Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 25


    
    శ్రీరాం వాళ్ళ ఇంటికి ప్రతిమ వచ్చేసి నాలుగు రోజులవుతోంది. జరిగినదంతా కల కాదనీ, నిజమేననీ నమ్మాలంటే కష్టమనిపిస్తోంది. తనకి ఇరవై నాలుగేళ్లపాటు సాదాగా, సీదాగా సాగిపోయింది తన జీవితం. ఎలాంటి వేళలో శ్రీరాం తనని పెళ్ళి చేసుకుంటానని ప్రపోజు చేశాడో గానీ, అప్పటినుంచీ నమ్మశక్యంగాని సంఘటనలన్నీ జరుగుతున్నాయి. తను బతికి ఉండగానే అంత్యక్రియలు జరిపించేశాడా తండ్రి! ఎందుకంత పగ తనంటే? తను అంత కానిపని ఏం చేసింది?
    
    తను ఇల్లు వదిలి వచ్చేసిందా?
    
    తను! ప్రతిమ! చీకటిపడితే సందు చివరిదాకా వెళ్ళడానికి జంకే ప్రతిమ, ఎవ్వరితో ఒక్క మాటయినా చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేసిందా? పెళ్ళి కాకుండానే, కాబోయే భర్త ఇంట్లో ఉంటోందా తను? 'అత్తగార్లు అంటే రాక్షసి మూకలు' అని చిన్నప్పట్నుంచీ అమ్మ నూరిపోసిన మాటల్ని పటాపంచలు చేస్తూ, దేవతలాంటి అత్తగారి పంచన చేరిందా తను?
    ఆమె తనమీద చూపిస్తున్నంత అభిమానం అమ్మ కూడా ఎప్పుడూ చూపించలేదు.
    
    వంటిల్లూ, కాలేజీ, హాస్పిటలూ తప్ప వేరే ప్రపంచం తెలియకుండా పెరిగిన తను - ముంగి అని కజిన్స్ వెక్కిరించే తను ఏదో సినిమా హీరోయిన్ లా ప్రేమలో పడిపోయి, ప్రేమించిన వాడి కోసం ప్రపంచాన్ని ఎదిరించి వచ్చేసిందా?
    
    ఇదంతా నిజంగానే జరుగుతోందా అసలు?
    
    మళ్ళీ ఇంతలోకే ఇంకో భావన. ఇదంతా ప్రేమకోసం చేస్తోందా తను? శ్రీరాంని అంతగా ప్రేమిస్తోందా?
    
    చాలాసార్లు ఈ ప్రశ్న తనని తాను వేసుకుని తరచి చూసుకుంది ప్రతిమ.
    
    ఉహు! ఇది ప్రేమ కాదు!
    
    అతనిపట్ల తనకు ప్రత్యేకమైన 'ప్రేమ'  లేదు కానీ, వైముఖ్యం కూడా లేదు -నిశ్చయంగా.    

    ఒకవేళ తను నిజంగానే ప్రేమలోపడి ఉంటే ఇలానే ఉంటుందా తన మానసిక స్థితి! ఉహు! కాదు. తను శతకోటి పుస్తకాలలో చదివింది. ప్రేమ అంటే ఏదో మధురమైన ఎగ్జయిటింగ్ ఎక్ స్ పీరియెన్స్ అని రాస్తారు.
    
    అంత ఎక్సయిట్ మెంట్ ఏమీ ఫీలవటం లేదు తను.
    
    పుస్తకాలలో రాసినదాని ప్రకారమైతే తను అతన్ని తలుచుకోగానే, చూడగానే ఉద్వేగం పొందాలి. అతన్ని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోవాలి. అతన్ని చూడాలనీ, అతన్ని తాకుతూ దగ్గరగా నిలబడి మాట్లాడాలనీ తహతహలాడిపోవాలి.
    
    అలాగేం అనిపించడం లేదు తనకి!
    
    ఒకవేళ నిజంగానే తను ఉద్వేగం పొందుతూ ఉంటే అతన్ని గురించి ఇంత క్లినికల్ గా, లేబరేటరీలో ప్రాక్టికల్సు చేస్తున్నంత మామూలుగా ఆలోచించడం సాధ్యం కాదు. అతన్ని తలుచుకోగానే తన చేతిమీద ఉన్న ఈ సన్నటి రోమాలు నిలుచోవాలి. గగుర్పాటు కలగాలి.
    
    అదీ ప్రేమ కలిగించే ఎగ్జయిట్ మెంట్ అంటే!
    
    సర్టెన్లీ తనకా అనుభూతి కలగటం లేదు. కానీ, అదే సమయంలో అతనంటే తనకు నెగెటివ్ ఫీలింగ్సేమీ లేవు. అతన్ని వెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరాలు లేవు.    
    
    ష్యూర్!
    
    పైగా, అతను తనకోసం చాలా అవమానాలు సహించాడన్న అభిమానం ఉన్నది తనకి. తనవల్ల అతనికి తలవంపులు కలిగిందే అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. తనని ఆ పిచ్చాసుపత్రిలాంటి ఇంట్లోనుంచీ విడుదల చేశాడన్న కృతజ్ఞత కూడా ఉంది.
    
    "పొద్దస్తమానం అలా కలలు కంటూ కూచోకే! మహా అయితే ఇంకో ఇరవై రోజులు! ఆ తర్వాత థియరీ ముగిసి, ఎంచక్కా ప్రాక్టికల్సు మొదలవుతాయి. అండ్ యాజు యూజువల్ యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్! కాస్త వోపిక పట్టూ!" అంది శృతి లోపలికి వస్తూ.
    
    "నాకేం తొందరలేదు! నేనే ప్రాక్టికల్సు గురించి తహతహలాడి పోవడంలేదు. అండ్ యూ బెటర్ హోల్డ్ యువర్ టంగ్! వూరికే వాగకు!" అంది ప్రతిమ కోపంగా.
    
    నవ్వి, సరస్వతి దగ్గరికి వెళ్ళిపోయింది శృతి.
    
    శ్రీరాం వాళ్ళ ఇంటి కొచ్చేసినప్పటినుంచీ హాస్పిటల్ కి వెళ్ళలేదు ప్రతిమ. పెళ్ళి రిజిస్టర్ అయ్యేదాకా హాస్పిటల్ కి పంపనని చెప్పేసింది సరస్వతి.
    
    ఇదివరకయితే హాస్పిటల్ నుంచి తిరిగిరాగానే తను ఏదన్నా చదువుకుంటూ కూర్చోవాలని అనుకోవడమూ, అంతలోనే అమ్మ ఏదన్నా పని అప్పగించేసి తరమడమూ జరిగేది.
    
    ఈ ఇంట్లో అలా కాదు.
    
    ఇక్కడికి వచ్చిన రెండో రోజున తను డ్రాయింగ్ రూంలో షెల్ఫులో అందంగా పేర్చి ఉన్న పుస్తకాలు తీసింది. 'జాస్', 'కోమా' రెండూ ఒకదాని తర్వాత ఒకటి చదివేసరికి సాయంత్రం ఆరయింది.
    
    ఉలిక్కిపడి లేచింది ప్రతిమ. తను ఇక్కడ వంట చెయ్యనక్కర్లేదా?
    
    పక్కనే ఖాళీ కాఫీ కప్పు కనబడింది.
    
    తను కాఫీ కూడా తాగిందా! ఎప్పుడు?
    
    తన పరధ్యానానికి తనమీద తనకే కోపం వచ్చింది ప్రతిమకి. ఇంక తన అలవాట్లు మార్చుకోవాలి. లేకపోతే బావుండదు.
    
    నేరం చేసినట్లు ఫీలవుతూ లివింగ్ రూంలోకి వెళ్ళింది. సరస్వతి కూర్చుని వక్కపొడిలోకి సుగంధ ద్రవ్యాలేవో నూరుతోంది.    

 

    "ఏమ్మా! అయిందా చదువు? దా!" అంది నవ్వుతూ.
    
    ఇబ్బంది పడిపోతూ "నేను వంట చెయ్యగలను - మొదలెట్టమంటారా?" అంది ప్రతిమ.
    
    "ఎందుకూ? సుబ్రమణి ఉన్నాడుగా! నువ్వేం హైరానా పడిపోనక్కర్లేదు. ఇంకో కప్పు కాఫీ ఇచ్చేదా? లేకపోతే పెందరాళే భోజనం చేసేస్తావా?"
    
    "సారీ! మీరేనా ఇందాక కాఫీ ఇచ్చింది! నేను గమనించను కూడా లేదు. చదువుతున్నప్పుడు నన్ను నేనే మర్చిపోతుంటాను." అంది ప్రతిమ, క్షమాపణ చెబుతూ.
        
    "చదువు మీద ధ్యాస ఉండడం మంచిదే!" అని నవ్వి, "సుబ్రమణీ! అమ్మాయికి కాఫీ ఇవ్వు. అలాగే నాకూ ఓ కప్పు ఇవ్వు!" అంది సరస్వతి వంట మనిషితో.
    
                                                              * * * * *
    
    "త్వరగా బయలుదేరండి. శాస్త్రిగారు చెప్పిన ముహూర్తం దాటిపోతుంది!" అని హడావిడి చేస్తున్నాడు శ్రీరాం.
    
    ఆ రోజే రిజిస్ట్రార్ ఆఫీసుకెళ్ళి సంతకాలు పెట్టాలి.
    
    "వస్తున్నా ఉండరా! మరీ హడావిడి పెట్టెయ్యకూ!" అంది సరస్వతి. ఆవిడ హైరాన పడిపోతోంది. ఆవిడతోబాటు సతమతమైపోతోంది శృతి.
    
    శ్రీరాం కొనితెచ్చిన చీర కట్టుకుంది ప్రతిమ. ఆ ఇంటికి వచ్చిన మర్నాడే - సరస్వతి రెండు చీరలు కొనుక్కురమ్మని చెప్పింది శ్రీరాం. అతను తనే సెలక్టు చేసి తీసుకొచ్చాడు.

 Previous Page Next Page