"మూడ్ అంటే మూడెట్లా అవుతుందిరా! మూడు అంటే త్రీ కదా?" నాలుగయిదు ఇంగ్లీషు ముక్కలొచ్చిన బామ్మగారు అనుమానం వెళ్ళగక్కింది.
"మూడ్ అంటే పరిపరివిధాలుగా పోయే మనసు అని అర్ధం."
"మనసంటేనే పరిపరివిధాలూ పోతుంది. పరి పరి విధాలు పోయే మనసేంటి?"
"అదేలే నాన్నమ్మా! ఇంగ్లీషులో అలానే అంటారు."
"మనసంటే పోయేదానికి ఇంతగోల దేనికో?"
"నీకు తెలియదు నాన్నమ్మా! అదంతే మూడ్ అనే రెండక్షరాలకి తెనుగులో ఇన్ని అక్షరాలున్నాయా అదే విధంగా సిగ్నల్ అను మూడక్షరాలకి అసలు తెనుగులో ధూమశకటము ఆగమన గమనకాలము తెలియజేయు రెక్కలు అని...
"అలాగా!" అంటూ బోలెడు ఆశ్చర్యపోయింది బామ్మగారు.
"నీకు తెలుగుకూడా బాగా వచ్చే" తృప్తిగా అన్నాడు మదన్ గోపాల్.
"అబ్బీ!"
"ఏంటి నాన్నమ్మా!"
"ఇందాక ఆపిల్లది వెళుతూ వెళుతూ నీ మనసు పరిపరి విధాల పోతున్నది మరోసారి వస్తానంది. అదేంటి?"
"తన మూడ్ బాగుండక ఆముడ్ లో నా మూడ్ బాగుండలేదని ముఖాన అనిపోయింది. ఆ పిల్ల దానికి వేపకాయంత వెర్రి. చీమ తలకాయంత పిచ్చి."
"ఛా...అవేం మాటలురా పిచ్చినాగన్న."
"నాకు కాదుపిచ్చి ఆ పిల్లదానకే. నన్ను చూస్తేచాలు నిప్పు తొక్కిన కోతిలా ఎగిరిపడుతుంది."
"ఆ... సరిగ్గా సరిపోతుంది" కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది బామ్మగారు.
మదన్ గోపాల్ కి అప్పుడు అనుమానం వచ్చింది. నాన్నమ్మ తన్ని ఆటలు పట్టిస్తుందేమో అని పరీక్షగా చూశాడు. ఆవిడ ముసి ముసి నవ్వులు నవ్వుతూ అంతకన్న పరీక్షగా తన్నే చూస్తున్నది, "ఫో నాన్నమ్మా! నీకంత నవ్వులాటగా వుంది" అన్నాడు ఆడపిల్లలా సిగ్గుపడుతూ.
సర్వం అర్ధమైందన్నట్లు బొలబొల నవ్వారు బామ్మగారు.
10
పది దస్తాల తెల్లకాగితాలు, రామా యింక్ బాటిలు, హీరో పెన్ను, అందంగావున్న ప్యాడ్ కొనుక్కువచ్చింది వైజయంతి. అవన్నీ త్రిలోకసుందరికి చూపిస్తూ "హహ్హాహ్హా" ఓ విలన్ నవ్వు నవ్వి "చూచితివా సుందరీ!" అంది వైజయంతి.
అతి మామూలు వస్తువులు అవి. వాటిని పనిగట్టుకు చూపిస్తూ అంతగా నవ్వాల్సిన అవసరం వైజయంతికి ఎందుకు కలిగిందో బొత్తిగా అర్ధంకాలేదు త్రిలోకసుందరికి. ఓ పెద్దకధ దానికో కమామీషూ లేకపోతే పనిమాల ఆ వస్తువులని వై జయంతి తనకి చూపదని త్రిలోకసుందరికి తెలుసు. అప్పుడప్పుడూ మరీ పసిపిల్లలా వైజయంతి వేసే తిక్కవేషాలు తెలుసు. కొంపదీసి ఆ మదన్ గోపాల్ సామాగ్రి ఎత్తుకు రాలేదుకదా" అనుకుంది.