Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 25

 

    ముఖం అది కడుక్కుని, పాలు పోయించుకుని స్టౌ పై కాచుకుని హార్లిక్స్ కలుపుకుని త్రాగేశాడు. అబ్బ! ఎంత బావుంది! అందుకే బాబిగాడు నెలకి రెండు సీసాలు ఖాళి చేస్తున్నాడు అనుకున్నాడు.
    ఇహ తర్వాత స్వయంపాకానికి ప్రారంభోత్సవం చేశాడు. అలవాటున్నా మనస్సు సాస్థ్యం లేకపోవటంతో వంటంతా ఎలాగో అయింది.
    చివరికి భోజనం ఎలాగో పూర్తి చేసుకుని త్వరగా ఆఫీసుకి వెళ్ళాడు.
    సైకిల్ అంతా మట్టికొట్టుకునిపోయింది. తుదవబోయి షర్టుకి అక్కడక్కడా ఒకటి రెండు మరకలు చేసుకుని ఇహ కాదనుకుని వెళ్ళిపోయాడు.
    ఇహ ఆ తర్వాత భోజనం ఓ దగ్గరి మెస్ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆఫీస్ నైట్ వాచర్ని పిలిచి తన భార్య వచ్చేవరకు యిల్లు శుభ్రం చేసేపని ఏర్పాటు చేశాడు. ఆ కుర్రాడు అదోహటి గాక అలా అలా పైపై పనులు కూడా చేసేవాడు. నీళ్ళు కాచేవాడు. కాఫీ చేస్తానంటే వద్దని బోర్నవిటా కలిపి యిచ్చేది నేర్పాడు.
    ఎలాగో కాలం గడుస్తోంది.
    అయినా అతనికి జీవితం అంతా చక్కగా వున్నా వుప్పులేక రుచి చచ్చిన కూరతో భోజనంలా వుంది.
    ఒక్కోసారి అలా వెళ్ళివద్దామా, ఎంత రెండు గంటల ప్రయాణమే కదా అనుకునేవాడు, కానీ మళ్ళీ తను ఎంతో లోకువ అయినట్టుంటుందని మానేసేవాడు.
    తనకి, బాబుకి, శ్రీదేవికి చాలా యిస్తామయిన స్వీట్స్ చూసినప్పుడల్లా బాధ అయ్యేది, బాబు బాగా గుర్తుకి వచ్చేవాడు. అది మరీ బాధని కల్గించేది. ఆ ఆసామి ఎప్పుడయినా ఎదురయితే ఏం సార్ యీ మధ్య స్వీట్స్ తీసికెళ్ళటం లేదు అని అడిగేవాడు. అదో బాధావిశేషం అనుకుని యిక అటుగా వెళ్ళటమే మానుకున్నాడు.
    ఏది ఎలా అయినా కాలం ఆగదు కదా. యిట్టే యిట్టే రెండు మాసాలు గడిచిపోయాయి. అయినా యిటు నుంచి గానీ అటునుంచి గానీ ఏమి జరగలేదు.
    శ్రీదేవి ఎప్పుడూ గుర్తుకి వచ్చేది, బహుశా ప్రసవం అయి వుంటుందేమో ననుకునేవాడు. ఆ ఉహ మెదులుతూనే విపరీతమయిన బాధ గుండెల్లో మెలేసి యింట్లో నిలువనిచ్చేది కాదు--బయటికి వెళ్ళి యిష్టం వచ్చినట్టు విధులన్నీ సరి చేసి తిరిగి ఏ రాత్రికో యిల్లు చేరుకునేవాడు.
    మూడు మాసాలు నిండాయ్శ్రీదేవి వెళ్ళి.
    ఓ రోజు సాయంకాలం అయిదుదాటాక ఆఫీసు నించి తిరిగి వస్తున్నాడు.
    కొండారెడ్డి బురుజు దాటి డౌన్ లో వచ్చేస్తుంటే సైకిల్ జోరుగా పోతోంది. ఎవరో కేకేశారు. తలతిప్పి చూశాడు. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ముందుకు సాగాడు. డౌన్ కాబట్టి ఆగలేక.
    "మాధవరావుగారూ! మాధవరావుగారూ!"
    చప్పట్లు కొడుతూ పిలిచారు ఎవరో.
    ఇహ తప్పనిసరి అయి సైకిల్ దిగాడు.
    అటూయిటూ పరకాయించి చూసేసరికి ఆర్.టి.సి బస్సు స్టాపు నుంచి వచ్చాడు శ్రీదేవి వాళ్ళ వూరి రైతు, మాధవ్ కి ఆ వూళ్ళో అంతా కాస్తో కూస్తో పరిచయమే కాని ఒకరిద్దరు పేర్లు తప్ప ఎవరూ బాగా గుర్తుగా తెలీదు.
    రోడ్ ని దాటి దగ్గరగా వచ్చి "నమస్కారాలండి" అన్నాడు.
    తిరిగి నమస్కారం చేస్తూ ప్రశ్నించాడు మాధవ్ "ఎప్పుడొచ్చావ్? అంతా కులాసా?"
    "ఉదయం వచ్చానండి, మా అబ్బాయిని యిక్కడే కాలేజిలో చేర్పించానండి, చూడటానికివచ్చాను."
    చిరునవ్వు నవ్వుతూ నార్మల్ గా అడిగేడు. ఇంకేమిటి విశేషాలు?"
    పైకి ఊరికే అడిగినట్టు శ్రీదేవి కబుర్లు ఏవో చెప్పకపోతాడా అని మనసులో ఓ మూల లేకపోలేదు.
    "ఏ మున్నాయ్ బాబూ, మీకు తెలీని కబుర్లేం చెపుతాం అయినా జిల్లా ముఖ్య పట్టణంలో వున్నారు మీరే చెప్పాలి. పల్లెటూరి వాళ్ళకి మాకేం తెలుస్తాయ్?" అని ఒక క్షణం ఆగి ప్రశ్నించాడు ఏమిటి బాబూ మీరీ మధ్య ఊరికి రాలేదు?"
    పల్లెవాళ్ళకి యింకా పై పై మాలిష్ వ్యవహారాలు అలవాటు కాలేదు. నేరుగా అడిగేస్తారు.
    అన్ని పట్టణాల్లో వాతవరణం కలుషితమై మనుషులు మరినంతగా యీ పల్లెజనం యింకా మారలేదు.
    నల్లగా మసి పూసి నట్టయిందతనిముఖం.
    తడబడుతూ అన్నాడు "ఏమిలేదు. రాకేం? రావాలనే వుంది. కానీ ఆఫీసులో పని ఎక్కువగా వుంటోంది . సెలవు యివటంలేదు. ఏం చేస్తాం చెప్పు? జీవితాలని అమ్ముకున్నాక వాళ్ళిచ్చే జీతాలకి బానిసలం అయ్యాక యిక స్వతంత్రం ఏముంది?
    పెద్దగా నవ్వి అన్నాడతను "ఏమిటి బాబు అలా చెపుతారు? చాలా చిత్రంగా మాటాడుతున్నారే? ఎన్ని ఆఫీసుపనులున్నా ఎంత సెలవు యివకపోయినా యింటిలో అత్యవసర కార్యక్రమాలకి సెలవు యివరటండి! అంత కర్కోటకులు యింకా ఎవరుంటార్లెండి?"
    "ఆహా యివరని కదయ్యా! ఏదో"
    ఇంటిలో ముఖ్యమయిన కార్యాలంటే! అతన్లో ఏదో ఓ చిత్రమైన వూహ మెదిలింది ఏమిటది?
    "మారింకేమిటండి? ఎందుకు రారూ? దాదాపు మూడు నేల్లయింది, అమ్మాయిగారు వచ్చి కనీసం ఒసారయిన మీరటు రాలేదు. అయినా కాలం మారే కొద్ది మనుషుల్లో ప్రేమలు తగ్గుతున్నాయ్ బాబూ."
    "ఏదో" ఇంకేమి అనలేకపోయాడు.
    "ఏందండి మళ్ళీ ఏదో అంటారు. "రెట్టిస్తూ అన్నాడా మనిషి మళ్ళీ "మీకు కొడుకు పుట్టాడని తెలిసినా రావాలనిపించలేదా? ఏమిటి బాబూ. ఎంత బావున్నాడని మీ చిన్న అబ్బాయి పెద్దబ్బాయి గారి కన్నా యీ రెండో అబ్బాయ్ యింకా తెల్లగా ఏం చక్కగా వున్నాడని! కానీ అబ్బాయి చాలా బలహీనంగా వున్నాడండి."
    "ఆ ఆ" అన్నాడు యింకేమనాలో తోచక.
    "ఇంకా ఆ ఆ ఏమిటండి. రేపో ఎల్లుండో బయల్దేరి రండి ఇక నేను వస్తానండి......బస్సు బయల్దేరబోతున్నాదల్లె వుంది."
    కదలి పోబోతున్న అతన్ని "ఒక్క క్షణం ఆగవయ్యా" అని "ఆ మా చిన్నబాబుకి ఎన్ని రోజులు?" అని అడిగాడు.
    "అయన నివ్వెరపోయినటై అన్నాడు "ఇంకా రోజులేమిటండి? దాదాపు రెండు నెలలు కాబోతుంటే-- వాలకం చూస్తే మీకు తెలిసినట్లు లేదే--- మీ మామగారు ఉత్తరం కూడా రాయలేదా ఏమిటి కొంపదీసి ఆయనంతేలెండి. ముందే లోభి---యిప్పుడు కార్డు పదిహేను పైసలు అయిందని అసలే మానుకున్నాడల్లె వుంది.

 Previous Page Next Page