కారణం ఏమిటంటే అరుణకే తెలియదు. కానివేణు ప్రేమతో ఇరుక్కుని భంగపడ్డాక. ఇంత తొందరగా ఇంకో మగాడ్ని వేణు స్థానంలో ఉంచడానికి అరుణ మనసుఅంగీకరించడం లేదు. తను వేణుని అంతలా ప్రేమించిందా? అరుణకే జవాబు తెలియడం లేదు. కానీ వేణులా ఇంకో మగాణ్ణి ఆ భావంతో చూడలేకపోతుండడం.
దాన్నిబట్టి వేణునితను ఎంత గాఢంగా వాంఛించిందో అర్ధంచేసుకుంటూంది. పైకి ఎవరికీ తన మనసులో బాధ అర్ధంగాదు. పైకినిశ్చింతగా రోగుల రోగాలు నయం చేయడమేతన జీవిత ధ్యేయం అన్నట్టు కనిపించేఅరుణ అంతరంగంలోని ఆమె బాధ నిరాశ, నిస్పృహఅర్ధం కాకపోవచ్చు ఎంతమభ్య పెట్టుకుందామన్నా అరుణకి వేణుతో పరిచయం వేణుతో గడిపిన ఆ రెండేళ్ళు తమని ఇద్దరిని ఎంతో దగ్గరికి తీసుకువచ్చింది సంఘటనలు...... ఏమీమరిచిపోదామనుకున్న మరుపుకిరావడం లేదు పగలంతా ఏవేవో పనులతో గడిచిపోయినా రాత్రిపక్కమీద వాలగానే ఆమెప్రయత్నం లేకుండానే వేణు కళ్ళముందు నిలిచేవాడు ఆ సంఘటనలనీడలని తుడిచేద్దామన్నా సాధ్యమయ్యేదికాదు. తను అంతగాఢంగా వేణుని ప్రేమించినట్టు ఇక్కడకు వచ్చాకగాని అరుణకి అర్ధం గాలేదు.
వేణుని నిరాకరించి పొరపాటు చేసిందా? ఆ ప్రశ్న రాగానే గాభరాగాలేదు అని తనను అతను నమ్మించుకోవాలనిచూసేది అరుణ. గాఢంగా తనలో ముద్రింపబడినవేణు రూపు నెమ్మదిమీదగాని తొలగిపోదని అరుణకి అర్ధం అవడం. ఇదంతా ఎవరితో చెప్పగలదు? ఏమని చెప్పగలదు?
అరుణ మొహం ఆ మౌనంచూస్తే హఠాత్తుగా ఓ సంగతి అర్ధం అయింది కృష్ణమూర్తికి అరుణ మనసులో బాధపడుతూంది అతనికి వేణు అరుణల సంగతి తెలుసు. అరుణ వేణుని ఏదో ఆదర్శాలవేడిలో నిరాకరించినా అవన్నీ మరిచిపోలేకపోతూంది. అందుకే ఎన్నివిధాల బ్రతిమిలాడినా, పెళ్ళి ప్రస్తుతం వద్దంటూంది వేణుని మరిచిపోవాలంటే కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు పెండ్లి సంగతి ఎత్తినా ప్రయోజనంలేదు ఇన్నాళ్ళు ఆ సంగతే తమకి తట్టలేదు. తరవాత చెల్లెలిని ఏమీ అడగలేదు కృష్ణమూర్తి చిన్న నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు.
ఇంటికివెళ్ళాక తండ్రితో ఆ మాటే చెప్పాడు "ప్చ్ ఏమిటో పిచ్చిపిల్ల.......అనవసరంగా చేతులారా బాధలు తెచ్చిపెట్టుకుంది. మూడు పువ్వులూ ఆరుకాయలుగా ఉండవలసినబంగారంలాంటి జీవితాన్ని ఆదర్శాల కోసం త్యాగం చేసుకుంది. ఏమిటో దాని బుద్దిమారదు కానీ చూద్దాం ఏమవుతుందో" ఆవేదనగా అన్నారాయన.
* * *
"నమస్కారం డాక్టరుగారూ:"
ఉదయం పదకొండు గంట్ల వేళ పేషెంట్లని చూస్తున్న అరుణ తల ఎత్తి చూసింది. ఎదురుగా ప్రెసిడెంటుగారు అదోలా నవ్వుతూ చేతులు జోడించినిలుచుని ఉన్నారు అరుణకాస్త తొట్రు పడింది." నమస్కారం కూర్చోండి కూర్చోండి." కుర్చీ చూపిస్తూ అంది.
ప్రెసిడెంటుగారిని అప్పుడు ప్రారంభోత్సవం నాడు చూడడం తప్ప తరవాత అరుణ మరిచూడలేదు. 'మీ రొస్తేనే చాలు, మిగతాదంతా నాది అంటు పెద్ద కబుర్లు చెప్పిన ప్రెసిడెంట్ మళ్ళీ ఈ ఆరు నెలల్లో ఒక్క సారయినా కనపడలేదు కనీసం ఎలా ఉన్నారు. ఏమన్నా కావాలా అంటూ భోగట్టా అయినా చేయలేదు కరణం ఆ ఊరి హెడ్ మాస్టరు వగైరాలు కొంతమంది రెండు మూడుసార్లు వచ్చియోగక్షేమాలు వివరించాడుగాని. ఈ పెద్దమనిషి అసలుకనపడలేదు. ఏదో సుబ్బారావు ఉన్నాడుకనక సరిపోయింది కానీ, ఇతని మాటలు నమ్మితే ఏ పనీ జరిగేది కాదు.
"డాక్టరమ్మ గారు ఎలాఉన్నారో చూసి పోదామనివచ్చాను ప్రాక్టీసు బాగున్నట్టుందే పేషెంట్ల వంక చూస్తూ అన్నాడు.
"ఆ ఏదో తమ దయకాస్త హేళననిరసన జోడించి చూస్తున్న పేషెంటుకి చీటీ రాసి ఇస్తూ అంది అరుణ.
ఆ నేసెప్పలే మీరు రావాలేగానీ, ఇక్కడ మీకేం లోటుందని? మీ మంచి చెడ్డలుచూసే భారం మాదనిసెప్పలే?" తనే ఏదోపెద్ద ఘనకార్యం చేసినట్టుగర్వంగా అన్నాడు.
నవ్వి ఊరుకుంది అరుణ.
అతని చూపులు సూటిగా గుచ్చుకుంటున్నట్టు అరుణని ఇబ్బంది పెట్టాయి ఎందుచేతోగాని, మొదటిచూపులోనే అతనంటే అదోరకం అయిష్టం కలిగింది అరుణకి.
ఆ భావం ఈ సారితో మరింత హెచ్చిందిగాని, తగ్గలేదు బొత్తిగా మంచి, మర్యాద లేకుండా అలా గుచ్చి గుచ్చి చూస్తున్న ప్రెసిడెంట్ని చూస్తుంటే అరుణకి ఒళ్ళు మండింది. ఎందుకొచ్చాడో? ఊరికే చూసిపోదామని వచ్చాడా? మీసం మెలేస్తూ, చూపులతో అరుణని తాగేయడం తప్ప ఏం మాట్లాడాడని అతన్ని చూస్తూ ఎక్కువ సేపు భరించలేకపోయింది అరుణ.
"ఊరకరారు మహాత్ములు ఏదన్నా పనిమీద వచ్చారా?" తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తనే అడిగాడు అరుణ.
అతను కాస్త గాభరాగా ఆ ఆ లేదులెండి ఊరికే సూసిపోదామనివచ్చాను" అన్నాడు. అంతలోనే మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు...... "ఏమిటో ఈ మధ్య మా ఆడవాళ్ళకి కాస్త ఒంట్లో బాగులేదు. మందేదన్నా ఇస్తారేంటో నని అడుగుదామని వచ్చాను" నసుగుతూ అన్నాడు.
"సుస్తీఏమిటి? తీసుకురాక పోయారా? చూసేదాన్ని"
"అబ్బేపెద్దేటి లేదులెండి కాస్త నెలలుతిన్నగా రావడంలేదంట ఏదో మందిస్తేసరిపోతది సూడ్డానికి ఏముంది?" చూడ్డానికి ఏమీ లేదట పెద్దడాక్టరులా తనే చెప్పేస్తున్నాడు. ఆపాటి దానికి తన దగ్గిరకెందుకు వచ్చాడో? రోగం ఏమిటో చూడకుండా మందిచ్చేయాలిట.
"అదెలాకుదురుతుందండీ? అసలు కారణం ఏమిటో తెలియకుండా ఏం మందీయ మంటాడు?" కాస్త కఠినంగానే అంది అరుణ.
"చూడాలంటారా?" అదోలా మొహంపెట్టా
"చూడకపోతే ఎలా? నెలలు తిన్నగారాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు గర్భిణీకావచ్చు బహిష్టుపోయే రోజులుకావచ్చు ఇంతకీ ఆమెకేపాటివయసుంటుంది.
ప్రెసిడెంటుగారు బుర్ర గోక్కున్నారు. "ఆ నలభైరెండో మూడో...... ఇంకా ఎక్కువోసరిగా గుర్తులేదు".
"ఈ వయస్సులో కొందరికి బహుష్టులుపోతాయి పోయే ముందుసరిగ్గా నెలలు రావు.
ఈ కారణమో, మరే కారణమో పరీక్ష చేయకుండా మందెలా ఇస్తాను?"
ప్రెసిడెంట్ ఎందుకో కలవరపడుతున్నాడు సందేహిస్తున్నాడు. ఏదో చెప్పాలని చెప్పలేక బాధపడుతున్నాడు. భార్యని తీసుకొచ్చి పరీక్ష చేయించడానికి అంత సందేహించడం ఎందుకో అరుణకి అర్ధం కాలేదు. పోనీ ఘోషా అనుకుంటే తనేం మగడాక్టరు కాదు.
"రేపు తీసుకురండి చూసి మందిస్తాను" అతన్ని వదుల్చుకోవడానికి గబగబ అంది. పైన ఇంకా పేషెంట్లు కూర్చుని ఉన్నాడు. ఎంతకూ అసలు సంగతి చెప్పడు కదలడు ఏం మనిషి బాబూ అని మనసులోనే విసుక్కుంది అరుణ.
"తమరే ఓ సారి రండి రేపు బండి పంపుతాను" అన్నాడు ఆఖరికి ఆలోచించి.
"నేనెందుకండీ ఆవిడనేతీసుకురండి ఏదో కదల్చలేనిరోగులయితే తప్ప సాధారణంగా ఇళ్ళకివెళ్ళను" అరుణ ఖచ్చితంగానే అంది అతని ప్రెసిడెంటుగిరి చూసి భయపడవలసిన అవసరం తనకేం లేదు.
"అమ్మమ్మ........తమరే ఓపాలి దయచేయాలి. మీకేం కష్టం అక్కరలేదు. బండి పంపిస్తాను మాఆడవాళ్ళకి ఎప్పుడూ పైకి రావడం అలవాటులేదు. ఏమనుకోకుండా మీరే రావాలి" అన్నాడు.
అతని ప్రెసిడెంట్ దర్పంవిడిచి మామూలుగా మాట్లాడడం చూసి అరుణ మెత్తబడింది.
"సరేఅలాగే తొమ్మిది గంటలకివస్తాను" అతన్ని వదుల్చుకొనడానికి అంతకంటే మరో మార్గం కనపడక వెంటనే అంగీకరించింది.
నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్ మిగతా రోగులనిచూడ్డంలో నిమగ్నమయింది అరుణ.
* * *
మర్నాడు ప్రొద్దుట అన్నవేళకి అరుణ ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళింది వీధి అరుగుమీద పడక్కుర్చీలో పడుకున్న ఆయనముఖం ఎందుకో పాలిపోయినట్టుంది. ఎందుకో చాలా కంగారుగా ఉన్నాడు చెమట పట్టినముఖం తుడుచుకుంటూ అరుణ రాగానే ముందుగదిలోకి తీసుకెళ్ళాడు.
"డాక్టరుగారూ డాక్టరుగారూ తమరు చిన్నసాయం చేసి పెట్టాలి. ఇవి చేతులుకావు"
అరుణకి అతని గాభరా, ఆందోళన ఆ మాటల కర్ధం బోధపడలేదు. ఆశ్చర్యంగా చూసింది. "ముందు ఆవిడను చూడనీయండి నన్ను. మీ రానవసరంగా ఎందుకిలా భయపడుతున్నారు?"