Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 26

    రూప స్నేహితులకి కాలేజి అమ్మాయిలకి ఈ వార్త చాలా ఉత్తేజాన్నిచింది. "హుర్రే.....రూపా....బ్రేవ్....సురేష్ డౌన్....వుయ్ వాంట్ జస్టిస్.....వుయ్ వాంట్ ఈకాలిటి విత్ మెన్ రూపా వాంట్ జస్టిస్ వుయ్ ఆర్ అల్ విత్ యూ రూపా...." అంటూ కోర్టు ఆవరణలో గుంపులు గుంపులుగా వచ్చి కేకలు పెట్టారు.
    రూపని అందరూ స్వయంగా అభినందించారు. ఆమె ధైర్యసాహసాలని మెచ్చుకున్నారు. ప్రోత్సహించారు. జడ్జి గారిని అయన ఛాంబరులో కల్సుకుని ఈ కేసు రూపదే కాదు తమ ఆడపిల్లలందరికి చెందినదని, కేసు న్యాయం చేకూర్చాలని రాసిన మెమోరాండం అందించారు. ప్రతీకా విలేఖరులు రూపని రకరకాల ప్రశ్నలడిగి ఇంటర్యు చేశారు.
    మొత్తానికి ఆ కేసు నగరంలో సంచలనమే తెచ్చింది. మొదట్లో అయ్యయ్యో కోర్టు కేక్కడమా? పరువేమిటి మర్యాదేమిటి, అన్న వారుకూడా పేపర్లో వార్తలు, అందరి దగ్గరనించి రూప లభించిన ప్రోత్సాహము చూసి రూప చేసిన పని మంచిదేనేమో, ఎవరో ఒకరు ఇలా ధైర్యం చెయ్యకపోతే యీ కుర్రాళ్ళకి బుద్ది రాదు, మంచి పనే చేసింది అనుకోసాగారు ఆడపిల్లల తల్లిదండ్రులు. తన భవిష్యత్తు నాశనం చేసుకునైనా తనలాంటి ఆడపిల్లలకి న్యాయం జరగాలని పోరాడుతున్న రూపమీద అందరికి సానుభూతి కలిగింది. రూప చేసిన పని మొదట అసహ్యించుకున్వారు, మొదట బరి తెగించి ఇప్పుడు సిగ్గులేకుండా కోర్టు కేక్కడమా అని ఈసడించినవారు కూడా నిజమే ఇద్దరూ తప్పు చేశారు. ఆ పిల్ల ఒక్కర్తే ఎందుకు బాధ పడాలి అనసాగారు. నిజమే ఈ నీతి సూత్రాలు మార్చాలి. ఆడదానికో నీతి, మగాడికో నీతి ఏమిటి అని రూప సమర్ధించడం మొదలుపెట్టారు.
    విశ్వనాధం, పద్మావతి కూడా- రూప కోర్టుకెక్కి, అంతా బట్టబయలు కాగానే యింకా భయపడి దాచుకోడానికి ఏమిలేకపోగానే ఏదో మొండిధైర్యం వచ్చింది వాళ్ళకి పరువు ప్రతిష్ట అంటూ పాకులాడిన వాళ్ళు, రూప అంతా ప్రోత్సహించడం చూసి రూప ఇలా కోర్టు కెక్కడం వల్ల తమకి పోయిన పరువు ఏం లేదనిపించింది. రూప యిలా ధైర్యంగా తాడో పేడో తెల్చుకోవాలనుకోడం ఒకవిధంగా మంచిదేమోనన్న నమ్మకం కల్గింది. తాము రహస్యంగా దాచితే ఆ రహస్యం ఏ క్షణాన బయటికి పోతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోడం, ఆఖరికి ఒకరినించి ఒకరికి ఆ రహస్యం ఎలాగో బయటికి రావడం- ఈ గోడవంతటికి కంటే రూపే ధైర్యంగా చేసిన తప్పు నలుగురి ముందు ఒప్పుకోడంతో ఆమె నిజాయితీని నలుగురూ మెచ్చుకున్నందుకు ఏదో బరువు దించుకున్న తృప్తి కల్గింది.
    మొత్తానికి ఆ పదిహేను రోజులలో ఊరు ఊరంతా రూప, విశ్వనాధం, పద్మావతుల పక్షమే మాట్లాడారు. దాంతో విశ్వనాధంగారు ధైర్యంగా నల్గురిలోకి రావడం ఆరంభించారు. రూప ప్రసక్తి రాగానే...."కానిండి యిది ఒకందుకు మంచిదే. రేపు ఓ ఆడపిల్ల జీవితంలో ఆటలాడుకునే ముందు కాస్త ఆలోచిస్తాడు మగాడు. కనీసం కొన్నాళ్ళు వరకయినా ప్రతి కుర్రాడు కాస్త హద్దులో వుంటాడు.....పోనీండి పెళ్ళికాకపోతే చచ్చిపోతుందా? ఏ ఉద్యోగమో చూసుకుని దాని బతుకు అది బతుకుతుంది. అది చేసిన తప్పు దాచుకోలేదని, దాని నిజాయితీని గుర్తించిన ఏ మంచి మనసున్న వాడన్నా పెళ్ళి చేసుకోడానికి వస్తాడేమో....దాని భవిష్యత్తు ఎలా వుంటే అలా జరుగుతుంది...." అనడం మొదలు పెట్టారాయన. మొత్తానికి అంతా పరిస్థితితోరాజీ పడిపోయారు.

    అటు రామనాధంగారి పరిస్థితి వర్ణనాతీతం. అసలే కేసు గొడవ, పరువు నడిరోడ్డు కెక్కి తను, తన కొడుకు దోషులయినందుకు ఒక బాధ, మరోపక్క సుమతి ఇరవై ఏళ్ళ క్రితం సంగతి పైకి లాగి నలుగురి ముందు తలెత్తుకోలేనంతగా అవమానం చేసినందుకు సిగ్గుతో చితికిపోయారాయన. భార్యా బిడ్డలముందు మొహం చూపలేకపోయారు. అపుడు తన తొందరపాటు తననిపుడు యిలా శిక్షిస్తుందని అయన ఎన్నడూ అనుకోలేదు.
    ఆరేళ్ళ క్రితం సుమతిని మొదటిసారి హైకోర్టులో చూసినప్పుడు అయన గాబరా పడిపోయారు. ఆమెని ప్రలోభ పెట్టి, ప్రేమ మాటలు చెప్పి, వాడుకుని, ఆమె గర్భవతి అయ్యాక పరిస్థితిని ఎదుర్కోలేక పిరికివాడిలా పారిపొయినా అయన, ఆనాడు సుమతి కన్పించి ఎక్కడ నిలేస్తుందోనని మొదట్లో చాలా భయపడేవాడాయన. కానీ సుమతి మొదటిసారి ఆయన్ని చూసి ఒక్కక్షణం మాత్రమే తడబడింది. తరువాత చప్పున సర్దుకుని అయన ఒక పురుగన్నంత హేయంగా ఒక్కక్షణం సూటిగా చూసి, పిరికిపందా భయపడకు అన్నట్టు అదోలా నవ్వి వెళ్ళిపోయింది చరచరా. ఆ రోజు తర్వాత అయన ఎప్పుడు ఎదుట పడ్డా ఒక్కచూపు విసిరితే అయన కుచించుకుపోయేవాడు. అంతేకాక ప్రతికేసులో సుమతి ఆయనకి ప్రత్యర్ధి అయ్యేది. కోర్టులో యిద్దరు బద్ధ శత్రువులయ్యారు.
    ఇప్పుడు ఇన్నాళ్ళకి కూతురని చెప్పి తనని చావు దెబ్బ తీసిందని, తన పేరు మంటగలిపిందని ఆయన అవమానంతో, కోపంతో కుతకుత లాడిపోయారు. దీనికంతటికి కారణమైన సురేష్ ని తిట్టని తిట్టు లేదాయన. సురేష్ పరిస్థితి అంతకంటే ఘోరంగా వుంది. ప్రతివాళ్ళు వెధవ అన్నట్లు చూస్తున్నట్లనిపించేది. ఆఖరికి స్నేహితుల దగ్గరనించి అందరి సానుభూతి రూపమీదే వుంది.
    "ఎందుకురా బాబూ యింత దూరం వెళ్ళవు. మూడు ముళ్ళు వేయాల్సింది" అంటూ అంతా సురేష్ దే తప్పని తేల్చారు.
    "ఒరేయ్ ఈ ఆడపిల్లలు తెలివిమీరరురా! ఇది వరకులా కాదు. మంచిగా పరిష్కారం చేసుకుంటే బాగుండేది. నీ మూలన మేమందరమూ దోషులం అయ్యాం అందరి దృష్టిలో. ప్రతివాళ్ళు "బాగా అయింది. యిలా ఒకడికన్నా శాస్తి జరిగితే ముందు ముందు వెర్రివేషాలు  వేయరు. ఆడపిల్లలతో ఆటలాడరు" అంటూ గడ్డి పెడ్తున్నారు ఎక్కడికెళ్ళినా" అంటూ స్నేహితులంతా సురేష్ ని దుయ్యబట్టారు.
    రామనాధంగారి యింట్లో అంతా ఎవరికి వారు యింట్లోంచి ఏదో శవం వెళ్ళినట్లు నిశ్శబ్దంగా అవమానాలు దిగమింగుకుంటూ కూర్చున్నారు. రామనాధంగారి భార్య శారదాంబ భర్త పాత కధ తెల్సి మొగుడితో మాట్లాడకుండా సత్యాగ్రహం చేస్తుంది. "ఎక్కడనించి వస్తాయి ఆ తండ్రి బుద్దులే నీకు వచ్చాయి" అని సురేష్ ని తిట్టేది ఆవిడ. ఆ యింటి వాతావరణమే మారిపోయింది. ఈ దెబ్బతో ప్రతివాళ్ళు ఆరాటంగా కేసు తీర్పు కోసం ఎదురు చూశారు.
    "ఆంటీ......మీరు నా ఎందుకు టేకప్ చేశారో.....నా మీద యింత దయ, శ్రద్ధ ఎందుకు చూపారో, తల్లి తండ్రులకంటే మిన్నగా నన్నాదుకోవడానికి ఎందుకు ముందుకు వచ్చారో ఈనాడర్ధం అయింది ఆంటీ. ఎప్పుడూ చిరునవ్వుతో వుండే మీ చిరునవ్వు వెనకాల మీ గుండెల్లో ఇంత బడబాగ్ని వుందని ఎన్నడూ గుర్తించలేకపోయాను. సరోజ మీ కూతురని నాకెందుకు చెప్పలేదు ఆంటీ" ఆఖరి రోజు కోర్టునించి వచ్చాక రాత్రి అడిగింది సుమతిని సానుభూతిగా చూస్తూ.
    సుమతి అదోలా నవ్వింది. "నిన్ను చూశాక ధైర్యం తెచ్చుకుని ఇన్నాళ్ళకి ఆ నిజం చెప్పగలిగాను. రూపా నీ ధైర్యం నీ మనో నిబ్బరంలో పదోవంతన్నా ఆనాడు నాకు వుండివుంటే సరోజ ఇలా అనాధగా పదిహేనేళ్ళు నరకంలో మగ్గేది కాదు. ఆమాట తల్చుకుంటే నా గుండె చేరవవుతొంది. అది గడిపిన నికృష్ట జీవితం గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కడుపు తరుక్కుపోతోంది నాకు" పట్టుకున్న గొంతుతో అంది సుమతి.
    "ఆ రామనాధం బండారం బయట పెట్టి మంచిపని చేశారు ఆంటీ. ఇలాంటి వెధవలంతా సంఘంలో పెద్దమనుష్యులుగా చలామణి అవుతున్నారు. వాడికి శాస్తి జరిగింది. ఇంతకంటే అవమానం ఏం కావాలి ఆ పెద్దమనిషికి" కసిగా అంది రూప.
    ఆంటీ! సరోజ అలా అనాధ శరణాలయంలో పెరుగుతుందని తెలిసి ఇన్నాళ్ళు ఎలా ఊరుకోగాలిగారు ఆంటీ, మీరు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. అమ్మ నాన్న పర్మిషన్ ఎందుకు? మీ అమ్మాయిని మీరు కూతురుగా చెప్పుకోకపోయినా కనీసం పెంచుకున్నట్టు చెప్పి తీసుకొచ్చి పెంచుకోవాల్సింది.
    సరోజ అలా అనాధ శరణాలయంలో పెరుగుతున్నట్లు మూడేళ్ళ క్రితం వరకు నాకు తెలియదు రూపా. నా భవిష్యత్తు నాశనం అవుతుందని, బిడ్డ బతికివున్నట్టు తెలిస్తే తల్లిగా నేను శాంతిగా బతకలేనని బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని అమ్మ, నాన్న అబద్దం చెప్పారు. కూతురు చేసిన పాపం దూరంగా తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా కడిగేసి పెళ్ళి చేసేయ్యాలనుకున్నారు అమ్మా నాన్నా. ఏ భవిష్యత్తు ఆశించి వాళ్ళు నా బిడ్డని అనాధ శరణాలయానికి వప్పగించారో ఆ భవిష్యత్తు మీద నాకు ఇచ్చే లేకపోయింది. ఆ అనుభవం తర్వాత ప్రేమించి, నమ్మి సర్వస్వం అర్పించిన పురుషుడు చేసిన మోసం తెలిశాక ఆ షాక్ కి తట్టుకోలేకపోయాను. పెళ్ళి, మగాళ్ళు అంటేనే అసహ్యం పుట్టి పెళ్ళి చేసుకోకుండా నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను.

 Previous Page Next Page