చదువులేని మూర్ఖులు కొందరయితే, చదువుకున్న మూర్ఖులు మరికొంతమంది. ఈ తరహాకు చెందిందే నా భార్య విశాలాక్షి ఆమెకు చాలాసార్లు చాలా సున్నితంగా నా భావాల్ని చెప్పాను. అర్ధం చేసుకోదు, చేసుకోలేదుకూడా.
చెప్పి చెప్పి వూరుకున్నాను.
నా మౌనం అన్ని విషయాల్లోనూ చేతకానితనం అయిపోయింది.
అంతే-
ఈ పరిస్థితుల్లో నువ్వు నా దగ్గరకొచ్చావు.
నాకు ఓదార్పునిచ్చే స్త్రీ కోసం నేను వెతుకుతున్నాను. నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్త్రీకోసం వెతుకుతున్నాను.
సురభీ-ఐ నీద యువర్ హెల్ప్ దట్సాల్" చాలా ఉద్రేకంగా చెప్పుకొచ్చిన శ్రీధర్ అంతరంగాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది సురభి.
"ఇందులో మీ తప్పేం లేదని నాకనిపిస్తోంది సార్. నా స్వార్ధం వల్ల నేనిలా చెప్పడంలేదు. రేపు మనం కల్సివుంటున్నామని ప్రపంచానికి తెల్సినపుడు ఎన్నెన్నో మాటల్ని సొసైటీ నుండి భరించాల్సివుంటుంది. వాటన్నిటికీ మీరు రెడీయేనా" సీరియస్ గా అడిగింది సురభి.
"నా సొసైటీ ఒక్క విశాలాక్షి మాత్రమే ఆ కామెంట్లు నేనిపుడు పడుతూనే ఉన్నాను, ఇకపై తోడుగా నువ్వు వుంటావ్. సగం అక్షింతలు నీకు కాబట్టి నాకు పెద్దగా బాధేం వుండదు" నవ్వుతూ అన్నాడు శ్రీధర్.
శ్రీధర్ తో నవ్వుతూ శ్రుతి కలిపింది సురభి.
ఎస్ మిస్టర్ శ్రీధర్. నీకోసం, నా ఛాలెంజ్ నిలుపుకోవడం కోసం నిన్నొక అద్బుతమైన వ్యక్తిగా తయారు చేస్తాను. స్త్రీ సంకల్పానికి ఎదురునిలిచే శక్తి ఏదీ ఈ ప్రపంచంలో లేదని నిరూపిస్తాను. అని మనసులోనే నిర్ణయించు కుంది సురభి.
"మా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను. రండి" ఇద్దరూలేచి రోజ గార్డెన్ లోంచి కాటేజ్ దగ్గరకొచ్చారు. అలక ఒక్కతే వుంది. అలకకు పరిచయం చేసింది శ్రీధర్ ని.
"నీలిమా! ముగ్దా రాలేదా."
"ముగ్ధ వచ్చి మళ్ళీ వెళ్ళింది. నీలిమ ఇంకా రాలేదు" చెప్పింది అలక.
"నే వెళతాను. రేపు కలుస్తావా" నవ్వుతూ అన్నాడు శ్రీధర్.
అలాగే అన్నట్లుగా తలూపింది సురభి. శ్రీధర్ రోడ్డుమీదకు వచ్చాడు.
అతని మనసు చాలారోజుల తర్వాత ఆనందంగా వుంది. అతనికి తన ప్రయోగశాల రంగు రంగుల కాంతిపున్జంలా కన్పిస్తోంది. చేసిన ప్రతి ప్రయోగము సక్సెస్ అయినట్లుగా గాల్లో ఎగురుకుంటూ నడుస్తున్నాడతను.
* * * * *
అప్పుడు సమయం నాలుగంటలయింది.
అహోబిల మఠం ప్రశాంతంగావుంది. ఆ మఠంలో స్తంభాలకు ఆనుకొని ఎదురెదురుగ కూర్చున్నారు ముగ్ధ, రాజేంద్రప్రసాద్.
"అందరిలాగా నేనూచదువుకున్నాను. పోస్టుగ్రాడ్యుయేట్ లో గోల్డ్ మెడల్ సంపాదించాను. ఉద్యోగాలకోసం తిరిగాను. ఎక్కడచూసినా లంచం, లంచం ప్రతిభ వున్న, అర్హతలున్నా లంచం కావాలి. లంచం యిచ్చి నా ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవడం నాకిష్టంలేదు. రెండేళ్ళు విశాఖపట్నంలో అష్టకష్టాలు పడ్డాను. విశాఖలో శివాని మోటర్స్ లో కొంతకాలం పనిచేశాను.
ఆత్మ సంకల్పం, దృఢమైన దీక్ష వుంటే ఒక వ్యక్తి ఎంత ఉన్నతమయిన స్థితికెళ్ళాగలడో, అక్కడే నేర్చుకొన్నాను. ఆ శివాని చైర్మన్ వికాస్ న ఆదర్శం నా ఇన్ స్పిరేషన్.
నేనుకూడా వ్యాపారంచేసి పైకిరావాలని నిర్ణయించుకొన్నాను. మావూరు రాజమండ్రి వదిలి వచ్చాను. ఉన్న భూమంతా అమ్మి మూడులక్షలతో బిజినెస్ ప్రారంభించాను.
అందులో నాతోపాటు ఇద్దరు పార్టనర్స్ వున్నారు. వాళ్ళిద్దరూ బహుబద్దకస్తులు ఎలాగయినా ఒకడ్ని మోసంచేసి పైకి రావాలనుకునే తత్వం వాళ్ళది.
మొదట్లో వాళ్ళతో కలిసినపుడు వాళ్ళతత్వం నాకు తెలియదు. బ్యాంక్ వాళ్ళని మోసంచేసి పైకిరావాలనుకోవడం, నమ్మిన స్నేహితులను మోసంచేసి పైకిరావాలను కోవడం, ఆఖరికి కస్టమర్లని మోసంచేసి పైకి రావాలను కోవడం, ఆఖరికి కస్టమర్లని మోసంచేసి పైకి రావాలనుకోవడం.
వాళ్ళిద్దరివల్లా నేను మోసపోయాను. ఘోరంగా మోసపోయాను. నన్ను మోసంచేసి వాళ్ళిద్దరూ, నా బ్యాంక్ కార్డులతో వాళ్ళిద్దరూ ఫ్లెయిట్లలో తిరిగి, వచ్చిన లాభాలన్నీ నాకు తెలీకుండా దోచేసుకుని మనకు వ్యాపారంలో నష్టం వస్తోందని, దానిక్కారణం నేనేనని నా మీదకు తప్పంతా తోసేసారు. మోసం జరుగుతోందాని తెల్సుకున్నా, ఆ మోసాన్ని ఎదుర్కోడానికి బలం లేనపుడు, మోసపోవడానికి నిందలు భరించడానికి సిద్దమైపోవాలి.
అంతే-
డబ్బూ పోయింది. మిత్రుల దగ్గర పరువూ పోయింది. ఎంతో మానసిక వేదన. వ్యాపారంలో మిత్రుల్ని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. ఉన్న ఇల్లు కూడా అప్పులపాలైపోయింది. ఏంచెయ్యాలో తోచలేదు నేను దేవుడ్ని నమ్ముతాను.
దేవుడు లేకపోతే ఈ ప్రపంచం లేదని నమ్ముతాను నాకున్న ఒక్కగానొక్క అమ్మను తీసుకొని ఇక్కడికొచ్చాను. టి.టి.డి. ధర్మ సత్రంలో వుంటున్నాం. నా దగ్గరున్న కొంచెం డబ్బుతో ఈ వ్యాపారం ప్రారంభించాను. రోజుకి ఇరవై రూపాయలు వచ్చినా చాలు బతకడానికి సంతృప్తే సగం బలం. కాదంటారా..." చెప్పడం ఆపాడు రాజేంద్ర ప్రసాద్.
తనకు సరైన కాండిడేట్, అని మరోసారి నిర్ణయించుకొంది ముగ్ధ.
"మీరే వ్యాపారం చేసారు." అడిగింది ముగ్ధ.
"ఇంకు పెన్నుల మాన్యుఫాక్చరింగ్" చెప్పాడు రాజేంద్రప్రసాద్ కొద్ది సేపాగి మళ్ళీ అన్నాడు.
"ఫ్రెండ్స్ ద్రోహం చేయడమొక్కటి కాదు. టైమ్, సీజను కూడా కలిసి రాలేదనిపిస్తోంది. న్నెఉ అదృష్టాన్నికూడా నమ్ముతానండోయ్ బాల్ పాయింట్ పెన్నుల వేవ్ లో, ఇంక్ పెన్నుల తయారి బిజినెస్ పెట్టడం మొదటి తప్పని నాకు తెల్సింది. అప్పటికే చేతుల్నిండా ఇంక్ అంటుకుంది..."
రాజేంద్రప్రసాద్ చేతులవేపు చూసుకుంటూ అన్నాడు.
నవ్వింది ముగ్ధ.
"ఈ కొండమీద ఈ చిల్లర వ్యాపారంచేసి మళ్ళీ నిలదొక్కుకొని, లక్షలు సంపాదించాలనా మీ ధ్యేయం" అడిగింది ముగ్ధ.
"ఒకపుడు లక్షలు సంపాదించాలని ధ్యేయం వుండేది. కార్లలో తిరగాలని, సినిమా ప్రొడ్యూసర్ గా మారాలని, సత్యజిత్ రాయ్ లెవల్లో ఆర్ట్ ఫిలిమ్స్ తీయాలనీ, ఆస్కార్ అవార్డు కొట్టెయ్యాలని, పొలిటిక్స్ లోకి ప్రవేశించాలని, ఈ లంచగొండి ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చేయాలని, పోలీస్ వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యాలని, విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు చెయ్యాలని, చదువు పూర్తిచేసిన ప్రతి విద్యార్ధికి ప్రభుత్వం పిలిచి ఉద్యోగం ఇచ్చే ప్రణాళికకు రూపకల్పనా చెయ్యాలని, ఎన్నో ఊహలు, ఎన్నెన్నో ఊహలు... చదువు కున్నపుడు, హాస్టల్ రూంలో కూర్చొని ఆలోచించే స్టూడెంట్స్ కి ఎన్నో ఆలోచనలొస్తాయో మీకూ తెల్సుగా? అన్ని ఆలోచనలు నాకు వచ్చాయి. కాని మొట్టమొదటిసారి చేసిన బిజినెస్ తుస్ మనేసరికి వాస్తవం స్కెలిటన్ లా కన్పించింది.