కనీసం కోటి ఇరవై లక్షలు ఖరీదుచేసే అందమైన తాతగారి కారు పాడవటంతో వాషింగ్ క్లాత్ తో, తను దాన్ని తుడుస్తుండగా, వెనుక నుంచి తాతగారు వచ్చి, సుతారంగా తన నుదుటికి పట్టిన స్వేదాన్ని అద్దారు.
తనకదో మధురమైన సంఘటనగా మనస్సులో మిగిలిపోయింది.
సరిగ్గా అదే ఫీలింగ్ కలిగింది కొద్దిసేపు క్రితం మాధుర్ అద్దుతుండగా.
ఆమెకే ఆశ్చర్యమనిపిస్తోంది. ఆమెకు తెలీకుండానే విచిత్రమైన అనుభూతులకు తను గురికావటం!
ఎదురుపడుతున్న కొత్త కొత్త అనుభవాలు, అనుభూతులు ఆమెకు థ్రిల్లింగ్ గా అనిపిస్తున్నాయి.
"ఇంత నాజూగ్గా వున్నావు. మాతో కలిసి పనిచేయగలవా?"
తలాడించింది తప్పక చేస్తానన్న భావాన్ని కళ్ళలో పలికిస్తూ.
"నీ పేరేంటీ? సారీ.... మీ పేరేంటి?"
"మొదటి రకంగానే పిలవండి" అందామె నిచ్చెన దిగుతూ.
"అలాగే నువ్వు ఆ అండీ తీసేసి మాధుర్ అను చాలు. అవునూ, నీ పేరేంటి ఇంతకీ?"
"మౌనిక."
మాధుర్ కి ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించిందో క్షణం.... కొద్దిక్షణాలు అరమోడ్పు కన్నులతో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.
అప్పటికిగాని మౌనికకు తను చేసిన తప్పు తెలిసిరాలేదు. అనుకోకుండా తొందరలో తను పేరు చెప్పేసింది.
మాధుర్ కొన్నాళ్ళు తన ఎంఫైర్ లో జాబ్ చేశాడు. తన పేరు వినకుండా వుంటాడా? ఆమె ఆలోచిస్తూ భయపడింది.
"ఆ... ఇప్పుడు గుర్తుకొచ్చింది.... మౌనిక.... ది గ్రేట్ జె.జె. మనుమరాలి పేరు మౌనికే..." అని మౌనికకేసి చూసి నవ్వుతూ.... "కొంపదీసి నువ్వు ఆమె కాదుగదా?" అన్నాడు మాధుర్.
తనలో కలిగిన కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ "జె.జె. ఎవరు? ఆయన గ్రాండ్ డాటర్ ఎవరు?" అంది. అమాయకంగా కనురెప్పల్ని అల్లల్లాడిస్తూ మౌనిక.
"జె.జె. అంటే టాటాస్ ని, బిర్లాస్ ని కలిపితే అంతకు సరిపడే గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్."
"సర్లెండి... ఫుడ్ కి డింకీలు కొడుతుంటే మీరిలా జోకులేయడం న్యాయమేనా?" బుంగమూతితో అంది మౌనిక టెన్షన్ ఫీలవుతూ.
మాధుర్ నవ్వేశాడు.
"తమాషాగా అన్నాను....అసలా మౌనికే వచ్చివుంటే నాలుగు దులిపేసి వుండేవాడ్ని...." అన్నాడు మాధుర్ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.
"మౌనికనే పేరు పెట్టుకునేందుకు ఆమె ఒక్కదానికే హక్కు వుందా? ఏం.... వాళ్ళకు డబ్బులుంటే ఎవరికీ భయం? ఐ డోంట్ కేర్! వూరికే ఏమన్నా పెడుతున్నారా?" కావాలనే ఒకింత ఆగ్రహాన్ని తనూ వ్యక్తం చేస్తూ అంది.
"సరదాగా అన్నాను....ఏమనుకోవద్దు" అన్నాడు మాధుర్ నవ్వుతూనే.
"ఆమెను దృష్టిలో పెట్టుకోకుండా చెప్పండి....నా పేరెలా వుంది?" చిన్నపిల్ల అడిగినట్లు అడిగింది మౌనిక.
తృటిలో ప్రమాదం తప్పిపోయినందుకు, మాధుర్ మరింత లోతుకు వెళ్ళనందుకు ఆమెకు ఆనందంగా వుంది.
"చక్కని పేరు! నీకు తగ్గ పేరు! నువ్వు సగం మాటలు సైగల ద్వారా మౌన్మగా వ్యక్తం చేస్తున్నప్పుడే అనుకున్నాను, అలాంటి పేరేదో అయితే బావుండని.... చూసేపెట్టారు మీ పెద్దవాళ్ళు."
మాధుర్ కాంపౌండ్ వాల్ కేసి నడుస్తుంటే, ఆ ఇద్దరూ అతని వెనుకే వెళ్ళారు.
"నే చెప్పేది కరెక్ట్ గా అదిగో ఆ వైట్ వాష్ మీదే రాయాలి అందంగా" అన్నాడు మాధుర్. అంతకు క్రితంరోజే వైట్ వాష్ వేసున్న ప్లేస్ ని చూపిస్తూ ఆమె అలాగే అన్నట్లు తలూపింది హుషారుగా.
Doing business without advertising is like winking at a girl in the dark. you know what you are doing. but no body else does.
అది వింటూనే ఓ అద్భుతమైన క్రియేటివ్ జీనియస్ ని చూసిన ఫీలింగ్ కి గురయిందామె.
ఎంత అర్ధవంతమైన స్లోగన్?!
"ముందు మరేదో అనుకున్నాను కాని నిన్ను చూడగానే ఇదయితే బావుంటుందాని అనిపించింది. ఎలా వుంది...?" మాధుర్ అడిగాడు మౌనికను.
"అద్భుతంగా వుంది" అందామె ఆనందంగా.
"భార్గవా నీకు అర్ధమయిందా?" మాధుర్ భార్గవకేసి చూస్తూ అడిగాడు.
భార్గవ కంతగా ఆంగ్ల పరిజ్ఞానం లేదు. అందుకే అర్ధం కాలేదన్నట్లుగా సైగ చేశాడు.
"ప్రచారం లేని వ్యాపారం ఎలా వుంటుందంటే- చీకట్లో ఆడపిల్ల ముందు నించుని కన్ను గీటినట్లు. నీకు తెలుసు నువ్వేం చేశావో! కాని మరెవరికీ తెలీదుగా?"
A hint given by motion of the eye.
అతనా అమ్మాయికి చెప్పదల్చుకున్నది చీకటి కావడంతో ప్రయోజనం లేకపోయింది. అలాగే మేన్యూఫాక్చరర్ వర్సెస్ కన్స్యూమర్. ఉత్పత్తిదారుడేం తయారుచేస్తాడో వినియోగదారుడికి తెలీనప్పుడు ప్రయోజనం శూన్యం అని అర్ధం."
భార్గవ మాధుర్ వైపు ప్రశంసగా చూశాడు.
ఆమె గోడమీద వ్రాయడం ప్రారంభించింది.
ఏదో ఖాళీ సమయాల్లో సరదాగా తన తాతగారి ఫ్రెండ్ ఒకాయన మంచి చిత్రకారుడంటే- ఆయన దగ్గిర నేర్చుకుంది పెయింటింగ్ మెత్తటి కాన్వాస్ క్లాత్ వేరు- గరుగ్గా వుండే గోడ వేరు.
పెయింటింగ్ సర్ఫేస్ పెరగడంతో ఆమె యిబ్బంది పడుతూ రాస్తోంది.
రాస్తూనే ఆలోచిస్తోంది...
గోడౌన్స్ లో మిగిలిపోయిన వ్యాన్స్ ని అమ్మేందుకు మాధుర్ ఏం ప్లాన్ చేశాడు. ఎలా చేశాడు? అదిప్పుడు తను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
తను ఫలానా అని ఏమాత్రం తెల్సినా తన ప్రయత్నం, పథకం మొత్తం నీరుగారి పోతాయి.
ప్రస్తుతానికైతే ప్రమాదం తప్పిపోయింది. ముందు ముందు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి.
తను పోతూ పోతూ తీసుకెళ్ళిన ఫైల్ లో జె.జె. వ్యాన్స్ ఎలా అమ్మవచ్చని ప్లాన్ చేశాడు? ఎడ్వర్టయిజింగ్ కేంపైన్ ఎలా ప్లాన్ చేశాడు?
తను వేసే రెండో స్టెప్ కూడా సరిగ్గా పడాలి.... ఆమె స్లోగా రాస్తూ వేగంగా ఆలోచిస్తోంది.
* * * * *
"సార్! ఈ నెల ప్రోగ్రెస్ చెప్పమంటారా?" పర్సనల్ సెక్రటరీ వినయంగా వంగి అడిగాడు.
భరద్వాజ కనుబొమలు ఒకింత పైకి లేచాయి ప్రశ్నార్ధకంగా.
"నాకు ముందుగా చెప్పవలసింది మన అభివృద్ధి గురించి కాదు. మన శత్రువుకి తగిలే నష్టం గురించి..." ఆనవాయితీని ఎందుకు తప్పావన్న కించిత్ కోపం, అసహనం తొంగిచూశాయి భరద్వాజలో.
అతను వెంటనే సర్దుకుంటూ మరో ఫైల్ ఓపెన్ చేశాడు.
కొన్నివేల వ్యాన్స్ గోడౌన్ లోపడి మూలుగుతున్నాయి... దాని గురించే ది గ్రేట్ జె.జె. వ్యధ చెందుతున్నట్టు తెలియవచ్చింది. వృద్దాప్యం ఆయన్ని కృంగదీస్తోంది. దాని మూలంగానో- మరింకేదైనా కారణం వుందో తెలీదుగానీ డెసిషన్స్ అంత ఫాస్ట్ గా తీసుకోవడం లేదని తెలియవచ్చింది. ఆ వ్యాన్స్ మరో నెలలో సేల్ అవ్వకపోతే భారీ ఎత్తున నష్టం సంభవించవచ్చు.
"ఆ ఎంపైర్ కి కాబోయే యువరాణి పరిస్థితేమిటి...?" భరద్వాజ నుదుటిని చూపుడువేలితో రుద్దుకుంటూ అడిగాడు.
"ఆమె పరిస్థితిప్పుడు ఆగమ్యగోచరంగా వుంది. ధైర్యంగా ఏ నిర్ణయాలు తీసుకోలేక పోతోంది. ఏ పనీ వెంటనే చేయలేకపోతోంది. వారసత్వపు సంధిలో ఒడ్డుకు చేరుకోలేక హడలిపోతోందని తెలియవచ్చింది."
"శభాష్! నా చిరకాల వాంఛ నెరవేరే రోజు అతి త్వరలోనే రాబోతోంది..." భరద్వాజ కళ్ళు విచిత్రంగా మెరిశాయి.
సెక్రటరీ ఓ క్షణం భయపడ్డాడు. భరద్వాజ కళ్ళలో కనిపించిన ఎరుపు జీరను చూసి.
మరో విషయం చెప్పాలని అతను ప్రయత్నిస్తూ సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతుండగా భరద్వాజ రిలాక్సింగ్ మూడ్ లో "ఇంకేమయినా చెప్పాల్సింది వుందా?" అన్నాడు.
"మొదటి ఫేజ్ పూర్తయింది. ఆనవాయితీ ప్రకారం మన గురించి, మన సంస్థ గురించి కూడా చెప్పాలి గదా....?" అతను భయపడుతూనే అన్నాడు.