"ఎంతైనా పర్వాలేదు- కానీ ఎక్కడా ఎవరికీ, నామీద అనుమానం రాకూడదు-"
"అదంతా మాకొదిలేయండి. ఇంతకీ ఎవరా వ్యక్తి. ఎక్కడుంటాడు. ఫోటో ఇస్తారా"
"వ్యక్తికాదు- నెలల పిల్లాడు-"
"యూ మీన్- మంత్స్ బేబీ-" ఆశ్చర్యంగా అడిగాడు హనీఫ్.
"ఎస్- ఎందుకాశ్చర్యపడుతున్నారు."
"మంత్స్ బేబీ కిడ్నాపింగ్ అంటే- మాక్కొంచెం రిస్క్ వ్యవహారం - చాలా జాగ్రత్తలు తీసుకోవాలి- ఫైవ్ లాక్స్ అవుతుంది. అడ్వాన్సు రెండు లక్షలివ్వండి"
"ఫైవ్ లాక్సా?" ఆశ్చర్యపోతూ అన్నాడు సత్తిపండు.
"మీరు కిడ్నాప్ చేయాలనుకుంటున్న బేబీ, ఫేమస్ ఇండస్ట్రియిలిస్టు కొడుకు తేజని__కోట్ల ఆస్తిని కొట్టెయ్యడానికి మీరీ ప్లాన్ వేశారు,"
"ఇవ్వన్నీ మీకెలా తెల్సు?!"
"ఇవ్వన్నీ తెలుసుకోవడమే, మా ప్రొఫెషనలిజమ్. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు?"
"ఎల్లుండు ఆదివారం, రాత్రి ఎనిమిదిగంటలకు ఇక్కడే కలుస్తాను" లేచి నిలబడ్డాడు సత్తిపండు.
"సీ....యూ.." హనీఫ్ టేబుల్ దగ్గర్నుంచి కదల్లేదు. సత్తిపండు హోటల్లోంచి బయటికొచ్చి స్కూటరెక్కాడు.
గెస్టుహౌస్ కెళ్ళీ, అక్కడ తన మేకప్ తీసేసి, కారులో ఇంటికెళ్ళి పోయాడు.
౦ ౦ ౦
"తాతగారూ....ఈ వింటేజ్ కార్లతో ఇదే ప్రాబ్లమ్. పూర్వం ఈ కార్లను అతి తక్కువ దూరమే నడిపించేవారు. షోగ్గా తక్కువ దూరమే వెళ్ళడానికే తప్ప, దూరప్రయాణాలకు ఇవి సరిపోవు. అసలు 1833లో బ్రిటన్ లోని వాల్టర్ హున్ కాక్ అనే కంపెనీ__వింటర్ ప్రైజ్ అనే కారుని కనిపెట్టింది. అదెలా ఉంటుందో తెల్సా- పెద్ద గుర్రపుబగ్గీలా ఉంటుంది. స్టీమ్ ఇంజన్ తో నడిచే ఆ కారు అప్పట్లో పెద్ద వింత." చెప్పాడు సమర్ద్ మార్వాడి వృద్దుడికి.
"కార్ల హిస్టరీ గురించి చెప్తున్నావా....అయిపోయాడు....ఆ ముసిలాడు ఇక సఫా-" గొణుక్కుంటూ వెళ్ళి చెట్టుకింద కూర్చున్నాడు గాలిబాబు.
"అప్పట్లో స్టీమ్ ఇంజన్లతో కార్లు నడిచేవన్నమాట-" ఆశ్చర్యంగా అడిగాడా వృద్దుడు.
దాంతో మరింత రెచ్చిపోయాడు సమర్ద్.
"తర్వాత ఫ్యాబ్రిక్ ఫ్యూష్ అనే ఇంజనీర్ గ్యాస్ ఇంజన్ ని కనిపెట్టాక, 1885సింగిల్ ట్రాక్ కార్లు వాడకంలోకొచ్చాయి. అవ్వి ఎలా గుండేవో తెల్సా - మూడు చక్రాల రిక్షాలుంటాయి చూసారూ- అలా ఉండేవన్నమాట"
"అంటే ఒకప్పటి రిక్షాలే, నేటి కార్లన్నమాట-" బోసినోటిని విశాలంగా తెరుస్తూ అన్నాడాయన.
"కాదు...అప్పటి కార్లే, ఇప్పటి రిక్షాలు...కొత్త పాయింట్ నువ్వు కంటెన్యూ చెయ్యరా నాన్నా." దూరం నుంచి అరిచాడు గాలి.
"ఆ తర్వాత 1888 ప్రాంతంలో కార్ల్ బెంజ్ అనేవ్యక్తి మొట్ట మొదటిసారిగా పెట్రోలుతో నడిచే కారుని కనిపెట్టాడు ఆ కారు ఎలా ఉండేధో తెలుసా- సినిమాల్లో చూపిస్తారే- రధాలు- అలా ఉండేదన్నమాట. చక్రాలు మాత్రం రిక్షా చక్రాలే ఉండేవన్నమాట. వాటిని మోటార్ వ్యాగన్లు అనేవారు. అందులో సింగిల్ సీట్ వ్యాగన్లు డబుల్ సీట్ వ్యాగన్లు, సింగిల్ సిలిండరు కార్లు, డబుల్ సిలిండరు కార్లు వచ్చాయన్నమాట. 1896లో ఫోర్డు అనే వ్యక్తి బెల్ట్ సిస్టమ్ ని కనిపెట్టాడు. నాలుగు చక్రాలు, ఫ్లిట్ ప్లేటు తయారయ్యాయి ఆ తర్వాత-"
అంటూ తలతిప్పి చూశాడు సమర్డ్. ఆ ముసలాయన ఎక్కడా కనబడలేదు.
"ఇదిగో సమర్ద్....ఇక్కడే ఉన్నా." పక్కనే ఉన్న చెట్టుకొమ్మమీదున్న ముసిలాయన పళ్ళికిలించాడు.
"ఏమిటి....చెట్టేక్కారూ...."
"ఇక్కడ ఈ చెట్టొకటే ఉంది కాబట్టి ఎక్కాను. లేకపోతే ఏంటయ్యా. ఖాళీగా ఓ మనిషి దొరికాడని స్టీమ్ ఇంజను....సైకిల్ చక్రాలూ, గుర్రపుబగ్గీ, సినిమాలో రధం, నేనేం చెవుల్లో ఉమ్మెత్తపువ్వుని పెట్టుకున్నాననుకున్నావా- నువ్వు చెప్పే అడ్డమైనవన్నీ వినడానికి..." అలా చికాకు పడిపోతున్న ఆ ముసలాయన్ని చూసి పొట్టచెక్కలయ్యేట్టు నవ్వాడు సమర్ధు.
"నేను చెప్పేది నిజమండీ బాబు.... కార్ల హిస్టరీ..." అంటూ ఏదో చెప్పబోతుండగా, చేతి గడియారంవేపు చూసుకున్న గాలి__
"అయిపోయింది....అయిదున్నరైపోయింది...అదిగో మబ్బుల చాటుకి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇదే టైములో, ఆ దెయ్యప్పిల్ల వచ్చేస్తుంది. వచ్చేస్తుంది." అంటూ కంగారుపడిపోసాగాడు.
"ఎవరూ... ఆ రోజు వచ్చిందే, ఆ పిల్ల ఇప్పుడోస్తుందా. చెప్పారు కారేం." అనుకుంటూ గబుక్కున చెట్టుదిగి, పంచె సర్దుకుని, ముఖం కడుక్కుని, అద్దంలో తలడువ్వుకుని, నీట్ గా వచ్చి, షోగ్గా కారు పక్కన నుంచున్నాడు ఆ ముసలాయన.
"ఆ పిల్లకి బీట్ కొడదామనుకుంటున్నారా..." అడిగాడు సమర్ద్.
"ఏం తప్పా?" ఎదురు ప్రశ్న వేసేసరికి, తలతిరిగిపోయిందతనికి.
సరిగ్గా అదే సమయానికి__
దడదడమని ఓ కారు శబ్దం చేసుకుంటూవచ్చి కారు షెడ్డుముందు ఆగింది.
"హల్లో యంగ్ బేబీ... హౌ ఆర్యూ..." ముందుకెళ్ళాడు ముసిలాయన.
కార్లోంచి దిగిన హిమకుంద, యూరోపియన్ స్టయిల్లో, ఆ ముసిలాయన చేతిని అల్లరిగా ముద్దుపెట్టుకుని__
గబగబా సమర్ధువేపు వెళ్ళింది.
"ఇన్నాళ్ళకి దొరికావయ్యా, మగడా" అంటూ షెడ్డు వెనకున్న చిన్న గార్డెనులోకి లాక్కెళ్ళింది.