Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 26


    
    పావుగంట తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసుముందు ఆగింది కారు.
    
    ప్రతిమకి ఇదంతా కలేమో, నిజం కాదేమో అన్న అనుమానం తీవ్రంగా కలుగుతోంది. చటుక్కున మెలకువ వచ్చేస్తుందేమో తనకి ఇప్పుడు!
    
    "వాట్స్ యువర్ నేమ్?" అంటున్నాడు రిజిస్ట్రారు.
    
    ఇది కలకాదు! నిజమే!
    
    "ప్రతిమ" అంది నెమ్మదిగా.
    
    "వాట్స్ యువర్ ఏజ్?"
    
    "ట్వంటీ ఫోర్"
    
    "ఈయన్ని మీరు ఇష్టపూర్వకంగానే మారేజ్ చేసుకుంటున్నారా?"
    
    "అవును" అంది ఇంకా మెల్లిగా.
    
    "అలా అని పూర్తి వాక్యాలతో చెప్పండి."
    
    "నేను శ్రీరాంగారిని నా ఇష్టం మీదే పెళ్ళి చేసుకుంటున్నాను." అంది ప్రతిమ ఇంగ్లీషులో.
    
    శ్రీరాంని కూడా అప్పటికే ఆ ప్రశ్నలన్నీ అడిగేశాడు రిజిస్ట్రారు.
    
    ఇద్దరూ రిజిస్టర్ లో సంతకాలు చేశారు. సంతకం పెడుతున్నప్పుడు అమ్మా, నాన్నా, అన్నయ్యా గుర్తొచ్చారు ప్రతిమకి. చెయ్యి కొద్దిగా వణికింది.
    
    శృతి సాక్షి సంతకం చేసింది. డబ్బులు తీసుకుని సాక్షి సంతకాలు పెట్టే మనుషులు ఆ ఆఫీసు దగ్గర ఎప్పుడూ ఉంటారు. వాళ్ళతో మరో రెండు సంతకాలు చేయించాడు శ్రీరాం.
    
    రిజిస్ట్రార్ నవ్వుతూ, "బెస్టాఫ్ లక్!" అని చెప్పాడు కొత్త దంపతులకి.
    
    కారెక్కారు అందరూ.
    
    నేరుగా చిక్కడపల్లిలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళాడు శ్రీరాం.    
    
    వాళ్ళ పురోహితుడు శాస్త్రిగారు అప్పటికే వచ్చి ఉన్నాడు అక్కడికి.
    
    దేముడి సమక్షంలో ప్రతిమ మెడలో తాళి కట్టాడు శ్రీరాం.
    
    కారు ఇంటిదారి పట్టింది.
    
    "సో! కంగ్రాట్స్ డాక్టర్ మిసెస్ ప్రతిమా శ్రీరాం!" అంటూ చెయ్యి కలిపింది శృతి.
    
    "థాంక్యూ!" అంది ప్రతిమ, వినీ వినబడకుండా.    
    
    "ముందు డాక్టర్ అని పెడతావేమిటి? ఈ అమ్మాయి ముందు నా భార్య! ఆ తర్వాతే డాక్టరు! మిసెస్ శ్రీరాం అని ముందు రాసుకుని, బ్రాకెట్లో డాక్టర్ అని రాసుకోవాలి. అంతేగానీ, డాక్టర్ మిసెస్ ప్రతిమా శ్రీరాం కాదు" అన్నాడు శ్రీరాం నవ్వుతూ.
    
    ప్రతిమ పెదిమల మీద చిరునవ్వు మెరుస్తోంది.
    
    శృతి శ్రీరాంని మింగేసేటట్లు చూసింది.
    
    "ఏమ్మా? ఎందుకనీ? ముందు మిసెస్ శ్రీరాం, ఆ తర్వాతే డాక్టర్ ప్రతిమానా? పెద్ద! మగాణ్ణి చేసుకోగానే ఆడది అంతలా ఐడెంటిటీ మార్చేసుకోవాలేమిటీ? నువ్వు పెట్టుకోరాదూ 'మిస్టర్ ప్రతిమా' అని? ఆడది మాత్రమే ఇంటిపేరుతో, పేరుకి ముందు ఉండే గౌరవ వాచకంతో సహా ఎందుకు మారిపోవాలి? పెళ్ళి కాకముందు కుమారి ప్రతిమగా చెలామణి అయిన అమ్మాయి పెళ్ళవగానే అర్జెంటుగా శ్రీమతి ప్రతిమగా మారిపోవాలా? ఎందుకూ? 'దీనికి పెళ్ళయింది' అని ప్రపంచానికంతా తెలియడానికా? మూర్చవాడి మెడలో ఇత్తడి బిళ్ళలాగా రెండు బిళ్ళలతో ఉన్న తాళి కట్టించుకోవాలా? కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవాలా? మై ఫుట్! మరి మగాడు మాత్రం పెళ్ళికి ముందూ, తర్వాతా కూడా మిస్టర్ అనే చెలామణి అయిపోవచ్చా? వీడికి పెళ్ళయింది అని ప్రపంచానికి నోటీసులాగా గుర్తులేమీ తగిలించుకోనక్కరలేదా? ఎందుకని? పెళ్ళంటే మొగుడూ పెళ్ళాలిద్దరూ ఈక్వల్ పార్ ట్ నర్స్ కారేమిటీ?"
    
    "మొగుడూ ఇద్దరు పెళ్ళాలూనా?" అన్నాడు శ్రీరాం, మాట విరిచి ఆటపట్టిస్తూ.
    
    "నిన్నూ...." అంది శృతి కళ్ళు పెద్దవి చేస్తూ.
    
    "వూరుకో!" అన్నట్లు శృతి చెయ్యి నొక్కింది ప్రతిమ. "నువ్వుండవే" అంది శృతి చెయ్యి విదిలించుకుంటూ. శ్రీరాంతో ఇలాంటి గిల్లికజ్జాలు తనకి చిన్నప్పట్నుంచీ అలవాటే! ఒక్కోసారి గంటలు గడిచిపోయేవి వాదనలో. వాళ్ళ వాదనకి ప్రత్యేకమైన కారణమేమీ అక్కర్లేదు. ఇదివరకు వోసారి, అమితాబ్ బచ్చన్ మంచి యాక్టరా, సంజీవ్ కుమార్ మంచి యాక్టరా అన్న మీమాంసలోపడి, అది వాదనగా చివరికి చిన్న పోట్లాటగా మారి నెలరోజులపాటు మాటలు మానేశారు కూడా!
    
    శృతి రోషం చూసి శ్రీరాం నవ్వాడు.
    
    "ఏమిటీ? మొగుడూ పెళ్ళాలిద్దరూ సమానమా? నెవర్, మై డియర్ శృతీ, నెవర్, నీకు కామర్సూ తెలియదు - కామన్ సెన్సూ తెలియదు. బిజినెస్ లో డబ్బు మాత్రం పెట్టి వూరికే కూర్చునే వాడు స్లీపింగ్ పార్ట్ నర్. తన అనుభవంతో, తెలివితో బిజినెస్ నడిపేవాడు యాక్టివ్ పార్ట్ నర్! పెళ్ళీ, జీవితం అనేవి కూడా వ్యాపారమే మిస్ శృతీ! ఈ వ్యాపారంలో ఆడది స్లీపింగ్ పార్ట్ నర్!" అని, రెండో అర్ధం వచ్చేలా ప్రతిమ వైపు తిరిగి కన్ను గీటుతూ, "విన్నావా? కేవలం స్లీపింగ్ పార్ట్ నర్. విశ్రాంతిగా పడుకుని జీవితాన్ని ఎన్ జాయ్ చెయ్యటమే తన వంతు! ఇక మొగాడు యాక్టివ్ పార్ట్ నర్. బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద టూ! తన శక్తితో, యుక్తితో, ఈ జీవితం అనే వ్యాపారాన్ని తెలివిగా నడుపుతాడు. ఓకే?"
    
    "యూ!..." అని మిగతా మాట వినబడకుండా నిశ్శబ్దంగా ఉచ్చరించింది శృతి.
    
    "బాగానే ఉందర్రా! శుభమా అని పెళ్ళిరోజున ఇదా మీ వాదన!" అంది సరస్వతి కోప్పడుతూ. కోడలు నొచ్చుకుందేమోనని ప్రతిమ మొహంలోకి చూసి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ఒత్తింది.
    
    అత్తగారివైపు చూసి చిరునవ్వు నవ్వింది ప్రతిమ.
    
                                                             * * * * *
    
    ఆఫీసులో తీరిగ్గా కూర్చుని నిక్ కార్టర్ నవల చదువుతోంది సౌందర్య. అంతకంటే సీరియస్ సాహిత్యం ఆమె ఎప్పుడూ చదవలేదు. స్పీడుగా పోయే కార్లూ, సాహసాలు చేస్తుండే మొగాళ్ళూ, అందమైన ఆడపిల్లలూ, తళతళ మెరిసే వెస్సన్, కోల్టు రివాల్వర్లూ, కాండిల్ లైట్ డిన్నర్లూ, బీచ్ లో అర్ధనగ్నంగా కూర్చుని సముద్రపు నురగ పాదాలని తాకుతూ ఉంటే నురగలు కక్కే షాంపేన్ తాగడాలూ-
    
    ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి ఆ రకం నవలల్లో.
    
    ఇలా ఉరుకులు పరుగులతో సాగిపోయే జీవితాన్ని గురించి చదువుతూంది సౌందర్య. అలాగే జీవించాలని అందమైన కలలు కంటూంది.
    
    పుస్తకం పూర్తయింది.

 Previous Page Next Page