Previous Page Next Page 
ముగ్ధ పేజి 28

  

    మనకు కన్పించేదంతా ట్రాష్ అని మొట్టమొదటిసారి తెల్సింది.
    
    మేక వన్నె పులులూ-
    
    చిరునవ్వుతో పలకరించే తోడేళ్ళు-
    
    ఏసీ కార్లల్లో తిరిగే హైనాలు...
    
    స్వార్ధమే జీవితమయ్యే పొలిటీషియన్స్-
    
    కల్లబొల్లి స్లోగన్స్ తో కాలక్షేపం చెయ్యడం తప్ప మరెందుకు పనికిరాని పొలిటికల్ పార్టీలు...
    
    రౌడీలు, గూండాలు, తాబేదార్లూ...
    
    నిజమైన మనిషిని, నిజమైన మానవశక్తిని, నమిలి మింగేసే అద్భుతమైన ప్రపంచం ఇది.
    
    ఇక్కడ కృత్రిమత్వానికి విలువెక్కువ.
    
    అందుకే తిలక్-
    
    దేవుడా రక్షించు నా దేశాన్ని అని ఆక్రోశించాడు.
    
    నేనంటాను...
    
    ఈ దేశాన్ని ఏ దేవుడు రక్షించలేడు అని.
    
    అందుకే ఈ మారుమూల కాలక్షేపం చేస్తున్నాను. ప్రస్తుతానికి భగవత్స్ న్నిధిలో హాయిగా వుంది.
    
    "ఆ పైన భగవంతుని దయ." అన్నాడు నిట్టూర్చుతూ.
    
    స్టూడెంట్స్ గా వున్నప్పుడు కన్న కలలు, ఆశలు, వాస్తవ ప్రపంచంలోని కొచ్చి చూసినపుడు కనబడిన పచ్చి నిజాలు బేసిక్ గా లైట్ హార్టెడ్ పర్సన్ రాజేంద్ర ప్రసాద్.
    
    అలాంటి వాళ్ళతో పోరాడి, గెలవాలనే ఆశ మనసులో వున్నా, అందుకు మెంటల్ గా ప్రిపేర్ కాలేని అసందిగ్ధ పరిస్థితి వాళ్ళకుంటుంది. ఎవరైనా నువ్వు చెయ్యగలవ్. ఈ ప్రపంచాన్ని నువ్వు తుక్కుతుక్కుగా కొట్టేస్తావ్ అని ఎవరైనా నమ్మకాన్నిస్తే వెనకాల వుండి సలహాలిచ్చి, ధైర్యాన్ని నూరిపోస్తే రాజేంద్రప్రసాద్ లాంటి వ్యక్తులు కదనరంగంలోకి ఉరుకుతారు.
    
    కత్తి, డాలు మనమే ఇస్తే, వాళ్ళు యుద్ధం చేస్తారు. అలాంటిదే వాళ్ళ మనస్తత్వం.
    
    "మీరు నిజంగా తలచుకుంటే, ఏ ఒక్కరిమీద ఆధారపడకుండా, మీరనుకున్న లైన్ లో విజయం సాధించలేరా చెప్పండి. అబద్దం ఆడకుండా చెప్పండి." సూటిగా అడుగుతున్న ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు రాజేంద్రప్రసాద్.
    
    తను పిరికివాడు కావచ్చుగాని! తెలివి తక్కువ వాడు మాత్రం కాడు. అని మనసులో అనుకునండు గాని బైటకు అనలేకపోయాడు.
    
    "ఆలోచన లేనివాడు ఏమీ చెయ్యలేడు. ఒకడికి కొండెక్కాలని వుంటుంది. కాని కూర్చునే ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనతోపాటు కొండెక్కడానికి అతను తన కాళ్ళకు పని కల్పిస్తే ఆ ఆలోచన, ఆచరణలోనికి వచ్చినట్టు లెక్క ఇదే సూత్రం ప్రతి పనికీ వర్తిస్తుంది. మన ఆలోచన మన కొక్కడికే ఉపయోగపడుతుందా లేక మరో పదిమందికి కూడా ఉపయోగపడుతుందా అన్న దానిమీదే బిజినెస్ సూత్రం ఆధారపడి వుంటుంది. కొంతమంది తన విలువైన ఆలోచనల్నే అమ్మి లక్షల లక్షలు సంపాదిస్తుంటారు.
    
    మనిషి బేసికల్ గా తన ఆలోచన పునాదిమీదే ఎదుగుతాడు. ప్రపంచంలో ఆలోచనలు లేని మనిషి ఉండడు. ఆలోచన్లని, నిజ జీవితంలో వక్రమార్గంలో పెట్టేవాడు ఎప్పుడూ ఓడిపోతూనే వుంటాడు. అదే ఆలోచనని సక్రమమైన మార్గంలో పెట్టేవాడు ఎవడైనా-
    
    ఆయా రంగాల్లో రాణిస్తాదు గుర్తుంచుకోండి."
    
    "మీరు సైకాలజీ స్టూడెంటా?" అడిగాడు రాజేంద్రప్రసాద్.
    
    "కాదు."
    
    "మరి."
    
    "కొన్ని విషయాల్ని శాస్త్రీయంగా ఎనలైజ్ చేస్తాం. మరికొన్ని విషయాల్ని అనుభవం ద్వారా ఎనలైజ్ చేస్తాం. ఒక్కొక్కప్పుడు శాస్త్రీయత కన్నా అనుభవమే ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగపడుతుంది. అవునా, కాదా."
    
    "ష్యూర్, ష్యూర్, యు ఆర్ కరెక్ట్." నవ్వుతూ అన్నాడు రాజేంద్రప్రసాద్.
    
    "మీరు నిరాశను పారద్రోలండి. మళ్ళీ మీరు బిజినెస్ ప్రారంభించండి. మీరు అనుకున్న డ్రీమ్స్ ని నిజం చేసుకోండి. మీరు బిజినెస్ చేస్తారు. నాకు తెల్సు."
    
    "భలే బాగున్నారండి మీరు హిప్నాటిస్టులాగా, మీలాంటి వాళ్ళు నేను మొదటి బిజినెస్ చేసినపుడు నా వెనుక వుండి ఉంటె ఈపాటికి నేను రామానాయుడిగారిలా, రామోజీరావుగారిలా అయ్యేవాడిని."
    
    అతనిలో ఆమాత్రం ఆత్మవిశ్వాసం వచ్చినందుకు మనసులోనే ఆనందించింది ముగ్ధ.
    
    "ఇపుడు మీ వెనుక నేనుంటానులెండి." ఆ మాట అంటున్న ముగ్ధ కళ్ళవేపు అభిమానంగా చూసాడు రాజేంద్రప్రసాద్.
    
    ముగ్ధ కళ్ళవేపు మొట్టమొదటిసరి పరిశీలనగా చూసాడు రాజేంద్ర ప్రసాద్.
    
    ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ, అభిమానం, కన్పించాయి అతనికి.
    
    ఎవరీ ముగ్ధ? ఎవరు తను?
    
    ఇద్దరికీ ఏమిటి సంబంధం?
    
    ఆలోచనల్లో పడడానికి సిద్దంగా వున్న రాజేంద్రప్రసాద్ వేపు చూసి-
    
    "మా కాటేజ్ కి వస్తారా మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను."
    
    "ఇప్పుడెందుకులేండి తర్వాత వస్తా" సిగ్గుపడ్డాడు తను.
    
    "ఆడపిల్లలా సిగ్గుపడతారేం రండి" లేస్తూ అంది ముగ్ధ.
    
    మరి తప్పించుకోలేకపోయాడు రాజేంద్ర ప్రసాద్.
    
                                           *    *    *    
    
    సురభి, అలక చిట్ చాట్ కొడుతున్నారు.
    
    దూరంనుంచి ముగ్ధతో వస్తున్న రాజేంద్ర ప్రసాద్ ని చూసి,
    
    "పుట్టుకతో వృద్దున్ని పట్టేసినట్టుందే, గడుసు పిండమే" అంది సురభి.
    
    దూరంలోంచే వాళ్ళిద్దర్నీ చూసిన రాజేంద్ర ప్రసాద్, వాళ్ళను హోటల్లో చూసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు.
    
    "మీ ఫ్రెండ్స్ చాలా అందంగా వుంటారండీ" అన్నాడు ముగ్ధతో అమాయకంగా.
    
    "నేను అందంగా లేనా?" చటుక్కున అడిగింది.
    
    ఆ ప్రశ్నకు కంగారుపడ్డారు రాజేంద్రప్రసాద్.
    
    "మీరా... మీకేం... మీకేం.... మీరు క్లియోపాత్రలా వుంటే వాళ్ళు వాళ్ళు గోల్డెన్ పాత్రల్లా వుంటారు" ఆ మాట అంటున్న రాజేంద్ర ప్రసాద్ కంగారుని చూసి పడి, పడి నవ్వింది ముగ్ధ.
    
    ఇద్దరూ కాటేజ్ మెట్లెక్కారు.
    
    "మీట్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్" అంటూ ఇద్దరి స్నేహితులకి పరిచయం చేసి, వాళ్ళిద్దర్నీ అతనికి పరిచయం చేసింది ముగ్ధ.
    
    "నీలిమ యింకా రాలేదా?" అడిగింది ముగ్ధ.
    
    "రాజేంద్ర ప్రసాద్ గారి గౌరవార్ధం మనం రెస్టారెంట్ కెళ్ళి కాఫీ తాగొస్తే బాగుంటుందికదా" ప్రపోజ్ చేసింది సురభి -అతన్నే పరిశీలనగా చూస్తూ.

 Previous Page Next Page