Previous Page Next Page 
ముగ్ధ పేజి 25

 

     "మిమ్మల్ని ఫూల్ చేసే వ్యక్తిలా కనిపిస్తున్నానా నేను? అంత అనుమానంగా వుంటే మా కాటేజ్ కి రండి."
    
    "నాకు అనుమానం లేదు కానీ..."
    
    "నేనొక అపరిచిత వ్యక్తినే కాదనటంలేదు ఇద్దరు స్నేహితుల్ని చూసి వాళ్ళిద్దరూ స్నేహితులని అన్నామనుకోండి. కానీ ఒకప్పుడు వాళ్ళిద్దరూ అపరిచిత వ్యక్తులేకదా! ఒక వ్యక్తిమీద యింకొక వ్యక్తికి నమ్మకంలేని, నమ్మకం కలిగించని ఆటవిక విద్యావిధానమా మీకు పోస్టుగ్రాడ్యుయేషన్ ఇచ్చింది? మీ ప్రాబ్లెమ్ ఏమిటో నాకు తెలీదు. కానీ మీ క్వాలిఫికేషన్స్ కు తగ్గట్టుగా, మీ వయసుకు తగ్గట్టుగా మీరెప్పుడైనా కష్టపడాలని ఆలోచించారా? ఏదో డెబ్బయ్యేళ్ళ ముసలివాడు తన పొట్టకోసం మాత్రమే తాపత్రయ పడేటట్టుగా ప్రవర్తించడం మీకు సిగ్గుగా లేదూ... చెప్పండి? చదువుకున్న నిరుద్యోగులందరూ మీలా నిరాశతోనూ, పిరికితనంతోనూ గుట్టుచప్పుడు కాకుండా బతకడంలోనే హాయి వుందంటారా?"
    
    సీరియస్ గా ప్రశ్నిస్తున్న ముగ్ధవేపు సూటిగా చూశాడు రాజేంద్రప్రసాద్.
    
    "నేనేం నిరాశతోనూ, పిరికితనంతోనూ ఇలా బతకడం లేదు మిస్ ముగ్దా! మోసపోయి బతుకుతున్నాను. మోసాన్ని నా మంచితనంతో జయించలేక, వంచితుడినై పారిపోయొచ్చి ఇక్కడ తలదాచుకున్నాను. అంతే" తన అనుభవాల్ని అస్పష్టంగా చెప్పాడు ముగ్ధకు.
    
    ఆ మాత్రం అతని మాటలు చాలు అతని గురించి పూర్తిగా తెల్సుకోడానికి.
    
    "సమస్యల నుంచి పారిపోవడాన్నే పలాయనవాదం అంటారు. ఎంతో శక్తివంతమైన యువతరం పలాయనవాదంలోకి జారుతుంటే, ఈ దేశం ఏమవుతుందో ఆలోచించారా? చదువుకున్న వాళ్ళంతా ఇలా తయారవుతుండబట్టే మనదేశం ఇంత అధ్వాన్నంగా వుంది. ఒక్కరికీ బాధ్యత లేదు. ఒక్కరికీ టైం విలువ తెలీదు.
    
    ఎదుగుతున్న యువతరం కాలంతోపాటు పరుగెత్తడం నేర్చుకోవాలి. ఊహలు కంటూ కలల్లో మేడలు కడుతూ కూర్చుంటే వాస్తవం ఎప్పుడూ తాబేలులాగే వుంటుంది.
    
    టైం ఈజ్ మోర్ దేన్ మనీ నిజంగా కాలం ఎంతో విలువైంది. దాన్ని సంవత్సరాలతో కాదు, క్షణాలు, నిమిషాలతో కొలవడం నేర్చుకోవాలి. ఒక్క క్షణం వృధా అయినా దాన్ని తిరిగి తీసుకోలేం కావాలని రివైండ్ చెయ్యలేం. ఫాస్ట్ ఫార్వర్డుకూడా చెయ్యలేం. అందుకే ప్రతి నిమిషం అతి విలువైనదే టైమ్ ఈజ్ మనీ అంటున్నా నిజానికి టైమ్ ఈజ్ లైఫ్ ఇట్సెల్ఫ్ అనుకోవాలి. అదే నిజంకూడా, మీరు చూడండి- ఎం.కామ. చదివి-చదువు లేనివాళ్ళు, వృద్దులు మాత్రమే చేయతగ్గ వ్యాపారం చేస్తున్నారు అలా అనిపించలేదా మీకెప్పుడూ?
    
    కాలం అందుబాటులోవుంటే దాన్ని డబ్బిచ్చి కొనడానికి చాలా మంది సిద్దంగా వుండేవాళ్ళుంతారు. కానీ కాలాన్ని ఎవరూ అమ్మలేరు, కొనలేరు కాలం అనంతమైనది. దాంతోపాటు స్వల్పాతి స్వల్పమైనది కూడా ఒక క్షణాన్ని మనకు ఇచ్చినట్లే ఇచ్చి, ఆ క్షణాన్ని ఉపసంహరించుకున్న తర్వాతగానీ, మరొక క్షణాన్ని మనకు ఇవ్వదు కాలాన్ని ఎవ్వరూ జయించలేరు. దాన్ని ఎవరూ శాసించలేరు. కాలాన్ని ఎక్కడయినా దాచుకోడానికి వీల్లేదు అందుకే-
    
    మన చేతుల్లో లేని కాలాన్ని మనం ఎప్పుడూ సద్వినియోగం చేసుకోడానికే ప్రయత్నించాలీ.
    
    మనిషి మేధస్సు, పరిజ్ఞానం పరిమితమైనవి రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ రహస్యాన్ని విప్పి చెప్పగల నేర్పు కాలానికే వుంది. 'సూర్యుడస్తమిస్తున్నాడు- సమయాన్ని వృధా చెయ్యకు' అని చైనా సామెత కాలం ఇంత విలువైనదని తెల్సికూడా కొంతమంది ఏం తోచడంలేదు-బోర్ కొడుతోంది అంటారు. వీళ్ళకు బోర్ కొడుతోందాని ఇంకొకళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళకు బోర్ కొడతారు. ఒకరి డబ్బును దోచుకోవడం ఎంత నేరమో, ఒకరి సమయాన్ని దోచుకోవడం కూడా అంతే నేరం.
    
    మనిషికి ఏకైక స్నేహితుడుకాలమే ఒక లక్ష్యం, ఒక ఆశయం వున్నవాళ్ళు అసలు టైమ్ వేస్ట్ చెయ్యకూడదు. డబ్బును పొడుపు చేసుకున్నట్లే కాలాన్ని కూడా పొడుపు చేసుకోవాలి. వాటిని వినియోగించుకోవాలి. బాగా అభివృద్ధిలోకి రావాలంటే, టైమ్ ను వినియోగించుకోవడంతోపాటు స్పేర్ టైమ్ ని కూడా వినియోగించుకోవాలి. ఎంత బిజీగా వుండేవాళ్ళకయినా కొంత స్పేర్ టైమ్ ఉంటుంది. స్పేర్ టైం రోజుకు మూడుగంటలు వుందనుకుందాం ఈ మూడు గంటల్లో సగంసేపు అయినా, తనను తాను అభివృద్ధి పరుచుకొనేందుకు కృషి చేయాలి. అందుకు సంబంధించిన పుస్తకాలు చదవటం, విషయజ్ఞానం సంపాదించటం అవసరం. అలా చెయ్యగలిగితేనే, ఈ పోటీ ప్రపంచంలో మిగిలిన వాళ్ళకన్నా ముందు వుండగలం రోజుకు గంటా, రెండు గంటలు స్పేర్ టైంను కేటాయించినా, అయిదేళ్ళ తర్వాత చూసుకుంటే ఈ స్పేర్ టైం ద్వారా సాధించింది ఎంతో వుంటుంది. అలాగే మెదడును పదునుపెట్టె పనులు చెయ్యడం అలవాటు చేసుకోవాలి. వీలున్నంతవరకూ యాంత్రికమయిన పనికి భిన్నంగా వుండే సృజనాత్మకమైన పని చెయ్యడానికి పూనుకోవాలి. ముఖ్యంగా యువతరం ఒక లక్స్య్మతో కాలాన్ని సద్వినియోగం చేసుకోడానికి నిరంతరం కృషి చేస్తే అనుకున్న విజయాలు సాధించడానికి వీలవుతుంది. టైమ్ విలువ గురించి నాకెంతో తెల్సని మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచటానికి ఇదంతా చెప్పలేదు మిస్టర్ ప్రసాద్! ఎంతో చదివిన మీరు, ఏదయినా చేయదగ్గ అర్హతవున్న మీరు, కేవలం పూజా సామాన్లు అమ్మతంతో కాలాన్ని సమాధి చేసుకుంటున్నారనే నా బాధ ఇంతకంటే కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోలేరా?"
    
    ఆమె వాగ్ధాటికి రాజేంద్రప్రసాద్ బిక్కమొహం వేసాడు ముందు.
    
    "నాకు టైం విలువ తెల్సు ఇన్నేళ్ళుగా నా పర్సనల్ లైఫ్ లోకి ఎవ్వర్నీ రానివ్వలేదు నేను అనుకోకుండా మీరొచ్చారు. వెరీ కైండ్ ఆఫ్ యూ! కానీ, మీరనుకున్నట్టు నిరాశావాదిని కాదు, పలాయనవాదినీ కాదు, పిరికివాణ్ణీ కాదు. కాలం విలువ తెలీనివాడ్ని అంతకంటే కాదు."
    
    "మరీ?" రాజేంద్ర ప్రసాద్ తన గ్రిప్ లోకి వస్తున్నాడన్న విషయం తెలియగానే ముగ్ధ మనసు ఆనందంతో నిండిపోయింది.
    
    "టైం విలువ తెల్సు కాబట్టి ఇప్పుడు నేను లంచ్ చెయ్యాలి. లంచ్ తర్వాత మళ్ళీ ఇక్కడే వుంటాను. సాయంత్రం వరకూ ఈ వస్తువుల్ని అమ్ముకుంటూ, అప్పుడు రండి మనం లీజర్డ్ గా మాట్లాడుకుందాం" అని అతను మూటను భుజానికి తగిలించుకుని ముందుకెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వేపే చూస్తోంది ముగ్ధ.
    
                                     *    *    *    *    *
    
    వారం రోజులవరకూ గడువు విధించిన శ్రీధర్, ఒక రోజుకూడా పూర్తికాక మునుపే రావడంతో ఆలోచనలో పడింది సురభి.
    
    "ఒక యాక్షన్ జరగ్గానే, దాని రియాక్షన్ గురించి వెంటనే పరిశీలిస్తాడు సైంటిస్ట్ అలాగే నీ ప్రశ్నకు రాత్రంతా జవాబు ఆలోచించాను. నా నిర్ణయాన్ని చెప్పేముందు నా గురించి చెప్తాను విను నేను తీసుకున్న నిర్ణయం నీకు ఆనందం కలిగించినా, బాధ కలిగించినా నేను తీసుకున్న నిర్ణయం వెనక నేననుభవిస్తున్న బాధకు పరిష్కారం ఇంకేదైనా వుందేమో కూడా ఆలోచించు. నా పాయింట్ నీకు అర్ధమైందనుకుంటాను?"
    
    ఆ మాటన్న శ్రీధర్ ముఖంవేపు ఒక్కక్షణం చూసింది. ఆ ముఖంలో ఏ భావమూ కన్పించలేదు.
    
    శ్రీధర్ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.

 Previous Page Next Page