"ఇడ్లీ. వడ, దోస, ఉప్మా, పురీ, చపాతీ" అతనిని పరీక్షగా చూస్తూ సర్వర్ చెప్పాడు.
"వీడేమిటి నన్ను అనుమానంగా పరీక్షగా చూస్తున్నాడు! ఓహ్ వీడిదగ్గర రూపాయి మాత్రమే వుంది వీడి ముఖం టిఫిన్ ఏమి తింటాడనా ఆ చూపుకర్ధం? అవును బ్రదర్ నా దగ్గర ఒకే ఒక్క రుపాయివుంది, అంతమాత్రాన నన్నో పనికిమాలినవాడిలా చూడనక్కరలేదు. నీవు చేస్తున్న పాటి ఉద్యోగం నాకున్నట్లయితే నేను కొట్టేవాడిని ఓ ఫోజు.....
అతను అలా ఆలోచిస్తుంటే "హ హిచ్ హూక్ " అన్నాడు సర్వర్.
"నాకు చైనా భాషవచ్చు అపుడప్పుడు ఆ భాషలో చైనావాళ్ళ దేముడిని తలుచుకుని పైకి అలా అంటుంటాను" సర్వర్ వ్యంగంగా చెప్పాడు.
గౌతంకి వళ్ళు మండింది. "చైనా వాళ్ళకి అసలు దేముడేలేడు. వున్నా ప్రస్తుతం ఈ లోకంలోలేని మావో. అంతేగాని హహిచ్ హూక్ మాత్రం కాదు" అని గట్టిగా అందామనుకున్నాడు. అత్తారింట్లో విలువలేని కోడలు ఉద్యోగంలో లేని మగవాడు నోరు విప్పకపోవడమే మంచిది అన్న విలువైన మాట గుర్తుకువచ్చి వళ్ళు మంటని తగ్గించుకుని "ఆమ్లెట్ లేదా!" అన్నాడు.
"ఇది బ్రాహ్మణ హోటల్ బయట బోర్డ్ చూడలేదా?" సర్వర్ అడిగాడు.
"బ్రాహ్మణులు కూడా అండా దగ్గరనుంచి తండూరి చికెన్ వరకు తింటూనే వున్నారుకదా!" గౌతం లాపాయింట్ లగినవడిలా ఫోజుపెట్టి అడిగాడు.
"మీరు మాట్లాడటానికి వచ్చారా తినటానికి వచ్చారా?" సర్వర్ అడిగాడు.
"తిండానికే వచ్చాను. పోట్లాటకి మాత్రం కాదు." ముక్తసరిగా చెప్పాడు అతను.
"అయితే ఏదో ఒకటి అర్దరివ్వండి."
"ఆమ్లెట్ అయితే బాగుండేది."
"ఎందుకు బాగుండదు తినేవాళ్ళకి నిక్షేపంగా వుంటుంది. ఇడ్లీ ఉప్మా రావ్వదోసే, పెసరట్...." సర్వర్ వ్యంగ్యంగా అని మళ్ళి తమ హోటల్లో వున్న పదార్ధాలని లిస్ట్ చదవటం మొదలుపెట్టాడు.
అంతావిని "కాఫీ" అన్నాడు గౌతమ్ ముక్తసరిగా.
సర్వర్ ఓ చూపు చూసి విసురుగా వెళ్ళిపోయాడు.
తన దగ్గర రూపాయి మాత్రమే వున్నట్లు సర్వర్ గ్రహించాడు అందుకే ఆ నిర్లక్ష్యపు ఫోజు కానిరా తండ్రి ఏం చేద్దాం నీ ఖర్మ యింకా పరిపక్వంగా లేదు అందుకే ఈ మాటలు అవమానాలు అవహేళనలు.... సర్వర్ వెళ్ళిం తరువాత అతను అనుకున్నాడు.
సర్వర్ కాఫీ తెచ్చి పారేసినట్లు బల్లమీద పెట్టి పచ్చ కాగితంమిద బిల్లువేసి ముఖనా పారేసినట్లు దానిని బల్లమీద వుంచి వెళ్ళాడు.
"వరదరాజులు గురించి ఏమని అడుగుతాడు తను? ఆమ్లెట్ లాగానే అవుతుంది వ్యవహారం. జేబులోవున్నది రూపాయి నీ ముఖం ఆమ్లెట్ తినేరకంలానే వుందిలే, అన్న వ్యంగ్యమైన చూపుని ఎదురుకున్నడతను. వరదాయ్ గురించి అడిగితె.... "వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, ఏమిటయ్య నీ వేషాలు? నీకు బుర్ర సరిగ పనిచేయటం లేదా కావాలని అల్లరివేషాలు వేస్తున్నావా! హోటల్లోకి వచ్చిన నీ ఫ్రెండ్ బయటికి వెళ్ళాక లోపల ఎలా మాయం అవుతాడయ్యా! చాచాల్లె బయటికి నడువు. నీ ఫ్రెండ్ ఏమన్నా పిన్నిసా గుండుసూదా! లేక పోలీసులని పిలవమంటావా!" అని నాలుగు దులిపితే చచ్చిన చావవుతుంది తనకి, నోరు మూసుకుని బయటికి తగలడటం బెటర్" కాఫీ తాగుతూ అనుకున్నాడు అతను.
హోటల్ ఇంద్రభవన్ పేరుకి హోటల్ గాని ఓ రహస్య కేంద్రానికి దానిలోంచి మార్గం వుందని అతనికి తెలియదు.
హోటల్లోంచి వరదరాజులు బయటికి రాలేదన్న నిజం తెలియదు గౌతంకి.
తన దగ్గరవున్న రూపాయిబిళ్ళ సర్వర్ చూసి ముందు పొరబడ్డాడని అతడికి తెలియదు.
11)