"అదేచెబుతున్నాను. ఒళ్ళు బాగా లేనిది మా ఆవిడకి కాదు. మా అమ్మాయికి." గుటకలుమింగాడు ప్రెసిడెంట్.
అరుణ ఆశ్చర్యంగా చూసింది. కూతురికయితేభార్యకని ఎందుకబద్దం చెప్పాడు?
"డాక్టరుగారూ, నా పరువు, మర్యాద అంతా మీ చేతుల్లో ఉంది. మీరే నా గౌరవం కాపాడాలి. ఈ మాట పైకి ఎక్కడా పొక్కకుండా ఏం చేస్తారో: నా పరువుగంగలో కలపకుండా తనేరక్షించాలి. మీ ఋణం ఉంచుకోను. మీరేం కావాలంటే అది ఇస్తాను." చెమటలు కక్కుతూ వివర్ణమయినమొహంతో ఆందోళనగా గాభరాగా అరుణ చేతులుపట్టుకుని అన్నాడు.
అరుణ తెల్లబోయింది. సగం సంగతి అర్ధం అయింది. "మీ అమ్మాయికి వివాహంకాలేదా?" అమాయకంగా అడిగింది.
ప్రెసిడెంట్ నెత్తిమీద కొట్టుకున్నాడు. అయ్యో రాత అమ్మాయికి పెళ్ళయింది గాని, మొగుడు చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఉంటే ఈ కర్మ ఎందుకు?"
అరుణ సంగతి బోధపడింది. కూతురు విధవ, కాలుజారిఉంటుంది. ఫలితం......ప్రెసిడెంటుగారిపరువు పోవడానికి సిద్దంగా ఉందన్న మాట ఎంత గడుసుగా భార్యకి అని చెప్పి మందు అడిగాడు అసలు ఇంతకుముందు ఏవో నాటుమందులు ఉపయోగించేఉంటారు. ప్రయోజనంలేక పోవడంతో గత్యంతరం లేకతన దగ్గరికి వచ్చిఉంటాడు.
"అసలేమిటో ముందు ఆమెని నన్నుచూడనీయండి."
"ఆచూడండి ఇంక నిశ్చింత నాకు. ఈ ఆపదలోంచి ఎలాగట్టెక్కిస్తారో అంతా మీదయ:" లోపలికి తీసుకువెళ్ళుతూ అన్నాడు. ప్రెసిడెంటు భార్యకాబోలు లోపలినించిఎదురొచ్చింది. "ఇదుగో డాక్టరమ్మగారు, అమ్మాయిని చూపించు మరేం పర్లేదులే డాక్టరమ్మగారికి అంతా చెప్పేశాను ఆవిడొచ్చేశారు. ఇంకేం భయంలేదులే" అరుణతరపున అతనే భార్యకిభరోసా ఇచ్చేశాడు. అరుణ కేసు చూడకుండా ఏమీ మాట్లాడదలచలేదు. అందుచేత ఆ మాటలకి జవాబీయలేదు.
ఆవిడ ఓ గదిలోకి తీసుకెళ్ళింది అరుణని. ఆ గదిలో ఓ మంచంమీద అటుతిరిగి పడుకుని ఉంది ఓ యువతి. "వెంకూ వెంకూ, డాక్టరమ్మగారొచ్చారు. సూడు లే" కూతుర్ని పిలిచింది ఆమె కదలలేదు మెదలలేదు ఆమె శరీరం మాత్రం చిన్నగా కంపిస్తూంది ఆ కంపనని బట్టి ఆమె నెమ్మదిగా ఏడుస్తూందని అర్ధం అయింది.
"లెగుసేసిందంతా సేసి ఇప్పుడా ఏడు పెందుకట? డాక్టరమ్మగారు వచ్చారు. సూది మందిత్తారు" ఆవిడ గొంతు కఠినంగా ఉంది.
"మీరుబయటికి వెళ్ళండి, నేను చూస్తానులెండి" ఆమెని బయటికిపంపి తలుపులు చేరేసిమంచం దగ్గరికి వచ్చింది అరుణ "చూడమ్మా ఇటు తిరుగు నన్నుచూడనీ నీకేం ఫరవాలేదు" సౌమ్యంగా అంది అరుణ.
నెమ్మదిగా ఆ యువతి ఇటు తిరిగింది. ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉబ్బిన కళ్ళతో చిందర వందర జుట్టుతో పాలిపోయిన ముఖంతో భయంగా దిగులుగా చైతన్యంగా ఉన్న ఆ చూపులని ఆమె ముఖాన్ని చూస్తే అరుణకి జాలి అనిపించింది పాతికేళ్ళుంటాయి చిన్నతనంలోనే వైధవ్యం సంప్రాప్తమయింది. కానీ కోరికలకి వైధవ్యంరాలేదు ఏదో క్షణికోద్రేకంలో కాలు జారింది, పాపం దౌర్భాగ్యురాలు: అరుణని చూస్తూనే ఆ యువతి రెండు చేతులతోమొహం కప్పుకుని ఏడుపు ఆరంభించింది. డాక్టరుగారూ నేను చచ్చిపోవడానికి ఏదన్నా మందీయండి ఎలాగూ మా నాన్న నన్ను సంపేత్తాడు. నన్ను బ్రతకనీయడు మీరే ఏదన్నా మందిచ్చిపుణ్యం గట్టుకోండి లేదూ అంటే చెర్లోనోపడి సస్తాను" వెక్కుతూ అంది ఆమె. "ఇంక ఈ మందులు మాపులు నాకొద్దు, మా నాన్న చేతిలో దెబ్బలు తినలేను నేను."
"మీనాన్నగారు కొడుతున్నారానిన్ను?" ఆశ్చర్యంతో అడిగింది అరుణ. ఆమె ఒక్కసారిగా భోరుమంది. "కొట్టడమా? చింతబరికెలతో బాదుతున్నాడు. సూడండి నిన్న ఎట్లాకొట్టాడో?" చేతులుచాచి చూపింది. నల్లటిచారలు స్పష్టంగా చేతులమీద కనిపించాయి అరుణ చేష్టలుడిగినదానిలా చూసింది. పాతికేళ్ళవిధవ కూతుర్ని కొట్టడమా:"ఎందుకు ఎందుకు?" వెర్రిదానిలాచూస్తూ అడిగింది.
"నేతప్పు చేశానంట ఆయన పరువు, ప్రతిష్టా నా మూలంగా గంగలోకలిశాయంట. ఎదవపని చేసి నా పరువు బజారుకీడుస్తావా అంటూ ఈ అయిదునెలల నించి సంపుతున్నారు...... కొట్టి కొట్టి మీరే సెప్పండమ్మా, నన్ను పదేళ్ళకి ఎదవముండనిసేసి ఇంట్లో కూచో పెట్టాడు. వీరడు, నేను ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకుంటామన్నాం. తప్పేం ఉంది సెప్పండి? జన్మంతా నేను ఇలాగే పడి ఉండాలా.
"వీరడెవడు?" అరుణకి వింటూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ చదువులేని పల్లెటూరి యువతిలో అమాయకత ఎంతమాత్రం కనపడడం లేదు. ఎంత ధైర్యంగా చెపుతూంది ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్భయంగా తన ప్రేమని సమర్ధించుకుంటూంది.
"ఈరడు మాయింట్లో కమతగాడు. ఆడెంతో మంచివాడు మొగుడు సచ్చినా నన్నుపెళ్ళాడతా నన్నాడు. మేం ఇద్దరం పెళ్ళి చేసుకుందామనుకున్నాం. ఈ లోపల మా నాన్న అమ్మ మా సంగతి పసిగట్టేశారు. వీరన్ని చావకొట్టి ఊళ్లోంచి పంపేశాడు మానాన్న. మళ్ళీ వస్తే సంపేస్తామన్నాడు. నన్ను ఇలా ఇంట్లో పెట్టి రోజు కొడుతున్నాడు. ఏవేవో మందులుతెచ్చి బలవంతంగా నోట్లో పోస్తున్నాడు నేను తాగనంటే కొడుతున్నాడు."
అరుణ ఏదో కథలా ఆశ్చర్యంగా వింటూంది. తనువచ్చిన పని మరచి ఆమె ఆవేశంగా ఇన్నాళ్ళకి తన గోడు చెప్పుకోవడానికి మనిషి దొరికిందన్నట్లు దాపరికం లేకుండా, కొత్తపాత లేకుండా ధైర్యంగా చెప్పేస్తుంది. తండ్రి పట్ల ఆమె కెంత కసి, ద్వేషం పేరుకున్నాయో ఆమె మాటల వల్లతెలుస్తూంది. ఈ అయిదు నెలల నించికూతుర్ని బందిఖానాలో పెట్టి, ఈమె చేసినపనికి తన పరువు పోగొట్టుకోకుండా దక్కించుకునే యత్నాలన్నీ చేస్తున్నాడన్నమాట. అరుణకి ఎవరిని ఏమనాలో అర్ధం కాలేదు.
"నీకు ఇప్పుడు ఎన్నో నెల? మందులు తీసుకోవడం ఇష్టం లేదా నీకు?"
ఊహు ఎందుకు తీసుకోవాలి? వీరడు నేను ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం. నాకు మొగుడు, పిల్లలు అన్నీ కావాలని ఉండదా? మీరేచెప్పండి, డాక్టరమ్మగారు మీరు సదూకున్నారు. మీరయినా మా నాన్నతో నాకూ, వీరడికి పెళ్ళి చేయమనిచెప్పండి. డాక్టరుగారూ: వీరడిదగ్గరికి నన్ను పంపిస్తే హాయిగా ఉంటాను. సస్తే మా నాన్న గుమ్మం తొక్కను, నా బతుకునేను బతుకుతాను. ఇంకా ఇంట్లో పడి వెధవముండ బ్రతుకు ఎన్నాళ్ళు బతుకుతాను? మీరే సెప్పండి. నేను సెప్పిందాంట్లో తప్పుందా? నాలాంటోళ్ళు మళ్ళీ పెళ్ళి సేసుకోకూడదా, ఎందరో చేసుకోవడంలేదంటారా?" ఆమెమాటలు ప్రశ్నలు...... అన్నీ చూస్తుంటే అరుణకి మతిపోయింది. బాగా చదువుకుని లేని జ్ఞాపకం తెలిసినమనిషిలా మాట్లాడుతూంది. తను చేసినదానిలో తప్పేం లేదని ధైర్యంగా చెపుతూంది తప్పుందా అని సవాల్ చేస్తూంది. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి ఆమెని సమర్ధించడానికి, ఆమెకి అభయం ఈయడానికి తను ఇక్కడికి వచ్చింది:? తనకేమిటి సంబంధం వీళ్ళ వ్యక్తిగత విషయాలలో? తనుకలుగ చేసుకున్నా ఆయన ఊరుకుంటాడా? కానీ, ఈ యువతి దౌర్భాగ్య కథ వింటూంటే ఆమె తరపున నిలబడి, వకాల్తా తీసుకుని ఆమెకి పెళ్ళి చేసి ఆమె కోరిక నెరవేర్చాలనిస్తుంది అరుణకి. పాపం, ఒక్క నాడన్నా కాపురం చేయలేదు. పాతికేళ్ళు వచ్చాయి. అలా ఇంట్లో ఏ వైవిధ్యమూ లేని బ్రతుకు ఆమెకి మాత్రం విసుగు కలిగించదా? ఓ చదువు, ఓ ఉద్యోగము ఏదీ లేదు. కాలం గడపడానికైనా ఈ పల్లెటూరిలో ఏ మార్గం లేదు.
అందుచేత మనసు పెడదారులుపట్టింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు అతన్నే పెళ్ళి చేసుకుంటానంటూంది అదీ నయమే. అసలు ఇంట్లో తల్లిదండ్రులు కన్నుగప్పి ఇంత నాటకం ఆడిందంటే ఆ అమ్మాయి ధైర్య సాహసాలని మెచ్చుకోవాలి? కాస్తోకూస్తో చదువుకున్నట్టుంది. తలగడ క్రిందనించి మంచం క్రిందనించి చౌకబారు సెక్స్ సాహిత్యాలు కనిపిస్తున్నాయి. అవన్నీ చదివి, వయసుకి సహజమయిన కోర్కెలకి అతీతురాలు కాలేక అందుబాటులో లభ్యమయిన పాలేరుతో ప్రేమకలాపాలు సాగించిందన్నమాట పోనీ, ఎలాగూ ఇంతదాకా వచ్చినవ్యవహారాన్ని ఆ తండ్రయినా అర్ధం చేసుకుని ఆమె ఇష్టప్రకారం పెళ్ళి జరిపించేస్తే ఏ గొడవాలేకపోయేది. అతనికి కూతురు బ్రతుకుకంటే పరువు ప్రతిష్ట ఎక్కువతనేం చేయగలదు ఇలాంటి స్థితిలో?
"అయితే మందు తీసుకోనంటావా? మరి మీ నాన్నగారు మందీయమని నన్ను పిలిచారే?" అసలేమంటుందో నని అరుణ నసిగింది.
ఆమె మళ్ళీ ఏడుపు ఆరంభించింది. "డాక్టరమ్మ గారూ నా బిడ్డని సంపేయకండి. నేనా బిడ్డను పెంచుకుంటాను. మానాన్నకి మీరయినా నచ్చచెప్పండి."
"పెళ్ళికాకుండా బిడ్డని కని పెంచుకోవడం అంత సులువే అనుకుంటున్నావా? లోకం బ్రతకనిస్తుందా? మీ నాన్నగారి గౌరవం, ప్రతిష్ట ఇవన్నీ ఏమవుతాయో ఆలోచించావా?"
"అందుకే పెళ్ళి చేయమంటున్నానుగా:ఇప్పుడు మాత్రం మానాన్న పరువు నిలిచిందా ఏంటి? మా నాన్న రహస్యం అని అనుకుంటున్నది ఊల్లో అందరికి తెలిసిపోయింది. ప్రెసిడెంట్ గదా అని ఎదుట అనరు గాని, ఎలాగూ పోయినపరువు పోనాది, ఆ పెళ్ళి సేస్తే నా బ్రతుకు నే బ్రతకనా?"
పదినిమిషాలలో అరుణకి ఆ అమ్మాయి సంగతి, ఆ ఇంటి సంగతీ అంతా పూర్తిగా అర్ధం అయింది. ఎంతబందిఖానాలో ఉంచినా ఏమాత్రం కనుచాటయినా ఆ అమ్మాయి ఈ జైలునుంచి పారిపోవడానికి సిద్దంగా ఉంది.
"వీరడెక్కడ ఈనాడు ఇప్పుడు? నిన్ను నిజంగా పెళ్ళి చేసుకుంటాడా? నే చెపితే మాత్రం మీ నాన్నగారు వింటారా?" సందేహంగా అంది అరుణ.
"వీరడుపక్క ఊరిలో ఉన్నాడు. మానాన్నకి భయపడి ఈ ఊరు రాలేదుగానీ, మొన్ననాకు ఉత్తరం పంపాడు రహస్యంగాఆళ్ళ అయ్య మాపాలేరుగా?" రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి అంది." అడిగి నేనంటే చాలా ప్రేమ నన్నుపువ్వుల్లో పెట్టి సూసుకుంటాడు. మీరు చెప్పిసూడండి, డాక్టరమ్మగారూ మా నాన్ననా మాటినకపోతే ఏ సందో చూసి పారిపోతాను. అప్పటిగ్గాని మా నాన్నరోగం కుదరదు. నన్నీగదిలో గొళ్ళెం పెట్టిఉంచుతున్నాడు. ఎలాగో అలాగ పారిపోతాను. అంతేకాని, మందుమాపు మింగను. అంతగా పోలేకపోతే ఉరెట్టుకుని చస్తాను" ఏడుపు మాని దృఢంగా అంది.