ఆ తర్వాత యింకేం చెయ్యాలో అతనికి తోచలేదు. "రాంపండేడీ?" అడిగాడు అన్నివైపులా చూస్తూ.
రాంపండు కనబడలేదు. వీరభద్రం మొహంలో నల్లటి వెలుగు వెలిగింది.
రాంపండు లేడు! రాంపండులేడు!
కాబట్టి ఇవాళ తను సితారతో అసలు విషయం మాట్లాడేయొచ్చు-
"ఈ పీడాకారి వెధవ ఇంట్లో లేకపోవడం యిదే మొదటిసారనుకుంటా" అన్నాడు వీరభద్రం గొరిల్లాలా నవ్వుతూ.
వెంటనే "నేనిక్కడే వున్నా" అన్నాడు రాంపండు.
అతను కరెక్టుగా వీరభద్రం వెనకే నిలబడి వున్నాడు. అందుకే వీరభద్రం అటూ ఇటూ చూసినా అతను కనబడలేదు.
లటిక్కిన తిరిగి చూశాడు వీరభద్రం.
రాంపండు మోహంలో కనబడుతున్న అవ్యక్తమైన భావం ఏదో వీరభద్రానికి కాస్త బెదురు కలిగించింది. అతను చాలామంది నేరస్తులని ఎరుగుదును. కానీ వాళ్ళందరిలోలేని స్పెషల్ క్రైం టాలెంటు ఏదో రాంపండులో వుందనీ, అది ఎప్పటికైనా ఆటంబాంబు పేలినట్లు బయటపడక తప్పదనీ అతనికి దృఢంగా అనిపిస్తోంది.
"నాతో నీకేం పని?" అన్నాడు రాంపండు.
"ఏమీలేదు. తీరికున్నప్పుడు అటుకేసిరా! నిన్ను జైల్లోపెడతా" అన్నాడు వీరభద్రం జోకుతో అతనికి వచ్చిన జోకు అదొక్కటే. ఎవరుకనబడ్డా, ఎన్నిసార్లు కనబడ్డా కూడా అతను అదే జోకు పేలుస్తూ వుంటాడు. ఆ జోకువిని డోక్కోకుండా మొహమాటం కొద్దీ నవ్వేస్తుంటారు అతని వాతపడ్డ వాళ్ళు.
అది గ్రహించలేని వీరభద్రం అదో ఎవర్ గ్రీన్ జోకన్న దురభిప్రాయంతో రోజుకి వందసార్లు ఎడాపెడా ప్రయోగిస్తుంటాడు.
అట్లా జోకిన తర్వాత ఇంక లేచి నిలబడ్డాడు వీరభద్రం.
"వస్తా! అర్జెంటు పని వుంది" అన్నాడు.
"అడవిదున్న ఏదైనా ఆగం చేస్తోందా? అరెస్టు చెయ్యాలా?" అన్నాడు రాంపండు గడుసుగా.
"కాదు! ఓల్డుసిటీలో మతకలహాలు, మారణ హోమం! వెళ్ళి అదుపు చెయ్యాలి" అని సర్వీసు రివాల్వర్ ఓసారి తడుముకుని వెళ్ళిపోయాడు వీరభద్రం.
సైలెంటుగా నవ్వుకున్నాడు రాంపండు. తన జేబులోవున్న బుల్లెట్స్ ని తడుముకుంటూ.
తర్వాత అతను ఆ బుల్లెట్స్ ని తన ట్రంకుపెట్టెలో పక్కింటి తాతగారి కట్టుడుపళ్ళ పక్కన పెట్టాడు.
ఆ తర్వాత అతను మరో అడ్వెంచర్ ని వెదుక్కుంటూ క్రీనీడల్లో కలిసి వెళ్ళిపోయాడు.
అప్పుడింక గబగబ పని ముగించుకుని జెయ్ చంద్ర ఇంటికి వెళ్ళిపోయింది సితార.
వెళ్ళిపోయిందా అంటే జెయ్ చంద్రవాళ్ళ గుమ్మం దాకానే వెళ్ళగలిగింది.
అంతే....
అక్కడింక ఠక్కున ఆగిపోయాయి ఆమెకాళ్ళు. ఇంకొక్క అడుగుకూడా ముందుకెయ్యమని మొరాయించాయి.
"ఇప్పటిదాకా బాగానే వున్నారుగా! మీకేంరోగం!" అని కాళ్ళని కసిరింది సితార.
"అమ్మో! నాకు సిగ్గు" అంది సితార కుడికాలు.
"అమ్మమ్మో నాకు ఎంతో భయం" అంది ఎడం కాలు. ఆ కాలు అప్పటికే సన్నగా వణకటం మొదలెట్టింది.
"శేషుగాడికోసం లక్షాతొంభైసార్లు ఈ ఇంటికొచ్చి వుంటాను. అప్పుడంతా లేని వెధవ్వేషాలు ఇప్పుడెందుకూ?" అంది సితార కోపంగా.
"శేషుగాడువేరూ, జెయ్ చంద్రగాడువేరూనూ! ఇప్పుడు నువ్వు జెయ్ చంద్రగాడి కోసం వెళ్తున్నావ్. అంచేతే నాకు భయం" అంది ఎడంకాలు.
"నా జెయ్ చంద్రని గాడూ, గీడూ అన్నావంటేనా....." అంది సితార కోపంగా.
"నువిదివరకంతా వాడిని వాడూ, వీడూ అన్లేదా ఏంటి మహా!"
"అది వేరు! ఇది వేరు! ముందు ముందుకి నడవండి."
"ఏవంటావ్?" అంది కుడికాలు రహస్యంగా ఎడమకాలుని సంప్రదిస్తూ.
"పోన్లే! ఈ సారికి పద పాపం" అంది ఎడం కాలు ముందడుగువేస్తూ.
దాంతో ఇంట్లోకెళ్ళిపోయింది సితార.
ముందడుగు వేసింది ఎడం కాలు కావడం వల్ల కాబోలు పని జరగలేదు.
అక్కడ అతడు లేడు.
లేడే? ఏడీ? ఏమైపోయివుంటాడు? అనుకుంది సితార.
ఆమెకి గుండె వుండాల్సినచోట్లో పెద్ద గుంట ఏర్పడిపోయినట్లయ్యింది.
ఏడి అతడు?
వెళ్లి దేవదాసుల్లో చేరిపోయాడా? ఏం?
అబ్బే! దేవదాసుల్లో చేరిపోవడం ఏమిటి?
అదేదో సన్యాసుల్లో చేరిపోయినట్లు?
ఎక్కడైనా దేవదాసులని ఒక సంఘం వుంటుందా ఏం?
తనకి యివాళ బుర్ర బొత్తిగా పనిచెయ్యడంలేదు.
అద్సరే! ఇంతకీ ఈ జెయ్ చంద్ర ఏమైపోయాడు?
తను రావడం ఒక్క క్షణం ఆలశ్యమైపోయిందా?
ఈ లోపలే అతనేమన్నా అఘాయిత్యం తలపెట్టేశాడా?
తీరా తను రావడం ఒక జీవితకాలం లేటయిపోయిందా?
అని ఆమె పరిపరివిధాల ఆలోచిస్తున్న టైంలో "లాభంలేదు! ఇవాళ అటో ఇటో తేలిపోవాలి" అనుకున్నాడు. అప్పటికే సితార ఇంటి వెనక్కి వచ్చేసి, పైపులని పట్టుకుని పైకి పాకుతున్న అతడు. "విజయమో, వీరస్వర్గమో!" అని కూడా అనుకున్నాడు అతను.
"ధైర్యేసాహసే లక్ష్మీ!" అని కూడా కొసరుగా ఇంకో ముక్క అనుకుని, లాఘవంగా పిట్టగోడని లంఘించి, ఎగిరి డాబామీద పడ్డాడు. తర్వాత సితార గదిలోకి వెళ్ళిపోయాడు.
కానీ అక్కడ సితార లేదు.
ఆ అమ్మాయి సరిగ్గా అదే క్షణంలో తనకోసం తపించిపోతూ ఇంటికే వెళ్ళితన కోసమే వెదుకుతోందని అతనికి పటాలున తట్టలేదు.
అక్కడ అతనికి సితార కనబడలేదుగానీ సితారని కన్నతండ్రి కనబడ్డాడు.
కానీ ఆయనకి జెయ్ కనబడలేదు. కేవలం వినబడ్డాడు.
"ఎవరది రాంపండూ?" అన్నాడు ఆయన.
మారుమాట్లాడకుండా డాబామీదికొచ్చేసి, పైపు పట్టుకొని జర్రున కిందికి జారిపోయి తనయింట్లోకి వచ్చిపడ్డాడు అతను.