Previous Page Next Page 
సంకల్పం పేజి 27

 

          ఏ ఒక్కరూ సహకరించలేదు.
   
    ఆఖరికి తన ప్రయత్నం తనే మొదలుపెట్టాడు.
   
    తాను మొదటిగా తయారుచేసిన యంత్రాన్ని ఓ'మెన్ డా' ట్రక్కుకు అమర్చి, ప్రజలముందు ప్రదర్శించినప్పుడు, ఏ ఇంధనం లేకుండా కేవలం గాలితోనే నడిచిన ఆ ట్రక్కును చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ సమయంలో ట్రక్కు వేగాన్ని అదుపులో పెట్టలేక డెన్ హిల్ ఘోరంగా ఫెయిలయ్యాడు.
   
    తాను మొదట తయారుచేసి ప్రదర్శించిన ఆ ఇంజన్ ను, కార్ల తయారీదార్లకు చూపించే ప్రయత్నాలు చేస్తుండగానే శత్రువర్గం ఆ ఇంజన్ ను నామరూపాలు లేకుండా తుక్కుతుక్కుగా చేసేశారు. దాన్ని రిపేరు చెయ్యడం అసాధ్యమైన విషయంగా భావించి, మరొక ఇంజన్ ను తయారు చెయ్యడానికి ప్రయత్నం ప్రారంభించాడు డెస్ హిల్. తన ఇంటి ఆవరణలో రహస్యంగా తయారుచేస్తున్న ఆ ఇంజన్ పూర్తవుతున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానికి సంబంధించిన అతి విలువైన భాగాలను దొంగిలించి, ప్రధాన భాగాల్ని ఇసుక తుక్కుతో పూడ్చేశారు.

    డెస్ హిల్ పాతకాలంనాటి ఓ లాన్ మోపర్ ఇంజన్ ని గాలితో నడిచే విధంగా తయారుచేసి పరీక్షించగా గాలి ప్రెషర్ తో అది సుమారు 30,000 రీవ్స్ వేగంతో ప్రయాణించగలుగుతుందని తేలింది. డెస్ హిల్ ఈ ప్రయత్నాన్ని 'లాస్ మోపర్' ట్రక్కు తయారీదారులు గమనించి, తయారీకి సహకరిస్తామని తెలిపి, కొద్దిరోజులయ్యాక డెస్ హిల్ ను, అతని భార్యను అక్కడ నుంచి గెంటివేశారు.
   
    కొత్తగా ఏ విషయం గురించైనా పరిశోధన చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేసి, టీవీలో చూపడం ఆస్ట్రేలియాలో చాలా సహజం. సిడ్నీ టీవీ కేంద్రం వారు 'డెస్ హిల్' కనుక్కున్నా యంత్రం గురించి ఇంటర్వ్యూ చేశారు. కానీ పాలిటిక్స్ ఎక్కడైనా ఉన్నాయని రుజువు చేస్తూ పెద్ద కార్ల కంపెనీ ఉత్పత్తి దారులతో లాలూచీ పడి దాన్ని 'రిలే' చెయ్యడం మానేశారు. గాలితో నడిచే కార్లు తయారయితే, ఇంధనంతో నడిచే కార్లు మూతపడతాయని, తమ వ్యాపారాలు మూతపడతాయని డెస్ హిల్ ప్రయత్నానికి అడుగడుగునా వాళ్ళు అడ్డు తగిలారు.
   
    కానీ ఆయన మాత్రం ఇంక తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నాడు. కాగా-
   
    ఇక్కడ మనకో సందేహం వస్తుంది.
   
    గాలితో కారెలా నడుస్తుందని...? అందుకు డెస్ హిల్ చెప్పిన వివరణ ఇది... కారు ముందు మడ్గారు భాగంలో రెండు పక్కలా రెండు గాలి సిలెండర్లను అమర్చుతారు- ఒక సిలెండర్ ను ఎయిర్ కంఫెషర్ తో  కలుపుతారు. ఆ సిలిండర్ లోని గాలి ఒత్తిడివల్ల పిస్టన్లలో కదలిక ఏర్పడి, బండికి శక్తిని ప్రసారం చెయ్యడం జరుగుతుందని, అందువల్ల మనం కావలసినంత వేగంతో ప్రయాణం చేయొచ్చని 'డెస్ హిల్' వాదన.
   
    పై వివరాలన్నీ వికాస్ నేమరవేసుకుంటూ, అందులోంచే ఉత్తేజాన్ని పొందటాన్ని వదలలేని బలహీనతగా మార్చుకున్నాడు.
   
                                    *    *    *    *    *
   

                                     శివానీ మోటార్ కాంప్లెక్స్   
   
    ఆఫీస్ రూంలో ఒక పక్క ఎగ్జిక్యూటివ్ టేబుల్ కుషన్ చైర్ ఎదురుగా నాలుగు ఫైబర్ కుర్చీలున్నాయి.
   
    టేబిల్ మీద నల్లరంగు ఫోన్ వుంది. కాని ప్రస్తుతానికి మూగది.
   
    ఆఫీస్ రూంకి ఆనుకొని రెండుగదులు..... విశాలమైన వరండా...
   
    పనివాళ్ళంతా శుభ్రం చేస్తున్నారు.
   
    బయట ఆవరణలో చెత్తా చెదారాన్ని వూడుస్తూ కొంతమంది పిచ్చి మొక్కల్ని నరికేస్తూ కొంతమంది.....
   
    ఇంకో యిద్దరు కూలీలు ప్రహరీ గోడకు సున్నం వేస్తున్నారు...
   
    వాళ్ళందరికీ పనులు పురమాయిస్తూ చయనులు...
   
    "ఒరేయ్ హరీ... ఇలారా... పంతులుగారిని తీసుకురావడానికి ఎవరెళ్ళార్రా... పూజా సామగ్రి... దండ... టౌనుకెళ్ళి తెస్తున్నారా... ఇక్కడెక్కడైనా దొరుకుతాయా....
   
    "సుబ్బయ్యెళ్ళేడండి... అన్నీ వచ్చేస్తాయండి" హరి చెప్పాడు.
   
    "ఆఫీసు గదిని ముందు కడిగి శుభ్రం చెయ్యమను..."       
   
    ఆడ కూలీలకు ఆ విషయం చెప్పడానికి హరి లోనకెళ్ళిపోయాడు.
   
    సరిగ్గా అప్పుడు సమయం....
   
    ఉదయం 9 గంటలయింది.
   
    అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న బస్టాపు దగ్గర "సిటీబస్' లోంచి దిగాడు వికాస్.
   
    చుట్టూ చూశాడు.
   
    భవిష్యత్తులో యిక్కడ బస్ దిగి తన ఫ్యాక్టరీ కార్మికులు రెండు కిలోమీటర్లు నడిచి రావడమంటే చాలా కష్టం.
   
    తన ఫ్యాక్టరీ వరకూ సిటీబస్సుల్ని పొడిగించమని 'ఆర్టీసీ'ని రిక్వెస్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
   
    అటూ యిటూ చూస్తూ నడుస్తున్న వికాస్, ఆ పరిసర ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు.
   
    అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు... అంతలోనే రూపుదిద్దుకుంటున్న ఎన్నో పథకాలు.
   
    ఇప్పుడది ఊరు శివార్లలో నున్న ఒక బంజరు భూమి ఐదేళ్ళలో అదక్కడ అద్భుతమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా రూపుదిద్దుకుంటుందన్న విషయం ఏ ఒక్కరూ ఊహించలేని విషయం.
   
    వికాస్ కి కూడా తెలీదు.
   
    "రావయ్యా....రా బస్ లో వచ్చావా....ఆటోలో రాలేకపోయావా' నిన్నటి వరకూ 'ఏంరా' అని పిలిచే మావయ్య పలకరింపులో మార్పు గమనించాడు వికాస్-
   
    "నువ్వెప్పుడొచ్చావ్...." గేటు దగ్గరే నిలబడి గేటుకేస్తున్న 'ఆలివ్ గ్రీన్' రంగువేపు చూస్తూ అన్నాడు వికాస్.
   
    "అసలెవైనా రావడానికి... పనులప్పజెప్పావ్ గదా....దాంతోనే తెల్లార్లూ గడిచిపోయింది... ఆ పెయింటర్ దగ్గర కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చుంటేనే తప్ప ఆ బోర్డ్ ఫినిష్ కాలేదు.... రా... రా..." కుడికాలు ముందుపెట్టి లోపలికిరా..."
   
    నవ్వుతూ లోపలికి నడిచాడు చయనులు.
   
    8x24 సైజులో పెద్ద బోర్డు. దానిమీద-
   
            శివానీ మోటార్ కాంప్లెక్స్
   
    నల్లరంగు బేక్ డ్రాప్ లో ఎర్రటి అక్షరాలు. చాలా అందంగా వుంది బోర్డ్.
   
    బోర్డ్ చూస్తున్న సమయంలోనే గేటు ముందు పదేసి నిమిషాల తేడాలో నాలుగు కార్లొచ్చిఆగాయి.
   
    వాటిల్లోంచి శివమూర్తి, ఏలుమలై, నందరాజ్, మల్లిఖార్జున్ దిగారు.
       
    కాసేపటికి యూనియన్ లీడర్ నర్సింహమూర్తి జీపులో వచ్చాడు. అతడి వెనుక పదిమంది జనం...
   
    అందరి సమక్షంలో వేదోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి.
   
    తర్వాత-
   
    వికాస్ మెడలో సివమూర్తి గులాబీల దండ వేశాడు. కరతాళ ధ్వనులు.... అవి ఎదిగేందుకు మెట్లో... ఎగతాళి చేసేందుకు తిట్లో...?
   
    "మైడియర్ ఫ్రెండ్స్....! నాకున్న ఏకైన నమ్మకం నా శివానీ మోటార్స్ ఆటోమోబైల్ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టిస్తుందని- మధ్యలో అవాంతరాలొచ్చి మూలబడిన ఫ్యాక్టరీ మళ్ళీ చిగురిస్తుందని నేనెప్పుడూ వూహించలేదు. వికాస్ నా దగ్గరకు రావటం అదో కలలా వుంది. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సందర్భంగా ముందుకొచ్చి సహాయ సహకారాలందజేస్తున్న ఎస్.ఎఫ్.సి. అధికారులకు, మిత్రులకు కృతజ్ఞతలు చెప్తూ నా యీ శివానీ మోటార్స్ ని, శివానీ మోటార్ కాంప్లెక్స్ గా మారుస్తూ దీనిని వికాస్ గారి చేతుల్లో పెడుతున్నాను."
   
    మళ్ళీ కరతాళ ధ్వనులు...
   
    "వికాస్ బాట వెనక... వికాస్ మాట వెనక ప్రతిక్షణం మేముంటామని నమ్మకాన్నిస్తూ నాకంటే చిన్నవాడయిన వికాస్ ని ఆశీర్వదిస్తున్నాను." శివమూర్తి చెప్పడం ఆపాడు.
   
    మళ్ళీ చప్పట్లు, చయనులొచ్చి వికాస్ నుదుట బొట్టు పెట్టాడు.
   
    అరగంట సేపు జరిగిన కార్యక్రమం, ఆనందోత్సాహాలతో నిండిపోయింది.
   
    "ఈ ఫ్యాక్టరీకి ఇక నుంచి మేనేజింగ్ పార్ట్ నర్ వికాస్-" అంటూ ఎగ్జిక్యూటివ్ చైర్ లో వికాస్ ని కూర్చోబెట్టాడు శివమూర్తి.

 Previous Page Next Page