"వన్ మినిట్...."
పక్కకొచ్చింది అన్విత. ఇద్దరి మధ్యా మూడడుగుల దూరమే వుంది. మధు కుడిచేతిలో బ్రౌన్ కలర్ కవర్లో అన్విత ఫోటో.
"మిస్ అన్విత..... నేనిస్తున్న గిప్టు చాలా చిన్నది. కానీ ఆ గిప్టుని ఇక్కడే, ఇప్పుడే విప్పి చూడాలి."
అతని చేతిలోని కవరువేపు చూసింది అన్విత నవ్వుతూ.
దూరంగా వున్న రెడ్ లైట్ మారిపోయి, ఎల్లోలైటు వెలిగింది.
మధు కుడిచేయి ముందుకు కదిలింది.
సరిగ్గా అదే సమయంలో డాక్టర్ యోగి కంగారుగా అక్కడకొచ్చి, "బేబీ...... నాన్నమ్మకు రోజూ వాడాల్సిన మందుల లిస్ట్ ఇది" ఏ మెడిసిన్ ఏయే సమయాల్లో వాడాలో చెపుతున్నాడు.
మూడు నిమిషాల గడిచాయి.
మధు అసహనంగా వున్నాడు.
అతని వంటినిండా చెమటలు పట్టేశాయి. ముఖమ్మీద చెమటను హాండ్ కర్చీఫ్ తో తుడుచుకున్నాడు.
"నేనిచ్చిన ప్రిస్కిప్షన్ వైజాగ్ డాక్టరు కి చూపించడం మార్చిపోకు, పద ట్రైను బయలుదేరుతుంది."
మధు సిగ్నల్ లైటు వేపు చూశాడు టెన్షన్ గా.
ఎల్లోలైటు, గ్రీన్ లైటుగా మారింది.
రైలు కూత పెట్టింది.
ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఆమె దగ్గరకొచ్చి, షేక్ హాండ్ యివ్వడం మొదలుపెట్టారు.
ఆల్ ది బెస్ట్....
హేపీ జర్నీ....
బీ కేర్ ఫుల్.....
రిమంబర్ మీ....
ఆ గొడవలో మధు గురించి మార్చిపోయింది అన్విత.
మధు అరచేతులు చెమటతో తడిసిపోయాయి. అతని వేళ్ళు చెమటతో కవరు తడిసిపోతోంది.
కంపార్టుమెంటు ఎక్కి డోరు దగ్గర నిలబడింది అన్విత.
రైలు కదిలింది.
నెమ్మదిగా కదిలింది.
అప్పుడు చూసింది మధుని అన్విత.
మధు గిప్ట్ విషయం జ్ఞాపకం వచ్చింది.
రైలు ముందుకు కదులుతోంది. మునుముందుకు కదులుతోంది.
"మధూ.....!" పిల్చింది అన్విత.
అదే సమయంలో రైలు కూత పెట్టింది.
ఆ పిలుపుకి మధు నడిచాడు.
గిప్ట్ ని అందివ్వడానికి చేతిని ముందుకు సాచాడు.
ఇద్దరి మధ్యా చేతిదూరమే వుంది.
ఆ గిప్ట్ ను అందుకోడానికి ఆమె కొంచెం ముందుకు వంగింది.
ఆ కవర్లు చివర్లు ఆమె వేళ్ళకు తగిలాయి.
మధు ముందుకు, విండోకి చాలా దగ్గరలో కెళ్ళాడు.
సరిగ్గా....
సరిగ్గా.....
అదే సమయంలో ఒక వ్యక్తి మధుని పక్కకి తోసేసి గాభరాగా కంపార్టుమెంటులోకి ఎక్కాడు.
"మధూ.... మధూ....." పిలిచింది అన్విత.
మధు పక్కకు తూలిపోయి, కిందపడిపోయి నిలదొక్కుకున్నాడు. అతని చేతిలోని కవరు కింద పడిపోయింది.
కింద పడిపోయిన కవర్ని ఆతృతగా తీసుకుని చూశాడు.
రైలు స్పీడందుకుంది.
రెండు క్షణాల్లో ట్రైన్ ఫ్లాట్ ఫారం చివరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి, చెయ్యూపుతున్న అన్విత.
మసగ్గా-
మసక.... మసకగా...
ఆ మసక మరికొంత సేపటికి మాయమైపోయింది.
విశాఖపట్నం.... డాక్టర్ అనంత్ స్వయంగా స్టేషన్ కొచ్చి అన్వితను, నాన్నమ్మను రిసీవ్ చేసుకున్నాడు. ఆనయకు నలభై అయిదేళ్ళుంటాయి. అయిన వేపు అదే పనిగా చూస్తోంది అన్విత.
"నువ్వెందుకు నావేపే అలా చూస్తున్నావో నాకు తెల్సు. నన్నెక్కడో చూసినట్టుగా వుంది కదూ...." పోర్టర్ చేత లగేజీని కార్లో పెట్టిస్తూ అన్నాడు అనంత్.
"అవునంకుల్....." అంది కార్లో ఆయన ప్రక్కనే కూర్చుంటూ, అన్నపూర్ణమ్మ బ్యాక్ సీట్లో కూర్చుంది.
"రెండేళ్ళ క్రితం నేను ఢిల్లీ వచ్చినప్పుడు, మీ ఇంటికొచ్చానన్న విషయం నువ్వు మార్చిపోయావు కాబట్టి...." నవ్వుతూ అన్నాడాయన.
అవును.... అన్విత నిజంగా మర్చిపోయింది.
అంబాసిడర్ కారు శరత్, సంగమ్ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే ఆగింది.
"మనం ఈదారంటే ఎందుకు వెళుతున్నామో తెలుసా?" అడిగాడాయన.
"నేను వైజాగ్ కి రావడం ఇదే మొదటిసారి" అంది అన్విత.
"దానికీ, నాక్వశ్చన్ కి సంబంధం లేదు..... ఈ దారంట ఎందుకు వెళుతున్నామంటే, ఇది 'వన్ వే' కాబట్టి...." మళ్ళీ అన్నాడు.
ఆయన క్యారెక్టర్ అర్థమైపోయింది ఆమెకు.
సిగ్నల్ మారగానే కారు ముందుకు కదిలింది.
ఆశీలుమెట్ట దాటింది.
చెప్పడం ప్రారంభించాడు అనంత్.
"వాల్తేరు అప్ లాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎడంపక్క నుంచి వెళితే యూనివర్సిటీ 'ఇన్ గేట్'... మనం కుడిపక్క నుంచి వెళుతున్నాం..... అది చిల్డ్రన్స్ ఆడిటోరియం. ఆ ప్రక్కనే రేడియో స్టేషన్. ఇది అసెంబ్లీ హాలు. యూనివర్శిటీ అవుట్ గేట్. ఇది పెద్ద వాల్తేరు. అది సన్ అండ్ సీ హోటల్. ఫారినర్సు హోటల్..... 'మరో చరిత్ర' సినిమా చూశావా నువ్వు?" సడన్ గా అడిగాడాయన.
"హిందీలో ఏక్ దుజేకేలియే..... చూశాను. ఆ సినిమా నాకిష్టం"
"అందులో కమల్ హాసన్ ఇష్టమా? సరిత ఇష్టమా?"
"ఇద్దరు కాదు. మాధవి కేరెక్టర్ ఇష్టం."
"నీది విచిత్రమైన టేస్ట్. గంభీరమైన మనస్తత్వం నీది" ఒక్క క్షణంలో తన మనస్తత్వాన్ని అంచనా వేసి నిజంగా చెప్పిన డాక్టర్ అనంత్ సైకాలజికల్ స్టడీ అన్వితను అబ్బురపరిచింది.
"రోడ్డుకి కుడిపక్కనున్న ఆ రెండు బిల్డింగ్స్ చూశావా..... ఆ మేడ సరిత బిల్డింగ్ గా, ఆ అవుట్ హౌస్ కమల్ హాసన్ వుండే ఇల్లుగా సినిమాలో చూపించారు."
చాలా థ్రిల్లింగ్ గా అన్పించింది అన్వితకు.
"ఇప్పుడెవరుంటున్నారు..... ఆ ఇంట్లో?" ఆసక్తిగా అడిగిందామె.
"నేనుకాదు...." క్యాజువల్గా చెప్పాడాయన.
గట్టిగా నవ్వేసింది ఆమె.
లాసన్స్ బే జంక్షన్ లో ఎకరం ప్రదేశంలో చుట్టూ గార్డెన్ మధ్య యూరోపియన్ ఆర్కిటెక్చర్ తో నిర్మించిన విశాలమైన భవనం.
కారుని చూడగానే గేట్ మాన్ గేట్ తెరిచాడు. కారు పోర్టికోలో ఆగింది.
కారు దిగింది అన్విత.
కుడివైపు తిరగాగానే కన్పించిన దృశ్యాన్ని అలా చూస్తూ వుండిపోయింది.
సముద్రం.....
వంద గజాల దూరంలో...... ఆకాశానికి, నేలకు కట్టిన బ్లూకలర్ డోర్ కర్టెన్ లా.
"ఫెంటాస్టిక్....."
"ఫెంటాస్టిక్ కాదు..... మీ డాడీ టేస్ట్."
ఆరు బెడ్ రూమ్స్..... విశాలమైన హాల్స్..... నిలువెత్తు స్తంభాలు..... చుట్టూ అంతెత్తు ఎదిగిన పోకచెట్లు.
"ఈ ఇంటి స్పెషాలిటీ ఏంటో తెల్సా?"
"తెలీదు."
"మేడమీద ఒకే ఒక్క బెడ్ రూమ్ వుంటుంది."
"మిగతా ప్లేసంతా ఏం చేశారు?"
"స్విమ్మింగ్ ఫూల్"
"వావ్....." దాదాపు అరిచినంతగా అంటూ మెట్లెక్కి స్విమ్మింగ్ ఫూల్ ని, అక్కడ నుంచి కనిపిస్తున్న విశాఖపట్టణాన్ని చూసి వెనక్కొచ్చింది.
లేడీ కుక్ కాఫీ కప్పుల్తోవచ్చి ముగ్గురికీ ఇచ్చింది. పనివాళ్ళను పరిచయం చేశాడు డాక్టర్.
"ఎవరూ వున్న లేకపోయినా రెగ్యులర్ మెయింటెనెన్స్ స్టాఫ్ వీళ్ళంతా..... మీ డాడీ గెస్టులు వైజాగ్ వచ్చినప్పుడే వీళ్ళకు పని ఇప్పటి నుంచే వీళ్ళకు పూర్తి వర్క్.
బైదిబై.... పిన్నిగారూ..... డోంట్ వర్రీ..... సోషల్ సర్వీస్ ఇంకా చేస్తున్నారా? రెండు నెలల్లో మీ హెల్త్ నార్మల్ గా అయిపోతుంది. ఈవెనింగ్ మిమ్మల్ని హాస్పిటల్ కి తీసికెళతాను" అన్నాడాయన.
"చూడు అనంత్ బాబూ.... ఇక్కడ లేడీస్ క్లబ్బు ఎక్కడుందో కొంచెం కనుక్కో నాయనా...." ఆయాసపడిపోతూ అందావిడ.
"నాన్నమ్మా..... క్లబ్బులూ, మీటింగ్ లూ, స్పీచులూ అన్నావంటే - నేను నిన్నొదిలేసి డాడీ దగ్గరికి వెళ్ళిపోతా..... బెదిరిస్తూ అంది అన్విత.
"మాట వరసకి కనుక్కోమన్నాను. వెళ్ళానంటే....." అందావిడ.
"టేక్ రెస్ట్ బెబీ..... ఈవెనింగ్.... కాలక్షేపం కోసం నీకో ఫ్రెండ్ ని తీసుకుని వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ అనంత్.
* * *
అరగంట తర్వత షవర్ ఓపెన్ చేసి స్నానం చేస్తోంది అన్విత. ఆ సమయంలో రైల్వేస్టేషన్ లోని సంఘటన గుర్తుకొచ్చింది ఆమెకు. చలనరహితంగా అయిపోయింది ఆమె మనసు.
జలపాతం ముందు తడుస్తున్న నగ్నశిల్పంలా అయిదు నిమిషాలసేపు అలాగే వుండిపోయిందామె.
ప్లాట్ ఫారమ్మీదే మధు చేతులోంచి ఆ గిప్ట్ ను తను తీసేసుకుని వుంటే బావుండేది. ఐ డిడ్ ఎ మిస్టేక్.
మధు మనసు బాధపడి వుంటుంది.
ఇంతకీ ఆ కవర్ని ఇవ్వాలని, అతను ఎందుకంత ఆరాటపడ్డాడు?
తను వైజాగ్ వెళ్ళిపోతున్నాని చెప్పగానే, రెస్టారెంట్లో మధు ముఖంలో భావాలెందుకు మారిపోయాయి?