ఆమె అందమైన ఫోటో!
కానీ-
ఆ క్షణంలోనే సడెన్ గా కరెంట్ పోయింది.
ఆగిపోయింది అన్విత.
"మీఇంట్లోకి రావటం ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వాళ్ళకి యిష్టం లేదేమో...." జోగా అంది అన్విత.
"మధూ! మీతో మాట్లాడాలి. విల్ యు ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ...." అడిగింది అన్విత.
"ఎస్.....పదండి" లైట్ స్విచెస్ ఆఫ్ చేసి, తలుపుకి తాళం వేస్తున్నాడు మధు.
"తాళం సరిగా పడిందా? లేదా? అని- తాళం సరిగా పడినా, తలుపులు సరిగ్గా వేశానా లేదా అని వేసి తన్నడం నేర్చుకో" అన్నాడు నారాయణ సీరియస్ గా.
ఆయన భాష ఒక్క ముక్క అర్థంకావడం లేదు అన్వితకి.
"తర్వాత నేర్చుకుంటాను సార్!" అన్నాడు మధు.
ముందు అన్విత, తర్వాత మధు, తర్వాత నారాయణ మెట్లు దిగుతుండగా అన్విత అంది.
"నా కారులోనే వెళుతున్నాం."
"సీయూ మధూ...... అన్వితా..... ఆల్ ది బెస్ట్" అంటూ టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు నారాయణ.
డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అన్విత. పక్కనే కూర్చున్నాడు మధు. అన్విత రాసుకున్న రెగెట్టా స్ప్రే పరిమళం మధు ముక్కుపుటాలను తాకుతోంది.
ఆమె అలా వస్తుందనీ, అలా ఇద్దరం కలిసి కారులో వెళతామనీ ఊహించని మధు ఆలోచనలు పూల పరిమళాల్ని వెదజల్లుతున్నాయి.
కారు ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర ఆగింది.
"విజయవాడ రోడ్ లో 'ఫామిలీ టౌన్' రెస్టారెంట్ కి మనం వెళుతున్నాం. అరగంట జర్నీ...." చెప్పింది అన్విత.
మెంబర్స్ కి మాత్రమే ఆ రెస్టారెంట్ లో ప్రవేశం.
కారులోంచి రెడ్ లైట్ వైపు చూస్తున్నాడు మధు.
అదే సమయంలో ఆ కారుకి కొంచెం దూరంలో ఆగిన స్కూటర్ వైపు, ఆ స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తులవైపు మధుగానీ అన్వితగానీ చూడలేదు.
ఆ స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తులు రవి, రమణ!
విశాలమైన ఏడెకరాల ప్రదేశంలో ఉంది ఫామిలీ రెస్టారెంట్ 'ఫామిలీ టౌన్' పదేసిఅడుగుల దూరంలో టేబుల్స్, వాటి పక్కన రంగు రంగుల చెయిర్స్. టేబుల్ పైన వ్రేలాడుతున్న టూమ్స్ లో సన్నటి కాంతితో వెలుగుతున్న లైట్స్, మెల్లగా వినిపిస్తున్నా వెస్ట్రన్ మ్యూజిక్!
"టేక్ యువర్ సీట్" తను కూర్చుంటూ ఎదురుగా ఉన్న సీటువేపు చూస్తూ అంది అన్విత.
ఆ సమయంలో మధు మనసు గందరగోళంగా వుంది. ఏదో తెలీని అస్పష్ట భావాల పరంపర.....
ఈ అరుదయిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తన ఫీలింగ్స్ ని చెప్పెయ్యాలి.
బేరర్ వచ్చాడు.
"టూ కోక్ అండ్ వెజిటబుల్ సలాడ్....." ఆర్డరిచ్చింది అన్విత.
గొంతు సవరించుకుని చెప్పింది- "మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఇక్కడకు తీసుకొచ్చాను" అందామె.
నిన్నటి సంఘటన గుర్తుకొచ్చింది మధుకి. ఆమె మీద తనకున్న అభిమానాన్ని గుర్తించిందా?
మీరంటే నాకిష్టం అని చెబుతుందా?
గుడ్ గాడ్...... పులకించిపోయింది మధు మనసు.
మళ్ళీ అంది అన్విత.
"మామూలుగా అయితే మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచేదాన్ని. కానీ ఒక్కొక్క వ్యక్తి గురించి తెలుస్తున్నాక.... నమ్మకం సన్నగిల్లిపోతోంది. మనం అభిమానించినట్లుగా వాళ్ళు అభిమానించడంలేదేమో అనే సందేహం వస్తోంది. ఫ్రెండ్షిప్ కూడా బిజినెస్ అయిపోతోంది. అందుకే....." ఆగిందామె.
అన్విత ఏ విషయం చెప్పబోతోంది?
ఇంట్రడక్షన్ లేకుండా, డైరెక్ట్ గా చెప్పాల్సిన విషయం చెప్పెయ్యకూడదూ?
"పోనీలెండి..... అవన్నీ వదిలెయ్యండి."
"చెప్పాల్సిన విషయం త్వరగా చెప్పమన్నట్లుగా అన్నాడు.
బేరర్ కోక్ బాటిల్స్ తెచ్చి ఓపెన్ చేసి గ్లాసుల్లో పోసి, టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు.
సిప్ చేస్తున్నారిద్దరూ.
"బైదిబై మిస్టర్ మధూ! మనం ఎప్పుడయినా కల్సుకుందాం. ఎందుకంటే- రేపు నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను...... నాన్నమ్మతో సహా......"
ఊహించని ఆ మాటకి సందిగ్ధంలో పడిపోయాడు మధు.
అంతవరకూ ఉత్సాహంగా ఉన్న మధు ఒక్కసారి డల్ గా అయిపోయాడు.
కోక్ చేదుగా అనిపించింది.
నాన్నమ్మ ఆరోగ్యం, కాలేజీలోంచి వెళ్ళిపోవడం ఈ సమయంలో తను ప్రేమ గురించే చెబితే ఏం బావుంటుంది?
నలభై నిమిషాల తర్వాత.
కార్లో తిరిగి వస్తున్నప్పుడు-
"ఉయార్ ఫ్రెండ్స్...... మీరెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. లాసన్స్ బే కాలనీలో వస్తారా? యూరోపియన్ ఆర్కిటెక్చర్ తో వుంటుంది మా బిల్డింగ్...." చెప్పిందామె.
"అంతేనా....." అనబోయాడతను. అంటే బాగుండేది. టాపిక్ పెరిగేది. ఏవీ మాట్లాడలేదు మధు- తిరిగి అతనిలో బిడియం.
అతని ఫ్లాటు ముందు డ్రాప్ చేసేసి వెళ్ళిపోయింది అన్విత. వెంటనే వెహికల్ తీసుకుని సుల్తాన్ షాపుకెళ్లాడు. అతనప్పుడే గ్యారేజీ క్లోజ్ చేస్తున్నాడు.
* * *
కాలేజీకి ఎదురుగా వున్న బార్లో కూర్చున్నారిద్దరూ,
బీరు తాగుతూ జరిగింది చెప్పాడు మధు.
"నువ్వు నిజంగా పిచ్చిమాలోకానివే. ఎందుకో తెలుసా..........? నిన్ను అన్విత ప్రేమించకపొతే, నీ ఒక్కడినే అంత దూరం తీసుకెళ్ళి తను వైజాగ్ వెళ్ళిపోతున్నానే విషయం ఎందుకు చెపుతుంది?" ప్రశ్నించాడు సుల్తాన్.
"ఈ పాయింటు నేను ఆలోచించాను. కానీ నేను తొందరపడదలుచు కోలేదు" సీరియస్ గా అన్నాడతను.
"ఫోజు కొట్టకు. ఆలస్యం నీవల్లే జరుగుతోంది. నామీద మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగితే, నీ సొమ్మేం పోతుందిరా" దెబ్బలాడుతున్నట్టుగా అన్నాడు సుల్తాన్.
"అడగొచ్చు. కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్..... ఆ విషయం తెలీడం లేదూ....."
"అయితే ఏమిటి? ఇక్కడ ఇన్ని చాన్సులు వదులుకుని, ఆ అమ్మాయి కోసం వైజాగ్ వెళతావా?"
"తప్పదేమో......"
"అక్కడ కూడా ఇలాగే జరగదని నమ్మకం ఏమిటి? ఇంతకీ ఆ అమ్మాయి ఫోటోలేం చేశావ్?"
"డ్రాయింగ్ రూమ్ లో పెట్టిన ఫోటో ఆ అమ్మాయి చూస్తే వ్యవహారం అక్కడే సెటిలైపోను" కొంచెం విచారంగా అన్నాడు మధు.
"ఓ పనిచెయ్. రేపు ఆఖరి అవకాశం. మిస్ చేసుకోకు. మీ ఫ్రెండ్స్ అందరూ రైల్వేస్టేషన్ కి వెళ్తారు కదా?"
"వెళ్ళొచ్చు."
"నువ్వూ వెళ్ళు. ఆ ఫోటోను కవర్లో పెట్టు. ఆ అమ్మాయికివ్వు. చూసి ఆశ్చర్యపోతుంది."
"తర్వాత?"
"నీ బొంద. తర్వాత ఏంటి? ఎందుకు తీశావో ఆలోచిస్తుంది! ఎలా తీసుంటావో ఆలోచిస్తుంది. ఆ వెనక కారణాల గురించి ఆలోచిస్తుంది అన్నిసార్లు కలిసినా, నువ్వు చెప్పలేకపోవడాన్ని గుర్తిస్తుంది. నీ వ్యక్తిత్వం ఆమెకు కరెక్టుగా తెలుస్తుంది. ఇన్ డైరెక్టుగా నువ్వు చెప్పిన 'ఐ లవ్ యూ' వల్ల ఆమె ఎంతో థ్రిల్లింగ్ గా ఫీలవుతుంది."
"ఒక్క ఫోటో ఇన్ని చెప్తుందంటావా?"
"ఇవే కాదు, చాలా చెప్తాయి చూడు."
రాత్రి పన్నెండు గ్మతల ప్రాంతంలో ఫ్లాట్ కొచ్చిన మధుకి రైల్వే ఫస్ట్ క్లాస్ సీట్లో కూర్చున్న అన్విత, ఆమెకు తను ఫోటో అందజేయడం, ఆమె విస్మితురాలవడం అంచెలంచెలుగా ఊహించుకున్నాడు.
ఐ లవ్ యూ.....
ఐ లవ్ యూ......
చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తున్నట్లుగా చలిచలిగా, వెచ్చవెచ్చగా వుంది ఆ తలపు.
* * *
పట్టాలమీద కొచ్చి ఆగింది ట్రైన్.
అంతకు పావుగంటకు ముందు అన్విత, నాన్నమ్మతో సహా అక్కడ కొచ్చింది.
డాక్టర్ యోగి పక్కనే వున్నాడు.
స్టేషన్ ఎవరూ రారనుకున్న అన్విత, తన క్లాస్ మేట్స్ అందరూ అక్కడకు రావడం చూసి హేపీగా ఫీలయింది.
రవి కూడా రావడం ఆమెకెందుకో నచ్చింది.
అది ఆమె నిష్కల్మషమైన హృదయానికి చిహ్నం.
అందరికీ దూరంగా బుక్ షాప్ దగ్గర నుంచున్నాడు మధు.
పక్కన సుల్తాన్.
ట్రైన్ బయలుదేరడానికి యింకా పదినిమిషాలటైముంది.
ఫ్లాట్ ఫారమ్మీద ఆమె చుట్టూ ఫ్రెండ్స్ గుమిగూడారు.
"మీరందరూ వైజాగ్ రావాలి. వారానికికొకసారి ఫోన్ చేయాలి" అందరివేపూ చూస్తూ అంది అన్విత.
రవి ముందుకొచ్చి-
ఒక చిన్న అగ్గిపెట్టెలాంటి బాక్స్ ని ఆమెకిచ్చి-
"మిస్ అన్విత..... ఒక జ్ఞాపకంగా వుంచండి, దిసీజ్ మై విజిటింగ్ కార్డ్ వీలయితే ఫోన్ చేయండి. వారం రోజుల్లో మీ దగ్గర నుంచి నాకు ఫోను రాకపోతే నేనే ఫోన్ చేసి విష్ చేస్తాను."
"ష్యూర్...... ష్యూర్...." అంది ఆ గిప్టును అందుకుంటూ.
ఫ్రెండ్స్ అందరూ ఒక్కో గిప్టు ఇస్తున్నారు.
"వెళ్ళు....... పక్కకు పిల్చి నీ గిప్టు ఇవ్వు. విప్పి చూడమని చెప్పు" సుల్తాన్ చెప్పడంతో-
ముందుకు నడిచాడు మధు.
తనవేపు వస్తున్న మధును చూడగానే-
"హలో! మీరూ వచ్చారే..... వెరీనైస్ ......" అందామె కళ్ళతోనే నవ్వుతూ.