Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 26

   
    "శృంగారంలో కళ్ళు సైడ్ మిర్రర్ లాంటివి. ఆనందం ఎంత ఒలుకుతోందో తెలుసుకోవచ్చు" అని అతన్ని ఉడికించడానికన్నట్లు నడుం మీద చక్కిలి గింతలు పెట్టింది.

    అతను చక్కిలిగింతలకు లోనై ఆ తరువాత సర్దుకున్నాడు. ఆమె మరో లోకంలోకి తేలిపోతున్నట్లు కళ్ళుమూసుకుంది.

    అతను ఠక్కున ఆగాడు.

    "మాయాబజార్ లో అభిమన్యుడు పోతున్న రథం రోడ్డుమీద రాక్షసుడు గోడలా లేస్తే ఇలానే ఠక్కున ఆగిపోయింది" అంది నిద్రలో కలవరిస్తున్నట్లు.

    తను ఎందుకు ఆగాడో చెప్పడానికి అతనికి సిగ్గు అడ్డం వచ్చింది. అతను ఎందుకు ఆగాడో ఆమెకి తెలిసి ఆమె ఏదో అంది. అయితే అప్పుడే బ్రిడ్జి పైన వాహనం ఏదో వెళుతుండడం వల్ల ఆమె అన్నది అతనికే వినిపించింది. ఆ తరువాత కూడా చాలా వాహనాలే వెళ్ళాయిగానీ ఆ శబ్దాలు కూడా వినిపించనంతగా వాళ్ళు మైమరచిపోయారు.

    బ్రిడ్జి మీద నిముషానికి ఒక వాహనం చొప్పున వెళుతోంది. వాళ్ళు అక్కడ వుండగానే దాదాపు పదిహేను వాహనాలు అటు వెళ్ళగా, పదిహేను వాహనాలు ఇటు వెళ్ళాయి వాళ్ళు పైకి లేచి తిరిగి రోడ్డుమీద కెక్కేటప్పిటికి సాయంకాలం మాయమైపోతోంది.

    ఆమెకైతే ప్రపంచం కొత్తగా వుంది. రాళ్ళు సైతం కూనిరాగాలు తీస్తున్నట్టున్నాయి. మసక చీకట్లు కూడా మెరుస్తున్నట్లు తోస్తోంది. సబ్బు ముక్కలా అనిపించే నీలాకాశం సముద్రపు కెరటంలా వుంది. పిచ్చి గవ్వల్లా వుండే నక్షత్రాలు ముత్యపు చిప్పల్లా వున్నాయి.

    తను మామూలుగా నడవగలుగుతున్నానన్న నిజాన్ని అప్పుడు గ్రహించింది ఆమె.

    ఏమైంది తనకి? వెంకటాచలం ఏమైనా మంత్రం వేసి తన కాళ్ళ నొప్పుల్ని తీసేశాడా? లేదా తథాస్తు దేవతలు తనని ఆశీర్వదించారా?

    ఆ ఊహతోనే తన సంబంధానికి దేవతలు సైతం ఆమోదముద్ర వేసినటు అనిపించింది. ఎక్కడో నక్కి వున్న పావభీతి కూడా పటాపంచలైపోయింది.

    ఆమె అతనికంటే ముందు నడుస్తోంది.

    మరో వారానికి శరీరంమీద పొక్కులు కూడా అదృస్యం కావడం ప్రారంభమైంది. ఇంకో నెలకంతా ఆమె మామూలు మనిషైంది.

    ఒకరోజు సాయంకాలం వెంకటాచలం పెళ్ళి పరత్రికలు తీసుకొచ్చాడు. "రేపు సాయంకాలం శివాలయంలో మా పెళ్ళి. ఎవర్నీ పిలవడం లేదు ఏదో ముఖ్యమైన వాళ్ళని మాత్రం పిలుస్తున్నాము.
   
    నువ్వు అందరికంటే ముఖ్యమైనదానివి. అందుకే ఈ పిలుపు. మా ఊర్మిళను తిరిగి మనిషిని చేసిన నీకు చర్మంతో చెప్పులు కుట్టించినా నీ రుణం తీరదు" అన్నాడు. అతని కళ్ళల్లో సన్నటి నీటిపొర.

    ఆ అభిమానానికి చంద్రరేఖ కూడా కదిలిపోయింది. "ఇందులో నేనేం చేశాను వెంకటాచలం. బహుశా ఊర్మిళకు జబ్బు బాగయ్యేప్పుడు నేను సలహాలు ఇవ్వడం ప్రారంభించి వుంటాను. పెళ్ళి రేపు రాత్రికి కదా తప్పక వస్తాను"

    అతను వెళ్ళిపోయాడు.

    మరికాసేపటికి ఊర్మిళ వచ్చి కార్డు ఇచ్చింది. వెళుతూ వెళుతూ "నేనేం తప్పుచేయడంలేదుకదా" అని అడిగింది.

    " ఛీఛీ -అలాంటిదేమీ లేదు"

    చకచక నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూసి చిట్టి ఆశ్చర్యపోయాడు.

    "ఎలా బాగుజేశావ్ ఆమెను? ఇంతకీ ఏమిటి జబ్బు?"

    "శారీరకంగా ఏ జబ్బూలేదు. అంతా మానసికమే. మానసిక జబ్బుల్లో చాలామటుకు పడకటింట్లోంచి పుట్టేవే. దాన్ని కనిపెట్టి మందు వేస్తే ఫలితం బ్రహ్మాండంగా వుంటుంది. మనం చేయాల్సిందల్లా దాని మూల కారణం ఖచ్చితంగా కనిపెట్టడమే"

    రెండోరోజు రాత్రి చంద్రరేఖ, చిట్టి ఊర్మిళ పెళ్ళికి బయల్దేరారు. ఊరికి ఫర్లాంగు దూరంలో వున్న శివాలయంలో పెళ్ళి. ఊరు దాటబోతుండగా వి ఎల్ డబ్ల్యు క్వార్టర్స్ దగ్గర గంగాధరం కనిపించాడు.

    వీధి దీపపు వెలుగు మసగ్గా పడుతోంది. ఆ వెలుతురులో అతను గోడమీద బొగ్గుతో ఏదో బొమ్మ గీస్తున్నాడు. చంద్రరేఖ తన సహజ మైన ఉత్సుకతతో ఆగింది. అతను చుట్టుపక్కల్ని పట్టించుకోకుండా బొమ్మ గీస్తున్నాడు.
 
    శబ్దం చేయకుండా మెల్లగా అటుకేసి నడిచింది.
   

 Previous Page Next Page