వైజయంతి సంతోషం చప్పగా నీళ్ళు కారిపోయింది "ఎలా తెలుసే!" నీరసంగా అడిగింది.
"నీగుణం తెలుసుకాబట్టి!"
"సరేలే దీనిపై నీ వొపీనియన్ ఏమిటి?"
"ఎంతమాత్రం మంచిపని కాదు."
"ఎందరో ఆడాళ్ళు చేస్తున్న పనిని మంచిది కాదనటానికి నీ నోరెలా వచ్చిందే?"
"లోకంలో ఎందరు చేస్తున్నారే యీపని! నువ్వనాల్సిందే. నీ వరస బొత్తిగా నాకు నచ్చలేదమ్మాయ్. నా చెవి మెలిపెట్టినాసరే, మదన్ గోపాల్ గారు నా కళ్ళకి జులాయిగా ఏమీ కనపడటంలేదు. వాళ్ళ మానాన వాళ్ళు మన మానాన మనము వుంటే సరిపోతుందికదా! అతను ఏం రాద్దామని ఈ కాగితాలు కొనుక్కున్నాడో పాపం. నీ ప్లాన్ నాకు తెలుసు లేవే. ఇంకుబాటిలు యెత్తి తెల్లకాగితాల నెత్తినపోసి మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి మళ్ళీ యధాచోటులో ఆ కాగితాలు వుంచుతావు. తర్వాతెప్పుడో మదన్ గోపాల్ చూసుకుంటాడు. లబలబలాడుతాడు. లబలబలాడినా గుబగుబలాడినా లాభం లేదుకదా! ఈ పని నీవుతప్ప అన్యులు చేయరని వూహిస్తాడు. అయినా నిన్నేమీ అనలేడు. నిన్ను పల్లెత్తు మాట అనటానికి అతనిది గుండా చెరువా!"
త్రిలోక సంగతి అంటుంటే తెల్లబోయింది వైజయంతి. నేను దొంగగా కనపడుతున్నానుటే నీ కళ్ళకి?" అంది.
"ఇది దొంగపనికాదు చిలిపిపని. చిలిపితనంతోనయినా సరే పాడుపని చెయ్యకూడదు."
"పాడుపనే నంటావా!"
"ముమ్మాటికి."
"కధలు రాయటం పాడుపనా?"
"దీనికీ దానికీ సంబంధం ఏమిటే కాగితాలు యెత్తుకు వచ్చి కధలు కాకరకాయలంటావేమిటీ?"
వైజయంతి పకపక నవ్వింది. ఆ తర్వాత కోతిలా కిచ కిచ మంది. ఆ తర్వాత "భలే భలే" అంది.
"చూడమ్మా త్రిలోకసుందరీ! ఈ వైజయంతి ఏ పని చేసినా అర్ధం వుండేలా చేస్తుంది. అవసరమయితే కాగితాలేమిటి కనకంకూడా ఎత్తుకురావచ్చు. మదన్ గోపాల్ వెర్రి వేషాలు వేసుంటే అతని వెర్రి కుదర్చటానికి అప్పుడప్పుడు నేను పిచ్చివేషాలు వేస్తున్నమాట వాస్తవం. కాని నేను యిప్పుడు ఈ కాగితాలు ఎత్తుకురాలేదు..."
"....మరి నడిచి వచ్చాయా?"
"అలాగూ రాలేదు."
మరి ఎలా వచ్చాయి ఎగిరా!"
"అదియును కాదు."
"తల్లీ నీకోదండం. అదేదో వివరంగా నీవే చెప్పు."
"త్రిలోకినీ! మర్యాదగా అలా దారికి రమ్ము. ఇంక చెప్పెద వినుము. ఈ సరంజామా అంతటినీ నేను బజారునుండి కొనితెచ్చితిని."
"త్రిలోకసుందరి తెల్లబోయి "దేనికే!" అంది.
"ఇందాకే చెప్పాగదా! ఎందరో ఆడువారు చేస్తున్న పనిని నేనూ చేద్దామని!"
"ఓహో అదా! కాగితాలు నానేసి రుబ్బి ఆ గుజ్జుతో బుట్టలు తయారుచేయటమా? దానికి యింత మంచి తెల్లకాగితాలు ఎందుకే. ఇంట్లోవున్న చిత్తుకాగితాలు న్యూస్ పేపర్లు చాలు."
"చుప్ రహో!"
"అంటే నోరు మూసుకోమనే కదా!"
"హో....హో.....గంటనుంచీ చూస్తున్నాను. మట్టిబుర్ర, పాత ఆలోకానలు తప్ప కొత్త ఆలోచనే లేదు. బుర్ర చురుకుగా పనిచేయటానికి గిర్లిక్ పానీయమో గార్లిక్స్ మాత్రలో వాడరాదా! తెలివితక్కువ ఆకలెక్కువా అని..."