Previous Page Next Page 
ముగ్ధ పేజి 26

   

    "ఒకప్పుడు భార్యా రూపవతీ శత్రుః అన్నారు పెద్దలు. అందులో నిజనిజాలు నాకు తెలియవుకానీ, నా అనుభవంలోకి వహ్చిన విషయం ఏమిటంటే భార్యా మందమతీ శత్రుః అంటే తెలివితక్కువ భార్య భర్తకు శత్రువని నేను చెప్పే అర్ధం దాంపత్యం అనే బతుకు రధానికి భార్యాభర్తలు రెండు చంక్రాలయినప్పటికీ అనుకూల, అపురూప, ఆహ్లాదకరమైన సంసారానికి, సుఖమయంగా జీవితాన్ని మలుచుకునే విషయంలో పురుషునికంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత ఉందని అలనాడు వాత్స్యాయనుడు చెప్పాడు. నేడు సోషియాలజిస్టులు అదే చెప్తున్నారు. ఎందరో ఆనందంగా బతుకుతున్న దంపతుల జీవితాలు కూడా అదే నిజమని రుజువు చేస్తున్నాయి. సుఖమయ సంసారం కోసం భార్యకు కొన్ని విధులున్నాయని వాత్స్యాయనుడు కొన్ని ప్రవర్తనా నియమాల్ని చెప్పాడు.
    
    1. ఆదర్శ గృహిణి భర్తను గౌరవిస్తూ, అతని ఇష్టా ఇష్టాలను కోరికలు తెల్సుకుని, అతని అభిమానాన్ని పొందడానికి తన శాయశక్తులా కృషిచేయాలి.
    
    2. తిరుగుబోతులయిన స్త్రీ పురుషుల్ని, వ్యక్తిత్వంలేని స్త్రీలను సంసారం అంటే అయిష్టంగల స్త్రీలను, మంత్రగాళ్ళను, దొంగలను, అదృష్టాలు, జ్యోతిష్యాలు చెప్తామంటూ వచ్చే వారిని గృహిణి ఏనాడూ నమ్మకూడదు. వారితో స్నేహం చేయకూడదు.
    
    3. ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలన్న సామెత ఈనాటిది కాదు. గృహాన్ని, గృహ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం స్త్రీ బాధ్యత.
    
    4. పదిసార్లు అడగ్గా ఇచ్చేదానికంటే, అడగకుండా అన్నీ అందించడంలో అందం, ఆనందం వుంది కనుక, భర్త అవసరాలను ముందుగానే గ్రహించి ఆయనచేత పదే పదే అడిగించుకోకుండా, భర్త అవసరాలను తీర్చగల నేర్పరితనం భార్యలో ఉన్నప్పుడు, అటువంటి భార్యపై భర్త ఎనలేని ప్రేమని పెంచుకుంటాడు.
    
    5. భర్త అనుమతితో తమ దాంపత్య సుఖ సౌఖ్యాల కోసం పూజలు, పుణ్యకార్యాలుచేసే భార్య, భర్త హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతుంది.
    
    6. అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు, భర్త తరపున బంధువర్గంపట్ల గౌరవం, వినయ విదేయతలు కల్గి ఉండడం ఆదర్శ గృహిణి కర్తవ్యాల్లో ఒకటి.
    
    7. భర్త ఇంట్లోకి వస్తున్న శబ్దం వినగానే, ఎన్ని పనుల్లో వున్నా చిరునవ్వుతో ఎదురేగడం, ఆయన ఇష్టాలకు అనుగుణంగా ఆహార పదార్ధాల్ని తయారుచేసి పెట్టటం, భర్తతోపాటు బయటకెళ్ళేటప్పుడు ఆయనకు చెడు పేరు రాకుండా అలంకరణలో, ప్రవర్తనలో జాగ్రత్త వహించడం గృహిణి విధుల్లో ముఖ్యమైనవి.
    
    8. ఎన్నో కష్టసుఖాల్ని భరించే భర్త ఎప్పుడయినా తనను బాధించినా, తనతో దురుసుగా ప్రవర్తించినా, ఎత్తి పరిస్థితుల్లోనూ చికాకును, ద్వేషాన్ని వెళ్ళగ్రక్కకుండా ప్రసన్నంగా స్త్రీ ఉండగల్గినట్లయితే తన పొరపాటును తానే గ్రహించి భర్త తన ప్రవర్తనకు సిగ్గుపడి నడవడికను మార్చుకుంటాడు.
    
    9. పదిమందిలో భార్య భర్తను ఎన్నడూ మందలించే ధోరణిలో మాట్లాడకూడదు. అటువంటి భార్యపట్ల భర్త ద్వేషాన్ని మాత్రమే పెంచుకుంటాడని గుర్తుంచుకోవాలి.
    
    10. పక్కింటి సంగతులు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయడం, అనవసరమైన పెత్తనాలు చేయడం, ఇతరుల విషయాల్లో కల్పించుకోవడం, బహిరంగంగా తిరగడం, పెద్దగా మాట్లాడ్డం, పదిమంది ముందూ వెకిలిగా మాట్లాడడం గృహిణికి మంచిదికాదు.
    
    ఇలా భార్య ఉండాలి. ఇందులో సగభాగంవున్నా పురుషుడు ఆ స్త్రీ పట్ల మమతను పెంచుకుంటాడు. కానీ ఇందుకు పూర్తిగా భిన్నంగా, అన్నీ తెల్సి  ప్రవర్తించే స్త్రీ వల్ల భర్తకు సుఖంగానీ, ప్రోత్సాహం గానీ వుంటాయంటావా? ఉండవు.
    
    భార్యభర్తల సంబంధాలంటే శరీరక ఆకర్షణ ఒకటే కాదుగదా?
    
    ఏడునిమిషాల కలయికే భార్యాభర్తల సంబంధంకాదు. బతికినన్నాళ్ళూ కలిసివుండే అపురూప సంబంధంకదా ఆ సంబంధాన్ని పరిరక్షించుకోవడం కోసం మనసా, వాచా, కర్మణా కలిసివుంటామని పెళ్లి మండపంలోనే ఇద్దరూ ప్రతినచేస్తారు. కాని నిజజీవితంలోకి వచ్చాక కొత్త ఆకర్షణ తగ్గిపోయాక, జీవితంలో డబ్బు, కీర్తి, పదవి, ఐశ్వర్యం మొదలయిన మోజులు పెరిగాక భర్తపట్ల భార్యకుగానీ, భార్యపట్ల భర్తకుగానీ చులకనభావం ఏర్పడితే ఇద్దరూ తమ వ్యక్తిత్వాల్ని, తమ బతుకుల్ని నాశనం చెసుకుంటున్నారని అర్ధం అలాగే నా జీవితంలోనూ జరిగింది సురభి.
    
    నేను నా భార్య విశాలాక్షి నుంచి ఆశించింది ఒకటి ఆమె ప్రవర్తిస్తున్న తీరు ఒకటి.
    
    దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడిచేది, ఆప్యాయంగా ఉన్నప్పుడు ప్రేమను పంచేది, ఓడిపోతున్నప్పుడు నువ్వు గెలుస్తావని నమ్మకాన్ని ఇచ్చేది, నిరాశ పడుతున్నప్పుడు ఆశను రేకెత్తించేది, అస్తవ్యస్త పరిస్థితులు వచ్చినప్పుడు ప్రోత్సాహాన్నిచ్చేది భార్యేకదా.
    
    అలాంటి భార్య తన భర్తను అర్ధంచేసుకోకపోతే ఏం జరుగుతుందో, నా జీవితంలోనూ అదే జరిగింది.
    
    నాభార్య గనుక నాకు సరయిన తోడ్పాటునందిస్తే నేనిప్పుడు ఇలా నీ ముందు అదేదో పెద్ద జీవన సమస్యలాగా, ఆ సమస్య గురించి మాట్లాడే అవకాశం ఉండేదికాదు ఏ ప్రయోగాలయితే నేను చెయ్యాలని నిర్ణయించు కున్నానో, అవన్నీ పరిష్కారం లేకుండా మూలనబడి వుండేవి కావు.
    
    నేనింతగా కష్టపడేది ఎవరికోసం? ఎందుకీ సంపాదన? ఎందుకు పొద్దున్న లేచిందగ్గర్నించి సాయంత్రం వరకూ దేవులాడడం, నేనింతగా శ్రమించేది ఎవరికోసమో, వాళ్ళు నన్నర్ధం చేసుకోడానికి ప్రయత్నించనప్పుడు, బాధను పంచుకోడానికి కనీసం ప్రయత్నం చేయనపుడు ప్రపంచంలోని మగవాళ్ళందరిలాగే నేనూ మానసిక ఆందోళనకు గురికావడం సహజం.
    
    నీకు తెలుసో తెలీదో కానీ సురభి-
    
    ప్రపంచ సైకలాజిస్టుల పరిశీలన ప్రకారం కేవలం 18శాతం, దాంపత్యాలు మాత్రమే, సుఖ సంతోషాలతో, ఆనందోల్లాసాలతో నిత్యం విలసిల్లే సంసారాలుగా తేలాయి. దీనికి మేధావుల సమాధానం ఒకటే- మానసిక మానసిక ఆందోళనకు గురై, ఈ మానసిక ఆందోళన తమసంసారికజీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో గుర్తించలేక పోతున్నారు.
    
    మానసిక ఆందోళనకు గురయినవ్యక్తి శృంగారంమీద ఏమాత్రం శ్రద్ద చూపించలేడు.
    
    ఎప్పుడూ చికాకుగా, చిరాకుగా, పరధ్యానంగా ఉండటం ఇలాంటి వ్యక్తులకుండే సహజలక్షణం. ఈ మానసిక వత్తిడుల కారణంగానే సంసారం అనే ఓ చక్కని సంతోషపు అనుభూతిని మర్చిపోయి కొందరు యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుంటారు.
    
    ఇందుకు ఉదాహరణ నేను అహోరాత్రులు నేనెందుకు లాబరేటరీలో వుంటున్నానంటే కారణం ఇదే.

 Previous Page Next Page