"సరేలే మన గొడవలతో వీళ్ళనెందుకు బోర్ కొట్టడం. ఏంటయ్యా రాజేష్ యివాళ మీ ప్రోగ్రాం సాయంత్రం పిక్చరుకెడదామా" అన్నాడు మెహతా.
"ముందు ప్రోగ్రాం దోసెలు తినడం, తరువాత మిగతావి" అర్చన నవ్వుతూ అని వంటింట్లోకి వెళ్ళి స్టౌ వెలిగించి పెనం పెట్టింది.
"ఓ వారం పదిరోజులు శెలవుపెట్టి యింటికెళ్ళి అమ్మ నాన్నలకి అర్చనని చూపాలి. తరువాత అర్చనా వాళ్ళ అమ్మగారిని చూడాలి. పూజని కూడా చూడాలి. పాపని తీసుకు వద్దాం అంటే యీ ఏడాది స్కూలు పోయి వన్ యియర్ వేస్టవుతుంది అంటూంది అర్చన."
"నిజమే మధ్యలో ఎందుకు తీసుకు రావడం" అన్నాడు మెహతా.
"నిజమే అనుకో కాని వాళ్ళంతా ఏమన్నా అనుకుంటారేమోనని భయం నాకు" పెళ్ళయ్యాక పిల్లని వదిలేసిందని అర్చన గురించి అనుకుంటారని భయం.
"భయ్యా! నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష అవుతుంది. అర్చనా ఈ అదృష్టాన్ని పదికాలాలపాటు నిలుపుకోవాలి నీవు" మనస్ఫూర్తిగా అంది సునీత.
ఈ నెల రోజులలో సునీత అర్చన ఎంతగానో కలిసిపోయారు. అర్చానకి ప్రతిదానికి సాయపడుతూ చేసిన ప్రతి కూరో, పప్పో, స్వీటో ఏదో ఒకటి యిస్తూనే వుంటుంది సునీత.
ప్రతి ఆదివారం తమ యింట్లోనే భోజనం చెయ్యాలనేది. ఇంట్లో ఫర్నిచర్ సర్దడం దగ్గిరనించి పరదాల సెలక్షన్ వరకు సునీత సహాయమే తీసుకుంది అర్చన. అలాంటి పొరుగు దొరకడం అదృష్టం అనుకుంది. రెండు కుటుంబాలు సరదాగా పేకాడుకోడం, పిక్నిక్ లకి వెళ్ళడం, కలిసి హోటళ్ళకి వెళ్ళడం ఒక్క నెలతోనే అర్చన, సునీతల సన్నిహితం ఏ రహస్యమూ దాచుకోనంతగా పెరిగింది.
"అర్చనా! మీ అత్తగారు మామగారిని ప్రసన్నుల్ని చేసుకొని రాజేష్ కి ఆ వర్రీ మిగలకుండా చూడాలి నీవు" దోసెలు వేస్తున్న అర్చన దగ్గిరకి వెళ్ళి నెమ్మదిగా అంది సునీత.
"అదే ఆలోచిస్తున్నాను సునీతా! ఎలాగయినా నా చేతనయినంత వరకు వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తాను. రాజేష్ ని ఆనందపెట్టడం కంటే నాకింకేం కావాలి"
"పెద్దవాళ్ళ కోపం ఎన్నాళ్లుంటుందిలే కాస్త ఆదరంగా, గౌరవంగా అభిమానంగా పలకరిస్తే వాళ్ళే మర్చిపోతారు. ఏమన్నా ప్రెజంట్సు పట్టుకెళ్ళు" సలహా యిచ్చింది. దోసెలు ప్లేట్లలో సర్ది టేబిల్ మీద పెడ్తూ.
"ఏమిటా గుసగుసలు వంటింట్లో చేరి బయటికి రాకూడదూ" మెహతా పిలిచాడు.
"మేం వంటింట్లో చేరకుండా తమరికి దోసెలు ఎలా వస్తాయో? తినండి తినండి....మా ఆడవాళ్ళ కబుర్లు మీకెందుకు" సునీత దబాయించింది.
"అబ్బ మా ఆవిడ రాక్షసి. నోట్లో మాట నోట్లో వుండగానే కరుస్తుంది మీదపడి. అందులో ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టాక పెట్రేగిపోతూంది" మెహతా భార్యని ఉడికించాడు.
"ఆయనలా వాగుతుంటే తమ్ముడివి అయి అలా ఊరుకుంటావేమిటి రాజేష్."
"ఆయన వాగుడు నిజం కాదని నీకు తెల్సినట్టే నాకూ తెలుసు కనుక ఊరుకొంటున్నాను అని నీకు తెలుసుగా" రాజేష్ నవ్వుతూ అన్నాడు.
"ఈవిడతో ఏమిటిలే....అర్చనాజీ! యింకో దోసె.... అబ్బ.....హోటల్ దోసెలకంటే బాగావున్నాయి. మా ఆవిడ చేస్తుంది నాన్ రొట్టెలా సాగుతాయి" వెక్కిరిస్తూ హేళనగా అన్నాడు.
"అవునవును పొరుగింటి పుల్లకూర అలాగే రుచిగా ఉంటుంది" సునీత వెక్కిరించింది. "ఆ నాన్ రొట్టెలే అరడజను మింగుతారు."
ఇద్దరి దెబ్బలాటలు, వాదనలు చూస్తూ తాము యింకో రెండేళ్ళు పోతే యిలాగే తయారవుతామా అని రాజేష్.... యిలాంటి చిలిపి కయ్యాలు, కలహాలు కూడా తనెరగదే యిన్నాళ్ళూ అని అర్చన అనుకున్నది.
* * *
"అమ్మా! మీ మనస్థితి, మీ బాధ బాగా అర్ధం అవుతూంది. ఇది రాజేష్ సంతోషం కోసం జరిగింది మరిచిపోయి మమ్మల్ని క్షమించలేరా?" అర్చన అత్తగారితో అంది.
"క్షమించడానికి ఏముందిలేమ్మా! ఏదో కన్నవాళ్ళం కనక నాలుగు రోజులు బాధపడ్తాం. ఆవిడ కాస్త ఉదాసీనంగా అంది....మీరు యిద్దరూ సంతోషంగా వుంటే అదే మాకానందం."
"అత్తయ్యా! మీ అబ్బాయి దేముడు. ఆయనకి ఏ కష్టం ఏరోజూ కలిగించను. నా వల్ల ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. మీ అబ్బాయి చాలా బాధ పడుతున్నారు. మీకు కష్టం కలిగించినందుకు" నమ్రతగా అంది.
అర్చన, రాజేష్ వెళ్ళగానే ఆ కన్నవారి కళ్ళలో మెరుపు అర్చన దృష్టి దాటిపోలేదు. కాని తను మాట వినలేదన్న బాధ వారిద్దరి ముభావతలో అర్ధం అయింది అర్చనకి. వారిని ప్రసన్నుల్ని చేసుకోడానికి రకరకాలుగా సిద్దపడే వచ్చింది. అత్తగారికి కొన్న వెయ్యి రూపాయల పట్టు చీర, మామగారికి మంచి కాశ్మీర్ షాల్. మామగారికి, అత్తగారికి స్వయముగా అల్లిన స్వెటర్లు, డ్రైఫ్రూట్స్, పళ్ళు, మిఠాయిలు అన్నీ అందించి కాళ్ళకి నమస్కరించింది. అర్చన అందం చూడగానే వాళ్ళిద్దరి కోపం సగం దిగజారింది. మిగతా సగం ఆ వున్న రెండు రోజులలో తమపట్ల ఆమె చూపిన గౌరవం, అభిమానం, రాజేష్ పట్ల ఆమెకున్న శ్రద్దాసక్తులు చూసాక, అర్చనలో ఒక్క రెండోపెళ్ళి అన్న లోపం తప్ప తప్పుపట్టడానికి ఏమీ కనిపించలేదు వారికి. వారి ఉదాసీనత, ముభావత మంచు కరిగినట్టు కరిగిపోయింది. "ఆ పాప ఎక్కడుందిరా మీతో రాలేదేం?" అర్చన దగ్గిర లేనపుడు రాజేష్ ని అడిగింది తల్లి.