Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 25

"పదండి వెళదాం. " అన్నాడు శ్రీహర్ష. అతని వెనకే స్నేహ కదిలింది.
వెనకనుంచి స్నేహాని చూసిన సుధ, "అబ్బ! ఎంత అందమైన నడకే! భలే గ్రేస్ ఫుల్ గా ఉంది కదూ! ఆ జడ హిప్ప్ మీద ఊగుతుంటే నాట్యంలాగా ఉంది." అంది అప్రయత్నంగా.
స్టేషన్ బయటకొచ్చారు. లావణ్య కారువైపు కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు రాజు. చిన్నతనం వల్ల అతనికి తామెంత కష్ట స్థితిలో ఉంది పూర్తిగా అర్ధమయినట్లు లేదు.
స్నేహ మొహమాటానికి చిరునవ్వు పెదాలకంటించుకుందే గానీ, ఆ నవ్వులో జీవం లేదు. ఆ పెద్ద పెద్ద కళ్ళలోంచి బోలెడంత విషాదం తొంగి చూస్తోంది.
సామాన్లు వెనక డిక్కీలో పెట్టి అందరూ కారేక్కారు. లావణ్య డ్రైవ్ చేస్తోంది. పక్కన శ్రీహర్ష, వెనక సీటులో రాజు, స్నేహ సుధా కూర్చున్నారు.
రాజు ఆసక్తిగా బజార్లన్నీ చూస్తున్నాడు. స్నేహ చూపులు దేనిమీద నిలపకుండా శూన్యంలోకి చూస్తోంది. లావణ్య పెదాలు బిగపెట్టి డ్రయివింగు మీద దృష్టి కేంద్రికరించింది.
ఇది ఉహించలేదు తను. పిల్లలంటే తొమ్మిది పదేళ్ళ వయసు వాళ్ళనుకుంది. ఇంత ఎదిగిపోయిన అమ్మాయి తమతో వుంటే ఏం బావుంటుంది! శ్రీహర్ష చెల్లెలితో పాటు ఈ అమ్మాయి పెళ్ళి కూడా చేసేస్తే పోతుందేమో.
"ఏమి చదువుతున్నావ్?" అంది సుధ పలకరిపుగా, స్నేహతో.
చెవులు రిక్కించి వింది లావణ్య.
"బి.యే. ఫస్టియర్" అంది స్నేహ.
సన్నటి నాజుకైనా గొంతు. పాట వచ్చి ఉండాలనిపిస్తుంది గొంతు వింటే.
"ఏ సబ్జెక్టు"
చెప్పింది స్నేహ.
"లావణ్యతో కలిసి ఒకసారి మా ఇంటికి రా."
"అలాగే," అన్నట్లు తల ఉపింది స్నేహ.
రియర్ వ్యూ మిర్రర్ లోకి చూసింది లావణ్య. స్నేహ నుదురు , లేడి కన్ను లాంటి పెద్ద కన్నూ కనబడుతున్నాయి. ఆ కళ్ళలో ఏదో తెలియని భయం కనబడుతున్నాయి. 'భీత హరిణేక్షణ' అన్న ఉపమానం గుర్తొచ్చింది లావణ్యకు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి మీద జాలేసింది. ఏం ప్రపంచం! ఎన్ని కస్టాలు! దేవుడి దయవల్ల తనకి కష్టాలంటే ఏమిటో తెలియదు. ఆకుల మధ్య చిగురుటాకులాగా సౌఖ్యంగా, భద్రంగా పెరిగింది తను. తల్లి లేకపోవడం, తండ్రి పట్టించుకొకపోవడం, డబ్బు లేకపోవడం...అమ్మో! తలచుకుంటేనే భయం వేస్తుంది. పాపం! ఈ అమ్మాయి!
శ్రీహర్ష ఇల్లు సమీపించింది. అశోక్ నగర్ పెద్ద పెద్ద ఇళ్ళ మధ్య నాలుగు గదుల చిన్న ఇల్లు. అందంగానే ఉంది.
హరన్ మోగగానే బయటికి వచ్చారు జానకమ్మ, రేవతీ.
లావణ్య కూడా శ్రీహర్ష ఇంటికి రావటం అదే మొదలు. కారు తాళాలు చేతిలో పట్టుకుని కారు దగ్గరే ఆగిపోయింది.
కొత్తవాళ్ళంటే బేరుకు, మనసులో దిగులూ- ఇవన్నీ మోహంలో కనబడుతుండగా వినయంగా నమస్కారం చేసింది స్నేహ.
ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసింది జానకమ్మా. ఆ కాస్త అభిమానానికే స్నేహ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"అమ్మా! లావణ్యా!" అన్నాడు శ్రీహర్ష అర్ధంతరంగా లావణ్యను చూపిస్తూ.
"ఓహొ! నువ్వేనా లావణ్యా?" అంటూ చిరునవ్వు నవ్వింది జానకమ్మా. నవ్వుతూనే లావణ్యని ఆపాదమస్తకం పరికించేసింది. అవును తనకి కాబోయే కోడలు మరి! అభిమానంగా లావణ్య భుజం మీద చెయ్యేసి , లావణ్యనీ, స్నేహాని ఇంట్లోకి నడిపించుకు పోయింది.
"వదినా?" అంది శ్రీహర్ష చెల్లెలు రేవతి, తటపటాయిస్తూ.
లావణ్య నవ్వింది. :నువ్వు రేవతి కదూ?"
"అవును రేవతినే."
ఆ అమ్మాయి అప్పుడే వరస కలిపి తనని 'వదినా' అని పిలవడం కొత్తగా వున్నా, మధురంగా వినబడింది లావణ్యకు.
రేవతి స్నేహ భుజం మీద చెయ్యి వేసి, "బాబోయ్! భుజం మీద చేయ్యేద్దామనుకుంటే అందట్లేదు ఈ అమ్మాయి. మనిద్దరికీ ఫ్రెండ్ షిప్ కష్టమే! మీద చెయ్యి వెయ్యకపోతే నాకు నోటంబడి మాటరాదు."
"మీకోసం నేను పొట్టి అయిపోతాను" అంటూ కాస్త వంగింది స్నేహ.
"చూశారా? అందుకే ఈ అమ్మాయికి స్నేహమయి అని పేరు పెట్టారు. స్నేహం కోసం ఏమన్నా చేస్తుంది. చివరికి పొట్టిగా అవమంటే అవుతుంది కూడా" అంది రేవతి.
"స్నానాలు చేసి వచ్చేయండి. ఎప్పుడూ భోజనాలు చేశారో? ఆకలేస్తూ ఉండి ఉంటుంది" అంది జానకమ్మగారు.
"నేనొక రిసెప్షన్ కి వెళ్ళాలి. భోజనం చేసే టైముండదు."
"మరేం ఫరవాలేదు. పది నిముషాలు" అంది జానకమ్మ.
"బట్టలు నలిగిపోతాయి."
"రేవతి చీరె కట్టుకుని భోంచెయ్యి."
"రేపెప్పుడన్నా వస్తాను."
"లావణ్యా! ప్లీజ్!" అన్నాడు శ్రీహర్ష.
ఇంక కాదనలేకపోయింది లావణ్య. ఇబ్బందిగా సుధ వైపు చూసింది. లావణ్య ఇబ్బంది సుదకి అర్ధమయింది. విస్తళ్ళలో అన్నం పెట్టుకుని, పీటల మీద కూర్చుని భోం చెయ్యడం లావణ్యకి అలవాటు లేదు. కంచాలు చాలవని జానకమ్మ అప్పుడే విస్తళ్ళు పరిచేసింది.

 Previous Page Next Page