Previous Page Next Page 
శుభోదయం పేజి 25


    కాని ఆశ్చర్యంగా మాధవ్ తిరిగి ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఆమెను తప్పించుకుని తిరిగాడు. రాధ వేవిళ్ళతో సతమతమవుతున్నా పట్టించుకోలేదు. నీరసంతో పడుకున్నా, కాలేజీకి సెలవు పెట్టినా కనీసం అడగలేదు. ఆ నీరసంలో, ఆ వేవిళ్ళలో శారదే యించుమించు పని అంతా చేసి సహాయపడింది.
    "అక్కయ్యా నీవు పడుకో. బావగారికి కాఫీ ఇస్తాలే, నేను టిఫిను చేసిపెడతాలే" అంటూ అన్ని పనులు తనే చేసేది శారద.
    రాధ కూడా మాధవ్ తన ఉనికి భరించలేనట్టు తను కనపడితే మొహం చిట్లించడం, కాఫీ తీసుకెళ్ళినా చేతితో అందుకోకపోవడం, భోజనం వడ్డిస్తే విసురుగా తిని వెళ్ళిపోవడం చూసి తను కంటపడితే మరీ అతని ధోరణి విపరీతంగా మారడంతో అతని పనులు అన్నీ శారదమీద వదిలింది.
    శారద ముందు ముందు మాధవ్ తో మాట్లాడడానికి సిగ్గుతో మెలికలు తిరిగి, వెకిలినవ్వులు, అక్కరలేని సిగ్గు ప్రదర్శించేది. కాని ఈ రెండేళ్ళలో అతని దగ్గిర చనువు ఏర్పడి "బావగారూ" అంటూ బాగానే మాట్లాడేది. ఇప్పుడు మరీ చనువుగా "బావగారు కాఫీ..." అంటూ గదిలోకి తీసికెళ్ళి అందించేది. "టిఫిను రెడీ. యిక్కడికి తేనా అక్కడికి వస్తారా", "అదేమిటి బావగారూ రాత్రి భోజనానికి రాలేదు, మీకిష్టం అని కొబ్బరికాయ పచ్చడి చేశాను...", "బావగారూ అక్కకి మందులు అయిపోయాయి తీసుకురండి.", "బావగారూ యిదిగో ఈ లిస్టులో సామాను తెమ్మంది అక్కయ్య..." అంటూ ప్రతి దానికి వారిద్దరి మధ్య వారధి అయింది.
    మాధవ్ కి ఏం కావల్సినా శారదతో చెపుతూ "మీ అక్కయ్యకియ్యి" అంటూ డబ్బివ్వడం... మొత్తానికిద్దరూ శారదమీదే ఆధారపడ్డారు.
    రాధకి యిదంతా చూస్తూంటే మనసు దహించుకుపోయేది ఒకోసారి. "వెకిలిపిల్ల, ఆ నవ్వేమిటి, ఆ మాటలేమిటి, అబ్బ ఆ శారదనెందుకు రానిస్తావు" అంటూ విసుక్కునే మాధవ్ కి యిప్పుడు తను శారదపాటి కాకపోయిందన్న మాట అంటూ బాధపడేది. శారద అతని పనులు చేస్తూ యింట్లో తిరుగుతూంటే తన స్థానం ఆమె లాక్కున్నట్టు స్త్రీ సహజమైన అసూయతో దహించుకుపోయేది. కాని శారద తప్పేముంది? తామిద్దరూ తమ అవసరం కోసం ఆమెని ఉపయోగించుకుంటున్నారు అని సమాధానపడేది.
    తన స్థితి చూసి పార్వతమ్మ విచారించేది. "ఏమిటోనమ్మా, మీ అన్యోన్యం ఆ భగవంతుడు చూడలేకపోయాడు. ఎలా వుండేవారు ఎలా అయ్యారు. ఏమిటమ్మా యిద్దరికిద్దరూ యిలా పంతాలు పట్టుకుంటే ఎలా తల్లీ, ఆడదానివి నీవే దిగి రావాలమ్మా" అని మందలించేది.
    "నన్నేం చెయ్యమంటారు పిన్నిగారూ, నన్ను చూస్తేనే చీదరించుకుంటూంటే ఎలా దగ్గిరకి వెళ్ళమన్నారు. నేను పెడితే అన్నం కూడా సరిగా తినడంలేదు పోనీ శారద పెడితేనన్నా కడుపునిండా తింటున్నారు. నన్నేం చెయ్యమంటారు చెప్పండి..." ఆవేదనగా అంటూండగా ఆమెకళ్ళు చెమర్చాయి.
    "ఏమిటో, ఆ అబ్బాయి ఇలా వుంటే రేపింక నీవు ఆ బిడ్డని ఎలా పెంచుతావో నాకర్థంకాదు. మగాడికిష్టం లేని పనిచేసి వాళ్ళతో మనం చావలేం అమ్మా... అతనన్న మాటే కానీయాల్సింది, అనవసరంగా యింత గొడవ జరిగేది కాదు..." అందావిడ బాధగా.
    "మీకు తెలియదు పిన్నిగారూ. నేను నెల తప్పకముందూ ఆయన మామూలుగా లేరు. ఎటొచ్చి అప్పుడు కనీసం కాస్త మాట్లాడేవారు. ఇప్పుడదీ లేదు. కానీండి, ఎన్నాళ్ళు సాధిస్తారో సాధించనీయండి. ఆడదాన్ని ఏం చెయ్యలేనని గదూ ఆయన ధీమా. ఏంచేసినా సహించి పడుండాలని గదూ ఆయనిలా నన్ను హింసిస్తున్నారు... నా తప్పులేకపోయినా నన్ను దూరం చేశారు పిన్నిగారూ... నా మనసు విరిగిపోయింది యింక..." రుద్ధకంఠంతో అంది.
    "ఏమోనమ్మా, నాకు ఏదో భయంగా ఉంది... రేపు పురుడొచ్చాక... ఖర్మకాలి... ఆ బిడ్డ... తన పోలికలు లేక తన బిడ్డ కాదని తెల్సుకుంటే ఏం చేస్తాడో... అప్పుడింక అసలు..."
    "ఏం చేస్తారు? మహా అయితే యింట్లోంచి పొమ్మంటారు. కానీండి, ఏదో నా బతుకు నేను బతికే ఆధారం వుంది... ఎంతకని అనుక్షణం భయపడుతూ బతుకుతాను. నాకూ తెగింపు వచ్చింది. యిప్పుడయినా ఆయనిష్టం అయి వుండనిస్తున్నారా? లోకం కోసం, పెళ్ళాన్ని యింట్లోంచి తరిమారని దుయ్యబడతారని చూసి చూడనట్లూరుకున్నారు. మీరే చూశారుగా యింటికెవరన్నా వస్తే ఎంతలా నటిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారో... ఆయనకు నేను నా బాధ కాదు ముఖ్యం. ఆయన పరువు, ప్రతిష్ట ముఖ్యం" నిట్టూరుస్తూ అంది రాధ.
    "ఈడొచ్చిన పిల్ల... శారద అలా అస్తమానూ అతనివెంట తిరుగుతూంటే... ఏం బావుంటుంది? చూసేవాళ్ళు ఏం అనుకుంటారు? అదో పిచ్చిమొద్దు, చెప్పినా వినిపించుకోదు. బావగారు... బావగారు... అంటూ తిరుగుతూంది.
    "పిన్నిగారూ శారద నా చెల్లెలు లాంటిది. నేనింట్లో వుండగా ఎవరేం అంటారు. శారద కూడా లేకపోతే ఈ సమయంలో పిచ్చెత్తిపోయేదాన్ని... మూగిదాన్ని అయిపోయేదాన్ని... నిజంగా నా వంట్లో బాగులేనందుకు ఎంత సహాయం చేస్తూందో... నేను చూసుకుంటున్నాను శారదని. మీరేం భయపడకండి" అంది నిబ్బరంగా రాధ.


                        14


    రాధ తను చూసుకుంటానని నిబ్బరంగా చెప్పింది కాని తాను చూడకుండా తనకి తెలియకుండా చాలా జరుగుతూందని ఎన్నాళ్ళకోగాని గుర్తించలేకపోయింది.
    మాధవ్, శారదలు చాలా దూరం వెళ్ళినట్టు ఎన్నిరోజులకో గమనించింది. ఎన్నోసార్లు కాలేజీనుంచి ఒక్కోరోజు ఆలస్యంగా వచ్చేసరికి మాధవ్ అప్పటికే యింటికి వచ్చి వుండేవాడు. శారద కాఫీ కాస్తుంటే ఆమె వెనకాల వంటింట్లో ఏదో అంటూ నవ్వుతున్నాడు. మరోసారి ఇద్దరూ మంచంమీద కూర్చుని టిఫిను తింటున్నారు. మరోసారి బెడ్ రూములో కూర్చుని పేకాడుతున్నారు.
    ఇలా తను యింటికి వచ్చేసరికి శారద, మాధవ్ యింట్లో వున్నా రాధ ఎన్నడూ అనుమానించలేదు. రాధని చూస్తూనే నిష్కల్మషంగా "అక్కయ్యా వచ్చేశావూ... నీవు యింకా రాలేదని మేం కాఫీ తాగుతున్నాం..." "అక్కయ్యా నీవూ రా ఆడుకుందాం...", "అక్కయ్యా, బావగారికివాళ పకోడీలు తినాలని వుందంటే చేశాను. బలే వున్నాయంటున్నారు" అంటూ అమాయకంగా చెప్పే శారదలో మాలిన్యం వుంటుందని ఎన్నడూ అనుకోలేదు. అలా వాళ్ళిద్దరిని చూసిన ఒక్కక్షణం ఆమె మనసు అసూయతో జలించేది... నవ్వుతూ శారదతో మాట్లాడే మాధవ్ తను రాగానే మొహం ముడుచుకోవడం చూసి మనసు మూలిగేది గాని అనుమానపడేదికాదు. శారద పిచ్చిది. ఎప్పుడూ యింతే, మంచిచెడ్డా తెలీదు. అలాంటి పిల్లమీద అనుమానం ఏమిటి అనుకునేది.

 Previous Page Next Page