సరిగ్గా అదే టైంలో అతను మనకు ఇక లేడు అని నిశ్చయించుకున్న సితార దుఃఖాన్ని ఆపుకుంటూ తన యింటికొచ్చి గుమ్మం తట్టుకు పడింది.
"హ్హె హ్హె హ్హె!" అని నవ్వుకున్నాడు పైన దివ్యలోకంలో నుంచి ఇదంతా సంబరంగా చూస్తున్న మన్మధుడు తన పూలబాణాన్ని ఎ.కె. 56 రైఫిల్ లా పట్టుకుంటూ.
"చాల్లెండి సంబరం! వాళ్ళని మీ బాణాల్తో కొట్టిపడేశారుగా! ఇంకా ఎందుకూ వాళ్ళని ఏడ్పించడం?" అంది రతీదేవి చిరుకోపంగా.
మళ్ళీ హ్హె హ్హె హ్హె! అని నవ్వాడు మన్మధుడు.
"రతీ! రెండు మనసులని కలపాలంటే గట్టి టంకం వుండాలి. ఆటంకానికి మరోపేరే విరహం. విరహం అంటే ఆటంకం. కొన్ని యుగాలపాటు వీళ్ళిద్దర్నీ విరహం అనుభవించనీ. ఆ తర్వాత...."
"కొన్నియుగాలా.....పాపం! 'నాథా' వాళ్ళిద్దరూ కేవలం మానవమాత్రులు."
"అట్లయినాసరే! కొన్ని దినముల పాటైనా వాళ్ళు విరహం అనుభవించక తప్పదు."
"అయితేనే వెళ్ళొస్తా!" అంది రతీదేవి పెట్టేబేడా సర్దుకుంటూ.
"ఎక్కడికీ?" అన్నాడు మన్మధుడు కంగారుగా.
"మా పుట్టింటికి. కొన్ని యుగాలపాటు మీకూ విరహం చూపిస్తేగానీ దార్లోకి రారు. ఈమధ్య పెత్తనాలు మరీ ఎక్కువైపోయాయి అయ్యగారికి" అంది రతీదేవి అదృశ్యమైపోతూ.
"హా! హతవిధీ!" అనుకున్నాడు మన్మధరావు.
అదలా వుండగా-
ఇంటికి వచ్చిపడ్డ జెయ్ చంద్రకి హఠాత్తుగా గుర్తొచ్చింది.
సాయంత్రం కాగానే సితార పక్కవీధిలోకెళ్ళి అక్కడొక మొద్దబ్బాయికి ట్యూషన్ చెబుతుందని. అదే కాదు.
ఇలాంటి పనులు చాలా చేస్తుంది సితార.
ఓ టైపు ఇన్ స్టిట్యూట్ లో జాబ్ వర్కు చేస్తోంది.
ప్రిస్టేజి ఫీలవకుండా చీరలకు ఫాల్సు కుట్టిపెడుతుంది.
అయితే, అవన్నీ ఒక ఎత్తు.
అద్భుతంగా మెహిందీ పెట్టడంలో ఆ అమ్మాయి గొప్ప ఎక్స్ పర్టు. అదీ ఆమె అసలుసిసలైన టాలెంటు. ఎమ్. ఎఫ్. హుసేన్ పెయింటింగ్ చేసినంత ఇదిగా గోరింటాకు పెట్టి పండించగలదు సితార.
అసలు తన హస్తవాసే మంచిదనీ, ఆ అమ్మాయి పెడితే గోరింటాకు గొప్పగా పండుతుందనీ ఆ వూళ్ళో గోరిం"టాక్" వుంది. ఏదో ఎగ్జిబిషన్ లో ఆమెకేదో అవార్డు కూడా వచ్చిందిట! గోరింటాకు పెట్టే కాంపిటీషన్లోనే.
అలా గోరింటాకు పెట్టి మరీ ఛెడామడా సంపాదించేయకపోయినా ఫర్వాలేదు అనిపించేటట్లు డబ్బు కళ్ళజూస్తూనే వుంటుంది సితార. దాన్తో కుటుంబాన్ని పోషిస్తూ వుంటుంది కూడా.
సితారకి ప్రతిరోజూ సాయంత్రం ఇలాంటి పనేదో వుంటుందని తెలుసు జెయ్ చంద్రకి. సాయంత్రం పూట యీ పనులు చక్కబెట్టడానికి ఆమె ఎక్కడెక్కడికి వెళుతుందో కూడా అతనికి తెలుసు.
అందుకని ముందుగా మొద్దబ్బాయ్ వాళ్ళింటికెళ్ళాడు.
అక్కడికి రాలేదు సితార.
ఆమె అదే క్షణంలో జెయ్ చంద్రని వెదుకుతూ క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళింది.
ఆ సంగతి అతనికెలా తెలుస్తుంది?
అక్కడ్నుంచి అర్జెంట్ గా టైప్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళాడు జెయ్ చంద్ర.
అక్కడా లేదు సితార.
ఆ టైంలో ఆమె అతన్ని వెదుకుతూ 'మూడుస్తంభాల' దగ్గరికి వెళ్ళింది.
మూడు సింహాల బొమ్మలుండే ఓ స్థలముంది. దానికి మూడు స్తంభాలు అని పేరు పెట్టాడు జెయ్ చంద్ర. నిక్ నేమ్ లు పెట్టడం అతనికి పుట్టుకతో వచ్చిన బుద్ది.
మూడుస్థంభాల దగ్గరా లేడతను.
సరిగ్గా ఆ టైంలో అతను.....
సరేసరే..... ఇలా లిస్టంతా రాస్తే ఈ పుస్తకంలో కథ రాయడానికి పేజీలే మిగలవు.
తాత్పర్యం మాత్రమే చెప్పాలంటే అతని కోసం ఆమె....
ఆమె కోసం అతను తెగ తిరిగారు ఆ సాయంత్రమంతా.
చివరికి నిరాశా, నిస్పృహలకు లోనై వాళ్ళిద్దరూ (విడివిడిగానే) తిరిగివస్తూ వుండగా....
సరిగ్గా వాళ్ళిద్దరి ఇళ్ళకి ఎదురుగానే....
ఒకరి కొకరు ఎదురుపడ్డారు.
"సితారా!" అన్నాడతను మనసులోనే కేక పెడుతూ.
"జెయ్!" అంది సితార మౌనంగానే మారుమోగిపోయేటట్లు.
"మా బావ పోలీసు తెల్సా?" అన్నాడు వాళ్ళిద్దరి మధ్యా హఠాత్తుగా ప్రత్యక్షమయిన రాంపండు.
"నా బుల్లెట్స్ తీసింది నువ్వేనా?" అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన వీరభద్రం రాంపండు మెడ పట్టుకుంటూ.
వీరభద్రం వళ్ళంతా ఎవరో రక్కి, బరికి, పీకినట్లువుంది. అతని యూనిఫారం పీలికలై వుంది.
"ఈ ప్రపంచం ఎంతో చాలా ఇరుకయిపోయింది. అవును ఎంతో యిరుకయి పోయింది" అని విసుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు జెయ్ చంద్ర.
ఆ తర్వాత మూడు రోజులు గడిచాయి.
ఆ తర్వాత శేషుకి జ్వరం వచ్చింది.
పండగొచ్చినా, పబ్బమొచ్చినా, జాతరొచ్చినా, ఎగ్జిబిషనొచ్చినా ముందు శేషుకి జ్వరం వస్తుంది.
అలా వచ్చినప్పుడు అతన్ని అనేకసార్లు మంచంమీదినుంచి దింపి కింద పడుకోబెట్టడం కూడా జరిగింది గానీ అతనిది మొత్తానికి గట్టిప్రాణం.
అతగాడికి జ్వరం వచ్చినప్పుడల్లా సితార వచ్చి సపరిచర్యలు చేయడంకూడా ఆనవాయితీనే.
కానీ ఈసారి శేషుకి అట్లాంటిట్లాంటి జ్వరం కాదు. అది ఉత్తుత్తిజ్వరం! ఊళ్ళో వాళ్ళని వుద్దరించడానికొచ్చిన జ్వరం! ఊళ్ళోవాళ్ళంటే జెయ్ చంద్ర, సితార అన్నమాట.
సితార, జెయ్ చంద్రలిద్దరూ జంటగా కలిసి ప్రేమ మొహబ్బత్ ఇష్క్ అభిమానం ఆషికీ లవ్ లో పడిపోవడం శేషు గమనించాడు. ఈ ప్రేమయజ్ఞంలో తనూ ఓ సమిధ అయిపోయి ఈ జీవితానికో అర్ధమేర్పరచుకుందామనుకున్న మహదాశయంతో అతను అర్జెంట్ గా జ్వరం తెప్పించుకున్నాడు.