అప్పుడు నాకో రక్షాబంధనం వంటి తాయెత్తు యిచ్చాడు నన్నా ప్రదేశంలోనికి తీసుకెళ్ళినతను. నేను దాన్నేం చేయాలో తోచక అతని వంక చూశాను. అతను మాట్లాడవద్దన్నట్లు సైగచేసి, దాన్ని చేతికి కట్టుకోమన్నట్టు సైగ చేశాడు.
నేను మౌనంగా అతను చెప్పినట్లే చేశాను.
అద్భుతం..... పరమాద్బుతమైన దృశ్యం తిలకించాగలిగాను. ఆ రక్షాబంధనం కట్టుకోగానే.
అంతిమ ఘడియల్లో వున్న బౌద్దభిక్షువు ఆత్మ టెంకాయ పగల కుండానే చిప్పనుంచి విడిపోయే 'కురిడీ' వలె క్రమక్రమంగా అతని శరీరం నుంచి విడుదల కాసాగింది. అతనా రక్షాబంధనం ఎందుకిచ్చాడో అప్పుడర్ధమైంది నాకు.
అంతటి మహోన్నత దృశ్యం తిలకిన్చాలంటే ఎంతటి యోగశక్తి వుండాలో, ఇంకెంతటి ఋషిత్వం పొందాలో, అటువంటివారే అలాంటి మహాద్భుత దృశ్యాన్ని - తిలకించగలరు.
నాలాంటి మామూలువాడికి అది సాధ్యపడే పని కాదు కాబట్టే నాకతడు ఆ రక్షాబంధనం వంటి తాయెత్తిచ్చాడని తెలుసుకుని అతనివైపు భక్తిగా, వినయంగా చూసి నమస్కరించాను. అతడు మౌనంగా తలూపి జరగబోయేది చూడమన్నట్టు సైగ చేశాడు. నేను అతను చెప్పినట్లే చేశాను.
మరణించేవారి ఆత్మకు భయమూ, దిగులూ, బాధా లేకుండా నిండారముగ్గిన మామిడిపండులోంచి టెంక తేలికగా జారివచ్చినట్టు శరీరంలోంచి జీవాత్మ వెలువడే విధానం అది.
పాదాలు దగ్గర నుంచి మొదలై, బొటనవేలుకి పక్కనే వున్న పొడుగాటి రెండవ వేలు నుంచి స్థూలశరీరంలోంచి సూక్ష్మశరీరం క్రమంగా వూడివచ్చి చీలమండలూ, మోకాళ్ళూ, తొడలు, నాభివరకూ బయటికి రాగానే పొగమంచులా గాలిలో శరీరానికి రెండడుగుల ఎత్తున తేలుతూ వున్నది 'జీవుడు'.
ఒక సెకండు బొడ్డు దగ్గర పొడుగాటి టెలిఫోను తీగవంటి ఒక గొట్టము మరణిస్తూన్న అతని శరీరానికీ, జీవాత్మకూ అనుసంధానంగా, లేత నీలపు కాంతితో వెలుగుతూ ఆరుతూ శరీరంలోని జీవుణ్ణి బయటకు లాగసాగింది.
ఉన్నట్టుండి ఆ వృద్దభిక్షువు నడుం దగ్గర నుంచి పైకి లేచాడు. లేత నీలపుకాంతి అక్కడ బలంగా లాగసాగింది. అదీ కొన్ని క్షణాలు మాత్రమే తరువాత పైకి లేచిన అతని నడుం ఎవరో వదిలేసినట్లే దబ్బుమని విడివడి క్రిందపడటం జరిగింది.
ఆ క్షణంలోనే ఏదో గాలిపటం తెగినట్లు, మగత నిద్రలో పిల్లలు చేసే మూలుగువంటి చిన్న శబ్దంతో జీవాత్మ పూర్తిగా ఆ వృద్ద భిక్షువు శరీరం నుంచి బయటికి వచ్చేసింది. మరుక్షణం అది తుఫాను వేగంతో శూన్యంలో కలసిపోవడం స్పష్టంగా కన్పించింది...." అంటూ ఆగాడు వరప్రసాదం.
అదే సమయంలో రాత్రి పన్నెండయినట్లు వాల్ క్లాక్ పన్నెండు గంటలు కొట్టింది.
"తరువాతేమైంది?" సస్పెన్స్ భరించలేనట్లు అడిగాడు అభిరాం.
"నన్నక్కడికి తీసుకెళ్ళిన లామా నా చేతికున్న రక్షాబంధనం తిరిగి తీసుకుని బయటకి నడిచాడు. నేనూ అతన్ని అనుసరించాను. అతను ఆ గుహ నుంచి కాస్త దూరం నడిచి ఓ మంచుకొండపై కూర్చున్నాడు. నేనతనికి దిగువగా వున్న మరో బండపై కూర్చున్నాను. అప్పుడు సూర్యాస్తమయమవుతోంది.
మంచు కరిగి నీరై ప్రవహిస్తూ చిన్న చిన్న అలలు ఒకదానికొకటి ఢీకొంటూ ప్రేయసీప్రియులు ముచ్చట్లాడుకుంటున్నట్లున్నాయి. కొండలపై నుండి జాలివారే నదులు, కాలువలు కేశపాశాల్లా వున్నాయి. వాటి సంగీతం సుమధురంగా, అద్భుతంగా వుంది. నీరెండలో పొగమంచు హిమాలయాలంతటినీ ఆక్రమించుకున్న వెన్నెల పరుపులా వుంది.
చాలాసేపు ఆ లామా మౌనంగా వుండిపోయాడు. అతని మౌనానికి నేను భంగం కలిగించదలుచుకోలేదు. హిమాలయాల్లో యోగులూ, ఋషులూ మౌనంగా వున్నప్పుడు వైర్కి అంతరాయం కలిగించకూడదని అప్పటికే తెలుసుకున్నాను నేను.
మన మదిలో మెదిలే భావాలూ, అనుభావాలూ, ప్రశ్నలూ వాయు తరంగాల్లో కలసిపోయి వారి బుద్దిని చేరుకుని వాటికి సమాధానాలు వారే చెబుతారు. దానికి మనం కొంచెం ఓపిక పట్టాలి. నా నిరీక్షణ ఫలించింది. నేను అడగాలనుకున్న ప్రశ్నలకి ఆ లామానే జవాబులు చెప్పసాగాడు.
"ఇప్పుడు నువ్వు చూసింది ఆత్మ శరీరాన్ని వీడి అనంత శూన్యంలో కలసిపోయే అద్భుత దృశ్యాన్ని ఇది తిలకించాలంటే ఎంతో సాధన అవసరం. నువ్వు అదృష్టవంతుడివి.
ఏ కష్టమూ లేకుండానే ఆ దృశ్యాన్ని తిలకించావు. అయితే నీకు పై పై దృశ్యాలే కనిపించాయి.
శరీరంలోంచి జీవాత్మ పోయేటప్పుడు ఆ జీవుడికి ఎదురయ్యే అనుభవాలు నీకు తెలియదు. ఎందుకంటే నీవింకా మరణించలేదు. కానీ యోగులకు, ఋషులకు మరణించకనే ఆ అనుభవాలు తెలుస్తాయి.
శరీరంలోంచి ఆత్మ బయటకు పోయేటప్పుడు నాభి దాకా జ్ఞాపక శక్తి పనిచేస్తూ వుంటుంది. క్రమంగా శిరస్సులోంచి క్రిందిభాగం వైపుకు వెచ్చగా, సముద్రపు ఆటుపోతుల్లా ఆ వెచ్చదానం ప్రవహిస్తూ తర్వాత హృదయం వైపుకు పాకి ఆగిపోతుంది.
మిగతా శరీరం చల్లబడి మట్టిముద్దలా బరువెక్కడం, ఆ బరువు నడుం దగ్గరకు చేరుకోవడం, ఆత్మ శరీరాన్ని విడిచిపోవటం జరుగుతుంది. అందుకే ఇందాక మరణించైనా లామా (బౌద్ద భిక్షువు) నడుం గాలిలోకి లేచి ఒక్కసారిగా నేలపైబడింది.
శరీరంలోంచి బయటపడిన అతఃమ అనంతాకాశంలోకి పయనిస్తూంది. అక్కడి చీకటి వెలుతురు లేనిచోట ఏర్పడే అంధకారం వంటిది కాదు. స్పర్శకి తగిలే చిక్కదనం నిండిన చీకటి.
ఇది ప్రేతలోకాల మార్గంలోకి ప్రవేశిస్తున్న జాడ సుడిగుండంలా గుండ్రంగా ఒక గొట్టంలో వేగంగా ప్రవహించే నీటిలా జీవుణ్ణి గిరగిరా తిప్పుతూ ముందుకు తోసుకుపోతుంది ఒక తుఫాను వంటి నిశ్శబ్దమైన వేగం ఆ జీవుడి ప్రయత్నమేమీ లేకుండానే ఏటవాలుగా కాళ్ళు ఎత్తుగా, తల దిగువగా వంగి గాలిలోకి, నల్లటి సొరంగంలోకి శరవేగంతో దూసుకు పోతున్న అనుభూతికి లోనవుతాడు.