Previous Page Next Page 
మోహిత పేజి 27


    సరిగ్గా మూడే మూడునిముషాలు-

 

    అతని ఊపిరి ఆగిపోయింది. అతను తలను పక్కకు వాల్చేసిన మరుక్షణంలో తనమీదకొస్తున్న జయంత్ భార్యను పక్కకు తోసేసి, ఆ రూమ్ లోంచి బయటికొచ్చి, రూమ్ బయట గొళ్ళెం పెట్టేసి వరండా చివరకు పరుగు, పరుగున వెళ్లింది మోహిత.

 

    అక్కడ ఆమెకోసం  ఎదురుచూస్తున్నాడు మైత్రేయ.

 

    "కమాన్ క్విక్.... పద" మెట్లవేపు పరుగు తీస్తూ అంది మోహిత. ఆమెవెనకే పరుగెత్తాడు మైత్రేయ.

 

    మెట్లు దిగి హాల్లోకొచ్చారిద్దరూ.

 

    మెయిన్ గేట్ వేపు వెళ్ళడం ప్రమాదం అని గ్రహించిన మోహిత ఆ హాలుకి రెండోవేపునున్న చిన్న డోర్ వేపు నడిచింది.

 

    ఆ డోర్ లోంచి లోపలికొస్తున్న వ్యక్తి మోహిత, మైత్రేయల వేపు అనుమానాస్పదంగా చూసి మెట్లవైపు పరిగెత్తాడు అరుచుకుంటూ.

 

    చిన్నడోర్ లోంచి బయటికెళ్ళిన మోహిత, మైత్రేయ ఒక్కక్షణం వెనక్కి తిరిగి చూశారు.

 

    "ఎవరతను..... మనల్ని చూసి అరుస్తున్నాడెందుకు?"

 

    "వార్డుబాయ్ అయివుంటాడు."

 

    "కాదు..... అతన్ని జయంత్ తో పాటు చూశాం. అతను జీపు డ్రైవర్" పరిగెడుతూనే చెప్పింది మోహిత.

 

    విశాలమయిన గార్డెన్..... ఆ పక్కన సైకిల్ స్టాండ్...... సైకిల్ స్టాండ్ ని దాటుకుని వెళితే హాస్పిటల్  వెనక్కి దారి. ఆ ఆ దారికి ఎడమవేపున లేడీ ఇన్ పేషెంట్ల రూమ్స్.

 

    వరండామీద పరిగెడుతోంది మోహిత.

 

    ఆ వెనక మైత్రేయ.

 

    ఒకరిద్దరు నర్సులు, వాళ్ళిద్దరివేపు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    ఇద్దరు డాక్టర్లు చివర ప్రత్యక్షం కావడంతో మోహిత వరండా దిగిపోయి గార్డెన్ వేపు పరుగెత్తింది.

 

    మైత్రేయ స్తంభం పక్కన నక్కాడు.

 

    అతనికి ఎదురుగా ఒక రూమ్..... ఆ రూమ్ లో బెడ్ మీద కూర్చున్న వ్యక్తి మైత్రేయని స్పష్టంగా చూసింది.... అతను అతనే  అని పోల్చుకోగానే ఒక్క ఉదుటున పరుగు, పరుగున  బైటకొచ్చి "బావా.... మైత్రేయ బావా" అంటూ గాఢంగా అతన్ని పట్టేసింది.

 

    అలా అక్కడ  మేనమామ కూతురు ఇందును చూసిన మైత్రేయ నిర్ఘాంత పోయాడు.

 

                                        *    *    *

 

    హాస్పిటల్ బయటకొచ్చి కార్లో కూర్చున్న మోహితకు చాలా అసహనంగా వుంది. మైత్రేయ  పట్టుబడిపోయాడేమోనని భయం వేసిందామెకు.

 

    పదినిమిషాలు గడిచాక పరుగు, పరుగున  వస్తున్న మైత్రేయని చూడగానే ఆమె మనసు తేలికపడింది. కార్లో ఎక్కి ఆమె పక్కన  నిస్త్రాణంగా కూర్చుండి పోయిన మైత్రేయ ముఖంలోనికి ఒక్కక్షణం చూసి కారు స్టార్ట్ చేసింది మోహిత.

 

    దారిలో అడిగింది మోహిత.

 

    "ఎందుకు లేటైంది?"

 

    ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థంకాలేదు మైత్రేయకి.

 

    అతనికి ఇందు కనిపించినందుకు సంతోషంగానూ, జయంత్ విషయంలో కంగారుగానూ వుంది.

 

    "జయంత్  విషయం చెప్పు" సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు.

 

    "చచ్చిపోయాడు..... మనం సాధ్యమయినంత త్వరలో హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోవాలి" అంది మోహిత.

 

    "వెళ్ళిపోవాలా?" నీరసంగా అన్నాడతను.

 

    "ఏం?"

 

    "మా మేనమామ కూతురు ఇందు హాస్పిటల్లో కనిపించింది. నాకు కనిపించగానే నన్ను పట్టుకుని భోరుమని ఏడ్చింది. నాతో చాలా విషయాలు మాట్లాడాలట.... ఫోన్ నెంబరిచ్చింది. రేపు ఎలాగైనా ఆమెను నేను కాల్సుకోవాలి" చెప్పాడు మైత్రేయ.

 

    "లేదు మైత్రేయ...... మనల్ని లేడీడాక్టర్ చూసింది. జయంత్ భార్య చూసింది. జీపుడ్రైవర్ చూశాడు. పోలీసులకు వాళ్ళంతా చెపుతారు. రేపుదయం నుంచి మనగురించి పోలీసుల వేట ప్రారంభమవుతుంది...... రాత్రికి మనం ఊరు విడిచి వెళ్ళిపోతే చాలా సమస్యల్లోంచి బైటపడతాం" అంది మోహిత.

 

    హొటల్ రూంకి చేరుకున్నాక చాలాసేపు తర్జన భర్జన పడ్డాడు మైత్రేయ.


    
    ఇందు హైదరాబాద్  ఎందుకొచ్చింది? హాస్పిటల్లో ఎందుకుంది? ఇందుకు పెళ్ళయిపోయిందా? అయితే భర్త ఎవరు? ఎన్నో ప్రశ్నలు..... జవాబు లేని ప్రశ్నలు.

 

    మోహిత సూట్ కేస్  బట్టలు సర్దుతోంది.

 

    "ఏం నిర్ణయించుకున్నావ్.....? రావడానికా..... వుండడానికా?" అడిగిందామె.

 

    "ప్లీజ్ నన్నర్థం చేసుకో! రేపొక్కరోజు నేనుండాలి. ఇందుతో మాట్లాడాలి. ఇందు ఏదో బాధల్లో వుంది."

 

    "ఇక్కడుంటే ఇద్దరం దొరికిపోతాం. ఇందుతో మాట్లాడి, పోలీసుల నుండి తప్పించుకుని నువ్వు రాగలవా?" అనడిగింది మోహిత.

 

    రెండునిమిషాల ఆలోచించాడు మైత్రేయ.

 

    "ఇప్పుడే  నువ్వు బయలుదేరిపోతావా?" అడిగాడతను.

 

    "అవును.....! హొటల్ రూమ్ ఖాళీ చేసెయ్యాలి...." చెప్పింది మోహిత.

 

    "నన్ను బస్టాండ్ లో డ్రాప్ చేసి, నువ్వెళ్ళిపో..... రేపు ఇందుతో మాట్లాడి నేనొస్తాను. నేనెక్కడకు రావాలి?" అడిగాడు మైత్రేయ.

 

    "గుంటూరు."

 

    "గుంటూరులో ఎక్కడ?"

 

    చెప్పింది మోహిత. మరో అరగంట తర్వాత సెంట్రల్ బస్ స్టేషన్ లో మైత్రేయని డ్రాప్ చేసేసి మోహిత గుంటూరు బయల్దేరింది.

 

    "ఇందుతో వుండిపోవు కదూ....." కారు స్టార్ట్ చేసేముందు అడిగింది మోహిత.

 

    ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు మైత్రేయ.

 

                                         *    *    *

 

    మలక్ పేట ఏరియాలో టి.వీ. టవర్ దగ్గరున్న బ్రహ్మానందనగర్ కాలనీలోకి అడుగుపెట్టాడు. మసీదు దగ్గరగా వున్న సుజన్ అపార్ట్ మెంట్స్ ను చాలా సులభంగా కనుక్కున్నాడు. ప్లాట్ నెంబర్ 15 ముందు ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు మైత్రేయ.  

 

    అతని రాకకోసమే ఎదురుచూస్తున్న ఇందు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్ తెరిచింది.

 

    కళా కాంతీలేని ఇందుముఖం వెనక కదులుతున్న భావాలను తెల్సుకోడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ.

 

    "ఏమిటిది? ఇక్కడికెలా వచ్చావ్? ఆ ఆస్పత్రి ఏమిటి...... ఎవర్నయినా ప్రేమించి అతడితో వచ్చేశావా?" ఆమె మెడలో మంగళసూత్రాలు లేని విషయాన్ని గమనించాడు మైత్రేయ.

 

    "అవును...... నిన్ను ప్రేమించాను. దాని ఫలితం ఇది! నీకోసం ఇల్లు వదిలేసి, నరకకూపంలో పడ్డాను" మైసూర్ లో జరిగిందంతా చెప్పింది ఇందు. ఆశ్చర్యపోతూ వింటున్నాడు మైత్రేయ.

 

    "ఆరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కిపోతే నా పరిస్థితి ఇలా మారకపోదు. నన్ను తీసుకుని వెనక్కి తీసికెళ్ళిపోయిన సర్కిల్ ఇన్ప్ పెక్టర్ చంద్రప్ప ఆరోజు రాత్రి నన్ను రేప్ చేశాడు. మర్నాడు నాకోసం వచ్చిన శ్రీమహాలక్ష్మి తన భర్త చంద్రప్ప తుపాకి తూటాలకు బలై చచ్చిపోవడంతో సిటీపోలీస్  కమిషనర్ కు కంప్లయింట్ చేసింది. చంద్రప్పని అరెస్టు చేయాలని ఆటో డ్రైవర్లందరూ ధర్నా చేశారు. ఆ సమయంలో చంద్రప్ప నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేసిన విషయంకూడా సిటీపోలీస్ కమీషనర్ కు తెల్సింది. ఫలితం  సిటీ పోలీస్ కమీషనర్ సర్కిల్  ఇన్స్ పెక్టర్ చంద్రప్పని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశాలిచ్చాడు.

 

    ఆ సమయంలోనే చంద్రప్ప ఎవరికీ తెలియకుండా నన్నిక్కడికి తీసుకొచ్చేశాడు. ఎక్కడికీ వెళ్ళకుందా కాపలా పెట్టాడు. తనని నమ్మితే పెళ్ళి చేసుకుంటానంటున్నాడు. ఆ సస్పెన్షన్ నుండి తప్పించుకోడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాడు" వివరంగా చెప్పింది ఇందుమతి.

 

    "చద్రప్ప ప్రస్తుతం ఇక్కడే వున్నాడా?" అడిగాడు మైత్రేయ.

 

    "అవును! ఉదయం వెళ్ళిపోయి, ఎక్కడెక్కడో తిరిగి అర్థరాత్రి వస్తాడు" చెప్పింది ఇందు.

 

    "ఇప్పుడు నీకు కాపలా లేదా?" అడిగాడు మైత్రేయ.

 

    "లేదు."

 

    "మరి తప్పించుకుని నందిగామ వెళ్ళిపోవచ్చుగా?"

 

    "నందిగామ ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలి..... ఎందుకెళ్ళాలి? నాలుగు రోజులు ఏడ్చి, వాళ్ళు నన్ను మార్చిపోయుంటారు. నువ్విలా కలుస్తావని నేనెప్పుడూ అనుకోలేదు" ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అంది ఇందు.

 

    టీ చేసి తీసుకుని వచ్చింది తాగుతున్నాడతను.

 

    "చంద్రప్పతో వుండిపోతావా?" అడిగాడు.

 

    "ఉండిపొమ్మంటావా?" ఎదురుప్రశ్న వేసింది.

 

    ఇందు పరిస్థితి ఇలా తయారవుతుందని ఎప్పుడూ వూహించని మైత్రేయ తేరుకోలేకపోతున్నాడు.

 

    "నా దేహం పాడైపోయింది. కానీ బావ, నా మనసు నిన్నే కోరుకుంటోంది" నెమ్మదిగా అందామె.

 

    "అంటే?"

 

    "నేన్నీతో వస్తాను బావా! నీకభ్యంతరం లేకపోతే" అలా జాలిగా అడుగుతున్న ఇందు కళ్ళలోకి సూటిగా చూశాడు మైత్రేయ.

 

    "ప్రస్తుతం నేను కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నాను. వాటిల్లోంచి నేనెప్పుడు బయటపడతానో నాకే తెలీదు. నావల్ల నీకు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి" అన్నాడు మైత్రేయ బాధగా.

 

    "నువ్వు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావట. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?" అతని దగ్గరిగా వస్తూ అడిగిందామె.

 

    జవాబు చెప్పలేదు మైత్రేయ.

 

    "ఆ అమ్మాయిని నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఇలాగే నా బతుకేదో నేను బతుకుతానులే..... లేదా నామీద నీకు ప్రేమున్నా ఈ పాడైపోయినదానితో వుంటే నీ పరువు పోతుందనుకుంటే నాకు ఒక సహాయం చేయి. ఆ ఆ తృప్తితో బతుకుతాను నేను" అతని భుజాలమీద చేతులు వేస్తూ అంది ఇందుమతి.

 

    "ఏమిటి?"

 

    ఇందు గబగబా లోపలి గదిలోకి వెళ్ళి, పసుపుతాడుని తెచ్చి అతని చేతుల్లో పెట్టింది.

 Previous Page Next Page