Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 25

    కాని......

    కృష్ణ తన లెటర్ చదివి ఉపాయంగా తిరిగి వస్తాడు.

    భగవాన్ గాడు కృష్ణని ప్రాణాలతో వదులుతాడా!

    అందరి ప్రాణాలు ఈ భగవాన్ చేతిలో లేవు.

    ఆపైవాడి చేతిలో వున్నాయి.

    ఇలా ఆలోచించి అమల తృప్తిపడింది.

    ఈ రోజుకి కృష్ణ వెళ్ళి మూడోరోజు.

    ఉదయానే కృష్ణ దగ్గర నుంచి యిప్పటిదాకా మిత్రుడి దగ్గరే వున్నాను అతని పరిస్థితి చాలా సీరియస్ గా వుంది. అర్జంట్ గా రాయవెల్లూరు తీసుకెళ్ళాలి. వీలు చూసుకుని ఫోన్ చేస్తాను. ఫోన్ రావటం నాలుగురోజులు లేటు అయినా గాభరా పడవద్దు, అని కృష్ణ ఫోన్ లో భుజంగరావుతో మాట్లాడాడు.

    భుజంగరావు కృష్ణతో మాట్లాడుతున్నప్పుడు ఆ గదిలోనే వుంది అమల.

    "అమ్మయ్య కృష్ణకేం ప్రమాదం లేదు. అని అమల ఆనందించింది.

    ఫోన్ లో మాట్లాడింది కృష్ణ కాదని కృష్ణ గొంతుకతో భగవాన్ మనిషి మాట్లాడాడని అమలకి తెలియదు.

    కృష్ణని కూడా తనలాగానే భయపెట్టి ఈ యింటికి దూరంగా భగవాన్ వుంచగలిగాడు. వీడు సామాన్యుడు కాదు, అని కూడా అనుకుంది.

    కృష్ణతో ఫోన్ లో మాట్లాడి ఆ తర్వాత ఏవో లెక్కలు కాగితాలు చూసుకుంటూ వుండిపోయాడు భుజంగరావు.

    భుజంగరావు కూతురు రోజా మధ్య మధ్య ఆ పిచ్చిలో ఎక్కడ పడితే అక్కడ పడుకుని నిద్రపోయేది. ఓ రోజు బాత్ రూమ్ లో స్నానం చేస్తూ అలాగే అక్కడే పడుకుని నిద్రపోయింది. రోజాకున్న ఈ అలవాటు భగవాన్ అమలకి చెప్పాడు. అది అమల పాలిట వరం అయింది. అప్పుడప్పుడు ఏ సోఫాలోనో పడి నిద్రపోతున్నట్లు వుండిపోయేది. కాని అమల చేసేది అలా పడుకుని దీర్ఘంగా ఆలోచించటం.

    భుజంగరావుకి అల్లంత దూరాన వున్న సోఫాలో అటు తిరిగి పడుకుని కృష్ణ ఆలోచిస్తున్నది అమల.

    అమల కన్నె హృదయాన్ని మొదటిసారిగా స్పందింప చేసినవాడెవడు కృష్ణ.

    అమల అతనికి తెలియకుండానే కృష్ణ ఆలోచనలతో తల మునకలవుతున్నది.

    సరీగ ఆ సమయంలో భుజంగరావు సహా మిత్రుడు జగదీశ్ వచ్చాడు.

    "రావోయ్ రా! ఏంటీ విశేషాలు." అన్నాడు అతన్ని ఆహ్వానిస్తూ.

    జగదీష్ వచ్చి కూర్చున్నాడు.

    వాళ్ళమధ్య కొద్దిసేపు కబుర్లు జరిగాయి. అన్నీ మామూలు విషయాలే.

    అమల వింటూ వుండిపోయింది.

    "కృష్ణ వచ్చాడా?" జగదీష్ అడిగాడు.

    కృష్ణ రావటం వూరికి వెళ్ళటం వివరంగా చెప్పాడు భుజంగరావు.

    "సరోజ విషయంలో కృష్ణ ఏమన్నాడురా?"

    "రోజా తల్లికి మతి వస్తుంది. అన్ని పరీక్షలూ చేసి చూస్తానన్నాడు. అర్జంటుగా వూరికి వెళ్ళాల్సి వెళ్ళాడు. వాడు రావాలి రోజా సంగతి చూడాలి. భగవంతుడి దయ వుంటే....." అంటూ భుజంగరావు భారంగా నిట్టూర్పు విడిచాడు.

    "ఈ యింట్లోనే భగవంతుడు వున్నాడు భుజంగరావుగారు మీకు కనిపించడు" అనుకుంది అమల.

    "ఈ రోజు ఓ దురదృష్ట సంఘటన కళ్ళారా చూశానోయ్ భుజంగం!"

    "ఏంటిరా అది!"   

 Previous Page Next Page