Previous Page Next Page 
మొగలిబాకు పేజి 25

  

     "ఈ ఐదు వందల ఫైన్ ఐడియాకూడా ఇప్పుడే వచ్చిందా" కుతకుత లాదిపోతూ అడిగింది సంధ్య.
   
    "ఈ రూల్ కొత్తదికాదు.....పాతదే.....ప్రేమయేవ జయతే" అని సంధ్య తలమీద చెయ్యిపెట్టి ఆశీర్వదించింది మోతీలక్ష్మి.
   
    "లాభంలేదు.....మిమ్మల్నందర్నీ.....కొన్నాళ్ళయ్యాక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిందే తప్పదు" అంటూ విసురుగా బయటకు వెళుతుండగా సంధ్యకు ఎదురుగా వచ్చి నిలబడింది మోతీలక్ష్మి.
   
    "ఏమిటి___ఇంకా ఏవయినా సంస్కృత శ్లోకాలు చదువుతావా" అడిగింది సంధ్య.
   
    "లేదు....మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ, వూరు విడిచి వెళ్లిపోతామనే ప్లాన్ వేయకూడదు తెల్సిందా.....ముందే హెచ్చరిస్తున్నాను__జాగ్రత్త" అని చెప్పి లోనికెళ్ళిపోయింది మోతీలక్ష్మి.
   
    మోతీలక్ష్మి ఇంటినుంచి బయటికొచ్చి ఫుట్ పాత్ మీద ఆలోచించుకుంటూ నడుస్తుంది సంధ్య.
   
    మోతీలక్ష్మి చేసిన హెచ్చరిక గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది సంధ్య.
   
    "వార్నింగ్ పేరిట మంచి సలహా ఇచ్చావుకదే" అని అనుకుందామె.
   
    ఎవరికీ చెప్పకుండా మూడో కంటివాడికి కూడా తెలీకుండా......కొన్నాళ్ళపాటు ఎక్కడికయినా వెళ్ళిపోయి, రహస్యంగా దాగుండిపోతే ఈ గొడవంతా తప్పిపోద్ది ఒక నెలరోజుల తర్వాత వస్తే ఈ లవ్ గేమ్ ఆవేశం స్టూడెంట్స్ లో చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆ నారాయణరావు పీడకూడా విరగడై పోతుంది....
   
    ఇలా ఆలోచనలమీద, ఆలోచనలతో బస్టాపులోకొచ్చి అప్పుడే వచ్చి ఆగిన సిటీబస్సు ఎక్కింది సంధ్య.
   
    తలెత్తి కండక్టర్ వేపు చూసి కెవ్వుమని అరిచింది.
   
    కండక్టర్ పరకాయమణి, సంధ్యను చూడగానే ఉత్తేజితుడైపోయి "ప్రేమా జిందాబాద్" అని అరిచాడు.
   
                                                *    *    *    *
   
    రాత్రి ఏడుగంటలు దాటింది.
   
    రామకృష్ణా బీచ్ దాదాపు నిర్మానుష్యంగా వుంది. అంతకుపూర్వం గంటనుంచీ ఇసకలో కూర్చుని అన్ని రకాలయిన కబుర్లూ ఆడుకుంటున్నారు నారాయణరావు జుత్తులజిన్నా.
   
    "ఏడీ మీ వాడు రాలేదేమిటి.....ఆరున్నరకే వస్తాడన్నావ్ గదా" అసహనంగా అడిగాడు అరవైయ్యారోసారి నారాయణరావు.
   
    "వస్తాడు.....రావడానికి టైం పడుతుందికదా.....కలెక్టర్ వేషమంటే మాటలా__లాండ్రీవాడిదగ్గరకెళ్ళి బూతు తెచ్చుకోవాలా?" వరసగా లిస్టు చదవడం ప్రారంభించాడు జుత్తులజిన్నా.
   
    "బాగానేవుంది. ఇంతకీ ఆ కేండిడేట్....ఏం చేస్తాడేమిటి? ఆసక్తిగా అడిగాడు నారాయణరావు.
   
    "చిన్నసైజు రౌడీలే.....విజయచందర్ లా ఏ వేషంవేస్తే, ఆ వేషానికి సరిపోతాడు....అదే మనవాడి స్పెషాలిటీ"
   
    "విజయచందరా......ఆయనెవరు?"
   
    "విజయచందర్....నీకు తేలీకపోతే మనిషిలా పుట్టడం అనవసరంరా నీలాటివాడికి ప్రేమకూడా అవసరమే అనుకో.....ఎలా పుట్టావురా నువ్వు.....విజయచందర్ గురించి కూడా తెలీనోడివి"
   
    "కొన్ని విషయాలు తెలీకపోతే, అన్ని విషయాల్లోనూ జ్ఞానం లేదనా అర్ధం.....ఒరేయ్__జిన్నా__ ఒక్కటిచ్చానంటే జుత్తెగిరి విగ్గులా పడుతుంది జాగ్రత్త....నేను అమాయకుడిలా కనిపిస్తానుగానీ.....అమాయకుడ్ని కాదంతే.....అండర్ స్టాండ్. ఇంతకీ ఆ విజయచంద్ర ఎవరో ఏంటో చెప్పి తగలడు"
   
    ఆ మీదట రెండు నిమిషాలసేపు ఆలోచించాడు జుత్తులజిన్నా.
   
    "ఇప్పటివరకూ బ్రెయిన్ లో మెదిలిందిరా.....ఇప్పుడే మర్చిపోయాన్రా ఆఁ జ్ఞాపకం వచ్చింది. మహాత్మాగాంధీ మీదొచ్చిన గాంధీ ఇంగ్లీషు సినిమా చూసావా"
   
    చూసాను....ఎందుకు చూడలేదు....మొదటిసారి చూసినప్పుడు ఇంగ్లీషు డైలాగులు అర్ధంకాకపోతే రెండోసారి ఇంగ్లీష్ డిక్షనరీ పట్టుకుని వెళ్ళలేదూ- నువ్వూ వచ్చావుకదా."
   
    "ఆఁ....జ్ఞాపకాని కొచ్చింది. ఆ గాంధీ సినిమాలో గాంధీలా వేసాడే ఆయనేనన్న మాట. విజయచంద్ర అంటే మహా భారతం టి.వి. సీరియల్ చూసావా.....అందులో భీముడిగా వేసిందికూడా ఆయనే...." వరసగా చెప్పుకుపోతున్నాడు జుత్తుల జిన్నా.
   
    "గాంధీ సినిమాలో బక్కగా వున్నాడు. మహా భారతం సీరియల్లో బలంగా వున్నాడు....అదెలాగరా? ఫేసు పోలికలుకూడా మారిపోయాయి కదా....." డౌటును వ్యక్తం చేశాడు నారాయణరావు.
   
    "గొప్ప డౌట్లు వస్తాయి నీకు. విఠలాచార్య సినిమాల్లోలా అక్కడ టెక్నిక్కులెక్కువ. ఒక్క ఫేసేమిటి.....పూర్తిగా మనిషినే మార్చేస్తార్ట.....తెలుసా, జ్యూరాసిక్ పార్క్ లో జంతువుగా వేసింది మనిషే. బ్యాట్ మాన్ పేరుతో వచ్చిన ఇంగ్లీషు సినిమాలో మనిషిలా కన్పించినప్పటికీ, అదంతా వైర్ వర్క్" అని చాలా విజ్ఞానవంతమైన విశేషాలు చెప్పి నారాయణరావుకి జ్ఞానోదయం కలిగించాడు జుత్తులజిన్నా.
   
    "నువ్వు చాలా తెలివితక్కువ వాడివని.....నేను చాలా కాలం భ్రమపడ్డానురా జుత్తుల జిన్నా.నీకు నాకన్నా చాల విషయాలు తెలుసు....." అని పొగిడాడు జుత్తుల జిన్నాను నారాయణరావు.
   
    సరిగ్గా అదే సమయంలో వాళ్ళు కూర్చున్నచోటికి కొంచెం దూరములో ఓ రిక్షా వచ్చి ఆగింది. రిక్షాలో మాత్రం మనిషెవరూ లేడు.
   
    "ఖాళీ రిక్షా వచ్చి మన ఎదురుగా ఆగిందేమిటి?" విస్మయంగా రిక్షావేపు చూస్తూ ప్రశ్నించాడు నారాయణరావు.
   
    "వెర్రినాగన్నా.....లోకజ్ఞానం ఉండాలని అన్నది అందుకే. మన క్యాండిడేట్ మారువేషంలో వస్తే ఎలా వుంటాడో నీకు తెలియాలి గదా-అందుకే రిక్షావాడ్ని రమ్మనమని చెప్పాను. చూడు రిక్షావాడి క్యారక్టర్ కి మనవాడు ఎలా సరిపోయాడో...."సదరు కాండిడేట్ ను చూస్తూ చెప్పాడు జుత్తుల జిన్నా.
   
    "మనకు రిక్షావేషం కాదుగదా కావల్సింది......కలెక్టర్ వేషం గదా...." ఆ మాట అంటున్న సమయంలోనే-
   
    రిక్షా కార్మికుడి వేషంలో ఉన్న అతగాడు నారాయణరావు ఎదుటకొచ్చి నిలబడ్డాడు.
   
    "నువ్వేనా నన్ను, కలెక్టర్ వేషం వెయ్యమని పిల్చిందీ....."అని అడిగాడు నారాయణరావు వేపు చూస్తూ.
   
    "అవును.....ఏం.....వెయ్యవా" అనుమానంగా అడిగాడు నారాయణరావు.
   
    "వేస్తాన్లే......ఏ జిల్లా కలెక్టర్ వేషం వెయ్యాలటా....." గోల్డు ఫ్లాక్ పెద్ద సిగరెట్ ను తీసి వెలిగిస్తూ అడిగాడు ఆ వ్యక్తి.
   
    "అంటే....." ఆ ప్రశ్న ఏమిటో అర్ధంకాలేదు నారాయణరావుకి.
   
    "చెపుతాను విను.....హలో బ్రదర్ సినిమాలో నాగార్జునలా జిల్లా కలెక్టర్లందరూ ఒక్కలాగే ఉంటారనుకున్నావా......కొంతమందికి వయసు డిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి మాట డిఫరెన్స్ వుంటుంది, కొంత మందికి బట్టతల ఉంటుంది, కొంతమందికి తలే వుండదు. కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకుంటారూ, కొంతమంది పెట్టుకోరు. ఇలా వయసూ, భాషా ప్రాతిపదికన కలెక్టర్ల వేషాలుంటాయన్న మాట. సో.....ఏ జిల్లా కలెక్టర్ ని....."
   
    "ఏ జిల్లా కలెక్టరయితే నాకెందుకు......నువ్వు నల్గొంగ జిల్లా కలెక్టర్ వేషం వేసావనుకో....ఆ తెలంగాణా భాష అర్ధంగాక, మా బామ్మ పిచ్చెక్కిపోతుంది. మన జిల్లా వేషం, మన భాష మాట్లాడితేనే- మా బామ్మ నీ ఉచ్చులో పడుతుంది....."
   
    "అయితే మన జిల్లా కలెక్టర్ కి బట్టతల ఉంది. ఇపుడు నేను బట్టతల పెట్టించుకోవాలి.....దాని ఖర్చు నువ్వే భరించాలి. బట్టతల ఖర్చు అయిదువందలు, సూటు బూటు అద్దె అయిదు వందలు, వేషం కట్టి నందుకు అయిదు వందలు, కారు రెంట్ అయిదొందలు.....అడ్వాన్స్ కొట్టు.....మిగతాది పనై పోయాక ఇద్దూగానీ....అవునూ మధ్య మధ్యలో ఇంగ్లీషూ భాష మాట్లాడాలా అక్కర్లేదా....."

 Previous Page Next Page