Previous Page Next Page 
సృష్టి పేజి 26


    గాయత్రి అనుమానవు మనిషిలా తయారైందంటే ఎందుకో నమ్మలేకపోయింది లిపి.

 

    "అప్పుడప్పుడు ఫోను చెయ్యి" తన విజిటింగ్ కార్డు యిచ్చి వెళ్ళి పోయాడు రమణ.

 

    ఆ విజిటింగ్ కార్డు వైపు చూస్తూ చాలాసేపు వుండిపోయింది లిపి.

 

    మామూలుగా చూస్తే మనుషులు మనుషులుగానే, సంబంధాలు సంబంధాలుగానే కన్పిస్తాయి. ఆ రెండు పదాల్ని కలిపితే మానవ సంబంధాలవుతాయి. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా మానవ సంబంధాన్ని పూర్తిగా విశ్లేశించలేడు.

 

    అగాధంలోంచి అణిముత్యాన్ని అలవోకగా తీయొచ్చుగానీ ఈ  మనుషుల మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వ్యక్తిత్వానికి సిసలైన నిదర్శనం రమణ. పెళ్ళయిన వెంటనే అతను  లిపిని మరిచిపోయాడు. గాయత్రి పెద్దగా చదువుకోకపోయినా ఆమెతో రాజీపడి పోయాడు. కానీ లిపిని చూడగానే అతని  మగబుద్ధి ఎందుకో తిరిగి  గాడి  తప్పింది. నిజానికి గాయత్రి అనుమానపు మనిషి కాదు. చాలా మంచి  మనిషి రమణ ఎందుకు అకస్మాత్తుగా అబద్ధం ఆడాడు?

 

    రమణ వెళ్ళిపోయాక నైట్ డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమైంది లిపి. అప్పుడు రాత్రి సరిగ్గా ఎనిమిదన్నర అయింది.

 

    
                                            *    *    *

 

    అదే రాత్రి ....... అదే ఎమిమిదిన్నర గంటల సమయం..

 

    హోటల్ చోళ లాన్స్ లో స్మిమ్మింగ్ ఫూల్  పక్కన నీళ్ళల్లోకి జారుకుంటున్న వెలుగునీడల్లోకి చూస్తోంది చీనాంబర.

 

    "జీవితంలో అనుకోకుండా కొన్ని గమ్మత్తయిన అనుభవాలు  మనకు ఎదురవుతాయి. అనంతమిన సంతృప్తికి అవి కారణంగా నిలుస్తాయని మా  డాడీ  అప్పుడప్పుడు అంటుంటారు. కానీ వాటిని చాలాకాలం నేను  నమ్మలేదు. ఎందుకో తెలుసా అభినవ్?"

 

    ఎంతో చనువుగా, స్నేహపూర్వకంగా అంది చీనాంబర. నెమలిపించం రంగుచీరలో దివ్యకాంతలా మెరిసిపోతోంది చీనాంబర. ఆమెకు ఎదురుగా కూర్చోవడం ఎందుకో ఉద్వేగంగా వుంది అభినవ్ కు. ఆ సమయంలో తన చెల్లెలు నందిన్ని..... నందినికొచ్చిన జబ్బు...... కావ్య... కావ్య కళ్ళల్లో కన్పించే ప్రేమ.... తన సున్నితమైన భావాల చుట్టూ పెరిగున్న ఆర్టిస్టు మనస్తత్వం...... అగాధంలాంటి దిగులు...... అనంతమైన నిస్సహాయత.....

 

    వీటినన్నిట్నీ మరిచిపోయాడతను.

 

    ఎడారిలో నడిచి నడిచి వచ్చినవాడికి ఎదురుగా ఉధృతమైన జలపాతం కన్పించినట్టుగా వుందతనికి.

 

    ఏదో మాయలాంటి నిజం..... నిజంలాంటి భ్రమ.

 

    అలాంటి అపురూపమైన సౌందర్యవతి, కోటీశ్వరురాలు తన కోసం ఢిల్లీ నుంచి రావడం ఏమిటీ?

 

    "ఎందుకు?" మెల్లగా అడిగాడు అభినవ్.

 

    "మొట్టమొదటిసారి మిమ్మల్ని, మీ పెయింటింగ్ నీ చూశాను. మీరు  చిత్రమించిన ఆ పెయింటింగ్ వైపు కొన్ని రాత్రులు అలా  దానివేపే చూస్తూ నిద్ర లేకుండా గడిపానంటే మీరు నమ్ముతారా?" ఒక వెలుగు కిరణం ఆమె కనురెప్ప మీద పడి మంచుబిందువులా మెరిసింది.

 

    ఆ విషయాన్ని వెంటనే నమ్మలేకపోయాడతను.

 

    అంతర్మధనానికి హేతువు గొప్ప కళాసృష్టి! గొప్ప రచనా సృష్టి! మనిషిని యుగయుగాలుగా నిద్ర లేకుండా అద్భుతమైన నేర్పరితనం ప్రకృతిలో రెండే రెండు విషయాలకు వుంది. ఒకటి సృష్టికి, రెండు ప్రతిసృష్టికి.

 

    "మిమ్మల్ని నేను పొగుడుతున్నాననుకుంటున్నారా?"

 

    ఇద్దరి మధ్యా రెండు అలల మధ్య నిష్మబ్దంలాంటి నిశ్శబ్దం.

 

    అవునని అతను అనలేదు, కాదని ఆమె అనలేదు.

 

    సూట్లోణి ఒక వ్యక్తి వచ్చి లైమ్ జ్యూస్ తో నిండిన పల్చటి గ్లాసులను అందించి వినయంగా వెళ్ళిపోయాడు.

 

    "నేనో విషయం చెప్తే మీరు సర్ ప్రయిజ్ అవుతారు. చెప్పమంటారా?" మెల్లగా నవ్వుతూ అందామె.

 

    "చెప్పండి" గ్లాస్ లోని జ్యూస్ ని సిప్ చేస్తూ అన్నాడతను.

 

    తన  గ్లాస్ ని పక్కన పెట్టి హేండ్ బ్యాగ్  ని తీసుకుని అందులోంచి ఒక చెక్ ని తీసి అతనికి అందించిందామె.

 

    అది అమెరికన్ బ్యాంక్ నుంచి ఇండియాకొచ్చిన చెక్. ఆ చెక్ విలువ అయిదు లక్షలు.

 

    ఆశ్చర్యంగా చూశాడతను.

 

    "ఆశ్చర్యపోతున్నారా? నాకు తెలుసు. మీ పెయింటింగ్ కి అమెరికాలో నాఫ్రెండ్ కట్టిన ఖరీదు. కళని, కళా హృదయాన్ని గుర్తించే మనసు విదేశీయులకు మాత్రమే వుందని నమ్ముతాను" చాలా గర్వంగా అందామె.

 

    "అంటే మీరు నా దగ్గర్నించి తీసుకున్న ఆ పెయింటింగ్ ని అమెరికన్ ఫ్రెండుకి అమ్మారా?" అంతవరకూ ఆహ్లాదంగా గొంతులోకి దిగిన లైమ్ జ్యూస్ లో ఏదో చిరుచేదు.

 

    "ఏం? కళాఖండాల్ని దాచుకోడానికి మనం మహారాజులం కాదుగా? ఎకకడ వాటికి విలువుంటుందో అక్కడ అమ్మాలి. బిజినెస్ తెలిసిన ఆర్టిస్టులు చేసే  పనే అది. మీకు ఆర్ట్ తెలుసు. కానీ బిజినెస్ తెలీదు. అందుకే....."

 

    ఆమె చెబుతున్న మాటలు విన్పించడంలేదతనికి.

 

    స్వచ్ఛమైన పాలగ్లాసులో నల్లటి నలక కన్పించినట్టయింది.

 

    తనకి రెండు లక్షలిచ్చి తన పెయింటింగుని తీసికెళ్ళిన చీనాంబర అదే పెయింటింగుని అమెరికన్ ఫ్రెండుకి అయిదు లక్షలకు అమ్మింది. అంటే .........

 

    అంటే...... ఆమె  కళాహృదయం ఖరీదు మూడు లక్షలా.  బ్రతుకులో బిజినెస్ కన్నా విలువైన వస్తువు మరేమీ లేదా? ఒక్క క్షణం  బాధగా కళ్ళు మూసుకున్నాడతను. నిస్సహాయంగా ఆమె వైపు చూశాడు. తనని ఏదో  అదృశ్య శక్తి అందమైన వూబిలోకి నెట్టేస్తున్నట్టుగా వుందతనికి.

 

    "మనుషుల మనసుల్ని కూడా మీ  అమెరికన్ ఫ్రెండ్స్ కొంటారా?" కాసేపయ్యాక కోపంగా అడిగాడతను.

 

    అతని మాటల  వెనకున్న కోపాన్ని వెంటనే అర్థం చేసుకుంది  చీనాంబర.

 

    అతని మనస్తత్వం ఏమిటో ఆమెకు అర్థమైపోయింది.

 

    మనుషుల మనసులతో డీలింగ్ బిజినెస్. మానవ మనస్తత్వాన్నికరెక్టుగా అంచనా వెయ్యగలిగినవాడే కరెక్ట్ అండ్  ఫర్ ఫెక్ట్  బిజినెస్  మెన్  అవుతాడు.

 

    "ఆర్ట్ కి, బిజినెస్ కి పడదులెండి నాకు తెలుసు. అందులో  మీలాంటి  వ్యక్తులు అన్ని కాలాల్లోనూ వుంటారు. మీ దృష్టిలో బిజినెస్  అంటే వ్యక్తులు అమ్ముడుపోవడం. అవునా? నాదృష్టిలో బ్రెయిన గేమ్. ఆర్ట్ కూడా ఒక రకంగా బ్రెయిన్ గేమ్. తన ప్రతిభ, తన కళ తన దగ్గరే వుండాలనుకున్న ప్రతి ప్రతిభావంతుడూ కష్టాల కాలగర్భంలో కలిసి పోయిన విషయం మీకు తెలుసా?" మృదువుగానే అంది చీనాంబర.

 Previous Page Next Page