"మోటార్ బైక్ యాక్సిడెంట్. బజారు వెళ్ళాను, నా కళ్ళముందే ఓ లారీ స్పీడ్ గా వచ్చి మోటార్ బైక్ గుద్ది కళ్ళుమూసి తెరిచేలోగా మాయం అయింది. అతను కొన ప్రాణంతో నాలుగు ముక్కలు మాట్లాడి చనిపోయాడు."
"ఏం మాట్లాడాడు?"
"నేను ప్రేమించినమ్మాయితో ఎల్లుండి నా పెళ్ళి, ఈ పెళ్ళి ఆపకపోతే ప్రాణం తీస్తానని బెదిరింపు లెటర్స్ వచ్చాయి. అయితే నేను లెక్కచేయలేదు. వాళ్ళే నా ప్రాణం తీశారు" అన్నాడు.
"ఎవరు బాబు వాళ్ళు!" అని అక్కడ వున్న వాళ్ళు అడిగారు.
"పేరు గొణిగి తల వాల్చేశాడు. ఆ పేరు ఎవరికీ వినపడలేదు. మొదటి అక్షరం యం. ఆ తర్వాతది తెలియదు" అంటూ జగదీష్ వివరించాడు.
"ప్చ్....... ఆ పిల్ల దురదృష్టం. పోయిన వాళ్ళంతా అదృష్టవంతులే. ఇంతకీ అతని ఎడ్రస్ తెలిసిందా?"
"నేను వచ్చేశాను. ఎడ్రస్ పోలీసులు పట్టేస్తారు. ఆపై కధ మామూలే. యం. అనే అక్షరంలో కూపీ ఎవరూ లాగలేరు. అదయినా అతను మరణిస్తూ అన్న మాటలు మాబోటి వాళ్ళం విన్నాము. సాక్ష్యాలు. కోర్టులు ఎవరికీ పట్టాయి. ఒకటి మాత్రం నిజం. ఆ దురదృష్ట వంతుడిది లవ్ మర్డర్." జగదీష్ అన్నాడు.
"అవును లవ్ మర్డర్." భుజంగరావు నెమ్మదిగా అన్నాడు.
వాళ్ళమాటలు వింటున్న అమల బుర్రలో ఓ మెరుపు మెరిసినట్లయింది.
భుజంగరావు కూతురు సరోజ ప్రభాకర్ కూడా లవర్స్ పెళ్ళికి ముందు అతను ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా లవ్ మర్డర్ కాదు కదా? ఏమో ఎవరికీ తెలుసు వీటి వెనుక ఏదైనా హస్తం వుందేమో?"
అమల చాలా తీవ్రంగా ఆలోచించింది.
చనిపోవటం సహజం. హత్య అసహజం. అసహజం వెనుక చాలా పెద్ద విషయమే వుంటుంది.
"రోజా ఆలోచనలు ఎలా వుండేవి! అభిప్రాయాలు ఎలా వుండేవి! డైరీ లాంటివి రాసేదా! రాస్తే డైరీలో ఏం రాసేది, రోజా పుస్తకాల షల్ఫ్ అలమర వగైరా గాలించాలి. కొత్త విషయం పట్టగలిగితే పట్టాలి."
అమల తన కొచ్చిన కొత్త ఆలోచనలకి చాలా మురిసిపోయింది.
ఈ సాయంత్రం నుంచి ఆచరణలో పెట్టాలనుకుంది.
భుజంగరావు జగదీష్ యింకా మాట్లాడుకుంటూ వున్నారు. రకరకాల కబుర్లు చెప్పుకోటం వాళ్లకలవాటే.
అలానే పడుకున్న అమలకి నిద్ర పట్టింది.
వాళ్ళ కబుర్లు మాత్రం యింకా తెగలేదు.
14
శంకరం ఎప్పుడు తనని చూసినా మామూలుగా చూడడు. అంతులేని కామంతో వళ్ళంతా తెగబలిసి కొట్టుకు చస్తున్నాడు. చూపులతోనే దుస్తులు వలిచేసి దిగంబరంగా చేసి చూసినట్లు చూస్తాడు ముందు వీడిరోగం కుదర్చాలి.
అమల దీర్ఘంగా నిట్టూర్పు విడిచి అనుకుంది.
రెండు రోజులనుంచి అమల చాలా ధైర్యంగా వుంది. కొత్తశక్తి వచ్చింది. తను భయపడినందువల్ల లాభంలేదు. జరిగేది జరక్కపోదు. అందుకే తెలివిగా అన్నింటికీ సిద్దమైనదానిలా మెలగదల్చుకుంది.