Previous Page Next Page 
శుభోదయం పేజి 26


    శారద అమాయకురాలే కావచ్చు. శారదలో మాలిన్యం లేకపోవచ్చు... కాని... మాధవ్ పురుషుడన్న విషయం రాధ మరిచిపోయింది. అందులో సంసార సుఖానికి దూరమైవున్న మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది. ఈ తొమ్మిది నెలల్లో శారద, మాధవ్ యిద్దరూ కాకూడనంత దగ్గిరయ్యారు. కాదు, శారదకి తగ్గిర అయ్యాడు మాధవ్. మంచి మాటలతో, తీపి మాటలతో శారదకు చేరువయ్యాడు.
    మాధవ్ కి మొదట్లో శారదంటే చికాకు, ఆ వెకిలిమాటలంటే విసుగు, సాధ్యమైనంతవరకు ఎవాయిడ్ చేసేవాడు. కాని, రెండేళ్ళలో ఆమె అమాయకత్వం, అభిమానం చూసి పాపం పిచ్చిది అనుకునేవాడు. రాధ దూరమైనకొద్ది శారద చేరువయింది. మొదట్లో ఏదో యింట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు కాఫీ, టిఫిను తెచ్చి యిచ్చినప్పుడు తినడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కాని, అతను మగవాడు... నిండు యవ్వనంలో వున్నవాడు. భార్యకి దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం, చనువు అతనికెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి.
    రాధతో సంసార సుఖానికి దూరమయి ఐదారు నెలలయిందేమో... ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడడం మొదలుపెట్టింది. ఆమె అమాయకత్వం అతనికి ప్రోత్సాహాన్నిచ్చింది.
    "నీవు ఎంత బాగా కాఫీ చేస్తావు శారదా...", "అబ్బ ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు నీవెంత బాగా చేశావు...", "నీ చేతిలో అమృతం వుంది శారదా, నిజంగా మీ అక్కయ్యకిలా వంట్లో బాగులేనప్పుడు నీవున్నావు కనక నాకిబ్బంది తెలియడంలేదు, నిజంగా శారదా నీవెంత మంచిదానివి, నీ అంత అమాయకురాలిని చూడలేదు సుమా. స్వంత అక్క, బావలకి చేసినట్టు చేస్తున్నావు మాకు. నేనంటే నీకింత అభిమానం ఎందుకు..." ఇలాంటి పొగడ్తలతో కొన్నాళ్ళు ఆ అమాయకురాలని ఉబ్బేసాడు. ఆ పొగడ్తలతో సిగ్గుపడి ఆనందపడి అతనిపట్ల అభిమానం మరింత పెంచుకుంది శారద.
    ఆ తరువాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్పందుకుంటూ చెయ్యిపట్టుకు కొంటెగా కళ్ళలోకి చూశాడు. పాతికేళ్ళు వచ్చినా పురుషస్పర్శ ఎరుగని శారద పులకించి సిగ్గుపడి మెలికలు తిరిగింది. ఆ అదను కనిపెట్టి చెయ్యిపట్టి దగ్గిరకు లాక్కుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. శారద మైమరచిపోయింది. అయినా అతను చేసినని తప్పని ఆ అమాయకురాలికి అర్థం అయి అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడ్తూ...
    "శారదా... నీవంటే నాకెంతో యిష్టం... చూడు ఇది మీ అక్కయ్యకు చెప్పకు సుమా!" అన్నాడు రహస్యంగా.
    "ఛీ... పో... చెప్తానేమిటి" అంది శారద సిగ్గుపడ్తూ.
    అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదని దగ్గిరకు లాక్కుని, ముద్దు పెట్టుకుని ఆమెమీద మంత్రం చల్లినట్లు నెమ్మదిగా ఆమెని లోబరుచు కున్నాడు.
    ఎక్కడికో వెళ్ళి అవసరం తీర్చుకోవాలంటే... ఎవరన్నా చూస్తే పరువు పోతుంది. పైగా భయం. ఇంట్లో వ్యవహారం ఎవరికీ తెలియదు అని ఆలోచించాడు.
    ఓ రోజు పార్వతమ్మ గుడికి వెళ్ళింది. రాధ కాలేజీనుంచి యింకా రాలేదు. ఆ అదను చూసి కాఫీ చేస్తున్న శారదని అమాంతం కౌగలించుకుని నలిపేస్తూ... ఎత్తుకుని తీసికెళ్ళి పక్కమీద పడుకోబెట్టి శారద ఏమనేలోపల, అనే అవకాశం ఇవ్వకుండా ఆమెను మైమరుపులో పడేశాడు.
    పాతికేళ్లు దాటిన శారద శరీరం పురషస్పర్శకోసం పరితపిస్తున్న ఆమె దేహం ఆమె ప్రమేయం లేకుండానే అతనికి లోబడిపోయి ఆ మైమరుపులో ఆమెని ఆమే మర్చిపోయింది. అంతా అయ్యాక జరగరానిది ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. సిగ్గుతో, అవమానంతో అతనివంక చూడలేకపోయింది.
    శారదని అతననేక విధాల బుజ్జగిస్తూ, తనకి ఆమె అంటే ఎంతో యిష్టమని, ఆగలేకపోయానని ఏవో తీయని మాటలు చెప్పి ఆమెని సమాధానపరిచాడు. శారద అతన్ని చూస్తూ ఏమీ అనలేకపోయింది. ఈ విషయాలేవీ రాధతో చెప్పకూడదు. నీవూ, నేనూ ఒకటి అంటూ తెలివిగా రాధ దగ్గిర మామూలుగా వుండమని, ఎవరూ లేనప్పుడు తన దగ్గిరికిలా రమ్మని శారద ఏ విధంగా ప్రవర్తించాల్సిందీ అంతా బోధపరిచాడు.
    ముందునించి మాధవ్ అందచందాలు చూసి ఓ ఆరాధనాభావం ఏర్పరచుకుని, అతను తనవంక చూస్తేనే, మాట్లాడితేనే ఆనందపడే శారద అతను తననింత ప్రేమగా చూడడంతో తబ్బిబ్బు అయిపోయి అతనెలా చెపితే అలా చేసేది. మనిషి రుచి మరిగిన పులి 'మేనీటర్' అవుతుంది. అలాగే మాధవ్ అందించిన సుఖాన్ని వదులుకోలేకపోయింది శారద. మాధవ్ ముందు జాగ్రత్తకోసం ఫామిలీ ప్లానింగ్ మాత్రలు కొనితెచ్చి జాగ్రత్తగా దాచి ఎలా వేసుకోవాల్సింది చెప్పాడు.
    రాధ గర్భవతిగా వున్న తొమ్మిది నెలల్లో గత నాలుగు నెలలనించి తనవెనక జరిగే ఈ భాగోతం గుర్తించలేకపోయింది. మాధవ్ గదిలోకి కాఫీ తీసికెళ్ళి యిచ్చి వచ్చిన శారద మొహంలో సిగ్గు, ఎరుపుదనం ఎందుకో గుర్తించలేకపోయింది.
    ఓసారి యింటికి వచ్చేసరికి మాధవ్ వంటింట్లోంచి వస్తూ తనని చూసి తడబడితే అదీ గుర్తించలేకపోయింది. భార్య యింట్లో వుండగా తనని ఎవరూ అనుమానించరని అతను తనని అడ్డుపెట్టుకుని శారదతో ఆడే ఆటలు గుర్తించలేకపోయింది. గుర్తించేవేళకి పరిస్థితి చేయి దాటిపోయింది.


                      15


    రాధకి నెలలు నిండాయి. తొమ్మిదో నెల రాగానే మెటర్నిటీ లీవ్ తీసుకుంది. రాధ యింటిపట్టున వుండడంతో మాధవ్ కి శారదకి స్వేచ్చ దొరకక మాధవ్ కది చాలా యిబ్బందిగా వుంది. తన సుఖానికి అడ్డువచ్చిన రాధమీద మాధవ్ కి మంటగా వుంది. ఆ కసి ఎవరిమీద చూపాలో తెలియక ప్రతిదానికి చిరుబురులాడుతూ, ధుమధుమలాడుతూ యింట్లో వున్న కాసేపు ఏదో కనిపించలేదని, ఏ టిఫినో బాగులేదని ప్రతిదానికి కేకలు పెట్టేవాడు. ఇద్దరి పడక గదులు రాధ గర్భవతి అయిన దగ్గిరనుంచి వేరయ్యాయి. రాధ వీలయినంతవరకు ఆ గది వదిలిరాదు. మాధవ్ యింట్లో వున్నప్పుడు అసలు రావడం మానేసింది. రాధ యింట్లో వుండడంతో శారదని కలవడానికి కొత్తదారులు వెతకవల్సి వచ్చింది మాధవ్ కి. రాత్రి అందరూ పడుకున్నాక తలుపుతీస్తాను రమ్మని శారదని ఒప్పించాడు. శారద ముందు భయపడింది. తల్లికి తెలుస్తుందని రానంది. రోజూ వద్దని రెండుమూడురోజులకోసారి ఎలాగన్న రమ్మని బలవంతపెట్టి ఒప్పించాడు.

 Previous Page Next Page