రాధకి ఆ రోజు నొప్పులు వచ్చాయి. లోకం కోసం మాధవ్ కి రాధని నర్సింగ్ హోమ్ కు తీసికెళ్ళి జాయిన్ చేయించక తప్పలేదు. రాధ నొప్పులు పడ్తుంటే అక్కడ ఆరాటంగా ఎదురుచూసే భర్తలా కూర్చోక తప్పలేదు. పార్వతమ్మ రాధకి తోడు వచ్చింది. ఉదయం నుంచి కష్టపడ్డాక ఫోర్ సెప్స్ వేశాకగాని రాధకి కాన్పు అవలేదు... తెలివి వచ్చాక రాధ ఆరాటంగా బిడ్డకోసం అడిగింది. తెల్లటి గుడ్డలమధ్య నల్లటి... అతినల్లటి బిడ్డని చూసి రాధ కెవ్వుమంది.
"కాదు... కాదు... వీడు నా బిడ్డకాదు... మీరు మార్చేశారు. పొరపాటుగా తెచ్చారు ఎవరినో..." అంటూ పిచ్చిగా అరిచింది.
పార్వతమ్మ జాలిగా రాధ తల నిమిరింది. "రాధా... అనుకున్నంతా జరిగిందమ్మా... ఏడవకమ్మా... ఇప్పుడింక ఏడ్చి ఏం లాభం. పచ్చి బాలింతరాలివి ఏడిస్తే వళ్ళు అదురుతుంది" అంటూ ఓదార్చింది.
"మాధవ్... మాధవ్ ఏమన్నాడు పిన్నిగారూ" ఏడ్పు మధ్య అంది రాధ.
"హు..." ఆరాటంగా చూశాడు. చూడగానే అతని మొహం వివర్ణమయింది. ఒకసారి నావంక చూసి వెళ్ళిపోయాడు గదిలోంచి.
"ఆ దేముడికింకా నా మీద కసిదీరలేదులా వుంది... నన్నింకా యిలా శిక్షించితేగాని తృప్తి తీరలేదు గాబోలు... నేనేం పాపం చేశానని యిలా చేశాడు..."
ఆ పూట అంతా ఏడుస్తూనే వుంది రాధ.
"రాధా... అన్నింటికీ సిద్ధపడే బిడ్డని కన్నావు... యిప్పుడిలా బెంబేలు పడితే ఎలా తల్లీ... ధైర్యంగా కన్నావు. ఆ ధైర్యంతోనే పెంచాలమ్మా... ఎలా పుట్టినా తల్లికి బిడ్డమీద ఎప్పుడూ ప్రేమ వుంటుందమ్మా..."
"ఇంతలా... యింత అనాకారిగా పుట్టి... నాకు జరిగిన అవమానం లోకానికంతకీ తెలిసేటట్టు... వీడిలా పుడతాడనుకోలేదండీ..." రాధ ధీనంగా అంది.
రాత్రి మాధవ్ ఆస్పత్రికి వచ్చాడు. రాధని చూస్తూనే మాధవ్ కఠినంగా "ఏం, యింకా యిప్పటికన్నా అనుమానం తీరిందా... వద్దు వద్దంటే నా మాట నిర్లక్ష్యంచేసి పంతంకొద్దీ కన్నావు... ఏం యిప్పటికన్నా నామీద కసి తీరిందా. ఎంత అందమైన కొడుకుని కన్నావో చూసుకున్నావా?" వ్యంగ్యంగా దెప్పిపొడిచాడు.
మాధవ్ మాటలకి రాధ భోరుమంది. హృదయవిదారకంగా ఏడుస్తూ, "మాధవ్! నామీద నీకెందుకంత కక్ష. ఈ సమయంలో కూడా యింత కఠినంగా మాట్లాడేంతలా ఎలా మారిపోయావు. అసలే చితికిపోయిన నా హృదయాన్ని మరింత తూట్లు పొడవకు. ఫర్ గాడ్ సేక్ వెళ్ళిపో యిక్కడినించి" రెండు చేతులు జోడించి రుద్ధకంఠంతో అంది.
"వెళతా... కాని వీడిని ఏం చేస్తావు... ఇంకా ఇంటికి తీసుకొచ్చి పెంచుతావా?"
రాధ కన్నీళ్ళ మధ్యనించి విసురుగా తలెత్తి "కాదు పెంచను, తీసుకెళ్ళి పెంటకుప్పలో పారేయి, అదే నీకానందం, తృప్తి యిస్తే అలా చేసిరా..."
"అవును. వద్దంటే కన్నావు. ఆ పారేసే పాపం నాకంటకట్టాలని చూస్తున్నావా. పెంచుకో నీ అందాల కొడుకుని."
"పెంచుకుంటాను మాధవ్... వీడెంత అసహ్యంగా వున్నా నా పేగు తెంచుకుని పుట్టాడు. వాడు నా రక్తం... ఎలా వున్నా తల్లి భరిస్తుంది, ప్రేమిస్తుంది. ఇంత చదువుకునీ ఆ మాత్రం తెలియకపోతే యిప్పుడైనా తెల్సుకో..."
"ఓహో... మరయితే ఆ ఏడుపెందుకు, ఆనందంగా అందరిని పిలిచి పండుగ చేయి..." హేళనగా అన్నాడు.
"నా బ్రతుకే హేళన అయింది. మీరింకా దెప్పనక్కరలేదు" తీవ్రంగా అంది.
"రాధా! సీరియస్ గా చెప్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ బిడ్డని వదిలించుకుంటే నీకు, నాకు మంచిది..."
"వదిలించుకోవడం అంటే... చంపమన్నారా?"
"చంపనక్కరలేదు. అనాధ శరణాలయాలున్నాయి.. వదిలి రావచ్చు..."
రాధ అతనివంక సూటిగా ఒక్కక్షణం చూసింది. తరువాత పక్కన పడుకున్న పసివాడ్ని పొత్తిళ్ళతో సహా ఎత్తి మాధవ్ ముందు చాపి "తీసికెళ్ళండి, అనాధశరణాలయంలో వదిలిరండి" అంది స్థిరంగా.
మాధవ్ తడబడ్డాడు... రాధ నిజంగా అంటుందా అన్న సందేహంతో ఆమెవంక చూశాడు. ఒకసారి తెల్లటి గుడ్డలమధ్య నల్లగా వుండి... గుప్పిళ్ళు బిగించి అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకునివున్న వాడ్ని చూశాడు... "నేనెందుకు తీసికెళతాను... నీవే యిచ్చే ఏర్పాట్లు చూసుకో" అన్నాడు బింకంగా.
"హు... మీకే విధంగానూ సంబంధం లేనివాడు, మీ రక్తం పంచుకోనివాడు... ఎవడికో పుట్టిన బిడ్డ... వాడిని తీసికెళ్ళి అనాధ శరణాలయంలో పారేయడానికి మీకే చేతులు రావడంలేదు... అదేదో పాపపు పనిలా మీరు సంకోచించుతున్నారు.. అలాంటిది తొమ్మిది నెలలు మోసి, నరకయాతన పడి కన్నబిడ్డని నేనెలా వదలనండి అనాధ శరణాలయంలో, నా చేతులు ఎలా వస్తాయనుకున్నారు, నా మనసు ఎలా ఒప్పుకుంటుందనుకుంటున్నారు. వాడ్ని పారేసి నేను నిశ్చింతగా ఎలా బతకగలననుకుంటున్నారండీ. ఆ పాపం చేసిన నాకింక శాంతి ఎక్కడుంటుందండీ..." జవాబు చెప్పమన్నట్టు చూసింది. మాధవ్ ఒక్కసారి రాధవైపు కోపంగా చూసి గదిలోంచి వెళ్ళిపోయాడు.
నర్సు వచ్చి ఏడుస్తున్న పసివాడ్ని వళ్ళోవేసి, పాలు ఎలా ఇవ్వాలో చెపుతూ... ఆమె స్థనాన్ని బిడ్డనోటికి అందించింది. ఆ లేత పెదాలు తాకగానే... ఆమెకి వెన్నులోంచి ఏదో జరజర పాకినట్టు... ఏదో పులకింత, మైమరుపు కలిగాయి. మాతృత్వపు మమత పొంగి పొరలినట్లు ఆమె స్థనాలలోంచి పాలు బిడ్డనోటికి వెళ్ళాయి. అప్రయత్నంగానే రాధ ఆ బిడ్డని హత్తుకుంది దగ్గిరగా పొదువుకుని... ప్రేమగా, ఆర్తిగా... వాడి చిన్న చేయి అందుకుని పెదాలకి ఆనించుకుంది.