Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 26

 

    "నీకు కోపమోచ్చినట్టుందమ్మా సీతా! ఈ విషయం నీకు బాధ కలిగిస్తుందంటే ఇంతదూరం రానిచ్చే వాడినేకాదు"

 

    "ఆ పిల్లల తండ్రికి యింత విశాలహృదయం వుంటుందనుకోలేదు నాన్నా!"

 

    సీత మాటలోని వ్యంగ్యం హృదయంలోని వేదన అ ఒక్కమాటతో అవగాహనా అయాయి రామచంద్రంకి.

 

    "అంత విశాలహృదయంకల వాడయితే ఏ వితంతువునో పెళ్ళి  చేసుకోవచ్చునుకదా! దానికి మనసంగికరించదు పాపం నలుగురు పిల్లల తండ్రి పెళ్ళాం చస్తే మళ్ళి పెళ్ళికి కన్య కావాలి. పిల్లల మీద అపేక్షతో ఈ పెళ్ళా! పిల్ల మీద మోజుతో ఈ పెళ్ళా?"

 

    "ఇంక ఆ విషయం వదిలెయ్యి సీతా! నీ మనస్తత్వం తెలిసి కూడా రెండో పెళ్ళివాడిని చూశాను. నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీ కోసం నీకన్నా ముందే ఓ మగాడిని పుట్టించే వుంటాడమ్మా! సంబంధాలు చూస్తుంటే అవేకుదురుతాయి."

 

    "రెండో సంబంధం అని కాదు నాన్నా! ఈ కలికాలంలో ఎన్నో విషయాలతో ముందంజ వేస్తున్న ఈ యుగంలో కొన్ని విషయాలలో స్రీ పురుషులు సమానమంటూ మరికొన్ని విషయాలలో స్రీ కొక ధర్మం పురుషుడికొక ధర్మం స్రీ కొక న్యాయం పురుషుడికొక న్యాయం అంటూ పక్షపాత వైఖరి చూపటం బాధాకరం నాన్నా! మీరు ఎప్పటిలా ధైర్యంగా వుండండి. నాకు పెళ్ళి గాకపోదు. ఓవేళ కాదు అనుకోండి, నేనీ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవిస్తాను. లోకం కోసం మనసంగికరించని మనువు మాత్రం చేసుకోను. అంతకన్నా ఆత్మహత్య చేసుకోవటం పుణ్యం. ఎంతమంది పెళ్ళికాకుండా జీవించటం లెదూ, వాళ్ళలో నేనొక దాన్ని అంతేగా! మిమ్మల్ని చూసుకుంటూ రాజు జయని చూసుకుంటూ మన ఉన్నతికి, మన సంసారం కోసం పాటు పడతాను. రాజుకి జయకి ఎంత వయసువుంది. వీళ్ళు పెద్దవాళ్ళు అయేదాకా చూడొద్దు!"

 

    "నీకు జవాబివ్వటం కష్టం తల్లీ!" తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు రామచంద్రం.

 

    సీత జవాబివ్వలేదు ఖాళి కాఫీ గ్లాసు తీసుకుని వంటింట్లోకివెళ్ళింది.

 

    రామశాస్త్రిగారొస్తే ప్లిడరుకు కబురు చేస్తాను. వేరే సంబంధం చూసుకోమని. ఈ మాట మొదటే అనుకుంటే ఎంత బాగుండేది? అనుకున్నాడు రామచంద్రం.

 

    "మూడునాళ్ళాయేరా మువ్వ గోపాలా! నినుజూడనేనింక నిలువజాలనురా" సీత వంట గదిలో గిన్నెలు సర్దుతూ నిమ్మళంగా పాడుకుంటూ వుండగా రూప వంటగది గుమ్మంలో నుంచుండిపోయింది.

 

    "అక్క ఎంత చక్కగా పాడుతుందో, సంగీతం నేర్చుకుంటే ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవో" అనుకుంది.

 

    సీత యిటు తిరిగి చూసేసరికి రూప దిర్ఘలోచనలో వుంది.

 

    "అదేమిటే రూపా! అలానుంచుండి పోయావు. ఎంతసేపయింది వచ్చి రవి కూడా వచ్చావా?'

 

    "అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తె ఎలా అక్కా?"

 

    "సరేలే, ఎంత సేపయింది వచ్చి?'

 

    "నువ్వు పాట మొదలు పెట్టావు నేవచ్చాను. భగవంతుడు నీకు కమ్మని కంఠం ఇచ్చాడు. అలా నేను పాడగలిగితేనా, సంగీతం నేర్చుకుని ఊరూరా తిరిగి కచ్చేరిలు చేసేదాన్ని."

 

    ఎప్పుడోచ్చాడో రాజు వీళ్ళ మాటలు విన్నాడు. "భగవంతుడు మనందరికన్నా తెలివిగలవాడు చిన్నక్కా! అన్ని అందరికి పంచుతాడు గాని, ఒక్కరికే అన్ని కళలు ఇవ్వడు. మద్దెల నేర్చుకుందామని వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను మద్దేలమిద ఓ చెయ్యి దరువేస్తుంటే మరోచేయ్యి మౌనం వహిస్తున్నది" అన్నాడు.

 

    'నేర్చుకున్న విద్యలు చాలలేదుటరా' అంది రూప.

 

    "చాలక కాదు ఏదో సరదా బావ రాలేదేం? ' అన్నాడు రాజు.

 

    'రవి రాలేదా రూపా' అంది సీత.

 

    'రాత్రికి వస్తాడు. ఈపుట మా భోజనాలు యిక్కడే' అంది రూప.

 

    "అమ్మయ్య, ఎప్పటిలా యిలా వెళ్ళిపోతావేమో అనుకున్నాను. ఈమధ్య నువ్వు యిక్కడికి భోజనానికి రాలేదు. పద కాసేపు ముందు గదిలో కుర్చుని మాట్లాడుకుందాము అంటూ సీత వంటగదిలోంచి కదలంగానే రూపా రాజూ వెనుకనే వచ్చారు.

 

    రూప అత్తవారింట్లో మంచి చెడ్డ వివరంగా కనుక్కుంది సీత. మొదట్లో గొణిగినట్లు ఎప్పుడేవారు ప్రవర్తించటం లేదని తనతో బాగా వుంటున్నారని రూప చెప్పింది.

 

    రవి రూపని పెళ్లి చేసుకుని తనింటికి తీసుకెళ్ళాడు కాసేపు కోపంతో పెద్దవాళ్ళు అరిచినా తర్వాత నోరుముసుకున్నారు. రవి యింట్లో పెద్దవాళ్ళంతా కాస్త భయస్తులు. ఈ కాలం పిల్లలు దుడుకు రకం. వాళ్ళ మాట వినకపోతే ఏ అఘాయిత్యమైనా చేసుకుంటారని, తర్వాత విచారించి ప్రయోజనం లేదని' అనుకున్నారు. రూప రవి మనసు మర్చి వుంటుందని మధ్య మధ్య గొణిగి తమ భాధ వ్యక్తం చేసేవారు. పోను పోనూ అది తమ అపోహేనని రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుందని గ్రహించి రూపని బాగా చూసుకుంటున్నారు.

 

    అత్తగారింట్లో విశేషాలన్నీ రూప చెపుతుంటే వింటూ కూచుంది సీత.

 

    వాళ్ళ మాటలు వింటున్న రామచంద్రం "ఎవరి అదృష్టానికి ఎవరు భాద్యులు, ఎవరి ఖర్మకెవరు కర్తలు" అనుకున్నాడు.

 Previous Page Next Page