Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 27

సెంట్రల్ స్టేషన్ నుంచి నడిచి నడిచి పారిస్ కార్నర్ చేరుకున్నాడు.
అతనికి గమ్యం లేదు, స్పృహ లేదు.
అక్కడో పెద్ద భవంతి. దాని మెట్ల మీద కూర్చున్నాడు.
గంటలు గడిచిపోతున్నాయ్.
మెట్లు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు కోలాహలం.
అలాగే కూర్చున్నాడు.
కాళ్ళ దగ్గర ఏదో కాగితం పడింది.
ఆప్రయత్నంగా తీసుకున్నాడు.
పదిరూపాయల నోటు.
పదిరూపాయల నోటని అతనికి అర్ధం కాలేదు.
తీసుకుని మడత పెట్టాడు. మళ్ళీ విప్పాడు. మళ్ళీ పది మడతలు పెట్టాడు. మళ్ళీ విప్పాడు.
మధ్యాహ్నమయింది.
కడుపులో ఆకలి మండిపోతోంది. పక్కనే ఏదో చిన్న షాప్ ఉంది.
దగ్గరకెళ్ళి నిలుచున్నాడు.
చేతిలో నోటు. ఆ నోటుతో తన కిష్టమైనది కొనుక్కోవచ్చన్న స్పృహ లేదు.
కాసేపయిన తర్వాత షాపతను ఇటు చూశాడు.
"ఎన్న వేణం సార్?"
నిస్సంకోచంగా మామిడి పళ్ళ వైపు చూపించాడు ముకుందరావు.
అతను రెండు పెద్ద పెద్ద మామిడిపళ్ళేరి ముకుందరావు చేతిలో పెట్టాడు.
షాపతను ఒక్క క్షణం ఆగి 'డబ్బులివ్వండి' అన్నాడు.
ముకుందరావు మాట్లాడకుండా నోటు ఆడిస్తూ నిలుచున్నాడు.
షాపతను అతని చేతిలోని నోటు తీసుకుని, "కర్నాటక లాటరి సార్! ఒక టిక్కెట్టు ఇత్తునా?" అన్నాడు. తలూపాడు ముకుందరావు. షాపతనికి హుషారోచ్చింది.
"బ్రాకెట్టు ఆడతారా సార్! డబుల్ జీరో మీద ఈ దినం నాకు నిండా నమ్మకముంది." అన్నాడు.
తలూపాడు ముకుందరావు. అతను తలుపడానికి అర్ధం లేదు. "నీ తల నరికేయ్యేనా?" అని ఎవరన్నా అడిగినా తలుపేలాగే ఉన్నాడతను.
షాపతను చకచక ఒక చీటి రాసి, లాటరి టిక్కెట్టు , మిగిలిన చిల్లర నోట్లతో బాటు అతని చేతిలో పెట్టాడు.
అవన్నీ గుప్పెట్లో గట్టిగా పట్టుకుని, కాసేపు అక్కడే నిలబడి ముందుకు కదిలాడతను.

                                                * * *
రాత్రి.
అందరూ నిద్రపోతున్నారు- స్నేహ తప్ప.
తను మంచం మీద కూర్చుని, తల మోకాళ్ళకి ఆనించి, రెండు చేతులూ కాళ్ళ చుట్టూ వేసుకుని ఆలోచిస్తోంది.
నాన్న ఎక్కడికెళ్ళి పోయారు? ఎలా ఉంటున్నారు? ఎందుకెళ్ళిపోయారు?
"పారిపోయారా?
ఎందుకు?
అప్పుల బాధ భరించలేక.
పిల్లల్ని ఇలా వదిలేసి వెళ్ళడానికి ఎలా మనసోప్పుతుంది?
శ్రీహర్షగారికి రాసినట్లు నిజంగా మతిస్థిమితం తప్పి ఉంటుందా? మతి స్థిమితం తప్పిన మనిషి అంత పెద్ద ఉత్తరం రాయగలరా? ఏమో! అంతా అగమ్య గోచరంగా వుంది.
అసలు మళ్ళీ నాన్నను తను చూడగలుగుతుందా?
ఉవ్వెత్తున దుఖం వచ్చింది. కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా కారడం మొదలెట్టాయి. పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే హయిగా ఉంటుందనిపిస్తోంది. ఏడిస్తే అందరూ లేస్తారు.
ఆపుకున్నా ఆగట్లేదు దుఖం. తెరలు తెరలుగా వస్తోంది.
మూడు నెలల క్రితం దాకా చిన్నచిన్న ఇబ్బందులే తప్ప పెద్ద కష్టాలేరుగదు తను.
కొత్త సినిమాకి మొదటిరోజే పంపించలేదని, కొత్త నవల కొనుక్కోవడానికి డబ్బివ్వలేదని, రెండో జత చెప్పులు కొనలేదని.
ఇలాంటి కష్టాలుండేవి అప్పట్లో!
మూడు నెలల క్రితం మార్వాడి పెద్ద గొంతుతో నాన్నని అప్పు తీర్చమని దబాయిస్తూ మాట్లాడ్డంతో తన జీవితంలో దిగులు ప్రవేశించింది.
రెండు నెలల క్రితం అమ్మ హఠాత్తుగా మంచం పట్టి, నెలరోజులు బాధపడి కన్నుముయాడంతో తనకి చెడ్డ దినాలు మొదలయ్యాయ్.
నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తన జీవితంలో వెలుగు పూర్తిగా ఆరిపోయింది.
మళ్ళీ ఇక్కడికొచ్చాక ఈ మనుషులూ, ఈ అభిమానాలూ, ప్రేమలూ, సరదాలూ కబుర్లు కాస్త కాస్తగా గుండె కుదుట బడుతోంది.
అయితే చీకటి పడితే , అందరూ నిద్రలోకి జారుతుంటే , అప్పుడు తన భయాలు బయట పడిపోయి, పైశాచిక నృత్యం చేస్తాయి.

 Previous Page Next Page