Previous Page Next Page 
మోహిత పేజి 25


  

       ట్రిగ్గర్ ఆన్ చేస్తూ ముందుకు రాసాగింది. అతను భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళుతున్నాడు. మరో రెండడుగులు మోహిత ముందుకు వేసింది.

 

    అదే రెండడుగులు వెనక్కి వేసిన జయంత్ సడన్ గా కొండ అంచునుంచి జారి మొసళ్ళు వున్న మడుగులో పడిపోయాడు.

 

    కొండల గుహల్లో ధ్వనించిన శబ్దానికి నిద్రిస్తున్న పక్షులు ఒక్కసారిగా లేచిపోయి పెద్దఎత్తున అరవడం ప్రారంభించాయి.

 

    జయంత్ వేస్తున్న కేకలకు ఆ పక్షులు బెదిరిపోయి చెట్లమీంచి ఒక్కసారిగా ఎగిరిపోయాయి.

 

    ఆ దృశ్యాన్ని కసిదీరా చూసి, నడుచుకుంటూ రోడ్డుమీదున్న జీపు దగ్గరకొచ్చింది మోహిత.

 

    జీపుకి చేరబడి మైత్రేయ సిగరెట్ కాల్చుకుంటున్నాడు.

 

    "ఎంతసేపైంది నువ్వొచ్చి....." అడిగిందామె.

 

    "పదిహేను నిముషాల క్రితం....." ఇద్దరూ మసక వెన్నెల్లో మౌనంగా నడుస్తున్నారు. అరగంట గెస్ట్ హౌస్ లో వున్నరిద్దరూ.

 

    అప్పుడు సమయం రాత్రి పదకొండు నలభై అయిదునిముషాలు దాటింది.

 

    గ్లాసులోని డ్రింక్ ను తాగుతోంది మోహిత మౌనంగా. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాడు మైత్రేయ.

 

    "మనం  ఇక్కడికి హనీమూన్ కి రాలేదు. ఇంకో రెండుగంటల్లో ఇక్కడి నుంచి మనం బయల్దేరుతున్నాం" చెప్పింది మోహిత.

 

    అరగంట తర్వాత బాత్రూమ్ లో కెళ్లి షవర్ విప్పిందామె.

 

                                            *    *    *

 

    తెల్లవారు జామున మూడుగంటలు దాటుతున్న సమయం.

 

    గెస్ట్ హౌస్ నుంచి కారు స్టార్టయింది. అంతకు ముందు వాచ్ మెన్ చేతిలో ఐదువేలు పెట్టి-

 

    "పోలీసులుగానీ, యింకెవరయినా గానీ వచ్చి అడిగితే, ఈ గెస్ట్ హౌస్ లో దిగిన భార్యాభర్తలు సాయంత్రం ఆరుగంటలకే ఖాళీచేసి వెళ్ళిపోయారని చెప్పాలి. తెల్సిందా....." చెప్పింది మోహిత.

 

    "ఎస్ మేడమ్!" అన్నాడు వాచ్ మెన్  ఆ ఐదు వేల నోట్లని అందుకుంటూ.

 

    
                                           *    *    *

 

    ఆత్మకూరు, కర్నూలు రోడ్ లో దూరంగా ఒక గ్రామం. ఆ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న పాడుబడ్డ  పాతకాలం నాటి కోట.

 

    కోట మెయిన్ గేట్ దగ్గర కారాపింది మోహిత.

 

    కోటకు దూరంగా చెరువు..... ఆ చెరువులో రత్నాల్లా మెరుస్తున్న కలువపూలు.... అటూ యిటూ కొండలు.

 

    "ఇక్కడ ఆగావేమిటి? ఇక్కడెవరున్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు మైత్రేయ.

 

    "నాకీ ప్లేసంటే చాలా ఇష్టం..... రెండేళ్ళ క్రితం రాజేంద్రకుమార్ కి ఏదో పనుండి ఈ ఏరియాకొచ్చినప్పుడు, ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశాం" చెప్పింది మోహిత.

 

    'తనతో ఎంజాయ్ చేయడానికి యిక్కడికి తీసుకొచ్చిందా?' ఆలోచిస్తున్నాడు మైత్రేయ.

 

    లోపలికి నడిచారిద్దరూ....

 

    ఎత్తయిన స్తంభాలు.... పాడైపోయిన ద్వారాలు.....

 

    వేలాడుతున్న గబ్బిలాలు..... పెచ్చులూడిపోతున్న గచ్చులు.....

 

    ఇది ముస్లిం బాదుషాల కోట...... యిది రాజమహల్.... ఆ పక్కన రాణీమహల్.... ఆ వెనక తోట..... ఆ వెనక నాట్యశాల....." చెప్తోంది మోహిత.

 

    "నీకు హిస్టరీ అంటే  ఇష్టమా?" విశాలమయిన మెట్లమీద స్తంభానికి అనుకుని కూర్చుంటూ అడిగాడు మైత్రేయ.

 

    "అవును. హిస్టరీలోని మిస్టరీ అంటే యిష్టం" అంటూ-

 

    "నేనూ చెరువులో స్నానం చేస్తాను.  ఈ లోపల నువ్వు వూళ్ళోకెళ్ళి టిఫిన్ తెస్తావా?" అందామె.

 

    "నేనూ స్నానం చేస్తాను" అన్నాడతను.

 

    "నాతో జంటగానా..... అయితే నగ్నంగా చేస్తావా.....? ఎవరూ లేని ఈ నిర్జీవమయినా కోటలో, నగ్నంగా తిరిగితే ఎంత బావుంటుందో నీకు  తెలుసా.....?" నగిషీలు చెక్కిన కోట గోడల వేపు చూస్తూ అంది మోహిత.

 

    "పల్లెజనం చూస్తే.... పిచ్చివాళ్ళనుకుని, పిచ్చికొట్టుడు కొడతారు" సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు మైత్రేయ.

 

    "సౌందర్యసాధన ఒక్కొక్కప్పుడు పిచ్చతనంలా కన్పిస్తుంది కదా" ఆమెకు బదులివ్వలేదతను.

 

    అతనికంతా అగమ్యంగా వుంది.

 

    ఊళ్ళోకెళ్ళి టిఫిన్ తెచ్చాడు.....

 

    ఇద్దరూ తిన్నాక-

 

    "మన ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు మైత్రేయ.

 

    "ఇప్పటికేమీ అనుకోలేదు..... కాసేపు ఆ ప్రోగ్రాం విషయం మర్చిపో.... రా..... చెరువు దగ్గరికెళదాం!" అంటూ చెరువువైపు నడిచింది మోహిత.

 

    ఆమె వెనకే నడిచాడు మైత్రేయ.

 

    ఇప్పటికే మూడుహత్యలు జరిగాయి..... ఒకరు కర్నాటకలో చనిపోతే, యిద్దరు ఆంధ్రప్రదేశ్ లో చంపబడ్డారు..... ఈ పాటికే అటు కర్నాటక పోలీసులు..... యిటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగే వుంటారు...... ఏమాత్రం 'క్లూ' దొరికినా మోహితను అరెస్ట్ చేయటం ఖాయం...... ఆమెతో పాటు తనను కూడా అరెస్ట్ చేస్తారు...... తన జీవితం ఎటువేపు వెళ్లనుంది.....? ఈమె తనను ఏ దిశకేసి తీసుకెళ్లనుంది.....? ఈమెకు తను ప్రియుడా? పెళ్ళి చేసుకోబోయే భర్తా....? ఈమె వ్యక్తిత్వం నచ్చా? లేక ఈమె అందమయిన శరీరం మీద మోజుతోనా.....? ఏమీ అర్థంకాని, అర్థం చేసుకోలేని అయోమయస్థితిలో తనిప్పుడు కూరుకుపోయాడు. సరదాగా ఎక్కడో, ఏ పత్రికో చూసి  వేసిన మొదటి అడుగు ఇక్కడివరకు తీసుకొస్తుందని, తనేమాత్రం వూహించలేదు.

 

                                           *    *    *

 

    మధ్యాహ్నం మూడుగంటల సమయం.....

 

    దట్టమయిన చెట్లమధ్య చీకటి అస్పష్టంగా కమ్ముకుంది.

 

    చీరతోనే చెరువులో స్నానం చేసొచ్చి, ఒడ్డున కూర్చుంది.

 

    "టవల్ ఇవ్వనా?" అడిగాడు మైత్రేయ.

 

    "నీళ్ళేగా ఆరిపోతాయి..... స్నానం చేశాక, ఇలా వంటిమీద నీళ్ళతో చల్లగాలిలో, ఏకాంతంగా కూర్చోవడం నాకిష్టం."

 

    చెరువులో స్నానం చేసి, టవల్ తో ఒళ్ళంతా తుచుకుని, ఫాంట్ వేసుకుంటున్నాడు మైత్రేయ.

 

    "షర్టు వేసుకోకుండా అలా నా ఎదురుగా కూర్చో..... ఆచ్ఛాదన లేని మగవాడి వక్షస్థలాన్ని చూడడం, ఆడవాళ్ళకు సరదాగా వుంటుంది" అతని వక్షస్థలం మీద నిగనిగ మెరుస్తున్న వెంట్రుకలవైపు చూస్తూ అంది మోహిత.

 

    మొదటిసారి మగవాడిగా సిగ్గుపడ్డాడు మైత్రేయ.

 

    "నీవన్నీ ఎంత వింత సరదాలు....." అన్నాడతను.

 

    అతని వక్షస్థలంమీద ముద్దుపెట్టుకుంది.

 

    "బావుందా?" అని అడిగింది.

 

    "నాకూ ఇలాగే చెయ్యాలని వుంది" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.

 

    "ఎన్నాళ్ళకి ధైర్యంగా  ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ చేశావయ్యా మగడా, ముద్దే కదా..... పెట్టుకో....." అందామె నవ్వుతూ.

 

    ఆడది సిగ్గుపడితేనే మగాడు ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆడది ధైర్యంగా ఆహ్వానిస్తే మగాడిలో సంకోచం పెరుగుతుంది.

 

    ప్రస్తుతం మైత్రేయ పరిస్థితి అలాగే వుంది.

 

    ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చేతిమీద ముద్దు పెట్టుకున్నాడు.

 

    "నీ ముద్దు వేడిగా వుంది" అందామె.

 

    "వేడి ముద్దులో స్వేచ్ఛమయిన ప్రేమ వుంటుంది" అన్నాడతను.

 

    "నడివయసు ముద్దులు వేడిగా వుండవా....." అంటూ గవ్వలు మువ్వలమీద పడుతున్నట్లుగా నవ్వింది మోహిత.

 

    "జయంత్ నిజంగా చచ్చిపోయాడంటావా?" అడిగాడు మైత్రేయ హఠాత్తుగా.

 

    "గుడ్..... నువ్వీ డౌటును ఎక్స్ ప్రెస్ చేస్తావని నేనూహించలేదు. బట్..... నాకూ ఆ డౌటుంది. చాలాసేపటినుంచి నేనూ అదే ఆలోచిస్తున్నాను" అందామె.

 

    "ఇలాంటిదేదైనా జరిగితే పేపర్లో న్యూస్ వస్తుంది కదా! రేపు పేపర్ని చూస్తే తెలుస్తుంది కదా" అన్నాడు మైత్రేయ.

 

    "అవును. రేపటివరకూ ఆగాలి" గాఢంగా వూపిరి పీలుస్తూ అంది. రెండు గంటలకి వాళ్ళ కారు కర్నూలు చేరుకుంది.

 

    "ఈ రోజు రాత్రి ఇక్కడ హొటల్లో వుందాం, రండి" అంది మోహిత.  

 

    మోహిత ఆ రాత్రి జిన్ తాగి పడుకుంది. మైత్రేయకి రాత్రంతా నిద్రపట్టలేదు. రకరకాల ఆలోచనలతో గడిపాడతను.

 

                                          *    *    *

 

`    మైత్రేయ ఆరుగంటలకు హోటల్లోంచి బయటకొచ్చి డైలీపేపర్ తీసుకుని తిరగవేశాడు ఆతృతగా.

 

    జిల్లా ఎడిషన్లో కన్పించిన న్యూస్ ఐటమ్ ని గబగబా చదివాడు మైత్రేయ.

 

    అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయిన శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీసర్.....

 

    శ్రీ శైలం ఫారెస్ట్ ఆఫీసర్ గా  పనిచేస్తున్న సి. జయంత్ ని ఈ నెల 11వ తేది ఉదయం శ్రీ శైలం అడవుల్లోని జలాశయం పక్కన పోలీసులు కనుగొన్నారు. ఈ నెల 10వ  తేదీన ఆఫీసునుంచి బయలుదేరిన జయంత్ కొండమీద గెస్ట్ హౌస్  లో ఇద్దరు అపరిచిత వ్యక్తుల్ని కలిసాడని, ముగ్గురూ కొండమీద గెస్ట్ హౌస్ లో  మందుపార్టీలో పాల్గొన్నారని, తర్వాత జయంత్ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైనఒక మహిళతోపాటు మొసళ్ళ పార్క్ వద్దకు వెళ్ళాడని, ఆ ఇద్దరు  వ్యక్తులూ అక్కడ తాగారని జీపుడ్రైవర్ చెప్పాడు.

 

    కాగా జయంత్ కి స్త్రీ వ్యసనం వుందని, అతనితో వెళ్లిన యువతి వ్యభిచారిణిగా, ఆమెతో వున్న యువకుడు బ్రోకర్ కావచ్చని పోలీసుల ప్రాధమిక అంచనా. ఇదిలా వుండగా , గుండెమీద, భుజంమీద రెండు గాయాలను పోలీసులు గుర్తించారు.

 

    కాగా జయంత్ తల బండరాళ్ళకు ఢీకొనడం వల్ల స్పృహ కోల్పోయాడని, అతనిమీద హత్యాప్రయత్నం జరిగిందా, లేక ఇతర కారణాలేవైనా వున్నాయో అనే విషయమయి దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. జయంత్ ణి హుటాహుటిన హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అతనికి ఇరవై నాలుగు గంటల్లో స్పృహ రావచ్చని డాక్టర్లు తెలిపారు.

 

    ఆ వార్తను రెండుమూడుసార్లు చదివాక "మనం వూహించింది నిజమయింది కదూ!" అంది మోహిత.

 

    "ఇప్పుడేం చేద్దాం?"

 

    "జయంత్ స్పృహలోకొస్తే చాలా డేంజర్..... అతడు శాశ్వతంగా నిద్రపోయేటట్టు చెయ్యాలి."

 

    "అంటే....."

 

    "నిమ్స్ ఆస్పత్రిలోంచి అతడు బయటికి రాకూడదు" స్థిరనిశ్చయంతో అంది మోహిత.

 Previous Page Next Page