Previous Page Next Page 
యమదూత పేజి 25

 

    మహాజన్ వైశాలికి పర్సనల్ ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తానని ఒక మాట అనేశాడే గానీ డబ్బు మాత్రం ఇవ్వలేదు. అది చూశాక, ఆయనకు మాటల్లో ఉన్న ఔదార్యం చేతల్లో లేదేమో అనిపించింది వైశాలికి. ఆ మరుసటి వారం మహాజన్ వైశాలి అకౌంట్ వున్న బ్యాంకు వైపు వెళ్ళడం తటస్థించింది.
    
    బ్యాంకు కనబడగానే కారు ఆపమని చెప్పాడు మహాజన్.
    
    మహాజన్ అంతటి ప్రముఖుడు స్వయంగా తన చిన్న బ్రాంచిలోకి రావడం చూసి సంభ్రమంగా ఎదురొచ్చాడు బ్రాంచి మేనేజర్. ఆయన్ని సగౌరవంగా తన కేబిన్ లోకి తీసుకెళ్ళి, కూల్ డ్రింక్సు తెప్పించి మర్యాదలు చేశాడు.
    
    ఆ తర్వాత వినయంగా అడిగాడు మేనేజర్.    

 

    "ఈజ్ దేర్ ఎనీ థింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ సర్?"    

 

    "యస్! యస్! చిన్న పని వైశాలి అనే ఓ అమ్మాయి ఇక్కడ అకౌంట్ మెయిన్ టెయిన్ చేస్తోంది. బహుశా సేవింగ్స్ అకౌంట్ అయి వుండవచ్చు అది. నెంబరు తెలియదు నాకు. అందులో ఒక లక్ష డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నాను. నెంబర్ వెతికించడం కష్టమా?" అన్నాడు మహాజన్.
    
    "నాటెటాల్ సర్! నాటెటాల్!" అన్నాడు బ్రాంచి మేనేజర్ సంతోషంగా. డిపాజిట్లు వస్తున్నాయంటే ఏ బ్యాంకు ఆఫీసరుకయినా ఆనందమే!
    
    "ఇన్ ఫాక్టు, ఆమె లెడ్జరు ఇంకా నా టేబుల్ మీదే వుంది!" అన్నాడు మేనేజరు మళ్ళీ.
    
    చిన్నగా నవ్వుకున్నాడు మేనేజర్? ఇవాళ కొద్దిగా డబ్బు విత్ డ్రా చేసి వుండవచ్చు వైశాలి. ఆమె అకౌంటులో ఉన్న రెండు వేలల్లోంచి రెండొందలో, మూడొందలో! చిన్న చిన్న అమౌంట్లు!
    
    "విత్ డ్రావలా?" అన్నాడు మహాజన్.
    
    "కాదు సర్! డిపాజిట్"
    
    "ఎంత?" అన్నాడు అప్రయత్నంగా.
    
    సందిగ్ధంగా చూశాడు మేనేజర్.
    
    అతని మౌనం, మహాజన్ కి కొద్దిగా అసహనంతో కూడిన కుతూహలాన్ని కలిగించింది. మేనేజర్ సంకోచం కూడా ఏమిటో అతనికి అర్ధం అయింది.
    
    అందుకని తెలివిగా మాట మార్చేస్తూ, "వైశాలి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లోనే పనిచేస్తోంది. ఇంకో రెండు లక్షలు ఆమె అకౌంట్ లో డిపాజిట్ చెయ్యమని మా వాళ్ళకి నేనే చెప్పాను నిన్న. వాళ్ళు ఇవాళ చేశారేమో!" అన్నాడు తేలిగ్గా.
    
    మహాజన్ స్మూత్ టాక్ లో ట్రాప్ అయిపోయాడు మేనేజర్. ఆయన్ని అనుమానించ వలసినంత అవసరం ఉంటుందని అతనికి తోచలేదు.
    
    బ్యాంకు రూల్సు ప్రకారం, ఖాతాదారుల వివరాలూ, వాళ్ళ లావాదేవీలూ బయటివాళ్ళకి చెప్పడం నిషిద్దం.
    
    "రెండు లక్షలు కాదు సర్! ఒక పది నిమిషాల క్రితమే ఒకరు వచ్చి మూడు లక్షలు జమచేసి వెళ్లారు ఆమె ఖాతాలో" అన్నాడు.
    
    అసలే చిన్నవయిన మహాజన్ కళ్ళు చింతాకుల్లా మరీ చిన్నవిగా అయిపోయాయి ఆ మాట వినగానే.
    
    "మూడు లక్షలా?" అన్నాడు నెమ్మదిగా.
    
    "అవును సర్!" అన్నాడు మేనేజర్.
    
    "ఎవరు డిపాజిట్ చేశారు? నిరంజనా?" అన్నాడు తన దగ్గర పని చేస్తున్న ఒక ఉద్యోగి పేరు చెబుతూ.
    
    "కాదు సర్!" అని ఒక పేరు చెప్పాడు మేనేజర్.
    
    ఆ పేరు అర్ధమయింది మహాజన్ కి. ఆ మూడు లక్షల రూపాయలు వైశాలి అకౌంట్ లో వేసింది మెకానిక్ అని!
    
    మెకానిక్!
    
    అంత పెద్ద అమౌంట్ ని వైశాలి అకౌంట్ లో వెయ్యవలసిన అవసరం మెకానిక్ కి ఎందుకొచ్చింది? న్యాయంగా చూస్తే మెకానిక్ కి వైశాలి అంటే కోపం ఉండాలి, అతను ఆమె చేతిలో పరాభవం పొందిన తర్వాత!
    
    కానీ డబ్బు  - అంతా ఇంతా కాదు - మూడు లక్షలు ఆమె అకౌంటులో వెయ్యవలసిన అగత్యం మెకానిక్ కి ఏముంది?
    
    ఏమిటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న లావాదేవీ?
    
    తన మనసులో మెదులుతున్న భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ గంభీరంగా అన్నాడు మహాజన్.
    
    "ఐసీ! నాలుగు రోజుల ముందు కూడా నేను కొంత డబ్బు డిపాజిట్ చెయ్యమని చెప్పాను మా వాళ్ళతో! అది అకౌంట్ ఫర్ అయిందా? అన్నాడు ఇంకా ఇన్ ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తూ.
    
    "అయింది సర్! నిన్న గోవర్ధనదాస్ ఆమె పేరుతో ఒక లక్ష డిపాజిట్ చేశారు"
    
    గోవర్ధనదాస్ పేరు వినగానే చురుక్కుమన్నది మహాజన్ మనసు.
    
    గోవర్ధనదాస్!
    
    తను వద్దు వద్దంటున్నా కూడా, కంపెనీకి అది చాలా లాభమని నచ్చజెప్పి, తమ కంపెనీ గోవర్ధనదాస్ కి ఇప్పించింది వైశాలి.
    
    కంపెనీ వ్యవహారాల్లో ఆమె చాకచక్యం ఏమిటో నిరూపించుకోవడానికి ఒక ఛాన్సు ఇద్దామన్న భావంతో తను ఒప్పుకున్నాడు.
    
    ఆమె అంచనా ప్రకారమే నలుగు రోజుల్లో నలుగు లక్షలు లాభం వచ్చింది కంపెనీకి!
    
    కానీ వచ్చిన లాభాల్లో ఒక లక్ష తను మిగుల్చుకుందా వైశాలి? లేకపోతే తమ కంపెనీ ఏజెన్సీ ఇప్పించినందుకు ప్రతిఫలంగా గోవర్ధనదాస్ ఒక లక్ష ముడుపు చెల్లించుకున్నాడు వైశాలికి?
    
    ఏది ఏమైనా కూడా వైశాలి చేసింది మాత్రం నమ్మక ద్రోహమే! నిప్పు రాజుకుంటున్నట్లు మెల్లిమెల్లిగా వేడెక్కడం మొదలెట్టింది మహాజన్ మనసు.
    
    "అంతేనా?" అన్నాడు నెమ్మదిగా మేనేజర్ తో.
    
    తను చెప్పకూడని విషయాలు చెప్పకూడని వాళ్ళకి చెప్పేస్తున్నానని గ్రహించని ఆ మేనేజర్ మిగతా డిపాజిట్ల వివరాలు కూడా చెప్పడం మొదలెట్టాడు.
    
    ఈ వారం రోజుల్లో ఆరు మంది వైశాలి పేరుతో మొత్తం పది లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు.
    
    వాళ్ళందరూ కూడా ఏదో విధంగా మహాజన్ కంపెనీతో వ్యాపార సంబంధాలు వున్నవాళ్ళే!
    
    తల పంకించి, "స్మార్ట్! వెరీ స్మార్ట్!" అనుకున్నాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్.
    
    వైశాలికి అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆమెని తన ఆర్గనైజేషన్ లో మంచి పొజిషన్ లో చేర్చుకున్నాడు.
    
    అయితే ఆ తెలివితేటలు తనమీదే ప్రయోగించి డబ్బు చేసుకోవడం మొదలెట్టిందన్నమాట - ఈ పిల్ల - దిస్ చీట్ ఆఫ్ ఎ గర్ల్ - వారం తిరక్కుండానే!
    
    ఈ వైశాలి తనతో కలిసిపోయి మెకానిక్, బదరీ నారాయణ్ లాంటి వాళ్ళతో నాటకాలాడిందేమో అనుకున్నాడు.
    
    కానీ ఇప్పుడనిపిస్తోంది!
    
    వాళ్ళతోనే కలిసిపోయి తనతో నాటకమాడుతోందా వైశాలి అని!
    
    మహాజన్ అలా ఆలోచిస్తుంటే...
    
    బ్యాంక్ మేనేజర్ బెల్లుకొట్టి ఒకతన్ని పిలిచి, డిపాజిట్ ఫారమ్ ఒకటి తీసుకురమ్మని చెప్పాడు.
    
    అది గమనించి అన్నాడు మహాజన్.
    
    "ఇప్పుడు అవసరం లేదు! మధ్యాహ్నం మా ఎంప్లాయి ఎవరన్నా వచ్చి వన్ లాక్ డిపాజిట్ చేస్తారు" అన్నాడు అంటూనే లేచినిలబడ్డాడు.
    
    ఈ పది లక్షల డిపాజిట్లూ వైశాలి అకౌంట్లో ఎలా వచ్చి చేరాయో తేల్చుకునే వరకూ తను యింకో లక్ష రూపాయలు డిపాజిట్ చెయ్యడం అనవసరం!
    
    కొద్దిగా ఆశ్చర్యం కనబడింది బ్రాంచి మేనేజర్ మొహంలో. మహాజన్ తో కరస్పర్స చేసి మర్యాదగా సాగనంపాడు అతను.
    
    నేరుగా తన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు మహాజన్. అతని ఛాంబర్స్ కి దగ్గరలోనే వుంది వైశాలి కేబిన్.
    
    ఛాంబర్స్ లోకి వెళుతూ ఒకసారి కాజువల్ గా లోపలికి తొంగిచూశాడు.
    
    తన టేబుల్ మీద గుట్టలు గుట్టలుగా పడివున్న ఫైళ్ళనీ, లెడ్జర్ బుక్స్ నీ ఒక్కొక్కదాన్నీ ఒక్క గ్లాన్స్ తో చూసి త్వరత్వరగా పక్కన పడేస్తోంది వైశాలి.
    
    అంటే -
    
    కంపెనీ అభివృద్ధికోసం ఆమె కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోందా?

 Previous Page Next Page