"సభ్యులిద్దరూ కాసేపు తర్జన భర్జనలు పడ్డారు.
"అలా ఆస్థికోసం నాటకాలాడడం తప్పుకదా...." నెమ్మదిగా అన్నాడు వాసుదేవ్.
"ఈ విషయం మన రూల్స్, రెగ్యులేషన్స్ లో లేవు"
"ఇప్పుడే చేర్చితే సరిపోతుందిగదా" అని టేబుల్ మీదున్న ఫైల్ ని అందుకొని విప్పాడు.
ఆ ఫైల్ లో మధ్య మధ్యలో చేర్చిన రూల అండ్ రెగ్యులేషన్స్ దాదాపు తొంభయ్ వున్నాయి.
తొంభయ్ ఒకటవ పాయంటు క్రింద ఇలాగ రాశాడు వాసుదేవ్......
"కుటుంబ ఆస్థికోసం ప్రాకులాడడం, స్వచ్చమైన ప్రేమకు నిదర్సనం కాదు ప్రేమన్నది కులాతీత, మతాతీత, ఆర్ధికతీత విషయం......అందువల్ల లవ్ గేమ్ లో పార్టిసి పేట్ చేస్తున్న ఇద్దరు అభ్యర్ధులు సిన్సియర్ ప్రేమ కోసమే మనస్పూర్తిగా నిలవాలి తప్ప, డబ్బుకోసం నిలవ కూడదు" అని రాసి సంతకంచేసి పాత డేట్ వేశాడు.
మోతీలక్ష్మీ కూడా అదే మోస్తరుగా లేచింది.
తర్వాత ఎలాగయినా ఆ డ్రామాను మరో డ్రామాద్వారా దెబ్బ కొట్టాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వాసుదేవ్ సరదాపటేల్ ని పిలిపించాడు కంగారుపడుతూ.
"నీకిప్పుడు గవర్నర్ పోస్టిప్పిస్తున్నాను. నువ్వు అర్జంటుగా ఓ పని చేయాలి వుంది" చెప్పాడు వాసుదేవ్.
"గవర్నర్ పోస్టా? ఇంత చిన్న వయసులో గవర్నర్ పోస్టా? ఏ రాష్ట్రానికి వెళ్ళాలి"" ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ అడిగాడు సరదాపటేల్.
"రాష్ట్రానికి కాదు-పల్లెటూరు వెళ్ళాలి" ఏ పల్లెటూరు వెళ్ళాలో, ఎందుకెళ్ళాలో వివరంగా చెప్పాడు వాసుదేవ్.
"మరి నా కూతురుగా ఎవరేస్తారు?" పక్కనున్న జానకివేపు చూస్తూ అడిగాడు.
"కూతురు కేరక్టర్ తర్వాత వస్తుంది ముందు తండ్రి కేరెక్టర్ ఎంటరవుతుందన్నమాట"
కూతురు కేరక్టర్ లేకపోతే నేను వెళ్ళనుగాన వెళ్ళనని భీష్మించుకు కూర్చున్నాడు సరదాపటేల్.
"మిస్టర్ వాసుదేవ్! ఆ దాదాగాడు కలెక్టర్ వేషంలో కూతురు లేకుండా వెళ్ళాడు కాబట్టి మన సరదాపటేల్ కూతురుతోబాటు వెళ్ళాడనుకో.....బామ్మ గవర్నర్ పార్టీకే ఓటేస్తుంది" ఐడియా యిచ్చింది మోతీలక్ష్మీ.
"మిస్ జానకీ.....నీ అభిప్రాయం ఏమిటి....?" అడిగాడు వాసుదేవ్.
"నా అభిప్రాయం ఏమీలేదు. కోతిలా వుండే సరదాపటేల్ కు నేను కూతురుగా నటించడం ఏవిటి? నా పరువు పోదూ? నేను నటించను. మహమ్మదాలీతో నటించమంటే నటిస్తాను" రెండేళ్ళక్రితం జానకీ సిటీబస్ దిగుతున్నప్పుడు సరదాపటేల్ సరదాగాజుట్టుపట్టుకుని లాగాడు.
అప్పటినుండీ అతగాడిమీద కత్తిగట్టింది జానకి.
"మహమ్మదాలీతో గవర్నర్ వేషం వేయిస్తే బాగుండదు జానీ! గవర్నర్ బఫూన్లా వుంటే ఎలాగా?"
"పొట్టివాళ్ళు మనుషులు కారా? వాళ్ళలో తెలివి తేటలుండవా......లాల్ బహదూర్ శాస్త్రి పొట్టివాడయినప్పటికీ దేశప్రధాని కాలేదా? పొట్టితనం సామాజిక నేరంకాదు. విధి చేసిన నేరం....మహమ్మదాలీతో గవర్నర్ వేషం వేయిస్తేనే నేను వెళతాను" భీష్మించుకుని కూర్చుంది జానకి.
అరగంటసేపు అందరూ బ్రతిమిలాడిన మీదట కొన్ని కొన్ని షరతులతో సరదాపటేల్ వెనక కూతురుగా వెళ్ళటానికి ఒప్పుకుంది జానకి.
అరగంటసేపు అందరూ బ్రతిమిలాడిన మీదట కొన్ని కొన్ని షరతులతో సరదాపటేల్ వెనక కూతురుగా వెళ్ళటానికి ఒప్పుకుంది జానకి.
ఆ రకంగా అక్కడ సామరస్య వాతావరణం నెలకొంది.
"మీరు ఈరోజే-ఈ క్షణమే బయలుదేరాలి. మీకు కారూ గట్రా ఏర్పాటుచేస్తాను" చెప్పాడు వాసుదేవ్.
"ఒకే కారులో సరదాపటేల్ పక్కన నేను కూర్చోనుగాక కూర్చోనంతే. నేను సపరేట్ గా ఇంకో కారులో కూర్చుంటాను" మళ్ళీ మరొక పాయింట్ ను లేవదీసింది జానకి.
"కూతురు తండ్రి ప్రక్కన కూర్చోవడం తరతరాల ఆనవాయితీ హిందూ సాంప్రదాయం మీరిద్దరూ తండ్రీకూతుళ్ళు కారని ఆ బామ్మ పోల్చేసిందనుకో-మొత్తం నాటకం రసాభాస అవుతుంది....." అన్నాడు వాసుదేవ్.
ఎట్టకేలకు ఒకేకార్లో సరదాపటేల్ పక్కన కూర్చుని వెళ్ళదానికి వప్పుకుంది జానకి.
ఆ రోజు మధ్యాహ్నానికే ఆ కారు బయలుదేరింది.
* * * *
విశాఖపట్నం సిటీలోనే కాదు, సింహాచలం, పెందుర్తి, గోపాలపట్నం, మర్రిపాలేం....ఇటు బీమునిపట్నం అన్ని ఏరియాల్లోనో మర్నాడు ఉదయానికి బ్యానర్లు వెలిసాయి.
ఎవరి చేతులలో చూసినా సంధ్య, నారాయణరావులకు సంబంధించిణ కరపత్రాలే! లోకల్ డైలీలుకూడా ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి.
మూర్ఖంగా ఆలోచించే పెద్దలకు, యువతరం హెచ్చరిక__అలాంటి హెడ్డింగ్ లతో వచ్చిన వార్తలు, యువతరాన్నే కాదు పెద్దల్ని కూడా ఆకర్షించాయి__ఆ మేరకు చాలా యిళ్ళల్లో చర్చలు జరిగాయి.
"పెద్దల్ని ఎదిరిస్తూ, ప్రేమ వివాహాలు చేసుకోమని తీర్మానాలు చెయ్యడమేమిటి? ఊరేగింపులు తీస్తామనడం ఏమిటి? ఈ కాలం కుర్రకారుని ఎవరూ ఆపలేం పోయేకాలం బుద్దులొస్తే ఇంతే...." అని కొంత మంది పెద్దలు విసుక్కుంటే.
"ఇన్నాళ్ళకు ఇష్టాయిష్టాలమీద ప్రేమించుకుని, పెళ్ళి చేసుకోవాలానే ఆలోచన యువతరానికి రావడం నిజంగా ఆరోగ్యకరమైన పరిణామం-అబలలమీద అఘాయిత్యాలు తగ్గాలంటే ప్రేమ వివాహాల అవసరం చాలా వుంది-మన పిల్లలకు కూడా మనం ప్రేమ వివాహాలు చేద్దాం" అని కొంతమంది అభ్యుదయ భావాలుకల తల్లిదండ్రులు తీర్మానించుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రేమ పెళ్ళిళ్ళను అనుమతించాలా? తిరస్కరించాలా? అనే విషయమ్మీద పత్రికల్లో చర్చలు సాగాయి.
మరీ ముఖ్యంగా మహిళా పత్రికల్లో, ఈ ప్రేమ వివాహాలను సమర్ధిస్తూ, చాలామంది మహిళలు ఉత్తరాలు రాయడం ప్రారంభించారు మహిళా మండలలు, స్వచ్చంద సేవా సంస్థలు ఒక పక్క డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీ విద్యార్ధినీ విద్యార్దులందరూ ప్రేమముఖంగా చైతన్యవంతులు కావడం ప్రారంభించారు.
ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవడమో అర్ధం కావడంలేదు సంధ్య, నారాయణరావులకు.
ఒకరోజు ఉదయాన్నే-
యూనివర్సిటీలోకొచ్చిన సంధ్య-
గోడమీద కనిపించిన విచిత్రమైన రాతల్ని చూసి విస్తుపోయింది.
"క్రితం రాత్రి సంధ్య, నారాయణరావులు ఏకాంతంగా ఎక్కడ గడిపారో వూహించినవారికి వెయ్యినూట పదహార్లు బహుమతి."
కరెక్టు జవాబు రాసిన స్టూడెంట్స్, తమ పోస్టు కార్డులకు స్టూడెంట్స్ యూనియన్ (సెంట్రల్ లవ్ యాక్షన్ ఆఫీసు) కు పంపగలరు.
ఇంకో గోడమీద ఇంకో రకం రాతలు-
"హమ్ ఆప్ కీ హై కౌన్ సినిమాహాల్లో బాక్సు నెం బీలో సంధ్య, నారాయణరావుల రాసలీలలు."