"జీపు డ్రైవర్ గురించి మనం మార్చిపోయాము" సాలోచనగా అన్నాడు మైత్రేయ.
"భయపడుతున్నావా?" నవ్వుతూ అంది మోహిత.
"ఇంత సీరియస్ టైమ్ లో నువ్వెలా నవ్వగలుగుతున్నావ్?" కోపంగా అన్నాడు మైత్రేయ.
ఆలోచిస్తోంది మోహిత.
* * *
` మరో ఇరవై నాలుగు గంటల తర్వాత......
హైదరాబాద్ లో దిల్ షుక్ నగర్ ఏరియాలోని హొటల్ రూమ్ లో వున్నారు మైత్రేయ, మోహిత.
"నిమ్స్ లో జయంత్ ఏ వార్డులో వున్నాడు? అతని దగ్గర ఎవరెవరున్నారు? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది? అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎవరు? ఈ వివరాలు మనకు కావాలి. కనుక్కొని రాగలవా?" అడిగింది మోహిత.
"కనుక్కుంటాను..... సాయంత్రంలోపుగా మనకు తెలిస్తే చాలుగా?" అన్నాడు మైత్రేయ.
"అలాగే విజిటింగ్ అవర్స్ ...... ఎప్పుడో కనుక్కో!" అందామె.
అరగంట తర్వాత బయటకు వెళ్ళిపోయాడు మైత్రేయ.
* * *
` మధ్యాహ్నం నాలుగున్నర గంటలు.
చెమటలు కక్కుకుంటూ హొటల్ రూమ్ కొచ్చాడు మైత్రేయ.
"జయంత్ ప్రస్తుతం ఇంటెన్సివ్ యూనిట్లో వున్నాడు. అతని దగ్గర అతని భార్య వుంది. రేపు ఉదయం అతన్ని వి.ఐ.సి. వార్డులోకి మారుస్తారట. అతన్ని డాక్టర్ కృష్ణ అనే ఆయన ట్రీట్ చేస్తున్నాడు.
"ఇంకో ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ అతను స్పృహలోకి రాకపోవచ్చని అనుకుంటున్నారు. విజిటింగ్ అవార్..... సాయంత్రం అయిదు గంటలనుంచి ఏడుగంటల వరకూ" చెప్పాడు మైత్రేయా.
"ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ముందు పోలీసులెవరైనా వున్నారా?"
"లేరు"
"గుడ్!"
ఏం చెయ్యాలో ఆలోచిస్తోంది మోహిత.
డాక్టర్ శ్రీదేవి తన ఎదురుగా నుంచున్న మోహిత వేపు చూసి, "కూర్చోండి...... ఏమిటి కంప్లయింట్?" అని అడిగింది.
"గత నెలరోజులుగా ప్రతిరోజూ రాత్రిపూట స్టమక్ పెయిన్ వస్తోంది" చెప్పింది మోహిత.
"మీకు పెళ్ళయిందా?" అడిగింది డాక్టర్ శ్రీదేవి.
"అయింది" నిస్సంకోచంగా చెప్పింది మోహిత పక్కనే నుంచున్న మైత్రేయ వేపు చూస్తూ.
"మీరు మీ భర్తతో కలిసే సమయంలో వస్తుందా ఆ నొప్పి?" అడిగింది శ్రీదేవి.
"లేదు...... ఆ సమయంలో కాదు."
"మరి?"
"రాత్రి రెండు మూడు గంటల ప్రాంతంలో...... సివియర్ పెయిన్ పావుగంటసేపు చాలా బాధగా, భయంకరంగా వుంటుంది."
"టెస్ట్ చేస్తాను పదండి..... లేచి-
టెస్టింగ్ టేబుల్ వేపు నడుస్తూ అంది డాక్టర్ శ్రీదేవి.
పావుగంట తర్వాత-
"బహుశా ఎమీబియాసిస్ కావచ్చు. ఎనీహౌ...... ఎక్సరే తీయిస్తాను. అవసరమయితే అండర్ అబ్జర్వేషన్ లో ఆస్పత్రిలో వుండగలరు కదా..... ఆ పెయిన్ వచ్చిన టైంలో టెస్ట్ చేస్తే, అసలు విషయం తెలిసిపోతుంది. మీకు పిల్లలా?" అడిగిందామె.
"ఇంకా లేదు" చెప్పింది మోహిత.
"ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వార్డు లో బెడ్ ఎలాట్ చేస్తాను...... రాత్రి భోజనం చెయ్యకండి. నైట్ డ్యూటీలో మిమ్మల్ని టెస్ట్ చేస్తాను" అంటూ 'నర్స్' అని పిలిచింది డాక్టర్ శ్రీదేవి.
నర్స్ కి ఏంచేయాలో చెప్పిందామె.
"నైట్ ఈయన నా దగ్గర వుండవచ్చా?" అడిగింది మోహిత.
"లేడీస్ వార్డు కదా....... వుండకూడదు. బైట వరండాలో వుండవచ్చు" చెప్పింది డాక్టర్ మోహిత.
మరో పావుగంటలో జనరల్ వార్డు లో ఇన్ పేషెంట్ గా జాయిన్ అయింది మోహిత.
మోహిత తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నాడు మైత్రేయ.
"నాక్కొన్ని మ్యాగజైన్స్ తీసుకునిరా...... అలాగే ప్రూట్స్ ఏవైనా" చెప్పింది మోహిత.
* * *
లేడీ పేషెంట్స్ బాధలతో అరిచే అరుపులు, మూలుగులతో చిన్నసైజు నరకలోకంలా వుంది వార్డు.
అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది.
బెడ్ మీద పడుకుని వుంది మోహిత. పక్కన స్టూలుమీద కూర్చున్నాడు మైత్రేయ.
"జయంత్ ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోంచి, జనరల్ వార్డులోకి ఎప్పుడు మారుస్తారో చూసి నాకు చెప్పాలి. అలాగే ఆ హోటల్ రూమ్ ని ఖాళీచేసి, ఇంకో హోటల్లో రూమ్ ని తీసుకో. అంతా సవ్యంగా జరిగితే..... ఇవాళ రాత్రికే మన పని పూర్తయిపోతుంది" మెల్లగా చెప్పింది మోహిత.
మౌనంగా ఆమె చెప్పింది విన్నాడు మైత్రేయ.
* * *
రాత్రి పదిన్నర గంటలు.....
బయట వరండాలో పచార్లు చేస్తున్న మైత్రేయ కళ్ళు దూరంగా ఒక మూల వున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్ళే వ్యక్తుల్ని నిశితంగా చూస్తున్నాయి.
నర్సులు లోనికి బయటకు కంగారు, కంగారుగా తిరగడం...... వార్డు బాయిస్ లోపలికి, బయటకి రావడం.... గమనిస్తున్నాడతను.
ఇరవై నిమిషాలు గడిచాయి.
నర్సులెందుకు అంత కంగారు, కంగారుగా తిరుగుతున్నారు......? ఆ యూనిట్ లోనే వున్న జయంత్ పరిస్థితి ఎలా వుంది?
తనవేపే వస్తున్న వార్డు బాయ్ ని పిలిచి అడిగాడు మైత్రేయ.
మైత్రేయ వేపు ఎగాదిగా చూశాడు వార్డు బాయ్.
"మీకు కావల్సిన వ్యక్తా?"
"అవును!"
"ఇప్పుడే స్పృహ వచ్చింది. అతను స్పృహలోకి రాగానే పోలీసులకు ఫోన్ చేయాలిట. ఇదేం కేసో" అనుకుంటూ ముందుకెళ్లిపోయాడు వార్డు బాయ్.
మైత్రేయ గబగబా మోహిత బెడ్ దగ్గరికెళ్ళి ఆమెకు ఆ విషయం చెప్పాడు.
పది నిముషాల తర్వాత ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు వెంటరాగా, స్టెచర్ మీద జయంత్ ని తీసుకొచ్చి జనరల్ వార్డు లో ఒక రూమ్ లో పెట్టారు.
సరిగ్గా అదే సమయంలో-
ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు. డాక్టర్ తో ఏదో మాట్లాడారు. కాసేపయ్యాక వెళ్ళిపోయారు.
బెడ్ మీద నుంచి లేచి వరండాలో పచార్లు చేస్తోంది మోహిత.
జయంత్ ని వుంచిన ఆ రూం వరండా కుడివేపు చివరన వుంది. దానికి ముందు నర్సుల రూమే. ఆ పక్కన లిప్ట్..... లిప్ట్ కు కొంచెం దూరంలో కిందకి వెళ్లడానికి మెట్లు. మెట్లకింద పెద్ద హాలు. ఆ హాల్లోంచి బయటికొస్తే సెక్యూరిటీ రూమ్.
రాత్రి పదకొండున్నర దాటింది.
వార్డుల్లోంచి పేషెంట్స్ అందరూ నిద్రకుపక్రమిస్తున్నారు.
డాక్టర్ శ్రీదేవి లిప్ట్ నుంచి బయటికొచ్చి, వార్డులోకి వస్తోంది. ఆమెను చూసి విష్ చేసింది మోహిత.
"ఏమిటి, బోర్ కొడుతుందా?" అడిగిందామె.
"కాదు..... భయమేస్తోంది మేడమ్" అంది మోహిత.
"ఎందుకు భయం?"
"వార్డు లో పోలీసులు తిరుగుతుంటే....."
"ఓ..... అదా! ఇది మామూలే. ఐ.సీ. పేషెంట్ స్పృహలో కొచ్చాడో లేదోనని తెలుసుకోడానికి వచ్చుంటారు. రౌండ్స్ పూర్తయ్యాక, నా ఛాంబర్ లో వుంటాను..... పెయిన్ వస్తే నర్సుకి చెప్పండి. నేనొస్తాను....." చెప్తూ ముందుకు నడిచింది డాక్టర్ శ్రీదేవి.
మరో నలభై నిముషాలు గడిచాయి.
డిమ్ లైట్స్ లో వార్డులు మెరుస్తున్నాయి. వరండాల్లో ఆ చివర, ఈ చివర మాత్రమే ట్యూబ్ లైట్స్ వెలుగుతున్నాయి.
మసక చీకట్లో అటూ ఇటూ చూస్తూ నడుస్తోంది మోహిత. వరండా చివర కుడివేపు మలుపులో, క్రీనీడలో కాసేపు నిలబడి నాలుగువేపులా చూసింది.
దూరంగా ఇద్దరు నర్సులు మెట్లవేపు వెళుతున్నారు.
వాళ్ళు వెళ్ళిపోయే వరకూ ఆగి-
జయంత్ రూమ్ వేపు నడిచింది మోహిత.
ఆ రూమ్ డోర్ దగ్గరగా వేసుంది. నెమ్మదిగా డోర్ తెరిచింది ఆమె.
ఎదురుగా బెడ్ మీద జయంత్. తలకి, భుజాలకు, గుండెలమీద కట్టినకట్లు.... పక్కన సెలైన్ బాటిల్ స్టాండ్.
బెడ్ పక్కన కుర్చీలోనే కూర్చుని ఓ ఆడమనిషి నిద్రపోతోంది. బహుశా జయంత్ భార్య అయివుండ వచ్చుననుకుంది మోహిత.
అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ వరకూ వెళ్లి జయంత్ ముఖంలోకి చూసింది. చిన్నగా ఉచ్చ్వాస, నిశ్వాసాలు విడుస్తున్నాడతను.
ఏ మాత్రం ఆలస్యం చేయలేదు మోహిత. తన అరచేతిని అతని ముక్కుమీద వేసి బలంగా నొక్కుతోంది. రెండవచేతిని అతని కంఠంమీద వేసి, బలాన్నంతా కూడదీసుకుని, ఊపిరాడకుండా చేస్తోంది.
గింజుకుంటున్నాడు జయంత్. మూలుగుతున్నాడు..... సరిగ్గా అదే సమయంలో అతనికి స్పృహ వచ్చింది కళ్ళిప్పి మోహితవేపు చూసి, ఒక్క వుదుటున పైకి లేవబోయి, వెనక్కి పడిపోయాడు.
దబ్ మన్న ఆ చప్పుడుకి, పక్కనున్న భార్యకు మెలకువ వచ్చింది. ఎదురుగా కనిపించిన దృశ్యానికి భయకంపితురాలైపోయిన ఆమె బిగ్గరగా కేకవేసింది.
తన కుడిచేతిని తీసి ఆమె ముఖంమీద వేసి. బలాన్నంతా కూడదీసుకుని ఆమెను గోడకేసి నెట్టింది. వెనక్కి పడిపోయిందామె. కిందపడిపోయిన ఆమె మళ్ళీ లేచి విసురుగా వస్తూ "రక్షించండి..... రక్షించండి...." అని అరుస్తోంది.
మోహిత చేతుల్లో జయంత్ విలావిల్లాడుతున్నాడు. గిలగిల్లాడుతున్నాడు. తన ప్రాణాల్ని రక్షించుకోడానికి లేవలేని స్థితిలో కూడా పోరాడుతున్నాడు.