Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 26

   

     "ఏమిటది?" ధీమాగా అన్నాడు.
   
    "కల్పనా ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ తిరిగి వ్యాపారాన్ని ఆరంభించబోతోందని తెలియవచ్చింది."
   
    సెక్రటరీ మాటలు పూర్తికాకుండానే భరద్వాజ పెద్దగా నవ్వాడు.
   
    "మిగిలిన ఆస్తుల్ని కూడా పోగొట్టుకుంటే ఏమయిపోతాడా గంగాధరరావు?" జాలిని ప్రదర్శిస్తూ అన్నాడు భరద్వాజ.
   
    "సరిగ్గా అలాగే అన్నాడు సార్...."
   
    "ఎవరు?"
   
    "మాధుర్ అనే యువకుడు."
   
    "అతనెవరు?"
   
    "ఆ సంస్థను పునరుద్దించాలనుకుంటున్న యువకుడు..."
   
    "సరిగ్గా అలాగే అంటే ఏమన్నాడు?"
   
    "మర్యాదగా కల్పనా ఎడ్వర్టయిజింగ్ ఏజన్సీకి ఎగ్గొట్టిన ఎమౌంట్ త్వరలో పే చేయకపోతే...?" సెక్రటరీ మాటలింకా పూర్తికాలేదు.
   
    భరద్వాజ చేతికందిన యాష్ ట్రే చేతిలోకి తీసుకుని కోపంగా సెక్రటరీ మీదకు విసిరాడు.
   
    అతను మెరుపు వేగంతో ఎగిరి ప్రక్కకు దూకాడు. అలాంటి సందర్భాలు అప్పటికి అతనికి చాలా ఎదురయ్యాయి.
   
    యాష్ ట్రే వెళ్ళి ఎదురుగా వున్న పూలకుండీకి తగిలి భళ్ళున పగిలిపోయింది.
   
    "ఎవడు వాడు? అంత సాహసమా వాడికి?"
   
    "సాహసమే వాడి వూపిరి అని కూడా కబురు చేశాడండి. మనకి సరిగ్గా వారమే గడువు ఇస్తాడట. అది దాటిన మరుక్షణం..." సెక్రటరి ఒక్క క్షణం ఆగిపోయాడు.
   
    "ఊ.... దాటిన మరుక్షణం....?" భరద్వాజ అసహనంగా అరిచాడు.
   
    "ఏం విసరనంటే చెబుతానండీ...." సెక్రటరీ భయపడుతూ అన్నాడు.
   
    చిరాకును ప్రదర్శిస్తూ తలూపాడు భరద్వాజ.
   
    "మీ పతనానికి ఒక్కొక్క రాయి శ్రద్దగా పేర్చుకుంటూ వస్తాడట సార్....వాడ్ని చూస్తే నిజంగా అంత పని చేసేలాగా కనిపించాడు సార్."

    "షటప్... అధిక ప్రసంగం మానేయ్" అన్నాడు కుర్చీలోంచి లేస్తూ.
   
    "సరిగ్గా అతనదే అన్నాడు సార్ నన్ను... దీన్నిబట్టి..." ఓ క్షణం ఆగిపోయి మాట మార్చాడు.
   
    "బకాయి గురించి రిజిష్టర్ లెటర్ రాశాడు సార్! దానికేం సమాధానం యివ్వమంటారు?"
   
    భరద్వాజ కళ్ళు అరమోడ్పులయ్యాయి.
   
    చిన్న పామును కూడా పెద్దకర్రతో కొట్టే అలవాటున్న భరద్వాజ ఆ విషయాన్ని ఒకింత సీరియస్ గానే తీసుకున్నాడు.
   
    "సమాధానం ఏం ఇవ్వొద్దు. రికార్డెడ్ గా దొరకడం అంత మంచిది కాదు. నేనతన్నోసారి చూడాలనుకుంటున్నాను. లెట్ హిమ్ కమ్..." అన్నాడు ఫైబర్ గ్లాస్ కిటికీలోంచి బయటకు సాలోచనగా చూస్తూ.
   
    అతనికో విచిత్రమైన అలవాటుంది.
   
    ఏదయినా చెప్పగానే ఐమీడియెట్ గా రియాక్టవుతాడు. ఆ తర్వాత ఒకింత తగ్గుతాడు. అప్పుడాలోచిస్తాడు సరిగ్గా.
   
    "అలాగే సార్!" అతను భరద్వాజ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు.
   
    ఆ వెంటనే అతని ఆలోచనలు జె.జె. ఎంఫైర్ మీదకు మరలాయి.
   
                                 *    *    *    *    *
   
    గంటన్నరకు గోడమీద రాయడం పూర్తి చేసింది మౌనిక.
   
    మాధుర్ చెప్పిన స్లోగన్ ని ముచ్చటగా, అందంగా వ్రాసింది. కానీ ఆ తరువాత కనీసం బ్రష్ పట్టుకోవడానికి కూడా భయపడుతూ లోపలికి వచ్చి ఆ యిద్దరికీ చెప్పగా వాళ్ళు వెళ్ళి చూసి చాలా బావుందని భార్గవ చెప్పగా మాధుర్ ఆమెకేసి ప్రశంసగా చూస్తూ చేయి చాపాడు.
   
    ఆమె ఓ క్షణం సందేహించింది.
   
    అతని చేయి అలాగే గాల్లో ఆగిపోయింది.
   
    ఆమె సందిగ్ధంగా ఆగిపోయింది.
   
    మాధుర్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
   
    ఆమెకు తప్పలేదు.
   
    సందేహంగా, నెమ్మదిగా తన ఎడంచేతిని ముందుకు తీసుకువస్తుండగా మాధుర్ కనురెప్ప పాటు కాలంలో ఆమె కుడిచేతిని చటుక్కున తన చేతిలోకి తీసుకుని "కంగ్రాట్స్.... చాలా బాగా రాసావు. నిజంగానే మాకో మంచి హేండ్ దొరికింది" అన్నాడు అభిమానంగా ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ.
   
    అంతే.... ఆమె కీచుమని అరిచింది.
   
    ఆ అరుపులో బాధ, ఆవేదన...
   
    మాధుర్ ఆశ్చర్యపోతూ, అనుమానంగా ఆమె చేతిని చూశాడు.
   
    ఓ క్షణం అలాగే ఆమె అరచేతికేసి చూసి తలెత్తి ఆమెకేసి చూశాడు.
   
    అతని కళ్ళలో బాధ.
   
    "నిజం చెప్పు. నీకెన్ని కోట్ల ఆస్థి వుంది?"
   
    ఆమె ఓ క్షణం షాక్ తింది.
   
    ఏమని సమాధానం చెప్పాలో అర్ధంకాక పాలిపోయిన ముఖంతో అలా చూస్తుండిపోయింది.
   
    మాధుర్ కి జాలేసింది.
   
    "లేకపోతే ఏమిటి? అరగంట రాస్తేనే చేతులు యిలా బొబ్బలెక్కిపోతే నువ్వేం కష్టపడగలవు?"
   
    ఆమె కొద్దిగా తేరుకుంది.
   
    "డబ్బు లేదనేగా ఇలా ఉద్యోగం వెతుక్కుంటూ మీ వద్దకు వచ్చింది" ఆమె ఒకింత నిష్టూరంగా అంది.
   
    మాధుర్ ఓ క్షణం ఫీలయి-
   
    "ఛా! నీ పేదరికాన్ని పరిహసించాలని కాదు- మరీ ఇంత సుకుమారం అయితే ఎలా? మనం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళగలం? అయినా నేనేమన్నా కోటీశ్వరుడ్నా నిన్ను వెక్కిరించడానికి పద.... పదా" అంటూ ఆమె అరచేతిని వదిలేసి ముందుకు సాగాడు.
   
    "మరి భార్గవ...?" మౌనిక అక్కడే ఆగిపోతూ అంది.
   
    "భార్గవ ఇక్కడే వుంటాడు. మనం ఇక్కడే వద్దాం. త్వరగా రా" అంటూ మాధుర్ మౌనిక కుడిచేతిని పట్టుకుని త్వరత్వరగా ముందుకు సాగిపోయాడు.
   
    అయిదు నిముషాలకి ఓ చిన్న హోటల్ కి మౌనికను తీసుకుని వెళ్ళి "రెండు ప్లేట్స్ పకోడీ- కొద్దిగా మీగడ పట్టుకురా-" అన్నాడు పెద్దగా.
   
    అతనేం చేయబోతున్నాడో మౌనికకు అర్ధం కాలేదు.
   
    సర్వర్ మీగడ తీసుకురావడం కొద్దిగా లేట్ చేయడంతో మాధుర్ లేచి అసహనంగా అటుకేసి నడిచాడు.
   
    అప్పుడు మౌనిక ఒంటరిగా కూర్చుని వుంది. అంతలో వెనుక నుంచి మాటలు వినిపించాయి. "ఒక పెళ్ళికాని యువకుడికి ఎడమచేతివైపు వుంటూ తన కుడిచేతిని అతని ఎడంచేతిలో వుంచి కనీసం పావు ఫర్లాంగు నడిచావు. కొన్నివందల ఏడడుగులు నడిచావు. దాని అర్ధమేమిటో తెలుసా...? ఓసారి ఆలోచించు. జాగ్రత్తగా మసలుకో."
   
    అని తనను ఉద్దేశించి అన్న మాటలే.
   
    ఆ గొంతు తనకు బాగా పరిమితం.
   
    ఆమె చప్పున వెనుదిరగబోయింది.
   
    "వెనక్కు తిరగవద్దు. నువ్వనుకుంటున్న నేనే. అతనిప్పుడు ఇటుకేసి వస్తున్నాడు. నావేపు చూసి అతనికి మొదటిరోజే అనుమానం రప్పించవద్దు."
   
    వెనుదిరిగిన రమణయ్యను చూసే ప్రయత్నాన్ని విరమించుకుని ఆయన అన్న మాటల్లో అర్ధాన్ని వెతుక్కుంటోంది.
   
    ఎంత ఆలోచించినా ఆమెకు తట్టదని అతనికి తెలుసు.
   
    మాధుర్ వస్తూనే ప్లేట్లో వున్న చల్లటి మీగడ తీసి ఆమె చేతిని తనవేపుకు చాపి సున్నితంగా ఆ బొబ్బలమీద రాయసాగాడు.
   
    ఆ చర్య ఆమెకు చాలా చిత్రంగాను, అంతవరకు అనుభవానికి అందని అనుభూతిని పంచుకున్నట్లుగానూ ఆమె ఫీలవసాగింది.
   
    ఈ వ్యవస్థలో మనిషి తలుచుకుంటే ఎంతో కొంత మంచిగా, మానవత్వాన్ని ఆసరా చేసుకుని బ్రతకవచ్చు. కానీ ఆ అవకాశాన్ని మనిషి కావాలనే దూరం చేసుకుని దుర్మార్గంగా బ్రతుకుతుంటాడు ఎందుకు?
   
    ఆమెకి అప్పుడు తను అనుభవించే శారీరక బాధ మాధుర్ సపర్యతో లభిస్తున్న అనుభూతి ముందు చాలా చిన్నదయిపోయింది.
   
    "ఇదేంటి పిల్లా! ఇంత సున్నితంగా ఎలా పెరిగావు?" మాధుర్ మీగడ రాస్తూనే తలెత్తకుండా అడిగాడు.
   
    "పిల్లంటే...?" ఆమె తన కనురెప్పల్ని చిత్రంగా కదిలిస్తూ అడిగింది.
   
    అప్పుడు తలెత్తి ఆమెవేపు చూస్తూ చటుక్కున ఆమె బుగ్గ గిల్లి "కొయ్యకు! పెద్ద టాటా బిర్లా మనవరాల్లా ఫోజొకటి..." అన్నాడు మీగడ రాయడం పూర్తి చేస్తూ.

 Previous Page Next Page