Previous Page Next Page 
జీవాత్మ పేజి 28


    అలా అలా కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణంచేసి క్రమక్రమంగా నక్షత్రంలాగా, మరుక్షణంలో చీకటి నిండిన రంధ్రం ద్వారా ప్రయాణించి కొంతసేపటికి ఒక సన్నటి వెలుగుకిరణంలాగ విశాల ప్రపంచంలోకి విసిరేయబడిన అనుభూతికి లోనవుతాడు జీవుడు. మరుక్షణమే కాళ్ళు దిగువకీ, తల పైకి లేచి శరీరం నిటారుగా నిలబడి చుట్టూ పరిసరాల్ని గమనించగలుగుతాడు.
    
    వెనుదిరిగి చూస్తే పక్కమీద వున్నది తఃన రూపమే అని తెలుసుకుని స్పష్టంగా చూసుకుంటాడు. చాలామందికి జీవితకాలంలోకంటే మరణం తరువాత తమని తాము స్పష్టంగా మొదటిసారి చూసుకోవటం జరుగుతుంది. చాలామంది ఆ చూస్తునది తమ సరీరాన్నే అని గుర్తించరు. ఎవరినో బైట వ్యక్తిని చూస్తున్నట్లు ఆశ్చర్యంగా చూస్తారు.
    
    మరుక్షణమే వెలుగు! లేత వెన్నెలలా సంధ్య వెలుగులా మెరుస్తూ వింతగా కన్పిస్తుంది. తాను మరణించావని జీవి తెలుసుకుని-తాను ఒంటరిననీ, ఇక్కడ తనకి నా అన్నవారు వుండరని దిగులుతో స్తంభించి ఉండగానే కాంతిని మించిన వేగంతో రెండు ఆకారాలు ప్రత్యక్షమవుతాయి.
    
    వారుమరణించేసరికి సహాయంచేసే 'కర్మదేవతలు' మరణించిణ వారి మత విశ్వాసాలను బట్టి కొందరికి క్రైస్తవ ఫాదరీలలా, మరికొందరికి చేతిలో జడమాల తిప్పుతున్న బౌద్దభిక్షువుల్లా, ఇంకొందరికి ఋషీశ్వరుల్లా కన్పిస్తారు.
    
    ఇప్పుడు మరణించినా ఒక వ్యక్తి యోగి! టిబెటన్ లామా! అతడిని ఒక పనిమీద ఈ భూమ్మీంచి ఒక అసాధారణ పరిశోధనకై పంపించారు' అతను చెప్పిన మాటలతో నేను షాక్ తిన్నాను.
    
    అప్పుడతను చిన్నగా నవ్వి- 'అలా ఆశ్చర్యపోకు ఇది సత్యమే. మరణించి తిరిగి జన్మించటం అంటే చాలాకాలం పడుతుంది. వంటనే తగినటువంటి తల్లిదండ్రులు దొరకడం కష్టం.
    
    ఒకవేళ మంచి జన్మ లభించినా బాల్యం నుంచి పెరిగి పెద్దవాడవటంలో అతడు భూమ్మీద చేయవలసిన కార్యం వేనుకబాది పోతుంది.    

    అందుకని మరణించబోతున్న వేరే వ్యక్తి శరీరంలోకి ఈ యోగి ఆత్మను 'పరకాయ ప్రవేశ విద్య' ద్వారా పంపించి, అతడిని ఓ బ్రిటీష్ వాని శరీరంలో నివసించే ఏర్పాటు చేయవలసి వచ్చింది.
    
    ఈ యోగి ఆత్మ బ్రిటీష్ వాడు మరణించిన మరుక్షణం తుమ్మెదల నాదంలాగ, సముద్రపు హోరులాగా, సన్నని కీచురాయిలా విన్పిస్తున్న శబ్దాల మధ్య నుంచి పయనించి కళ్ళు నల్లగా చీకట్లు కమ్మి, శ్వాస గొంతులో గురగురలాడుతుండగా, ఉన్నట్టుండి ప్రాణాలు చచ్చుబడ్డట్టు నీరసంతో ఉన్నప్పుడు తానెవరి శరీరంలోకి వెళ్ళాలో ఆ శరీరం బొడ్డు దగ్గరకు చెరి కరెంటులా అదాట్టుగా ఆ శరీరంలోకి వెళ్ళిపడతాడు.
    
    దాంతో మరణించిన ఆ బ్రిటీష్ వాడు మరలా ఊపిరి పీలుస్తాడు. వైద్యులు తమ పేషెంటు గుండె ఆగిపోయి కొన్ని నిముషాలు 'మెడికల్' గా మరణించి, తిరిగి తాము అతని గుండెలను నొక్కి, మాలీషు చేయడం వల్లే శ్వాసక్రియ అందుకొని బ్రతికాడని తమ వైద్య నివేదికలో రాసుకుంటారు.
    
    వారికి తెలిసిందే సర్వస్వం అనుకుంటారు. వాళ్ళ దృష్టిపథంలోకి రానివి, లేవని కొట్టిపడేస్తారు' అంటూ ముగించాడు ఆ లామా నేను ఊపిరి సైతం పీల్చడం మర్చి విన్నాను" అన్నాడు వరప్రసాదం.
    
    (వృద్ద బౌద్దభిక్షువు మరణించి తిరిగి ఓ బ్రిటీష్ వాని శరీరంలోకి పరకాయ ప్రవేశం ద్వారా ప్రవేశించడం. Dr. From Lhasa, The Rampa Story అనే రెండు గ్రంథాల్లో లోబ్ సాంగ్ రాంపా అన్న పేరు గల వ్యక్తి తన పరకాయ ప్రవేశం అనుభవాన్ని యథాతధంగా వివరంగా విపులీకరించి రాసాడు)
    
    "ప్రస్తుతం నాదీ అదే పరిస్థితి" అన్నాడు అభిరాం- తనున్న స్థితేమిటో తనకే తెలీక.
    
    రాత్రి ఒంటిగంటయినట్లు గడియారం ఓసారి మోగింది. "ఇక పడుకుందాం" అన్నాడు వరప్రసాదం.
    
    "సరే" అని లైటాపేసి బెడ్ ల్యాంప్ వెలిగించాడు అభిరాం. ఇద్దరూ నిద్రకుపక్రమించారు.
    
                                                            *    *    *    *    *
    
    జీవులన్నీ మూగబోయిన వేళ!
    
    వెలుగును ఓడించి చీకటి విశృంఖలంగా స్వైరవిహారం చేస్తున్న సమయం..... మనిషి సుఖదుఃఖాలకు, పెద్దా గొప్ప తారతమ్యాలకు గీతం పాడే ప్రదేశం...
    
    పిశాచాల్లా కదులుతున్న వృక్షాల సముదాయం....
    
    ఆ వృక్షాల ఛాయలో...
    
    ధ్యానంలో ఓ ఝటధారి-
    
    అతని ధ్యానానికి శూన్యంలోంచి సన్నగా ప్రారంభమైన గాలి అలలై, అలలు ఘోషయి, ఘోష భీకరమై, అపశృతులతో ఓడలు జలదరింప చేసే నవ్వులాంటి ఏడుపు, ఏడుపులాంటి నవ్వు... అది అంతవరకూ పెరిగి అండపిండ బ్రహ్మాండాలని కదిపి కుదిపేసేలా రూపాంతరం చెందింది.
    
    హాస రోదనల సంగీతం గాలి హోరును కాలరాచి కరాళనృత్యం చేస్తోంది. కర్ణభేరిని బద్దలు చేస్తుందా అన్నట్టు విర్రవీగిపోతోంది.
    
    శూన్యంలోంచి పుట్టుకొస్తున్న దేహం లేని నీడలు!
    
    ఒక్కక్షణం మెరిసి మాయమైపోతున్నాయి.
    
    చెట్లమీద పక్షులు భయంతో మరింత ముడుచుకున్నాయి. దక్షిణం దిక్కునుంచి 'హో' అనే హోరు మునుపటి రోదనలతో కలిసిపోయి మరుభూమే ఒక రణభూమిగా మారనుందా? అన్పిస్తోంది.
    
    ప్రభంజనం ప్రళయఘోషతో వికటిస్తోంది. భ్రష్ట రోదనలు శక్తి పుంజుకున్నాయి.
    
    తీతువు వికృతంగా అరిచింది.
    
    గుడ్లగూబ గుబులుగా చూసింది.
    
    చరాలు అచరాలై చేష్టలు దక్కి ఉన్నచోటునే వుండిపోయాయి. ఆకాశం పెద్దగా గర్జించింది. పుడమి భయంతో వణికిపోయింది.
    
    ఆ ఝటాదారి ముల్లోకాలూ కదిలిపోయేట్టు బిగ్గరగా మంత్రాలు పఠించసాగాడు.
    
    ఓం నమః కర్ణపిశాచినీ అమోఘ సత్యవాది మమకర్ణే.

 Previous Page Next Page