Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 25

    "మీలో దేశభక్తి లేదు! ఒక్కసారి జైళ్ళలో ఖద్దరుతో కాలం గడిపిన మీ పూర్వుల్ని జ్ఞాపకం చేసుకోండి- కావలిస్తే!"

    "ఏం అక్కర్లేదు. మా డిమాండ్స్ ని ఒప్పుకోవాలి!" ఖైదీలందరూ లేచి, జైలర్ని చుట్టుముట్టారు.

    "మీ డిమాండ్స్ ని తీర్చడానికి నాకు పవర్ లేదు- గవర్నమెంట్ కి రాయాలి!"

    "మాకు తెలీదు...ఇంకొన్ని డిమాండ్స్ ని మర్చిపోయాం- విను. సెప్టిక్ లెట్రిన్లను కట్టించాలి. హాట్ వాటర్ ని సప్లయి చేయాలి!"

    "మీరు ఖైదీలా- వి.ఐ.పి. గెస్టులా? నేను మీ డిమాండ్స్ ను పరిశీలించనంతే!"

    అలా అంటున్న జైలర్ ఆందోళనరావు వేపు సీరియస్ గా చూశారు ముగ్గురూ.

    "అయితే మా దండ మాకిచ్చెయ్!"

    "ఒరేయ్! ఇలాంటి దండ వేసుకోవడం జీవితంలో ఇదే ప్రథమం. కాసేపు నా మెడలో ఈ దండను ఉంచండ్రా!" ప్రాధేయ పడ్డాడతను.

    "ఉంచం గాక ఉంచం! మా డిమాండ్స్ ను ఒప్పుకోకపోతే, యీ దండతో పాటు, ఈ దండకైన ఖర్చులుకూడా మా కిచ్చెయ్!" పోతురాజు ఆందోళనరావు జేబులో చెయ్యి పెట్టాడు. కాగితాలుంటాయనుకుంటే చిల్లర తగిలింది.

    "రెండు అరణాలే ఉన్నాయి నా దగ్గర!" బిక్కు బిక్కుమంటూ అన్నాడు ఆందోళనరావు.

    "మా డిమాండ్స్ ను నెరవేర్చిననాడే, మళ్ళీ దండ వేస్తాం- అంతే!" ఆడ ఖైదీలు ఒక్కుమ్మడిగా ఆ దండను అతని మెడలోంచి లాగేసి, ముక్కలు ముక్కలు చేసేసి, ఆ పువ్వుల్ని తలలో పెట్టేసుకుని వెళ్ళి పోయారు.

    ఆ దెబ్బతో ఆందోళనరావుకి బాగా కోపం వచ్చేసింది. ఉగ్రుడై లేచిపోయాడు.

    "ఇవాల్టి నుంచీ మీ భరతం పట్టకపోతే, నా పేరు ఆందోళనరావే కాదు- నిజమైన హిట్లర్ని నాలో మీరు చూస్తారు...దండను మీరే నాకు వెయ్యాలా- ఆ మాత్రం దండను కొనుక్కుని, నేనే వేసుకోగలను" అంటూ ముగ్గురి వేపూ చుర, చుర చూస్తూ ముందుకడుగేసాడు.

    "జైలర్ డౌన్, డౌన్!" అనే నినాదాలు మిన్నుముట్టాయి.

    సన్మాన సభ అడ్డం తిరగడంతో, దీనికి కారణమైన ముగ్గుర్నీ రాచి రంపాన పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు జైలర్ ఆందోళనరావు.
   
                                  ౦    ౦    ౦

    సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ, సీరియస్ గా ఆలోచిస్తున్నాడు సత్తిపండు.

    వేలెడంత లేని తేజా గురించా తను గంటలు, గంటలు తల బద్దలు కొట్టుకుంటూ, ఆలోచిస్తూ రకరకాల ప్లాన్స్ వేస్తోంది? రెండు చేతుల్తో పీకను గట్టిగా నులిమేసే, మరుక్షణం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

    వీడ్ని కిడ్నాపు చేయడం, చేయించడం దండగమారి వ్యవహారం!

    లేదు. తన చేతులకు మట్టి అంటుకోకుండా చెయ్యాలంటే- నెంబర్ వన్ క్రిమినల్ని పట్టుకుని, మాస్టర్ ప్లాన్ వేసి, మర్డర్ చేయించాలి.

    ఎక్కడా, ఏ రకమైన క్లూలు దొరక్కుండా జాగ్రత్త పడాలి!

    ఇవ్వన్నీ తను అవుటాఫ్ స్టేషన్లో వున్నప్పుడే జరగాలి-ఏమాత్రం తన మీద అనుమానమొచ్చినా తను ఇరుక్కుపోతాడు.

    సుదేష్ణాదేవి గర్భం ధరిస్తుందని, తనూహించలేదు. ఆ న్యూసే పెద్ద షాక్! గర్భవతిగా వున్న సుదేష్ణాదేవినే లేపేద్దామనుకున్నాడు-

    సరిగ్గా అదే సమయంలో బిజినెస్ ట్రిప్ పేరిట కాళేశ్వర ప్రసాద్ వెనక తప్పనిసారీ పరిస్తితుల్లో అమెరికా వెళ్ళాల్సివచ్చింది.

    తిరిగొచ్చేసరికే సుదేష్ణాదేవికి నెలలు నిండిపోయాయి.

    ఇప్పటికైనా, ఆలస్యం జరిగిందేమీ లేదు!
   
                                                                    ౦    ౦    ౦

    "నువ్వెళ్ళిన పనేమైంది?" భీంభాయ్ ని అడిగాడు సత్తిపండు.

    సరిగ్గా అదే సమయంలో కారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మలుపు తిరిగింది.

    "రాత్రి ఎనిమిది గంటలకు కాచిగూడలోని హోటల్ కాళి రెస్టారెంట్లో వెయిట్ చేస్తానన్నాడు."

    "డిటైల్స్ ఏమీ అడగలేదా?" ఆత్రుతగా అడిగాడు సత్తిపండు.

    "డిటైల్స్ నువ్వే మాట్లాడతానన్నావ్ గదా..."

    ఆ టాపిక్ అక్కడితో కట్ అయింది. తన ఆలోచనల్ని ప్లాన్స్ గా మారుస్తున్నందుకు సత్తిపండుకి చాలా ఆనందంగా ఉంది.
   
                                 ౦    ౦    ౦

    స్కూటర్ దిగి, హోటల్ కాళి రెస్టారెంట్లోకి వస్తున్న అతన్ని వెంటనే గుర్తుపట్టడం చాలా కష్టం. వత్తు గెడ్డాం, చిన్న మీసాలు, జీన్స్ ఫ్యాంటు, చెక్స్ షర్టు, చింపిరి చింపిరి జుత్తు- చూడగానే నీగ్రోలా వున్నాడు సత్తిపండు మారువేషంలో.

    గ్లాస్ డోర్స్ తెరచి లోనికొచ్చి, నలువేపులా చూసి, ఓ టేబుల్ ముందు ఒంటరిగా కూర్చున్న వ్యక్తిని గుర్తుపట్టి, అతని వేపు నడిచి, ఎదురుగా చెయిర్లో కూర్చున్నాడు.

    ఆర్యూ మిస్టర్ అనీఫ్?"

    "యా!"

    "అయామ్ ఎస్.పి. - సత్తిపండు!"

    ఇద్దరి పరిచయాలయ్యాక, కొన్ని ప్రశ్నలు వేశాడు అనీఫ్.

    "మా పాత బస్తీ ఏరియాలో మా మీద బాగా నిఘా ఉంది- అందుకే ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి- ఏవిటీ, ఎవర్నో కిడ్నాప్ చెయ్యాలట?" సగం, సగం ఉర్దూలో, సగం, సగం తెలుగులో అన్నాడతను.

    "అవును! కిడ్నాప్ చేసిన వెంటనే ఆ కాండిడేట్ ను ఇక్కడ నుంచి సాధ్యమైనంత దూరానికి తీసికెళ్ళిపోవాలి. పోలీసులు ఎలర్టయ్యే లోపలే ఆ పని జరిగిపోవాలి!"

    "అయితే, చాలా మనీ పవర్ అవసరం వుంటుంది....ఖర్చు ఎక్కువవుతుంది."

 Previous Page Next Page