"అమ్మా!" వెక్కిళ్ళు ఆపుకోలేకపోయింది.
తలుపు తట్టారెవరో.
గబగబ కళ్ళు తుడుచుకుని వెళ్ళి తలుపు తీసింది."
శ్రీహర్ష!
ఆమె ముఖంలోకి చూసి "ఏడుస్తున్నావా?" అన్నాడు.
'లేదు' అన్నట్లు తల ఉపింది స్నేహ.
"స్నేహ! నా మాట నమ్ము. మీ నాన్నగారు త్వరలో తిరిగి వస్తారు. మళ్ళీ అంతా సవ్యంగా అయిపోతుంది. నువ్వు దిగులు పడితే లాభం లేదు" అన్నాడు.
ఇంకో పదిహేను రోజుల్లో కాలేజి తెరుస్తారు. కాలేజిలో జేరిపో. హయిగా చదువుకో. మీ నాన్నగార్ని వెదికే భారం నామీద వదిలేయ్. అయితే నాకు కాస్త టైం కావాలి. సరేనా?"
"సరే" అన్నట్లు తల ఉపింది స్నేహ.
* * *
"మూడ్రోజులయింది మీరు కనబడి" అంది లావణ్య చిరుకోపంగా.
శ్రీహర్ష నవ్వాడు.
"లావణ్యా! ఇవాళ సంతోషంగా ఉన్నాను కోపం తెచ్చుకోకు. టెండరు మనకే వచ్చింది. ఐదు లక్షలు కాంట్రాక్టు. మనకు కనీసం యాభై వేలు మిగులు."
"యాభై వేలు! దానికోసం ఎంత శ్రమ! మీరు నా మాట వినిపిచుకోరు" అంది లావణ్య.
"ఇవాళ ఎక్కడికన్నా సరదాగా వెళదాం" అన్నాడు శ్రీహర్ష.
"ఓహ్! ఐ యామ్ రెడీ" అంది లావణ్య. మీ జీపా? నా కారా?"
"నా జీపే" అన్నాడు శ్రీహర్ష.
"అయితే సందు చివరి దాకా షికారు వెళ్ళగలమన్నమాట."
జీప్ లో టాంక్ బండ్ కింద ఉన్న ఇందిరా పార్క్ కి వెళ్ళారు.
స్నేహాని కాలేజిలో చేర్చాలి" అన్నాడు శ్రీహర్ష.
అవునన్నట్లు తలూపింది లావణ్య.
"స్నేహ, రాజు ఇద్దరూ కూడా చాలా బుద్దిమంతులు. స్నేహ మరీనూ" అన్నాడు శ్రీహర్ష.
ఒకసారి అతని కళ్ళలోకి చూసి "చాలా బాగుంటుంది ఆ అమ్మాయి" అంది లావణ్య.
"వయసుకి మించి పెరిగిపోయింది. తనకి పద్దెనిమిదేళ్ళు. ఇరవై మూడు, ఇరవై నాలుగు ఉన్నట్లు కనబడతాయి కదూ?"
లావణ్య మాట్లాడలేదు.
లావణ్యకి హఠాత్తుగా కోపం వచ్చింది. అది కోపం కూడా కాదు. అలక అనొచ్చు. ఆ అలక ఇంట్లో వాళ్ళందరి మీదా చూపిస్తుంది. నెలకో సారైనా. అలక వచ్చిందంటే మాట్లాడదు. ముభావంగా ఉంటుంది. పలకరిస్తే పలకదు. తను అలిగితే అందరూ బతిమాలాలి. అందరూ బతిమాలితే తను కోపం తెచ్చుకుంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతుంది కోపం. అప్పటిదాకా ఎదుటి వాళ్ళు బతిమాలుతూనే ఉండాలి. భంగపడుతూనే ఉండాలి. పలకరిస్తే కోపం ఎక్కువవుతుందని మానేశారో ఉక్రోషం పట్టలేక అరిచేస్తుంది.
ఆ అలక ఇన్నాళ్ళూ శ్రీహర్ష మీద రాలేదు.
ఇవాళ వచ్చింది.
"ఏదో ఆలోచిస్తున్నావు." అన్నాడు శ్రీహర్ష.
లావణ్య మాట్లాడలేదు
"నిన్నే"
ఉహు.
"లావణ్యా!"
ఒకసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ దించేసుకుంది.
"మాట్లాడవూ?"
".............."
"లావణ్యా!"
"..........."
"ఏయ్"
"ఊ"
నాలుగుసార్లు పిలిస్తే ఒకసారి ఊ కొట్టి ఊరుకుంటోంది లావణ్య. అంతేగానీ మాట్లాడడంలేదు.
"ఇదేమిటి? చిన్నపిల్లలా అలక?" అన్నాడు.
లావణ్యకు ఇంకా కోపం వచ్చింది. పెదిమలు బిగించింది. మోహంలో చిరాకు కనబడుతోంది. ఇతనికి బతిమాలటం తెలియదు. తనకింకా కోపం తెప్పిస్తున్నాడు.
అమ్మా నాన్నగారూ అయితే తనని సముదాయించి , సముదాయించి అలక తీరుస్తారు.
పావుగంట సేపు మౌనం.
"లావణ్యా!"
".........."