Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 27


    బోస్ మౌనంగా వుండడం కొంత ధైర్యాన్నిచ్చింది ఇంజనీర్ కి.

    "మనమంతా సుశిక్షితులమైన సైనికులుగా త్రినాధ్ క్రింద పనిచేయబట్టేగదా మన సంస్థలు ఆ స్థాయికి ఎదగగలిగింది...? మనకు చెప్పకుండా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడీ మధ్య? ఆ గుప్తాజీతో తప్ప అన్ని విషయాలు మరెవరికి చెబుతున్నాడు? అయినా ఓ అనాధ శవానికి ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ త్రినాధ్ కర్మకాండ చేయించడం చూస్తే సొసైటీలో కంపెనీ ప్రెస్టేజ్ ఏమవుతుంది? మన డిగ్నిటీ ఎంతకు దిగజారుతుంది?"

    బోస్ ఇంకా తల ఎత్తలేదు.

    హిందూకి భయం పట్టుకుంది- త్రినాధ్ ని మాటంటే సహించడు బోస్- ఇప్పుడతను ఒక్కసారి రాక్షసుడైతే? సంస్థకు ముసలం ఇంజనీర్ రూపంలో పుట్టింది.

    యుద్ధాలు, చీలికలూ, అశాంతి తప్పవు. ఇంజనీర్ కి పుట్టిన బుద్ధేనా? లేక అతని వెనుక శత్రువుల పన్నాగం వుందా?' హిందూలో తొలిసారి భయాందోళనలు చోటుచేసుకున్నాయి.

    "ప్రతి రాత్రి త్రినాధ్ ఎక్కడకు వెళుతున్నట్టు? ఒక పెద్ద పదవిలో వున్న పాపులర్ ఫిగర్ పై ఎందరి కళ్ళుంటాయి? ఎందరి నిఘా వుంటుంది...? చైర్మన్ నడవడికతో కంపెనీ ఇమేజ్ ముడిపడి వుంటుందని తెలీదా? ఏదో జరిగింది- అంతమాత్రంచేత సుదర్శన్ రావులాంటి స్టాల్ వర్ట్ తో భేటీపడితే ఏమయిపోతాం మనం? పైగా అతను త్రినాధ్ కి మేనమామ. ఒక్కసారి త్రినాధ్ సుదర్శన్ రావుకి సరెండర్ అయితే వ్యాపారపరంగా ఎన్ని లాభాలుంటాయి...?"

    ఇంజనీర్ మాటలింకా పూర్తికాలేదు- బోస్ సివంగిలా కుర్చీలోంచి లేచి, టేబుల్ పైగా జంప్ చేసి పులి పంజా విసిరినట్లు తన కుడిచేతిని ఇంజనీర్ కంఠం మీదకు విసిరాడు. ఊహించని ఆ హఠాత్పరిణామానికి ఇంజనీర్ షాక్ తిన్నాడు-

    హిందూ భయంతో వణికిపోయింది.

    సరీగ్గా ఆ సమయానికి సైంటిస్ట్ అక్కడకు రాకుండా వుండి వుంటే ఉక్కుముక్కల్లాంటి బోస్ వేళ్ళు ఇంజనీర్ కంఠాన్ని నిర్ధాక్షిణ్యంగా నలిపిపారేసేవే.

    అతి బలవంతంమీద హిందూ, సైంటిస్ట్ లు బోస్ చేతిని వెనక్కి లాగేశారు. అప్పటికే ఇంజనీర్ ఊపిరాడక కళ్ళు తేలేసే పరిస్థితికి వచ్చాడు.

    ముఖమంతా రక్తం చిమ్మిందా అన్నట్లుంది బోస్ రౌద్రరూపం.

    గజగజ వణికిపోయాడు ఇంజనీర్.

    "ప్రియాంక ప్రలోభానికి, తనలోని అహానికి లొంగిపోయి ముందు తప్పు చేసినా, సైంటిస్టే నీకంటే చాలా గొప్పవాడు. నీచుడా....! దైవంలాంటి వ్యక్తిని ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావురా? మనకు బ్రతుకుని ఇచ్చిందే ఆ దైవంరా. పెద్ద పెద్ద చదువులు చదివినా వ్యవస్థ శాపానికి బలై- ఉద్యోగాలు రాక... చిన్న పనులు చేసి పొట్టనింపుకునే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేక పరమ నికృష్టంగా పావలా డబ్బుల కోసం పదిరోజులు ఎదురుచూసే స్థాయిరా నీది ఒకప్పుడు. ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన నువ్వు తొలిసారి బాస్ నుంచి వంద జీతం తీసుకున్నావు. మర్చిపోయావా? ఎంత విశ్వాస ఘాతుకుడివిరా ఇంజనీర్...! 

    అనాధ శవానికి సంస్కారం చేయడం గొప్ప మానవతావాదికే సాధ్యం. ఆ చర్యతో త్రినాధ్ జన్మ ధన్యమైపోయిందిరా. ముందుగా ఆ శవాన్ని చూసింది నేనే అయినా దానికి దహన సంస్కారం చేద్దామన్న గొప్ప ఆలోచన నాకు వచ్చిందా? రాలేదు- రాదుకూడా- ఎందుకంటే- మనం ఎదిగేవాళ్ళం కాదురా- ఎదిగేవాళ్ళకు ప్రక్కన వుండే భజంత్రీలం. మదర్ థెరిస్సా డబ్బుని చూసి ఎవరూ గుర్తించలేదు. ఆమె ప్రజాసేవను చూసే ప్రపంచ ప్రజ ఆమెకు చేతులెత్తి నమస్కరించింది. అయినా ఇవన్నీ నీకెలా అర్ధమవుతాయి? నీ హిపోక్రసీ నిన్ను నాశనం చేస్తుందిరా.

    నీకిదే నా ఆఖరి హెచ్చరిక- మరోసారి ఇలా పేలినా, బాస్ నిర్ణయాల్ని అడ్డుకున్నా నిన్ను నడిరోడ్డుమీద చంపి నేను జైలుకెళతాను గుర్తుంచుకో- నన్ను పాత బోస్ ను చేసే అవకాశం మరోసారి తీసుకోకు- నౌ- గెటవుట్ ఫ్రమ్ మై రూమ్- బాస్టర్డ్-" నిప్పులు కక్కాడు బోస్.


                  *    *    *    *


    సరిగ్గా త్రినాధ్ సవాల్ విసిరి అప్పటికి 23 గంటల 58 నిమిషాలైంది.

    తగ్గిన సుదర్శన్ రావు బి.పి. క్రమంగా తిరిగి పెరగనారంభించింది.

    తండ్రి బెడ్ ప్రక్కనే ప్రియాంక కూర్చుంది. "పెట్టిన టైమ్ అయిపోయిందా బేబీ? అయినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను నెగ్గలేడు- ఛాలెంజ్ ను నెగ్గించుకోలేడు-" సుదర్శన్ రావు నెమ్మదిగా అన్నాడు.

    తండ్రిని ఆ స్థితిలో చూసిన ప్రియాంకకు గుండె చిక్కబట్టినట్లయింది.

    ప్రియాంక తల్లి ఆ గదిలోనే మూలగా కూర్చునుంది.

    క్షణాలు- నిశ్శబ్దంగా గతంలో పెనవేసుకుపోతున్నాయి.

    సరీగ్గా అప్పుడే ఎలక్ట్రిసిటీ బోర్డు సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) కు ఫోన్ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వడం పూర్తయింది.

    సరీగ్గా 24 గంటలు పూర్తికావడంతోటే సుదర్శన్ రావు కంపెనీలన్నిటితో పాటు ఇంటిలో కూడా కరెంట్ ఆఫ్ అయిపోయింది.

    ఒక్కసారి సుదర్శన్ రావుకి బీపి పెరిగిపోయింది. ఊపిరి అందక గింజుకుంటున్నాడు.

    డాక్టర్ కి ఫోన్ చేసేందుకు వీలులేదు...

    చల్లగా గాలి తగిలేందుకు అవకాశం లేదు... ఆధునిక మానవుడి నగర జీవితం స్తంభించి పోతే ఎంత దుర్భరంగా వుంటుందో? సుదర్శన్ రావు అహం మీద త్రినాధ్ సమ్మెట దెబ్బ... సుదర్శన్ రావు సుప్రిమసీ మీద త్రినాధ్ చావుదెబ్బ... సుదర్శన్ రావు అపారమైన పలుకుబడిపై త్రినాధ్ కమ్చీ దెబ్బ... అప్పుడు అనుభవంలోకి వచ్చాయి.

    ప్రియాంక వెంటనే ఓ నౌకరుని డాక్టర్ దగ్గరకు పంపించి, ఆవేశంగా తండ్రికి సంబంధించిన వేరే గదిలోకి వెళ్ళింది.

    ప్రియాంక తల్లి కూతురు ఆవేశాన్ని గుర్తించింది. దాని వెనుక దాగిన ప్రమాదాన్ని పసిగట్టింది.

    వేగంగా తనూ ప్రియాంక వెనుకే వెళ్ళింది. అప్పటికే ప్రియాంక చేతిలో తళతళ మెరుస్తున్న పిస్టల్ తో వెనుదిరిగిమ్ది. కూతురు పిచ్చి ఆవేశానికి తల్లి నిర్ఘాంతపోయిందో క్షణం.

    గది బయటకు వెళ్ళబోతున్న కూతురుకి అడ్డుగా నిలిచింది తల్లి.

    "ఇంక నువ్వు నన్నాపలేవమ్మా... ఆ దుర్మార్గుణ్ని చంపందే నాకు మనశ్శాంతి లేదు. నా తండ్రిని ఇంత హింస పెడుతున్న ఆ త్రినాధ్ ని బ్రతకనివ్వను. అడ్డు తప్పుకో..." సివంగిలా ముందుకి దూకి తల్లిని విసురుగా పక్కకు నెట్టింది.

    "నీతి, నిజాయితీలకు, మానవత్వానికి అర్ధం తెలిసినవాడు నీ మేనత్త కొడుకు త్రినాధ్. అతను దుర్మార్గుడు కాలేడు. నీ తండ్రి నీకు చెప్పింది కట్టు కథ. నాకు తెలిసింది నిజం. ఇంతకాలం నీకెందుకు చెప్పలేదని నీ కనుమానం రావచ్చు... అందుక్కారణం నీ తండ్రే. మొదటినుంచి నన్నో బొమ్మను చేసి తనకు ఇష్టమొచ్చిన రీతిలో ఆడించాడు. నీకూ, నీ అన్నకూ, తనకు అనుకూలంగా కథ వినిపించాడని నాకు తెలుసు. నాకు తెలిసిందని మీ నాన్నకు తెలిసి నన్ను బెదిరించాడు- ఏమనో తెలుసా? అసలు నిజం మీకు చెబితే త్రినాధ్ ని, వసుంధరాదేవిని నిర్ధాక్షిణ్యంగా చంపించి వేస్తానన్నాడు. అందుకే ఇంతకాలం నిజం చెప్పలేక నాలో నేనే మధనపడ్డాను. ఇప్పుడిక నువ్వే త్రినాధ్ ని చంపేందుకు బయలుదేరుతున్నావు... నిజం చెప్పి, నీ కళ్ళు తెరిపించి నీలో మానవత్వం లేశమాత్రంగానైనా వుందని ఋజువు చేసుకుందామని తల్లిగా ఆరాటపడుతున్నాను. ఆగు... ఆగిపో ప్రియాంక..." తల్లి మాటల్ని విన్నా ఆగలేదు ప్రియాంక.

    ఆ మరుక్షణం ప్రియాంక కారు వసుంధరా ఇండస్ట్రీస్ హెడ్డాఫీసు వేపు దూసుకుపోయింది.

    డాక్టర్ వచ్చేవరకూ వుండి... భర్తను డాక్టర్ కి అప్పగించి మరోకారులో ప్రియాంక తల్లి బయలుదేరింది.

    తన కూతురు హంతకురాలు కాకూడదన్న కన్నతల్లి కోరికకన్నా త్రినాధ్ లాంటి మహోన్నతుడు ఒక ఆవేశం, అనాలోచన, అహం చేతిలో అర్ధాంతరంగా చావకూడదనే ఆమె బయలుదేరింది.

    సరీగ్గా అప్పుడు రాత్రి ఎనిమిది గంటలవుతోంది. త్రినాధ్ వాచీకేసి చూసుకున్నాడు. చటుక్కున సీట్లోంచి లేచాడు.

    "నాకూ న్యాయంగానే తోస్తోంది సార్. మీరు చెప్పినట్లుగా పెరిగిన ధరలకు అనుగుణంగా మన కంపెనీల సిబ్బందికి జీతాలు పెంచక తప్పదు. ఫైనాన్స్ కి సంబంధించిన విషయం గదా? ఒకసారి బోర్డ్ కి రిఫర్ చేస్తే బాగానే వుంటుందనీ... అక్కడ మీ అమ్మగారు, ఇంజనీర్ మీ పాయింట్ ని వీటో చేస్తారనీ వుంది" గుప్తా నెమ్మదిగా అన్నాడు.

    "బోర్డ్ దాకా విషయం వస్తే మా అమ్మగారే వీటో చేసేలా చేసాడన్న మాట మన ఇంజనీర్- థాంక్యూ ఫర్ యువర్ ఇన్ ఫర్మేషన్. మీరు ఇంజనీర్ తో మాట్లాడారా?" త్రినాధ్ సీలింగ్ ఫాన్ కేసి చూస్తూ ప్రశ్నించాడు.

    "మాట్లాడాను సార్... బొత్తిగా అతను డబ్బు మనిషైపోయాడు సార్. మీకు ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేక, తన పంతాన్ని నెగ్గించుకునేందుకు మీ అమ్మగార్ని ఆశ్రయించాడు" గుప్తా త్రినాధ్ తిరుగులేని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు.

    "ఇంజనీర్ ని బాధించలేను- తద్వారా మా అమ్మగార్ని కూడా బాధించలేను. జీతాలు పెంచకపోతే సిబ్బందిలో అసంతృప్తి పెరగక తప్పదు. సో- సమ్మె అనివార్యం. గుప్తాజీ! సమ్మె జరగబోతోందనే మీరు చేయవల్సింది మీరు చేయండి" త్రినాధ్ స్థిరంగా అంటూ బయటకు వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతుండగా-

    "సార్! మీరు చైర్మన్ హోదాలో ఒక్క నోట్ పెట్టి ఆర్డర్స్ పాస్ చేస్తే సరిపోతుందిగా" త్రినాధ్ తిరుగులేని నిర్ణయం ఎందుకు తీసుకోవటం లేదని గుప్తాకి ఆశ్చర్యంగా వుంది.

    "కలిసి బ్రతికాం... కలిసి ఎదిగాం... అతని ఆలోచనలు ఇవాళ మరో మార్గంలో ప్రయాణిస్తున్నాయని తెల్సినా ఏం చేయలేకపోవటం నా అశక్తత కాదు గుప్తాజీ... అనుబంధం నన్ను పట్టివేస్తోంది. అతనికి బాధ కలిగించని రీతిలోనే జీతాలు పెరగటం అనివార్యం/ వస్తాను" త్రినాధ్ చాంబర్ లోంచి బయటికెళ్ళి పోయాడు.

    కేవలం తన మేధస్సుతో, శ్రమతో, అకుంఠిత దీక్షతో ఇంతటి పారిశ్రామిక మహా సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన, ఎందరో పారిశ్రామిక వేత్తలకు పోటీ వెళ్ళి వాళ్ళకు నిద్రలేకుండా చేసిన త్రినాధేనా యితను?! ప్రాణాంతకమైన నిర్ణయాల్ని సయితం క్షణాల్లో తీసుకునే తన బాసేనా ఇతను?! ఈ స్థాయికి వెళ్ళిన మేధావుల్లో సయితం... సెంటిమెంట్స్... స్నేహం... అనుబంధం... చిత్రంగా వుంది. ఒక్కో ఆలోచనను ఒక్కో లక్ష క్రింద మిలియన్ క్రింద మార్చుకోగల సమర్ధుడైన త్రినాధ్... తన సిబ్బందికి జీతాలు పెరగాలనే నిర్ణయం తీసుకొని కూడా స్నేహం కోసం ఈనాడు కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయాడు.

    బోర్డ్ లో పెట్టకుండా, చైర్ మెన్ గా తన స్పెషల్ పవర్స్ ఉపయోగించకుండా జీతాలెలా పెరుగుతాయని అతని విశ్వాసం?

    తమ సంస్థల సిబ్బందిలో అసంతృప్తి తానెన్నడూ చూడలేదు. ఏదో అరాచకత్వం సృష్టిద్దామన్న ఆలోచన సయితం వారిలో ఎన్నడూ తొంగి చూడలేదు. మరెలా?! సమ్మె మొదలవుతుంది?

    అయినా జీతాలు సరిపోవటం లేదంటూ సవివరమైన జీవన వ్యయాన్ని లెక్కలేసి మరీ చూపించాడు. ఎలా?

    హోండాలో తిరిగే బిజినెస్ మేగ్నెట్...

    ఏ.సి. రూముల్లో వ్యవహారాలు చూసుకునే కోటీశ్వరుడు... గంటకు కొన్ని లక్షలు తన కంపెనీ ఎకౌంట్స్ లో జమ చేయించుకుంటున్న బిజీయెస్ట్ బిజినెస్ మెన్ కు ప్లేట్ మీల్స్ ఖరీదు... కిలో బియ్యం ఖరీదు... వంట నూనె ఖరీదు ఎలా తెలిసాయి? ఇటీవల పెరిగిన పాల ధరతో సహా చెప్పేసాడే?

    గుప్తాకి పిచ్చెత్తినట్లుగా వుంది.

    ఎప్పుడూ ఫ్యాక్టరీల వేపుగా వచ్చినట్లుగా కూడా లేదు. కాని ఎప్పటికప్పుడు ఏ విభాగంలో ఏ పొరపాటు జరుగుతుందో, ఎక్కడ ఏ సమస్య వుందో 24 గంటల్లో చెప్పగలుగుతున్నారు... ఎలా సాధ్యం ఇవన్నీ?

    త్రినాధ్ వెళ్ళి రెండు నిమిషాలైనా గుప్తా ఆ ఛాంబర్ లోంచి కదిలేలా లేడు. ఆలోచిస్తూనే వుండిపోయాడు.

    అంతలో బోస్ వచ్చాడక్కడకు.

    బోస్ ని చూసి గుప్తా చప్పున తేరుకొని అంతకుముందు అక్కడ జరిగిన సంభాషణంతా చెప్పేశాడు.

 Previous Page Next Page