Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 26

కనుబొమ్మలు ముడేసి భోజనం ఏర్పాట్లు పరికించి చూసింది లావణ్య.
పీటలు, వాటి ముందు విస్తారాకులు, మర చెంబుతో నీళ్ళు, స్టీల్ గ్లాసులూ.
విస్తళ్ళలో ముద్దపప్పు, మువ్వోంకాయ కూరా, దోసకాయ పచ్చడి , ఆవకాయా, పక్కనే గిన్నెలో మునక్కాడల పులుసూ.
సిసలైన తెలుగు భోజనం.
సూప్ లేదు. జామ్ లేదు. కెచప్ లేదు. డేసర్టు లేదు. స్పూన్లు లేవు. ఫోర్కులు లేవు.
అనాగరికంగా చేతుల్తో కలుపుకుని , వేళ్ళతో నాకుతూ.......
అబ్బ!
లావణ్యకి ఒళ్ళు జలదరించింది.
"ఆకుల్లో భోజనమేమిటి? ఈ పుల్లలు గొంతు కడ్డం పడితే చచ్చిపోతా" అంది లావణ్య సుధతో రహస్యంగా.
"ష్! తప్పు! వింటారు" అంది సుధ.
అందరూ భోజనాలకి కూర్చున్నారు.
మొహం ఇబ్బందిగా పెట్టి, నిమ్మకాయంత అన్నంలో కూర కలుపుకుంది లావణ్య.
"కాస్త పప్పు వెయ్యనా?" అంది జానకమ్మ.
"పప్పు తింటే లావెక్కిపోతాను" అంది లావణ్య.
 జానకమ్మ ఆశ్చర్యంగా చూసింది.
"పప్పు తినకపోతే ఇంక బలమేం ఉంటుందమ్మా?" అంది.
"సర్లెండి. తాగే టానిక్కులన్ని ఏమయిపోతున్నాయ్? బలానికే తాగుతాను" అంటూ ఇంకో నిమ్మకాయంత అన్నం కలుపుకుని "మజ్జిగ" అంది.
జానకమ్మ నిర్ఘాంతపోయింది.
"అదేమిటి ఆ భోజనం? కాకులు కేలికినట్లు!" అంది జానకమ్మ సహజంగా పెద్దవాళ్ళ కుండే చనువుతో.
"లేకపోతే రాబందుల్లాగా పిక్కుతింటామా? కాలరీస్ వాచ్ చెయ్యకుండా దొరికింది కదా అని మెక్కేయ్యడమేనా?" అంది లావణ్య సుధ చెవిలో.
సుధ నవ్వింది. "తప్పే! అలా మాట్లాడకు."
శ్రీహర్ష పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. "లావణ్యకి టేబుల్ మీద తప్ప భోం చెయ్యడం అలవాటు లేదమ్మా! ఇలాంటి కూరలు, ఆవకాయలు తను తినదు. తన రుచులు వేరు."
"మనింటికొచ్చాక అన్నీ నేర్చుకుంటుంది. నా చేతి వంట అలావాటైతే ఆ సీసాల్లో తయారయి వచ్చేవన్ని తింటుందేమిటి?"
ఆ ఉహే లావణ్యకు భయంకరంగా కనబడింది.
ఇవన్ని తను అలవాటు చేసుకోవాలా? ఇంకా శ్రీహర్ష్ తన పద్దతులు అలవాటు చేసుకుంటాడనుకుంటొంది తను.
భోజనాలయ్యాక గ్లాసులతో నీళ్ళు పట్టుకెళ్ళి దొడ్లో చేతులు కడుకున్నారు.
"అయ్యో తులసిపాదులో కదిగేస్తున్నారు చెయ్యి" అంది స్నేహ కంగారుగా.
ఒక్కడుగు వెనక్కేసింది లావణ్య. ఇది తులసిపాదా? తను గ్రహించలేకపోయింది. తమ ఇంట్లో ఇలాంటి చాదస్తాలు లేవు. అయినా తులసి మొక్కేమిటి? దైవ స్వరూపం ఏమిటి? విచిత్రం.
స్నేహ తనని ఇన్సల్ట్ చేసినట్లు ఫీలయింది లావణ్య. స్నేహ కూడా తన తప్పు గ్రహించి బాధపడింది.
"తొందరపడి అనేసాను సారీ......" "లావణ్యగారూ" అనే దైర్యం చాలక "అక్కయ్యా" అని మాట పూర్తి చేసింది.
"తులసి చెట్టని నాకు తెలియదు. నిజంగా" అంది లావణ్య.

                                                 * * *
ఇరవై రోజులు గడిచాయి.
స్నేహ దిగులు కాస్త మర్చిపోయింది. రేవతి స్నేహం సగం కారణం డానికి.
శ్రీహర్ష ముకుందరావు జాడ కనుక్కోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయినా లాభం లేకపోయింది.
రాజుకి మాత్రం ఇవేం పట్టవు. పక్కింటి పిల్లలతో బాగా స్నేహమయిపోయింది అతనికి. ఆటలే ఆటలు.

                                              * * *
రైలు ఆగింది.
అది మద్రాసు.
జనమంతా దిగిపోయారు. చివరికి మిగిలింది ముకుందరావు. అతను తెలివిలో లేడు. అలా వెర్రిగా చూస్తూ కూర్చునే ఉన్నాడు. అందరూ దిగిన తర్వాత తనూ దిగాడు.
నలుగురైదుగురు ఉన్న గుంపులో కలిసి వెళ్ళిపోతున్న అతన్ని టికెట్ కలెక్టరు గమనించలేదు.
అతను సాధారణమైన ఎత్తు. మాములు చాయ. ఏ ప్రత్యేకతా కనబడదు ఆ రూపంలో.

 Previous Page Next Page