Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 26

"ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ అసూయా కూడా వుంటుంది."
అంటే-
తను - హరీన్.......?
చిక్ లీని దగ్గరికి లాక్కుని , ఆమె కళ్ళలోకి చూస్తూ అంటున్నాడు హరీన్.
"ఇకనన్నా ఈ సేవకుడికి శెలవిప్పిస్తావా? కాస్త విశ్రాంతి తీసుకోవాలి."
"హొయ్ హొయ్ హొయ్!" అని నవ్వింది చిక్ లీ.
"కావలసినంత విశ్రాంతి తీసుకో - విశ్రాంతి తీసుకోడానికి నీకు ఇంక ఇదే చివరి అవకాశం! రేపే మన పెళ్ళి! ఆ తర్వాత నీకు ఉపిరి సలపనివ్వనులే!"
ఇంతలో దూరం నుంచి చిక్ లీ చెలికత్తెలు ఆమెని పిలిచారు ఎందుకో.
"ఓయ్......వస్తున్నా!" అంటూ చిలిపిగా హరీన్ ని చేతులతో దూరంగా నెట్టేసింది చ్జిక్ లీ. తర్వాత ఉత్సాహంగా లేడిపిల్లలా చెంగుచెంగున గంతులు వేస్తూ తన చెలికత్తెల వైపు సాగిపోయింది.
ఆమె అటు వెళ్ళగానే తను చటుక్కున కరుణ వున్న గుడిసెలోకి వచ్చేశాడు హరీన్.
"ఎలా వున్నావు కరుణా?" అన్నాడు ఆర్ద్రంగా కరునవైపు చూస్తూ.
నిరుత్సాహంగా అంది కరుణ "నేనా -నాకేం.......నేను బాగానే వున్నానే!"
ఆమె వైపు పరిశీలనగా చూసి అన్నాడు హరీన్.
"నేను పూర్తిగా మారిపోయానని అనుకున్నావు కదూ నువ్వు? నేను ఆడుతున్న నాటకాన్ని చూసి నిజమని భ్రమపడ్డావు కదూ? తప్పనిసరై అలా నాటకం ఆడవలసి వచ్చింది కరుణా!"
"నాటకమా?" అంది కరుణ సంభ్రమంగా. "ఆ రోజున మీరు తిన్న ఆహారంలో ఏదో మందు కలిపి వుంటుందని దాని ప్రభావం వల్లే అలా మారిపోయారని అనుకున్నాను నేను."
"లేదు లేదు.....ఆరోజున ఆ ఎర్రటి అన్నం చూడగానే నాకొక విషయం గుర్తుకు వచ్చింది. దానితో బాటు ఒక ఉపాయం కూడా తట్టింది. ఆ ఉప్పాయాన్ని అమలులో పెట్టి ఆ అపాయంలో నుంచి తప్పించుకోవాలంటే చిక్ లీ నమ్మకం చూరగొనక తప్పదనిపించింది. అందుకే ఆమె పట్ల మరులుగొన్నట్లు నాటకం ఆడాను కరుణా!"
అది వినగానే ఒక్కసారిగా తెరిపిన పడ్డది కరుణ మనసు.
"అయితే అదంతా ఉత్తదేనా?"
"ఏదంతా?"-
"చిక్ లీతో మీ ప్రేమాయాణం?" అంది కరుణ నేల చూపులు చూస్తూ.
"నిస్సందేహంగా!" అన్నాడు హరీన్.
"ఇంతకీ మీరు తెలుసుకున్న ఆ విశేషం ఏమిటీ?"
"ఆ రోజు నేను తిన్న ఆ ఎర్రటి అన్నం ఏమిటో తెలుసునా? నిప్పులేకుండానే పుచ్చకాయలో వండిన అన్నం అది."
నిజమా? అదెలా సాధ్యం?"
చెప్పడం మొదలెట్టాడు హరీన్.
"పుచ్చకాయ ఒకటి తీసుకుంటారు కరుణా .........కత్తితో దాని తొడిమ చుట్టూ గాటు పెట్టి, ఆ తోడిమని మూతతీసినట్లు తీస్తారు. తర్వాత బియ్యం తీసుకువచ్చి, ఆ బియ్యం పట్టేంత మేర పుచ్చకాయలోని గుజ్జుని తీసేస్తారు. అయినా ఇంకా చాలా గుజ్జు మిగిలే వుంటుంది పుచ్చాకాయలో. తర్వాత దానిలో మరికొన్ని దినుకులు వేసి, ఆ పుచ్చకాయని సముద్రతీరాన ఇసుకలో పాతిపెడతారు. సాయంత్రం అయ్యేసరికల్లా పుచ్చకాయలోని బియ్యం అంతా అన్నంగా మారిపోతుంది. తినడానికి చాలా తియ్యగా రుచిగా వుంటుంది ఆ అన్నం. నేను ఇదివరకోసారి సముద్రానికి దగ్గరగా ఉన్న ఒక అడవిలో షూటింగుకి వెళ్ళినప్పుడు తిన్నాను అలాంటి అన్నం. అక్కడి ఆటవికులకి స్బెహశీలత చాలా ఎక్కువ. కలుపుగోలుగా వుంటారు."
నెమ్మదిగా అంది కరుణ.
"అంటే....దాని అర్ధం.....?'
"దాని అర్ధం ఏమిటంటే - సముద్ర్రం ఇక్కడికి చాలా దగ్గరలో ఉండివుండాలని. కానీ అదిమనకు కనబడటంలేదు. ఎందుకంటే చుట్టూ వున్న కొండలవల్ల ఒక దొన్నెలాగా వుంది ఈలోయ.
"కానీ సముద్రం అతి సమీపంలోనే వుంది - అది మాత్రం నిశ్చయం! బహుశా చెట్లదుంగలతో కట్టిన తెప్పలతోనే సముద్రమార్గాన బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకుని వుంటారు - ఈ ఆటవికులు!"
ప్రశంశపూర్వకంగా అతనివైపు చూసింది కరుణ.
హీరో ఇతను! తనంతట తానుగా కనిపెట్టాడు - లోయలో నుంచి బయటపడే మార్గాన్ని!
అనందం ముంచుకొచ్చి అతని చేతిని పట్టుకుని గాడంగా ఒత్తింది కరుణ.
చిరునవ్వు నవ్వాడు హరీన్.
"సముద్రం మనకి దగ్గరిలోనే వుందని తెలిసింది. అంతేకాదు అది ఎతువైపున వుందో తెలుసుకోవడానికి కూడా ఒక ఆధారం దొరికింది."
"ఏమిటా ఆధారం?"
"మనం కొట్టుకు వచ్చిన నదే! సర్వసాధారణంగా నదులన్నీ మరో పెద్ద నదిలోనో లేదా సముద్రంలోనో కలుస్తాయి. సముద్రం ఇంత సమీపంలో వుంది కాబట్టి బహుశా ఈ నది సముద్రంలోనే కలుస్తూ ఉంది ఉండాలి. అందుకని నదీప్రవాహం ఎటువైపు వుందో అటువైపు వెళ్ళి వెదికాను నేను."
"ఏం కనబడింది?"
"అక్కడ పెద్ద పెద్ద గుహలు వున్నాయి. వాటిలో ఒక్క గుహ మూడేసి విమానాలు ఒకేసారి లోపలికి వెళ్ళేటంత పెద్దదిగా వుంది. ముందువైపు అంత విశాలంగా వున్నా లోపలికి వెళ్ళినకొద్ది పడుకుని పాకుతూ వెళితే గానీ ముందుకు సాగాలేనంత ఇరుగ్గా అయిపోతుంది గుహ. దానికితోడు లోపలంతా గాడంధకారం కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి"
ఆదుర్దాగా చూసింది కరుణ. "మరైతే మనం ఎలా వెళ్ళగలం? పోనీ నదీ మర్గాన వెళ్ళిపోలేమా?"
"అది సాధ్యం కాదు! ఈ నది ప్రచండవేగంతో కొండలనీ, బండలనీ దాటుకుంటూ సముద్రంలోకి ఉరుకుతోంది. మనం సాహసం చేసి నదిలో దూకినా కూడా, మన శరీరాలు ఏ బండనో గుద్దుకుని నామరూపాల్లేకుండా పోవడం తధ్యం. అయినా అంత అవసరం లేదు కరుణా........చీకటిగా వున్న కొండగుహల్లోకి వెళ్ళే పద్దతి వుంది."
"ఏమిటది?"
"చిక్ లీ వంటచెయ్యడానికి నూనెలా ఉపయోగించింది చూడు. జంతువుల తోకలు. వాటినిండా కొవ్వే. వాటిచుట్టు అంటిస్తే కాగడల్లా మండుతాయి అవి. ఆ కాంతిలో ముందుకు సాగవచ్చు మనం."
అతను అలా వర్ణిస్తూంటే ఆ వెలుగు కరుణ మోహంలో ప్రతిబింబించినట్లయింది.
"యూ ఆర్ రియల్లీ గ్రేట్!" అంది అభిమానంగా.
నవ్వి సాలోచనగా అన్నాడు హరీన్.
"కరుణా ఈ ఆటవికులు నాయకుడు చాలా మానవత్వమున్న మంచిమనిషి! ఇప్పుడు మనలాగే అతను కూడా ప్రమాదంలో వున్నాడు. మనతోబాటు అతన్ని కూడా తీసుకెళ్ళడం మన ధర్మం కరుణా!"
"అవును......అది తప్పనిసరి!" అంది కరుణ.
"నువ్వు ఇక్కడే వుండు.......నేను ఇప్పుడే వస్తాను" అని వడివడిగా వెళ్ళిపోయాడు హరీన్.
చిక్ లీ సత్సంభందాలు ఏర్పరుచుకున్నాక , అతనికి ఇప్పుడు ఓ మాదిరి స్వేచ్చాస్వాతంత్ర్యాలు లభిస్తున్నాయి ఆ గూడెంలో.
నాయకుడిని సమిపించాక నెమ్మదిగా అన్నాడు హరీన్ "నాయకా! ఇక్కడే వుంటే నిన్ను బతకనివ్వరు వీళ్ళు. రేపు అటో ఇటో తేల్చేస్తారు. ఒకవేళ జరిగిన దానిలో నీ తప్పేమీలేదనీ మీ వాళ్లందరూ నమ్మినా కూడా దేశింగ్, తెరవెనక నుంచి అతని ఆడిస్తున్న మంత్రాల మల్లయ్యా కలిసి మరేదో తంత్రం పన్ని నిన్ను మళ్ళీ ఇబ్బందిలో పడేస్తారు. అందచేత మాతోబాటు నువ్వు కూడా వచ్చేస్తే మంచిది."
"ఎక్కడికి?"
"బయటిప్రపంచంలోకి,"
ఏదో గుర్తువచ్చినట్లు అన్నాడు నాయకుడు. "అవును ..........బయట ప్రపంచంలోకి వెళ్ళే మార్గం నీకు చెబుతానన్నాను కదూ - విను! కొండలలో ఒక గుహ వుంది. మనిషి చూడడానికి కూడా వీలులేనట్లు కనబడినా దానిలో నుంచి సముద్రతీరానికి దారి వుంది."
"ఆ సంగతి నాకు తెలుసు నాయకా!"
"ఎలా తెలుసు?" అన్నాడు నాయకుడు విస్మయంగా.
చెప్పాడు హరీన్.
అనందం పట్టలేక హరీన్ భుజం పట్టుకుని కుదిపేశాడు నాయకుడు. దేశింగ్ దూరం నుంచి తమని గమనించి చూస్తున్నాడని కనుసైగ చేసి చెప్పాడు హరీన్. నాయకుడు తనని తాను అదుపులో పెట్టుకుని తర్వాత అన్నాడు ప్రశంశాపుర్వకంగా.
"ఉండదగ్గవాడివి హరీన్! నిన్ను చూస్తుంటే మరీ మరీ గుర్తు వస్తున్నాడు నా జింబురూ! అతనేగనక బతికి వుంటే........."
నాయకుడి మాటలు సానుభూతిగా విని అన్నాడు హరీన్.
"పదనాయకా, పోదాం!"

 Previous Page Next Page