Previous Page Next Page 
యమదూత పేజి 26


    
    లేకపోతే ఏ ఫైలులో ఏ రహస్యముందో గుర్తు పెట్టుకోవడానికి వాటిని గబగబ తిరగేస్తోందా?
    
    ఇక్కడి విషయాలన్నీ మెకానిక్ కి చేరవేయడానికే నా ఈ ప్రయత్నమంతా?
    
    ఆ ప్రయత్నంలో భాగంగానే తన ఆర్గనైజేషన్ లోకి అడుగు పెట్టిందా వైశాలి?
    
    ఇప్పుడు ఆమె, మెకానిక్ యిద్దరూ కలిసి తన ఆర్గనైజేషన్ ని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర మొదలెడతారా?
    
    ఆలోచిస్తున్నకొద్దీ కుతకుతలాడిపోతోంది మహాజన్ మనసు.
    
    మహాజన్ రాకని గమనించిన వైశాలి చిరునవ్వు నవ్వి మర్యాదగా లేచి నిలబడిపోయింది.
    
    "కారీ ఆన్.... కారీ ఆన్...." అని చెప్పి, తన ఛాంబర్స్ లోకి వచ్చేశాడు మహాజన్.
    
    టేబుల్ ముందు కూర్చుని తన డ్రాయరు తాళం తీసి, అందులో నుంచి ఒక ఫోల్డర్ బయటికి తీశాడు.
    
    ఫోల్డరు లోపల నీట్ గా డబుల్ స్పేస్ తో టైపు చేసిన పేజీలు  మూడు వున్నాయి.
    
    మొదటి పేజీ పైభాగంలో "అల్బర్టు పింటో: డిటెక్టివ్ ఏజెన్సీ: రిపోర్టు ఆన్ మిస్ జె.వైశాలి" అని వుంది.
    
    తనకి జాగ్రత్త చాలా ఎక్కువ. వైశాలి తెలివితేటలు నిర్ధారణ చేసుకోవడానికి రెండు పరీక్షలు పెట్టి, అంతటితో ఊరుకోకుండా ఆమె గతాన్ని గురించి అల్బర్టు పింటో అనే ప్రైవేట్ డిటెక్టివ్ చేత ఎన్ క్వయిరీ చేయించి, ఫర్వాలేదనుకున్న తర్వాతే తన ఆర్గనైజేషన్ లో చేర్చుకున్నాడు.
    
    కానీ ఎక్కడ జరిగింది తప్పు? సాలోచనగా సిగార్ అంటించి, ఆల్బర్టు పింటో యిచ్చిన రిపోర్టుని మళ్ళీ ఇంకోసారి చదవడం మొదలెట్టాడు మహాజన్.
    
    "వైశాలి: వయసు ఇరవై ఒకటి: ఐడెంటిఫికేషన్ మార్క్స్: పాదం మీద అర్ధరూపాయి కాసంత పుట్టుమచ్చ, బరువు: యాభై నాలుగు కిలోలు, పొడుగు: ఐదడుగుల ఏడంగుళాలు, ఆరోగ్యం : ఎక్స్ లెంట్, చదువు: బి.కామ్, తండ్రిపేరు: సురేష్, తల్లి: ఇందిర; తండ్రి మరణించిన రెండేళ్ళలో తల్లి కూడా మంచంపట్టి మరణించింది; మనోవేదన కారణం; వైశాలికి ఇప్పుడు ప్రపంచంలో మిగిలివున్న ఒకే ఒక్క ఆత్మబంధువు ఆమె తమ్ముడు; పేరు విక్కీ, వయసు పదేళ్ళలోపు.
    
    వైశాలి తండ్రి సురేష్ ఒక డ్రీమర్. అతనికి వ్యాపారంలో లక్షలు సంపాదించాలన్న తపన వుండేది. కానీ కష్టపడి పనిచెయ్యడం అతని తత్వం కాదు. తన ప్రోడక్ట్సుని కాకుండా తన కలల్ని అమ్మి సులభంగా డబ్బు చేసుకుందామని తాపత్రయపడేవాడు. బేసికల్ గా మనిషి చాలా మంచివాడు. సరదా మనిషి అతను ప్లానులూ, ప్రాజెక్టులూ చూసేవాళ్ళకి చాలా హాస్యాస్పదంగా వుండేవి. కానీ అతను మాత్రం వాటిని చాలా సీరియస్ గా నమ్మేవాడు. కానీ ఏ ప్రణాళిక వేసినా దాన్ని చివరిదాకా అమలుచేసే సహనం వుండేది కాదు అతనికి. సగంలోనే ఒక ప్లానుని వదిలేసి సరి కొత్త ప్లాను యింకోదాన్ని పట్టుకునేవాడు. అలాంటి అవకతవక పనులతో అతను పిత్రార్జితాన్నంతా తగలేశాడు. హీ డైడ్ ఏ పూర్ మాన్! దారిద్ర్యంతో బాధపడుతూ కన్నుమూశాడు అతను. కాని దేవుడు అతనికి ప్రసాదించిన అద్భుతమైన వరం ఏమిటంటే, మిన్ను విరిగిమీద పడే స్థితిలో కూడా నవ్వుతూ వుండగలగడం! ఆ కుటుంబంలో తల్లీ, తండ్రి కూతురూ, కొడుకూ చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళు. తను ఎన్ని తప్పులు చేసినా కూడా కుటుంబ సభ్యుల ప్రేమని కోల్పోకుండా వుండగలగడం సురేష్ కి గొప్ప అదృష్టం!
    
    తండ్రి స్వభావమే కూతురు వైశాలికి వచ్చింది. ఆమె కూడా తండ్రిగానే డ్రీమర్. తండ్రిలాగే ఆమెకి కూడా సాధ్యమయినంత త్వరగా, సాధ్యమయినంత ఎత్తుకి ఎదిగిపోవాలన్నా తహతహ వుంది. అయితే తండ్రికి వున్నట్లు అసంబద్దమైన ఆలోచనలు లేవు. ఆమె ఏం చేసినా చాలా పకడ్బందీగా చేస్తుంది. స్కూల్, కాలేజ్ డేస్ లో ఆమె సరదాగా చేసిన ఫాసినేటింగ్ ఫీట్స్ కొన్ని ఈ కింద యివ్వడం జరిగింది."
    
    వైశాలి తన స్టూడెంట్ డేస్ లో చేసిన కొన్ని సంభ్రమం కలిగించే పనులు ఆ కింద రాసి వున్నాయి.
    
    ఆ తర్వాత మళ్ళీ రిపోర్టు కొనసాగింది.
    
    వైశాలి చిన్నతనం నుంచే అక్కడక్కడా పార్టుటైం జాబ్స్ చేసి కుటుంబాన్ని అదుకుంటూ వుండేది. తండ్రి పోయాక కుటుంబ భారం మొత్తం ఆమె మీదే పడింది. తల్లి కూడా పోయాక యింక తమ్ముడు విక్కీకి ఆమె ఒక్కతే దిక్కు అయింది! తమ్ముడంటే విపరీతమైన అభిమానం వైశాలికి. అతనే ఆమె పంచప్రాణాలు. తండ్రి స్వభావం వైశాలికి వస్తే, తల్లి స్వభావం విక్కీకి వచ్చింది. తమ్ముడికి చదువంటే అమితమైన శ్రద్ద! చాలా క్రమబద్దమైన అలవాట్లు అతనివి.
    
    తమ్ముడు తనలాగే లాటరీ లాంటి రిస్కీ లైఫ్ లో పోకుండా బాగా చదువుకుని ఏద డాక్టరో, ఇంజనీరో కావాలని ఆమె అభిలాష, అదే ఆమె జీవితాశయం!
    
    ఆమె సెక్స్ లైఫ్ గురించి ఏమీ పుకార్లు లేవు. ఆమె ఎవరితోనూ ప్రేమలో పడినట్లు దాఖలాలు లేవు.
    
    ఫోల్డర్ మూసేశాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్. ఒక్క క్షణం ఆలోచించాడు.
    
    ఈరిపోర్టు చూశాకే తను వైశాలిని తన ఆర్గనైజేషన్ లో చేర్చుకున్నాడు. అప్పట్లో ఈ రిపోర్టులో తనకి ప్లస్ పాయింట్స్ గా కనబడిన పంక్తులే యివాళ నెగెటివ్ అర్ధాలిస్తూ కనబడుతున్నాయి.
    
    ఆ పంక్తులు మళ్ళీ కళ్ళముందు మెదిలాయి మహాజన్ కి.
    
    "తండ్రి స్వభావమే కూతురు వైశాలిని వచ్చింది. ఆమె కూడా తండ్రిలాగే డ్రీమర్. తండ్రిలాగే సాధ్యమయినంత త్వరగా, సాధ్యమయినంత ఎత్తుకి ఎదిగిపోవాలన్న తహతహ వుంది. అయినా తండ్రికి ఉన్నట్లు అసంబద్దమయిన ఆలోచనలు లేవు. ఆమె ఏం చేసినా పకడ్బందీగా చేస్తుంది.
    
    "అంటే, సాధ్యమయినంత త్వరలో సాధ్యమయినంత ఎక్కువ డబ్బు మిగుల్చుకుని, తన ఆర్గనైజేషన్ కే మోసం చెయ్యాలని చూస్తోందా ఆమె?
    
    లేకపోతే ఆమె అకౌంట్ లో ఒక్క వారంలో పది లక్షల రూపాయలు వచ్చి చేరడంలో అర్ధమేమిటో?
    
    గుప్పుగుప్పున సిగార్ పొగ వదుల్తూ కాసేపు ఆలోచించి, తన డైరెక్టర్ లైన్ ఫోన్ ఎత్తి డిటెక్టివ్ ఆల్బర్ట్ పింటోకి రింగ్ చేశాడు మహాజన్.
    
    క్షణాల్లో లైన్ లోకి వచ్చాడు అల్బర్ట్ పింటో. అతని మాటల్లో గోవా యాస వినబడుతోంది.
    
    "మోర్నింగ్ సర్!"
    
    "అల్బర్ట్! లాస్ట్ వీక్ ఒక అమ్మాయి గురించి రిపోర్టు ఇచ్చావు గుర్తుందా?"    

 

    "ఆ అమ్మాయి గురించి ఇంకొన్ని వివరాలు కావాలి"
    
    "లైక్ వాట్ సర్?"
    
    "ఫలానా అని చెప్పలేను! ఆమె లేనప్పుడు ఆమె రెసిడెన్స్ కి ఓసారి వెళ్ళు. కాగితాలూ, బట్టలూ అన్నీ వెదుకు. ఏ టూ జడ్ రిపోర్టు కావాలి నాకు."
    
    "సర్టెన్లీ సర్!"    

 

    ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్.    

    అతనికి అన్నిటికన్నా బాధ కలిగించిన విషయం వైశాలి మెకానిక్ తో కలిసి తనకి ద్రోహం చేస్తోందన్న భావన!
    
    ఈ మెకానిక్ వల్ల తనకి చెప్పలేనంత అపకారం జరగడం ఇది మొదటిసారి కాదు.
    
    ఇంతకుముంది ఒకసారి తనకి మెకానిక్ వల్ల హాని జరిగింది.
    
    ఇప్పుడిది రెండోసారి.

 

    మహాజన్ కి వద్దనుకున్నా గతం గుర్తొచ్చింది.
    
    గుర్తు రాకూడదని అతను అనుక్షణం గింజుకునే గతం!
    
    అంతకు కొన్ని నెలల క్రితం...
    
    ఒక పార్టీలో మొదటిసారిగా కలిశాడు తను జానకిని.
    
    ఏ పార్టీకయినా సరే తను వెళ్ళగానీ క్షణాల్లో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాడు.
    
    తననే చుట్టు ముట్టేస్తారు అందరూ.
    
    తనని మించిన మొనగాడు మరెవరూ లేనట్లు చూస్తారు. మొగాళ్ళందరూ!
    
    తనని మించిన మొగాడు ముల్లోకాల్లోనూ లేడన్నట్లు చూస్తారు ఆడాళ్ళందరూ.
    
    అది తనకు అనేక వేలసార్లు అనుభవం!
    
    ఆ అనుభవానికి విరుద్దంగా ప్రవర్తించింది జానకి.
    
    అందరూ ఎగబడి తనని పలకరించడానికీ, తన దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికీ తాపత్రయపడిపోతుంటే, ఎవరో పరిచయం చేసినా కూడా ఊరికే నమస్కరించి, ముక్తసరిగా ఉండిపోయింది జానకి.
    
    అదిగో.....
    
    సరిగ్గా అందువల్లే తన దృష్టిలో పడిందేమో!
    
    ఆ తర్వాత అప్రయత్నంగానే అయిదారుసార్లు ఆమె వైపు చూశాడు తను.
    
    ఘాటైన అత్తరులాగా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసే అందకాదు జానకిది.
    
    మృదువయిన పెర్ ఫ్యూమ్ ఉండుండి చిరుగాలి వీచినప్పుడల్లా సున్నితమయిన పరిమళాన్ని పంచుతున్నట్లు -

 Previous Page Next Page