"మాట్లాడకపోతే ఎలా.....కలెక్టర్ హోదాకి భంగం కదా?"
"అయితే మధ్య మధ్యలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు ఇంకో అయిదు వందలు......"
"నీకింగ్లీషు గూడా వచ్చా.....ఇంతకీ నువ్వేం చేస్తుంటావ్....." ఆశ్చర్యంగా పదిగాడు నారాయణరావు.
"మర్డర్లు....."
"మర్డర్లా?!" ఆ మాటకు గుండె ఢామ్మంది నారాయణరావుకి.
"ఏం.....అధి మా కుల వృత్తి సీజన్ లో రెండు మూడు మర్డర్లు చేస్తాను.....ఆ తర్వాత మిగతా టైమంతా ఇలా వేషాలు వేసుకుంటాను."
"ఇంతకీ మా బామ్మను మేనేజ్ చెయ్యగలవా....." అనుమానంగా అడిగాడు నారాయణరావు.
"మేనేజ్ చెయ్యడమా.....చూడు.....ఇప్పటివరకు ఈ దాదాటేకప్ చేసిన ఏ కేసూ ఫెయిలవలేదు.....అండర్ స్టాండ్.....అవతల పార్టీ మొండి పార్టీ అనుకో ఒక దెబ్బతో సఫా"
"అంటే.....పొడిచి చంపేస్తావా......"
"మర్డర్లు మా కులవృత్తి అని చెప్పాను గదా"
"నాయనోయ్.....మా బామ్మను ఎలాగయినా ఒప్పించు. అంతే తప్ప చంపెయ్యకు"
"అలాగే గానీ.....ఇంతకీ మీ బామ్మతో ఏం చెప్పాలో చెప్పు-"
ఏం చెప్పాలో, ఆ ఊళ్ళోకెళ్ళగానే ఎవరెవరుంటారో, ఇంట్లో ఎవరెవరుంటారో వివరంగా చెప్పాడు నారాయణరావు.
"సరిగ్గా నువ్వక్కడకు వెళ్ళే సమయంలో మా మేనమామ వున్నాడనుకో ఏం చేస్తావ్?" అనుమానంగా అడిగాడు నారాయణరావు.
"కాసేపు చూస్తాను.....అడ్డదిడ్డంగా మాట్లాడేడనుకో లేపేస్తాను-ఒక పనై పోతుంది....దానికి ఎగస్ట్రా చార్జీ ఇవ్వక్కరాలేదులే. అలాంటి చిన్న కేసులన్నీ మిస్ లీనియన్స్ కింద కొస్తాయ్....."
"మా మావని లేపేస్తే పెద్ద గొడవై పోతుంది. అతగాడిని భయపెట్టు చాలు. అంతే తప్ప మరేం చెయ్యకు. నీ ప్రధాన కర్తవ్యమేమిటంటే మా బామ్మను ఒప్పించడం, నాకు ఆస్తి రాయించడం. మొత్తం నీ వ్యవహారమంతా అయిపోయాక, నువ్వు కబురుచేస్తే నేనొస్తాను......ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా, మా బామ్మ పేగులు లెక్క పెట్టేస్తుంది బీ కేర్ ఫుల్" చాలా రకాలయిన జాగ్రత్తలు చెప్పాడు నారాయణరావు.
అడ్వాన్స్ కూడా ఇచ్చి, తన ఇష్టదైవమైన జాలరుపేటలోని నారద దేవాలయానికి తీసికెళ్ళి, అర్చనలనీ చేయించి మరీ కారెక్కించాడు దాదాను.
దాదా కారేక్కుతూ చిన్న డౌటును వెళ్ళబుచ్చాడు.
"అంతా సెటిలయి పోయిందనుకో.....మీ మామ్మ నా కూతుర్ని అదే కలెక్టర్ కూతుర్ని అర్జంటుగా చూడాలని అనుకుందనుకో.....ఏం చేయమంటావ్" అడిగాడు దాదా.
ఇన్ని విషయాలు మాట్లాడిన నారాయణరావుకి ఈ విషయం తట్టకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
"అవున్నిజమే సుమీ......మా బామ్మకు ఇలాంటి డౌట్లే వస్తాయి అలాంటి పరిస్థితే వస్తుంది.....ఏం చేద్దాం"
"ఈ లోపల మరిక్కడ మంచి అమ్మాయిని చూడండి....మీ బామ్మతో మాట్లాడాక నేను నా కూతుర్ని తీసుకొస్తానని చెప్పి ఇక్కడ కొస్తాను. మీకు అమ్మాయి దొరికితే సరేసరి. లేకపోతే డాబాగార్డెన్ లో మా డిపార్ట్ మెంట్ కు చెందిన బాకులాంటి పిల్ల ఒకామె ఉంది ఆవిడ్ని తీసికెళతాను__"
"మీ డిపార్టుమెంట్ అంటే....." సందేహం వెలిబుచ్చాడు నారాయణరావు.
"అదేనయ్యా....రౌడీల డిపార్ట్ మెంట్. ఆ పిల్ల డాబా గార్డెన్స్ రౌడీ అన్నమాట. విజిలేస్తే వచ్చేస్తుంది..... పెద్ద శ్రమేంలేదు....కానీ ఖర్చెక్కువ. ఆ విషయం తర్వాత చూసుకుందాం. కానీ మీ వేటలో మీరుండండి......విష్ మీ ఆల్ ది బెస్ట్"
కారెక్కాడు దాదా. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు నారాయణరావు.
ఆ తర్వాత జుత్తులజిన్నా, నారాయణరావు కలిసి, ఉత్సాహముగా బీచ్ దగ్గర్నించి జగదాంబా వరకూ వెళ్ళి అక్కడ ఓ హోటల్లో కూర్చున్నారు.
"మీ బామ్మ ఆస్థి వ్యవహారం ఫైనలైపోతే నువ్వు సంధ్యను ప్రేమిస్తావా.....పెళ్ళి చేసుకుంటావా...." అడిగాడు జుత్తుల జిన్నా.
"ఆ పిల్ల నన్ను ప్రేమిస్తేనే....ఇలాగలాగ కాదు......గాఢంగా ప్రేమించాలి......అంతే ...."వేడి టీ తాగుతూ అన్నాడు నారాయణరావు.
దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు జుత్తులజిన్నా.
"అయితే నే వెళతాను.....చాలా పనులు వున్నాయి....." లేచాడు జిన్నా.
"మళ్ళెప్పుడొస్తావ్?" అడిగాడు నారాయణరావు.
"రేపు కలుస్తాను"
"ఒరేయ్ జిన్నా......మీ జనరల్ బాడీకి బామ్మ ఆస్థి, ఈ డ్రామా వ్యవహారమేమీ చెప్పుకురోరేయ్. నువ్వు చెప్పావంటే మన ఫ్రెండ్ షిప్ పుటుక్కున తెగిపోద్ది అంతే"
"నా గురించి నువ్వనుమానించడం చాలా అన్యాయంరోరేయ్.....నేనెప్పుడయినా, ఏ విషయమైనా అక్కర్లేని వాళ్ళెవరికైనా చెప్పానా చెప్పు"
"అవును చెప్పలేదు" అన్నాడు నారాయణరావు.
"ఇప్పుడూ అంతే. అక్కర్లేని వాళ్ళందరకూ మన విషయాలు ఎందుకురా.....వస్తాను" హోటల్ లోంచి ఆఘమేఘాలమీద బయటికెళ్ళిన జుత్తులజిన్నా రెండే రెండునిముషాలు సీరియస్ గా ఆలోచించాడు.
ఫ్రెండ్షిప్ కొద్దీ తను నారాయణరావుకు ప్రామిస్ చేసినా పవిత్రమయిన ఆశయంతో ప్రారంభమైన ఉద్యమాన్ని మాత్రం అన్యాయం చేయకూడదుగాక చేయకూడదు-చేయలేడు కూడా.
"అంచేత.....
నారాయణరావు ఆస్థికోసం ఆడే డ్రామాను వెంటనే హైకమాండుకు చెప్పాలని నిర్ణయించుకుని-
వెంటనే ఆటో ఎక్కి యూనివర్సిటీకి వెళ్ళి, కెమిస్ట్రీ లాబ్ కి వెళ్ళాడు.
అక్కడ ఆ సమయంలోకూడా తీవ్రంగా సంధ్య నారాయణరావ్ విషయమై ఇద్దరే ఇద్దరు చర్చించుకుంటూ కనబడ్డారు.
వాళ్ళిద్దరూ మోతీలక్ష్మి, వాసుదేవ్.
"మేడమ్ కమలాక్షితో, నారాయణరావుకి ఏవో రొమాన్స్ ఎఫైర్ ఉందని సంధ్య ఆరోపిస్తే ఆ ఆరోపణను నువ్వు ఖండించావా?" అడిగాడు వాసుదేవ్.
"అవును! నిర్ద్వంద్వంగా ఖండించాను"
"ఎందుకలా చేశావ్? అలా నువ్వు నిర్ద్వంద్వంగా ఖండించకుండా వుండాల్సింది"
"ఏం?" అడిగింది మోతీలక్ష్మీ.
"నువ్వొక్కదానివే అక్కడికక్కడ అలా ఖండించావనుకో.....మరి మామీద వాళ్ళకు గౌరవం ఎక్కడుంటుంది? ఈ గవర్నింగ్ బాడీ ఎందుకు? ఈ అడ్వయిజరీ కమిటీలెందుకు? ఈ జనరల్ బాడీలెందుకు? నువ్వు ఉద్యమాన్ని నీరు కార్చటానికి కుట్రలు చేస్తున్నావని నా వ్యక్తి గత అభిప్రాయం" రుసరుసలాడాడు వాసుదేవ్.
ఆ మాటతో బిక్కచచ్చిపోయింది మోతీలక్ష్మీ.
"ఈసారి అలా వ్యక్తిగతంగా ఖండించనని హామీ ఇస్తున్నాను- సారీ" చెప్పింది మోతీలక్ష్మీ.
సరిగ్గా ఆ సమయంతో అక్కడికెళ్ళిన జుత్తులజిన్నా బామ్మ ఆస్థికోసం నారాయణరావు ఆడుతున్న నాటక వృత్తాంతాన్ని విశదీకరించిచెప్పాడు గౌరవనీయ సభ్యులతో.