"వాళ్ళమ్మమ్మ దగ్గర ఉందమ్మా యిన్నాళ్ళూ! యిప్పుడు తీసుకు వెడతాం" రాజేష్ మామూలుగా అన్నాడు.
"ఐందేదో ఐపోయింది చేసుకున్నందుకు ఆ పసిపిల్లకి అన్యాయం జరగకుండా తండ్రిలా ఆదుకో" అందావిడ. తల్లిదండ్రులు యింతత్వరగా తనని క్షమించగలరని ఎదురు చూడని రాజేష్ చాలా తృప్తిగా, ఆనందంగా ప్రయాణం అయ్యాడు.
"అత్తయ్యా మీరిద్దరూ వంటరిగా ఎందుకు మా దగ్గిరికి వచ్చేయకూడదూ. యింకొంచెం పెద్దిల్లు తీసుకుందాం. యీ వయసులో మీరు వంటరిగా ఉండడం ఎందుకు."
అత్తగారు నవ్వింది-"ఉన్న ఊరు, స్వంత యిల్లు. ఏదో కాలు చేయి యింకా ఆడుతున్నాయి చూద్దాం అంతగా లేవలేని స్థితిలో వుంటే ఎలాగూ తప్పదు" అంది.
"పోనీ ఓ రెండు నెలలన్నా వచ్చి వుండాలి. యిప్పుడు అంత చలి వుండదు. అక్టోబరులో రండి."
"సరేలేమ్మా! కన్నవాళ్ళం పిల్లలని చూడకుండా, రాకుండా ఎలా వుంటాం. వీలు చూసుకుని వస్తాంగా" కోడలికి వాగ్దానం చేసింది ఆవిడ.
* * *
తల్లి దగ్గిర, అన్నదగ్గిర రెండు పూటలుండి అత్త వారింటికి పాపని చూడడానికి వెళ్ళింది అర్చన. అర్చన తల్లి రాజేష్ ని చూసి, "ఎంత మంచి వాడే అబ్బాయి. ఎంత చక్కగా వున్నాడు. యిప్పుడు ఈడు జోడు రూపం అన్నీ కలిసాయి. ఆ పెళ్లి ఏదో చేశాం కాని యిలా మీ రిద్దరిని చూసిన తృప్తి ఆనాడు కలగలేదు" అంది మనసారా రాజేష్ ని అభినందిస్తూ. 'అర్చనా! యితని మంచితనానికి నీవు ఏం యిచ్చీ రుణం తీర్చుకో లేవు. అతని అభిమానం, అనురాగం నిలుపుకోవాలి నీవు. ఏ విషయం లోనూ అతన్ని కష్టపెట్టకు' అంది ఆవిడ. అర్చన నవ్వింది. "అవునూ పాపని తీసికెడతావా యిప్పుడు?"
"లేదమ్మా! యిప్పుడు తీసికెడితే సంవత్సరం మధ్యలో సీటు దొరకదు. అనవసరంగా ఒక ఏడాది వేస్టవుతుందని ఆలోచిస్తున్నాను. పరీక్ష లవగానే తీసికెడదాం అనుకుంటున్నాను."
"అదీ మంచిదేలే. మీకొత్త దాంపత్యంలో పాప మధ్యన వుంటే అతను ఏమన్నా అనుకోవచ్చు. అతను కాస్త నాలుగురోజులు సరదాగా గడవనీ" తల్లి సాలోచనగా అంది.
"అబ్బే! ఆయనేం అనుకోరమ్మా! అసలు ఆయనే నన్ను తీసుకురా అంటూ పోరుతున్నారు. నేనే పరీక్షలవనీ అంటున్నాను."
"పోనీలే నీ అదృష్టం బాగుండి మంచి భర్త దొరికాడు. ఆ పిల్ల దానికీ మంచి తండ్రి కాగలిగితే యింకేం కావాలి అంతకంటే" ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది.
* * *
అర్చనా నేనూ నీతో వస్తున్నానుగాని, నన్ను చూసి వాళ్ళేం అనుకుంటారోనని బిడియంగా వుంది. రైల్లో అన్నాడు రాజేష్.... "ఎంతయినా కొడుకు స్థానంలో నన్ను వాళ్ళు అంగీకరించి ఆదరించగలరా.
"అంగీకరించదానికి మానడానికి యిప్పుడింక పెళ్లి చేసుకున్నాక ఆ మాటకి అర్ధం ఏముంది. ఆదరించడానికి మనం ఏం అక్కడుండబోతున్నామా. ఓ పూటవెళ్ళి పాపని చూసి రావడమేగా - నిన్ను ప్రత్యేకం రమ్మనడం పాపకోసం, పాపకి కొత్తడాడి అని చెప్పడానికి-మా అత్తగారు మామగారు సంస్కారులు, మంచివాళ్ళు..... వాళ్ళకి అన్నీ చెప్పే, చేసుకొన్నాను గనక యిప్పుడు కొత్తగా అనుకోడానికి అనడానికి ఏముంది రాజేష్..." అర్చన సమాధాన పరిచింది.
అర్చనని, రాజేష్ ని డాక్టరు వరలక్ష్మి డాక్టరు సదాశివంగారూ సాదరంగా ఆహ్వానించారు. "హార్టి కంగ్రాజులేషన్స్ అర్చనా, వెల్ కమ్ మైడియర్ బోయ్..." రాజేష్ కి షేక్ హాండిచ్చి అన్నారు సదాశివం రాజేష్ ని చూసి పలకరింపుగా నవ్వింది వరలక్ష్మి. యూ ఆర్ లక్కీ అర్చనా.....కీప్ యిట్ అప్" మనసారా అభినందించింది ఆవిడ. వారిద్దరి సహృదయత, సౌశీల్యం చూసి యిలాంటి వారి కడుపున ఆ దరిద్రుడు ఎలా పుట్టాడో అన్పించింది రాజేష్ కి.
"పూజా! ఎవరొచ్చారో చూడు...." వరలక్ష్మి కేకేసింది. పూజ లోపల్నించి పరిగెత్తి వచ్చింది - తల్లిని చూసి సంతోషంగా "మమ్మీ" అంటూ పరిగెత్తి రాబోయి అర్చన పక్కనున్న రాజేష్ ని చూసి బిడియంగా ఆగిపోయింది.
"పూజా.... రా అమ్మా -" అంటూ అర్చన ముందుకువెళ్ళి పూజని కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది తల్లి భుజాలమీద నించి తనవైపే కుతూహలంగా చూస్తున్న రాజేష్ ని చూసి కాస్త సిగ్గుపడింది.
పూజ తను చూసినపుడు చంటిపిల్ల మాటలు కూడా సరిగ్గా రాని పసిది. యిప్పుడు ఐదేళ్ళు నిండి ఆరోఏడు బాగా ఏడుపు చక్కగా ఆరోగ్యంగా మిసమిసలాడుతూంది. ఆ కళ్ళలలో చురుకుదనం, తెలివితేటలుకనిపించాయి రాజేష్ కి. తనవైపు చూసిన పూజనిచూసి పలకరింపుగా నవ్వాడు. అది చూసి పూజ మరింత సిగ్గుతో తల్లి భుజాలమీద తలదాచుకుని తల్లి చెవిలో గుసగుసలాడింది. "ఎవరు మమ్మీ యీ అంకుల్?" అంది అర్చన ఒక్కక్షణం ఆలోచించి "మీడాడీ" అంది నెమ్మదిగా పూజ ఒక్కసారిగా తల్లి బుజంమీదనించి లేచి ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతోచూసి.. "ఛీ.." ఏంకాదు. మాడాడి ఏంకాదు.." అంది గట్టిగా అరచినట్టు. అర్చన తడబడింది. రాజేష్ మొహం కాస్త చిన్నపోయింది. "మాడాడి నాకు తెలియదేమిటి అదిగో మాడాడీ" అంటూ డ్రాయింగు రూములో షోకేసులోవున్న ఫోటో చూపించి "డాడీని ఎన్నిసార్లు చూడలేదేమిటి నేను, నెలక్రితంకూడా చూశాను- నాకు బొమ్మలు కూడా కొనియిచ్చారు. కదూ నాయనమ్మా." అంది డాక్టరు వరలక్ష్మి చప్పున ముందుకువచ్చి మనవరాలిని దగ్గిరకుతీసుకుంది ఆవిడ పరిస్థితి ఆకళింపు చేసుకుంది. చిన్నపోయిన రాజేష్మోహం అర్చన తడబడడం అన్నీ చూసి మనవరాలితో మృదువుగా. "ఈ డాడి నీ కొత్తడాడీ అమ్మా పూజా -" అంది పూజ వింతగా అర్ధం కానట్టు చూసింది.