Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 26

 


    "అతని ముందు బయటపడిపోయాననిపించి అన్నాడు "అది కాదులే! వ్రాసే వుంటారు. బహుశా ఎక్కడో మిస్ అయి వుంటుంది. పోనిలెండి అందర్నీ అడిగానని చెప్పు."
    అతను పోతూ పోతూ అన్నాడు. "నిజమేలెండి మీ మాట. ఈ రోజుల్లో టెలిగ్రాం కూడా మిస్ అవుతోంది. కార్డు మాటేమిటిక. ఎలాగైతేనేం యిప్పుడయినా తెలిసింది కదూ. రేపో ఎల్లుండో వచ్చేయండి ఆ మాట చెప్పమంటారా మీ మామగారితో?"
    "ఆ ఆ" అన్నాడు ఇంకేమి అనలేక.
    మెల్లిగా సైకిలెక్కి యిల్లు చేరాడు.
    ఎలాగో.

                                           14
    ఎలాగో యిల్లు చేరాడు. మనస్సంతా చీకటిగా విచారంగా వుంది.
    తనలో తనే వురికే మధనపడసాగాడు. ఆరోజు తనతో వాదులాడి వెళ్లిందంటే ఏదో పంతానికి తాత్కాలిక కోపంతో వెళుతోందనుకున్నాడు.
    కానీ--మరీ యింత ముర్ఖించి వుంటుందనుకోలేదు తను.
    ప్రసవమై రెండు మసాలు దాటాబోతున్నా ఆవార్త అయినా కనీసం తనకి అందజేయలేదంటే చీ!చీ!
    మామగారయినా ఉత్తరంరాయలేదు.
    ఆయనేం చేస్తాడు?
    రాయొద్దులే నాన్నా అంటే సరి? అలాగే నమ్మా నీ యిష్టం అంటాడు.
    అసలు శ్రీదేవిని యిలా పెంకెగా తయారుచేసిందెవరు? ఆయనే!
    మొదట్నించె తొలిసంతానమని, ఆడపిల్లని గోముగా పెంచి పెంచి పెంకెతనం అంతా వంటబట్టించారు. ఆయనకు తోడు బామ్మగారు. ఎప్పుడూ నా ముద్దులకొండే, నావరాల కొండే నా బంగారు బొమ్మే అంటూ గోముచేసి అడిగింది అది కొండ మీది కోతి అయినా తెచ్చి యిచ్చేవరకూ అసలు ఆమె వూరుకునేది కాదట.
    అల్లా తయారు చేశారు పెంకేగా!
    నిజమే! గోముగా ప్రేమతో పిల్లల్ని పెంచకుడదని ఎవరూ అనరు. అయితే ఆ ప్రేమ దుష్పాలితాన్ని మాత్రం యివకూడదు. అది ఆ ఫలితం మరొకరు అనుభవించేట్టయితే ఇక ఆ గోము ఎందుకు?
    ఇంతకీ యిప్పుడేంచెయ్యాలి?
    వాళ్లు ఉత్తరం వ్రాయలేదు. తనూ వ్రాయలేదు.
    ఇలా బాబు కలిగివుంటాడని తెలీదు కానీ డెలివరి అయి వుంటుందని తను అనుకుంటూనే వున్నాడు. అయినా తెలియక ముందు అనుకోవటం వేరు! తెలిసి!!
    స్థిమితంగా కూర్చోలేక ఊరికే కాలుగాలిన పిల్లిలా తిరగసాగాడు ఏమి పాలుపోవడం లేదనికి.
    ఒక్కోసారి ఉత్తరం రాసేద్దామా అనిపించేది. మరుక్షణమే ఏమని రాయాలా అనే ప్రశ్న ఎదురయ్యేది. ఏమని వ్రాస్తాడు. తక్షణం మీ అమ్మాయిని తీసుకుని వచ్చిదిగవిడిచి పోవలసింది అని వ్రాస్తే లేదు అమ్మాయి నిన్నె రమ్మని వ్రాయమందనో లేదా నిన్ను చూచి చాలా రోజులైంది కాబట్టి నీవే యిటు వచ్చి పోవలసిందనో వ్రాస్తారు. ఉహూ ఉత్తరం వ్రాసి లాభం లేదు.
    టెలిగ్రామ్ ఇస్తే!
    నిజమే టెలిగ్రామ్ యివొచ్చు. కానీ ఏమని యివాలి? ఏదైనా అబద్దంగా యివాలి. ఏక్సిడెంట్ అయిందనో, హెల్తు బాగా లేదనో యివాలి.....ఛ! ఛ! ఎవరికైనా తెలిస్తే అదెంత అసహ్యంగా వుంటుంది. పైగా ఎంతో అవమానకరం.
    మరింకేం చేయాలి?
    ఆలోచన పాలుపోక కుర్చీలో కూలబడి తలపట్టుకుని కూర్చున్నాడు.
    అయ్యో! ఎలాటి దురవస్థవచ్చింది!
    తప్పు ఒకరిది.
    బాధ మరొకరిది.
    అయినా యిది ఎవరికి తెలియదు. పైగా ఇప్పుడు తననే నిందిస్తారు?
    మరి తను ఏం చెయ్యాలి?
    అవును ఏం చెయ్యాలి?
    ఏం చెయ్యాలి?
    ఎటూ తెగని ఆలోచనలతో మూడు రోజులు గడిచాక చివరికి ఆలోచించి ఆలోచించి ఓ నిశ్చయానికి వచ్చేశాడు. ఏం లేదు సింపిల్ గా ఓ చీటిలో వ్రాసుకుని లాటరీ వేస్తె సరి వెళ్ళమని వస్తే వెళ్ళేది. వద్దని వస్తే మానుకునేది.
    చివరికి తన సంసారం లాటరీపై అధారపడవలసి వచ్చిందని నవ్వుకున్నాడు బాధగా.
    ఎలాగయితేనేం ఆ నిర్ణయానికి వచ్చాక మనసెంతో తేలికయింది. గబగబా వెళ్ళి రెండు చిటిలు తయారు చేసి ఒకదాన్లో వెళ్ళాలి; మరో దానిలో వెళ్ళొద్దు అని వ్రాసేసుకుని ఉండలు చుట్టి బాగా కలిపేశాడు. ఏది ఏదో గుర్తు పట్టేటట్టు లేకుండా చేసి వేశాడు. అయినా తనే చీటి ఎత్తే ధైర్యం లేకపోయింది. జంకాడు ఏదో తెలియని భయంతో! ఎంతయినా సంసారిక జీవితాలు! ఏమవుతాయో?
    ఇంత విరుద్దంగా తేల్చుకోలేకచివరికి బయటికి వెళ్ళి గేటు వద్ద నుంచుని దారినే పోతున్నతను వీధి అబ్బాయి నోకడ్ని పిలిచి లాలించి వాడిచేత ఎలాగయితేనేం చీటి తీయించి పంపేశాడు. ఓ పదిపైసలు వాడి చేతిలో ఉంచుతూ. హుషారుగా నవ్వుకుంటూ వెడుతున్న ఆ అబ్బాయిని చూసి నవ్వుకున్నాడు హాయిగా.
    ఆ అబ్బాయి తీసిన చిటిని భద్రంగా తీసికెళ్ళి టేబిల్ పై ఎదురుగా వుంచుకుని కూర్చున్నాడు. కానీ విప్పి చూడాలంటే అతనికి దైర్యం చాలలేదు.

    భయం! సంకోచం!! ఆందోళన!!!
    అన్నీ ఎంత సేపు ఒక్క నిమిషం! రెండు నిమిషాలు!
    చివరికి ఎలాగో గుండె దిటవు పరుచుకుని వణుకుతున్న చేతుల్తో అందుకుని రామ రామా అనుకుంటూ విప్పి చూశాడు. ఒకటి రెండు క్షణాలు అతని కాగితమంతా కలగా పులగంగా కనిపించినా మరుక్షణం అక్షరాలు బాగా కనిపించాయి.
    "వెళ్ళాలి"

 Previous Page Next Page