Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 25

 

    "అక్కా!" అంటూ రూప సీతని కౌగలించుకుంది.

 

    రామచంద్రంలోని తండ్రి మనసు "అమ్మా సీత నీ భవిష్యత్తేమిటి?" అని మూలుగుతునె వుంది.

 

 

                                                                     15

 

    సీత ఎప్పుడో ఓ స్థిర నిశ్చయానికొచ్చింది.

 

    పెళ్ళిళ్ళు పేరయ్య రామశాస్త్రి వచ్చి వెళ్ళాక రామచంద్రం ముందు గదిలో కుర్చీలో అలా ఆలోచిస్తూ వుండిపోయాడు. సీతతో ఎలా చెప్పాలి? సీతనెలా కదపాలి. అసలు సీతతో సంప్రదించటం మంచిదా కాదా! ఆలోచిస్తున్నాడు రామచంద్రం.

 

    తండ్రేం ఆలోచిస్తున్నాడో సీతకి తెలుసు. తెలుసు కదా అని తను ముందుగా బయటపడలేదు. అడిగినప్పుడే చెప్పవచ్చు అనుకుంది.

 

    మధ్యాహ్నం పాలపిల్ల వచ్చి పాలసీసా యిచ్చి వెళ్లింది.

 

    సీత పలు కాచి కాఫీ కలిపి రామచంద్రంకి యిచ్చేందుకు వెళ్లి 'కాఫీ తాగండి నాన్నా' అంది.

 

    సీత ముఖంలోకి దీర్ఘంగా చూసి ఓ నిట్టుర్పు విడిచి 'కాస్త మాట్లాడాలి అలా కుచోమ్మా సీతా' అని సీత చేతిలోంచి కాఫీ గ్లాసు అందుకున్నాడు రామచంద్రం.

 

    
    సీత మౌనంగా తండ్రికి కాస్త దగ్గరగా మోడా లాక్కుని కూచుంది.

 

    "మధ్యాహ్నం రామశాస్త్రి వచ్చి వెళ్ళడామ్మా"

 

    "చూశాను నాన్నా"

 

    " మా మాటలు విన్నావాతల్లి?"

 

    "ఊ"

 

    రామచంద్రం కాఫీ తాగటం పూర్తి చేసి గ్లాసు కిందపెట్టాడు. సీతేమయినా మాట్లాడుతుందేమోనని చూశాడు. అదేం కనపడకపోగా తనే అసలు విషయానికి రాదల్చుకున్నాడు.

 

    "సీతా! నీ నిర్ణయం ఏమిటి?" అన్నాడు రామచంద్రం.

 

    "మీరే నిర్ణయానికొచ్చారు నాన్నా!"

 

    "సోమసుందరానికి పెద్ద వయసేమి లేదు. మంచివాడని పేరు. ఆస్తి వుంది కట్నం అక్కరలేదని, నీకిష్టమయితే తనకభ్యంతరం లేదని కబురు చేశాడు.'

 

    "నలుగురు పిల్లలున్నారు నాన్నా ఆవిషయం మర్చిపోయారు"

 

    "సీతా!"

 

    'ఆస్తి మాట అంటుంటేను పిల్లలు గుర్తొచ్చారు.'

 

    "పిల్లలుంటే నేమమ్మా! బంగారం లాంటి ఫామిలి. పేరు పొందిన ప్లీడరు. ఆస్తి సంపాదించాడు. నలభై ఏళ్ళు డతని వాడు. చూడటానికి చక్కగా వుంటాడు. రెండో పెళ్లివాడనే కదా! ఏ సంశయమయినా , ఇది వరకు కట్నాలా బెడదతో నీ పెళ్లి కాలేదు. తర్వాత బాబాకి రూపకి పెళ్లి కావటంతో ఎంత ప్రయత్నించినా నీ పెళ్లి ప్రయత్నాలు వెనక్కే వెళ్ళాయి గాని ఒక్కరూ ముందుకు రాలేదు. నా యిష్టమంటావా సీతా! ఇది వరకు పరిస్థితిలలో అయితే ఇష్టపడే వాడిని కాదు. రోజులు మనవి కానప్పుడు సర్దుకుపోవడం నేర్చుకోవాలి నీవు ఊ అంటే...."

 

    "చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నాన్నా! శివరావు తాతయ్య మీతో పెళ్లి చేసుకోమని పోరేవాడు. మళ్ళి పెళ్లి చేసుకోనని మీరెంతో బాగా వాదించేవారు. పిల్లలున్న రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేసేబదులు ఆ పిల్లని ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బతకమని సలహా యిచ్చారు గుర్తుందా నాన్నా! అలాంటి సలహా నా కెందుకు యివ్వరు నాన్నా?"

 

    సీత శాంతంగా వుంటుందని తెలుసు. ఎక్కువా మాట్లాడదని తెలుసు, తెలివి కలదని తెలుసు. ఎంతో అవసరమయితే పది మాటలవార ఒకేమాట మాట్లాడి ఎదుటి వారినోరు ముయించగలదని తెలుసు కాని.....ఈ విషయంలో పదునైనా ప్రశ్న యింత సూటిగా వేస్తుందని రామచంద్రం వుహించలేదు.

 

    "పరిస్థితులు నా చేత అలా మాట్లాడిస్తున్నాయి తల్లీ"

 

    "అంత గడ్డుపరిస్థితి నాకేమికనిపించలేదు'

 

    "బాబాకి, రూపకి పెళ్ళయి వాళ్లు హాయిగా బతుకుతూ, పెద్దదానివి నీకు పెళ్ళి గాకపోతే ఈ విషయం నలుగురు అనుకుంటుంటే భరించలేక....ఈ సంబంధం వాళ్ళు ఇష్టపడటంవల్ల...."

 

    "రెండో పెళ్ళివాడయినా ఫర్వాలేదనుకున్నావా నాన్నా"

 

    "అనుకున్నాన్నమ్మా! ఇతను ముందుకు వచ్చాడు కదా!"

 

    "అది అతని అవసరం"

 

    "మన అవసరం కూడా "

 

    "అవసరం లేదనుకుంటే ఏమిలేదు. రెండో పెళ్ళివాడిని చేసుకోకపోతే బతక లేననే భయం నాకు లేదు. ఆ రోజు వచ్చినపుడే అవుతుంది పెళ్ళి. అమ్మ నా దగ్గిర కూచుని వడ్డిస్తేగాని అన్నం తినటం చేతగాని రోజుల్లో అమ్మ దూరమయింది. తమ్ముడిని చెల్లెళ్ళని పిల్లల్ల్లా చూస్తూ నేను పెద్దదాన్నయాను. ఒకతల్లికి పుట్టిన పిల్లలం ఒకేలా బతకాలి. ఇది వేరు. ఇప్పుడు ఓ పిల్లల తండ్రిని పెళ్ళాడి అయన పిల్లలకి తల్లినై పిల్లలని పెంచి పెద్దవాళ్ళను చేసి.....ఇదంతా ఎవరికోసం నాన్నా! నా మెడలో పడే పసుపు తాడు కోసమా! నా మెడలో బిగించే పలుపుతాడు కోసమా! ఓ పిల్లలతండ్రి సుఖంకోరా! లోకం సంతోషిస్తుందనా?"   

 Previous Page Next Page